పాటకు శ్రోత దొరికాక బాగుంటుంది. జీవితానికి సరైన సహచరి దొరికాక బాగుంటుంది. రఫీ తెల్లవారు లేచి నాష్టా పూర్తి చేసి, ఇంటి గార్డెన్‌లోకి వెళ్లి కూచున్నాక మరి ఆయనకు ఎవరూ అంతరాయం కలిగించరు. ఎందుకంటే ఆ సమయాన ఆయన ఆ రోజున రికార్డు చేయబోయే పాటను సాధన చేస్తాడు. పాట ఎవరికీ వినిపించదు. పాదంలోని బొటనవేలు లయగా కదులుతూ ఉంటుంది. పాటను ఆయన లోగొంతుకలో స్మరిస్తూ ఉంటాడు. ఆ సమయాన ఆయన ఆహ్వానించేది రెంటినే. ఒకటి భార్య చిర్నవ్వుని. రెండు ఆమె చేతి మసాలా టీని.
చాయ్ పత్తా, చక్కెర, బాదంపప్పు పొడి, యాలకులు వేసి బిల్కిస్ బానో మాత్రమే తయారు చేసే ఆ టీ బహు ప్రఖ్యాతం. రఫీ ఎదుటివారి మీద ప్రేమ కొద్ది ఒక రూపాయి ఫీజుకి పాట పాడిన సందర్భాలున్నాయి. కాని ఎంత బతిమిలాడినా భార్య చేసిచ్చిన ఫ్లాస్క్‌లోని టీ మాత్రం ఎవరికీ ఇచ్చేవాడు కాదు. అది ఆయనది. ఆయన కోసం బిల్కిస్ చేసినది. ‘పాకిజా’లో రఫీ ‘చలో దిల్‌దార్ చలో చాంద్ కే పార్ చలో’ అంటే లతా ‘హమ్‌భీ తయ్యార్ చలో’ అంటుంది. రఫీ కోసం బిల్కిస్ బానో కూడా అలా ఎప్పుడూ తయారుగా ఉండేది. బిల్కిస్ లేకపోతే రఫీ వ్యక్తిగత జీవితంలో లేడు.
రెండో భార్య
రఫీ లాహోర్ నుంచి ముంబై వచ్చి గాయకుడిగా స్థిరపడే సమయంలోనే బంధువుల అమ్మాయిని నిఖా చేసుకున్నాడు. వాళ్లకు ఒక కుమారుడు కలిగాడు. అయితే దేశ విభజన రఫీ భార్యను చాలా కలవరానికి గురి చేసింది. ఆమె తల్లిదండ్రులు ఆ అల్లర్లలో మరణించారు. ఆమె లాహోర్‌కు వెళ్లిపోయింది. రఫీ ఆ తర్వాత బిల్కిస్ బానోను వివాహం చేసుకున్నాడు. రఫీకి మొత్తం నలుగురు అబ్బాయిలు. ముగ్గురు అమ్మాయిలు. అయితే రఫీ పెద్దకొడుకు సయీద్ తమ తల్లికే పుట్టాడని బిల్కిస్‌బానో సంతానం అనుకునేది. చాలా ఏళ్ల పాటు వారికి ఆ అబ్బాయి సవతి సోదరుడనే తెలియకుండా బిల్కిస్ బానో అందరినీ సమానంగా పెంచింది. రఫీ మాటల పొదుపరి. ‘ఇదిగో’ అని అతను పలికే ఒక్క శబ్దానికి ఉండే బహుళ అర్థాలతో ఆమె కాపురం చేసింది.
భార్య బిల్కిస్ బానోతో మహమ్మద్ రఫీ
భోజన ప్రియుడు
రఫీ పాటను నిండుగా పాడతాడు. భోజనం కూడా అంతే నిండుగా చేస్తాడు. రేపు ఉదయాన నాష్టా ఏం చేస్తారు అని రాత్రి, రాత్రికి ఏం వొండుతారు అని నాష్టా సమయంలో తప్పక అడిగేవాడు. ఆయనకు చెప్పాలి కూడా. బిల్కిస్ చెప్పేది. ఆయనకు ఆకుకూరలు వేసి చేసిన మాంసం, బంగాళాదుంప–మాంసం అంటే బహుప్రీతి. ఆయన గొంతులోని తీపికి డయాబెటిస్ రావడంతో ఆయనకు స్వీట్లు తినే యోగ్యం తక్కువగా ఉండేది. ఇల్లు భార్య చూసుకునేది. డబ్బు వ్యవహారాలు బావమరిది చూసుకునేవాడు. రఫీకి పాట మాత్రమే తెలుసు. లేదా భార్య సమక్షాన కూచుని పిల్లలతో గాలిపటాలు ఎగరేయడం తెలుసు.
