పెద్దవాళ్లకు కూడా కోపాలు తప్పవు
మ్యూజిక్
గాయకుడు మహమ్మద్ రఫీ పీక్‌లో ఉన్నప్పుడు మ్యూజికల్ నైట్స్‌కు చాలా డిమాండ్ ఉండేది. రఫీ తానే సొంతగా కొన్ని నైట్స్ చేసేవాడు. సినిమాల అవకాశాలు తగ్గినవాళ్లు కొన్ని చేసేవారు. ఫీల్డ్‌లో కొత్తగా వచ్చిన కల్యాణ్‌జీ-ఆనంద్‌జీ తాము చేస్తున్న మ్యూజికల్ నైట్స్‌లో పాడమని రఫీని అడిగారు. నేను బిజీగా ఉన్నాను లతాను అడగండి అని రఫీ అన్నాడు. వాళ్లకు కోపం వచ్చింది. చాలా కాలం రఫీతో పాటలు రికార్డింగ్ చేయించలేదు. గమనిస్తే వాళ్ల సంగీతంలో రఫీ పాటలు తక్కువ ఉంటాయి. అలాగే సంగీత దర్శకుడు ఖయ్యామ్‌కూడా రఫీని తన మ్యూజికల్ నైట్‌లో పాడమని అడిగితే- ముందు నువ్వు సంగీత దర్శకుడిగా పేరు సంపాదించు. ఆ తర్వాత మ్యూజికల్ నైట్ పెట్టు అన్నాడు రఫీ.
అది మనసులో పెట్టుకుని ఖయ్యాం చాలాకాలం రఫీకి బదులుగా మహేంద్ర కపూర్ చేత పాడించాడు. హమ్ కిసీసే కమ్ నహీ (1977) సినిమాలో రఫీ పాడిన ‘క్యా హువా తేరా వాదా’ పాటకు ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. అయితే అదే సంవత్సరం అమర్ అక్బర్ ఆంథోనికి సంగీతం అందించిన లక్ష్మీకాంత్-ప్యారేలాల్‌కు ఉత్తమ సంగీత దర్శకులుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది. ఉత్తమ గాయకుడిగా అవార్డు తీసుకున్నవాడు ఆ పాటను పాడాలి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌ల ముందు తాను హమ్ కిసీసే కమ్ నహీకి సంగీతం అందించిన ఆర్.డి.బర్మన్ ట్యూన్‌ను పాడితే వాళ్లకెక్కడ కోపం వస్తుందోనని రఫీ ఆ వేడుకకు వెళ్లడానికి భయపడ్డాడు. ఆ సంగతి తెలిసి లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లు తాము ఆర్కెస్ట్రా అరేంజ్ చేసి ఆర్.డి,బర్మన్ పాటైనా సరే మేము సహకరిస్తాం అని చెప్పి రఫీ చేత పాడించారు. రఫీ ఊపిరి పీల్చుకున్నాడు. పెద్దవాళ్ల కష్టాలు ఇలా ఉంటాయి.