రఫీ పిల్లలను తీసుకొని సినిమాకు వెళ్లేవాడు. అయితే ఎవరైనా చూస్తారు అని సినిమా మొదలైన పదిహేను నిమిషాల తర్వాత, ముగిసే పదిహేను నిమిషాల ముందు తీసుకొచ్చేసేవాడు. పిల్లలు అందుకే సినిమాకు వెళదాం అంటే మేము రాము అని హటం చేసేవారు. ‘ఆయనతో కలిసి మేం చూసిన సినిమాల క్లయిమాక్స్ ఏమిటో మాకు ఇంతవరకు తెలియదు’ అని వారు నవ్వుతారు. బిల్కిస్ వారిని బుజ్జగించేది. పాటల మహరాజుకు ఇవి చేతనయ్యేవి కావు. రఫీ తన జీవితంలో కేవలం ఒక్క సినిమా రెండుసార్లు చూశాడు. అది ‘షోలే’. అయితే ఆ సినిమాలో రఫీ పాడిన పాట ఒక్కటీ లేదు.
లండన్‌లో పిల్లలు
రఫీ కెరీర్ పీక్‌లో ఉండగానే రఫీ పిల్లలు లండన్‌లో స్థిరపడ్డారు. రఫీ, బిల్కిస్ బాంబే నుంచి లండన్‌కు రాకపోకలు సాగించేవారు. భర్తతో ఎవరైనా సుదీర్ఘ జీవితమే ఆశిస్తారు. కాని రఫీ తన 55వ ఏట జూలై 31, 1980న మరణించాడు. నిత్యం నిర్మాతల, సంగీత దర్శకుల రాకపోకలతో కళకళలాడిన వారి ఇల్లు మౌనం దాల్చింది. ఆ ఇంటిని ఆ తర్వాత బిల్కిస్ బానుయే నిలబెట్టుకుంటూ వచ్చింది. భర్త చనిపోయాక ఆమె జరీ వర్తకం చేసేది. రఫీ ఇంటిని దర్శించుకుందామని వచ్చే అభిమానులకు ఆమె చల్లని పలకరింపు దక్కేది.
ప్రార్థనలు వెంబడించాలి
రఫీ పదేళ్ల వయసులో తన వీధి ముందు నుంచి పాడుతూ వెళ్లే ఫకీర్ మోహంలో పడ్డాడు. ఆ ఫకీర్ అది గమనించి ‘నువ్వూ పెద్ద గాయకుడివి అవుతావులే’ అని ఆశీర్వదించాడు. రఫీని ఎవరైనా ‘మీ పిల్లలను మీ పాటకు వారసులుగా ఎందుకు తీర్చిదిద్దలేదు’ అని అడిగితే ఆయన నవ్వి ‘ఎవరైనా ఏదైనా అవ్వాలంటే ప్రార్థనలు వెంబడించాలి. నన్ను వెంబడించే ప్రార్థనలే నన్ను ఇంతవాణ్ణి చేశాయి. తయారు చేస్తే ఎవరూ కళాకారులు కాలేరు. వాళ్లకై వాళ్లు తయారు కావాలి’ అని అనేవాడు. బిల్కిస్ ఆ అభిప్రాయానికే కట్టుబడింది.
పిల్లలు వ్యాపారాల్లో స్థిరపడేందుకు ప్రోత్సహించింది. కళకారులను కళతో మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు. వారి జీవిత భాగస్వామితో పాటు తెలుసుకోవాలి. తమలోని కళకు తామే సామ్రాట్టు అయిన అనేకమంది తమ జీవితానికి మాత్రం భార్యలను అధిపతులను చేశారు. రఫీ కూడా అంతే. జీవితం ఎపుడూ ఒకరు నడిపేది కాదు. స్త్రీ పురుషులు ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకుంటేనే అది సాధ్యమవుతుంది. రఫీ పాట, రఫీ–బిల్కిస్‌ల జీవితం అదే చెబుతుంది.
సాథీ హాత్ బఢానా సాథీ హాత్ బఢానా ఏక్ అకేలా థక్‌జాయేగా మిల్‌కర్ బోజ్ ఉఠానా – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment