సినిమాల వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది | small chit chat ewith artist ranganayakamma | Sakshi
Sakshi News home page

సినిమాల వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది

Published Tue, Jan 27 2015 11:44 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

సినిమాల వాళ్ళకి  ఒక జబ్బు ఉంటుంది - Sakshi

సినిమాల వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది

నిన్న ఒక పాత సినిమా, మంచీ-చెడ్డా రెండూ ఉన్నది, చూశాను. చాలా సంవత్సరాల కిందట చూసిందే. అందులో ఒక్క పాట తప్ప మిగతావన్నీ దాదాపు మర్చిపోయాను. అదే సినిమా కొత్తగా చూస్తున్నట్టు చూశాను నిన్న. సినిమాలో పాటలు అద్భుతం! మొత్తం తెలుగు సినిమా ప్రపంచంలో గొప్పదైన పాట ఒకటి ఉంది. అందులో మాటలు కూడా అచ్చంగా మనుషులు మాట్లాడుకున్నట్టే, పాత్రలకు తగినట్టుగా ఉన్నాయి. కథ అయితే, నిజం కథగా మొదలై, నిజం కథగానే ముగిసింది. అనేక కొంపల్లో జరిగే నిజాలు అవే కావచ్చు. అయినా ముగింపు అంత తుక్కుగా జరిగితే, ఇక ఎందూకూ ఆ సినిమా? కేవలం పాటల కోసమేనా? నేను ఎప్పుడూ పాత సినిమాల కోసమే వెతుకుతాను. వాటిల్లో కూడా కథల్లో ముగింపుల్ని ఖూనీలు చేసేస్తూ ఉంటారు. ఈ సినిమాలోనూ పెద్ద ఖూనీయే జరిగింది. అయినా, పాత సినిమాల్లో హాయి అయిన పాటలు కొన్ని అయినా దొరుకుతాయని సంతోషం! అందుకే కొత్త పుస్తకాలు కూడా పక్కన పెట్టి ఈ సినిమాతో గడిపాను.


‘‘గృహమే కదా స్వర్గసీమా’’ అని పాడతాడు ఆ గృహస్తుడు. భార్య వీణ వాయిస్తోంటే, అతగాడు కంఠం కలుపుతూ ఉంటాడు. అతగాడు పాటగాడే కాదు, రాతగాడైన కవి కూడా. కళాపోషకుడిగా పేరూ! స్వర్గ సీమ రుచి తెలిసిపోయినట్టు పాడేవాడు, ఒక నాటకాల నటి వెంటబడి ‘‘హాయి సఖీ’’ అంటూ ఆ సఖికి సఖుడై గానం ప్రారంభించి, తన గృహ స్వర్గసీమని నరక సీమ చేసేస్తాడు.
 ఈ సినిమాలో భానుమతి పాడిన ‘‘ఓహోహో పావురమా’’ పాట అందరూ వినే వింటారు. అందులో సాహిత్యం, సంగీతం, కంఠం, అన్నీ మధురాతి మధురాలు. అది ఎవరైనా విని ఉండకపోయినా, విన్నామనే చెప్పుకోండి! లేకపోతే పరువు పోతుంది, ఉండదు.
 ఆ నటికి ఒక నాటకం రాసి పెట్టడం కోసం ఆ కవి, రోజంతా ఆ నటి దగ్గరే గడుపుతూ కొంపకి తిన్నగా రావడం ఎగ్గొడుతూ ఉంటాడు. అతని భార్య అతి వినయంగా భర్తతో, ‘‘మీరు ఆ నాటకం రాసే పని మన ఇంటి దగ్గరే చేసుకోకూడదా?’’ అంటుంది, పాపం వొణుకుతూనే.
 ఆ కళాకారుడు అతి నిర్లక్ష్యంగా, ‘‘అస్తమానూ ఇంట్లో నీ మొహం చూస్తూ కూర్చోవాలా? నిన్నూ నీ పిల్లల్నీ పోషించడానికే కదా నాటకం రాస్తున్నాను?’’ అనేసి రుస రుసలతో వెళ్ళిపోతాడు. అలా ఒకటి రెండు సార్లు అయ్యాక అసలు ఇంటికి రావడమే బంద్ చేస్తాడు. పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి, నటి పాడినట్టు, ‘‘తరుణ యవ్వనము పొంగి పొరలే వలపు కౌగిలిలో ఓలలాడే’’ స్వర్గ సీమలో మునిగిపోతాడు.
 ‘స్వర్గ సీమ’ అనేది ఒక భ్రమ! ఒక కల్పన! దాన్ని ఎలా ఊహిస్తే, అదే స్వర్గ సీమగా కనపడుతుంది. ఒకప్పుడు గృహమే స్వర్గసీమ.

ఇప్పుడు గృహం బయటే స్వర్గ సీమ!

 గృహమే స్వర్గ సీమ అయిన వాడికైతే పరాయి సంబంధాలు స్వర్గ సీమలు కాలేవు. మన కవి కోరే స్వర్గ సీమ అంతా, పర స్త్రీ పొందే!
 ఇంటి నించి భార్య జడుస్తూ ఫోనులు చేస్తే, అతగాడు ఫోను ముట్టడు. ఎప్పటికో ఆ నటే ఆ ఫోను ఎత్తి, కవి భార్యని ఖయ్యిమని కసురుతుంది. భార్య దీనంగా ఉత్తరం రాస్తే, మన కళాపోషకుడు, ఆ ఉత్తరాన్ని ముట్టకుండా, ‘‘తల తిక్క రాతలు’’గా కొట్టిపారేస్తాడు.
 ఆ భార్యకి ఏడుపేగానీ, ఏడుపుతో పాటు చీమ తలకాయంతైనా కోపం రాదు. ఆ దేహం రక్తమాంసాలున్న దేహమేనా అని డౌటు వచ్చే వాళ్ళకి వస్తుంది. ఆ ఇల్లాలు తన భర్త నడత గురించి శోక రాగాలతో కృష్ణుడి బొమ్మకి చెప్పుకుంటుంది! ఆ కృష్ణుడికి 8 మంది పెళ్ళాలూ, 16 వేల మంది ప్రియురాళ్ళూ అని, ఆమెకి తెలియకపోవచ్చునేమో గానీ, సినిమా తీసిన బి.ఎన్.రెడ్డి గారికీ తెలీదా? ఆమె, తన ఘోషని ఏ బొమ్మకి చెప్పుకున్నా దండగేగానీ, పోనీ చెప్పుకుంటే, ఒకే భార్య గల రాముడి బొమ్మకి చెప్పుకోవాలా, ఆడదాన్ని చూస్తే వదలని కృష్ణుడి బొమ్మకి చెప్పుకోవాలా? దేనికి చెప్పుకున్నా ఆ బొమ్మ ఆ భర్తని తీసుకురాదు గానీ, అక్కడ రాముడి బొమ్మని పెట్టించాలని తెలియలేదా డెరైక్టరు గారికి?

 ఇక, ఆ భార్య, ఒక పాకలోకి మారి మిషను కుట్టుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ గడుపుతోంది. కానీ భర్తగారి ఫొటోని గోడకి తగిలించి, దానికి రోజూ కొత్త పూలు పెడుతూ!నటితో కలిసి నాటకాలాడేస్తోన్న మన కళాకారుడికి స్టేజి మీదే ఒక ప్రమాదం జరిగి ఆ నటి పోషణలోనే మంచం పట్టాడు. ఆ నాటకాల రంభ, వీణ్ణి వొదిలేసి, వీడికన్నా ఘనుణ్ణి పట్టింది. మంచం పట్టిన ప్రేమికుడు ఫోనులు చేస్తే, ఆ ప్రేయసి పలకదు. ఫోన్ల తర్వాత పలికితే ఖయ్యిమని పలుకుతుంది. తన ప్రేయసి ఇంకోణ్ణి ‘పట్టిన’ సంగతి మన కవికి తెలుస్తుంది. ఇక ఆమె దగ్గర చోటు లేదు. ఆ నటి, ఆ రెండోవాడితో, నాటకాలాడుకుంటూ పాడుకుంటూ, కీర్తి పెంచుకుంటూ, నిశ్చింతగా గడిపేస్తోంది. ఆమె అవసరం అదీ!

 ఇక, మన కవి, మంచం దిగాడు. ఇల్లు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? రంభ వొదిలేసింది కాబట్టి. అంతే గానీ తన తప్పు తనకి తెలిసి కాదు. ఆత్మ విమర్శతో కలిగిన బాధ కాదు. ఆ రంభ, ఇంకా తనతో నాటకాలు రాయించుకుంటూనే ఉంటే, ఆ కవికి ఇల్లు గుర్తొచ్చేదా? అలా జరగదు. నిలవ నీడ లేకే ఇల్లు గుర్తు! తను చాలా పశ్చాత్తాప పడిపోతున్నట్టు గడ్డం పెంచేశాడు. పశ్చాత్తాపాలకు గుర్తు ఎప్పుడూ గడ్డాలే. లేకపోతే క్షవరానికి డబ్బులు లేకనో! అక్కడే డెరైక్టరు గారు, సైగల్ పాటలోనించి రెండు మాటలు ఇరికించారు, ‘‘దునియా అంతా దుఃఖం బాబా, కళ్ళు తెరిచి చూడు!’’ అంటూ! మనవాడికి ఎవరో ఆ దుఃఖం తెచ్చిపెట్టినట్టు! ఆ గడ్డాలతో తిరుగుతూ తిరుగుతూ పెళ్ళాం ఉన్న పాక దగ్గరికే వస్తాడు. అది రాత్రి పూటే. ఆ ఇల్లాలు పాక తలుపు బార్లాగా తెరిచి పెట్టేసి ఉంచింది. మిషను పని చేసుకుంటూ మిషను మీదే తల వాల్చి కునుకు తీస్తోంది. చిన్న పిల్లలిద్దరూ మంచం మీద నిద్రలు!

మనవాడు పాకలోకి జొరబడి గోడ మీద తన ఫొటోని పూలతో చూశాడు. మంచం మీద నిద్ర పోతోన్న పిల్లల తలలు నిమురుతూ ప్రేమలు కురిపించాడు. (అతడి పశ్చాత్తాపాన్ని అందరూ నమ్ముతారని డెరైక్టరు గారు అనుకున్నట్టున్నారు. నేను నమ్మలేదనుకోండీ).
 మిషను మీద భార్య ఎలాగో తల ఎత్తేసరికి, ఇతగాడు గుమ్మం బైటికి తప్పుకున్నాడు. పశ్చాత్తాపంతో దగ్ధమై పోతున్నవాడు అలా పారిపోవడం ఎందుకు? ఆమె ముందే తల వాల్చుకుని నిలబడరాదూ? బైటికి వెళ్ళిపోతోన్న వాణ్ణి చూసి ఆ ఇల్లాలు, ‘‘దొంగ, దొంగ’’ అని అరిచింది. అతడు తన భర్తేనేమోనని అనుమానం కూడా వచ్చింది ఆమెకి. దీపం ఎత్తి పట్టుకుని వాడు ఎవడా అని చూడడానికి బైల్దేరింది గుమ్మం బైటికి.

 వాణ్ణి దొంగే అనుకుంటే, వాడు బైటికి పోయాడు కాబట్టి, వెంటనే తలుపులు మూసేసుకోవాలి. లేదా, అతణ్ణి తన భర్తేనేమో అనుకుంటే, అతను రాదల్చుకుంటే లోపలికి అతనే వస్తాడనుకోవాలి. తను దీపం పట్టుకెళ్ళి అతడి మొహం పరిశీలిస్తుందా! మన ఇల్లాలు అదే చేసింది. వాడు ఇంకెవరు? భర్తే! దీపం అవతల పారేసి, భర్త కాళ్ళ మీద పడిపోయింది!

 పడితే వాడు పడాలి, భార్య కాళ్ళ మీద! అలా పడి, ‘‘తప్పు చేశాను, తప్పు చేశాను’’ అంటూ దొర్లి దొర్లి ఏడవాలి. భర్త అలా ఏడిస్తే, ‘‘పోనీలే, తప్పు తెలుసుకున్నాడులే. ఏడుస్తున్నాడులే’’ అని భార్య సరిపెట్టుకుందని, ఆ భార్యని మనం సరిపెట్టుకోవచ్చు.
 అసలా భర్త ఎలా నించున్నాడంటే, పెళ్ళామే తన కాళ్ళ మీద పడాలన్నట్టుగా నిటారుగా నించున్నాడు! ఆ పిచ్చిది అలాగే పడిందిగా, వచ్చేశాడు చాలని?

 ఇక ఆ తర్వాత, పాక మాయమైంది. ‘‘గృహమే కదా స్వర్గ సీమా’’ అంటూ ఆ భర్త ఎగురుతూ మళ్ళీ పాడేస్తున్నాడు!! ఆ భార్య కూడా ‘‘గాలివాన వెలసె’’ అని పాడేసి, తన ఘోర అవమానాన్ని ‘గాలివాన’తో పోల్చుకుంది. అదీ ‘స్వర్గ సీమ!’
 భార్యకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సంస్కరించే ముగింపు ఉండాలి. ఆ మంచి ముగింపు ఇలా ఉండాలి: ఆ గడ్డాల భర్త, భార్య ముందు మొహం వేళ్ళాడేసుకుని నించుంటాడు. అప్పుడు ఆ భార్య అంటుంది. ‘‘పిల్లలు నా పిల్లలే. నా పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను. నువ్వు పోషించనక్కర లేదు. నువ్వు మళ్ళీ మా జీవితాల్లోకి వస్తే, నేను రోజూ నీ మొహం చూస్తూ ఉండాలా? నేనే కొన్నాళ్ళు ఎవడితోనో తిరిగి వస్తే, నేను రావడమే చాలని నువ్వు నా కాళ్ళ మీద పడతావా?’’ అని అడుగుతుంది. అలా అడుగుతూ, అతని పశ్చాత్తాపం నిజమా అని కూడా సందేహిస్తూ చూస్తూ ఉంటుంది.

 అంతలో, ఆకాశంలోంచి, ‘‘ఓహో పావురమా’’ పాట వినపడుతుంది రయ్యిమంటూ, ఆ నాటకాల నటి వీడి కోసం మళ్ళీ వెతుకుతోంది. ఎందుకంటే, ఆ రెండో వాడు దీని డబ్బంతా ఎత్తుకుని పారిపోయాడు. ఆ నటికి మళ్ళీ కొత్త కొత్త నాటకాలు రాసి యిచ్చే పాత కవి కావలసి వచ్చాడు. అందుకే మళ్ళీ ఆ పావురం పాట ఎత్తుకుంది.

 పెళ్ళాం ముందు నిలబడ్డ పశ్చాత్తాపాల వాడు, మొహం అటు వైపు తిప్పేశాడు. ఆ కీర్తివంతురాలు, ఆ నాట్యకత్తె, ఆ మధురగాయని, ఆ కళాకారిణి, ఆ సుందరాంగి, మళ్ళీ దొరకబోతోంది! మన కళాకారుడు, పాకలో నించి ఒక్క ఊపుతో బైటికి పరుగుతీశాడు.
 భార్య ఆశ్చర్యపోతూ చూసింది కొంతసేపు. అతడి పశ్చాత్తాపం అబద్ధమని అప్పటికి స్పష్టంగా గ్రహించింది. చప్పున కదిలి తలుపులు మూసేసింది. గోడ మీద ఫొటో తీసి కింద పెట్టింది. ఆమె మొహంలో విచారం లేదు. మనిషి ప్రశాంతంగా అయింది. పిల్లల దగ్గిర కూర్చుని చక్కని పాట ఎత్తుకుంది.

‘‘మనం తల్లీ పిల్లలం
మనం ఒకరికి ఒకరం
మన గూడే మన స్వర్గం!
మన పాకే మన స్వర్గసీమ!
మన యంత్రమే,
మన సూదీ దారాలే,
మన ఆయుధాలు!
మీ రక్షకురాలిని నేనే,
నా సంరక్షకులు మీరే!
చాలు మనకీ సంతోషం
చాలు మనకీ ఆనందం
ఇదే ఇదే మన స్వర్గ సీమ!’’

 పిల్లలు నిద్రలు లేస్తారు. వాళ్ళు కూడా ఆ పాటలో కలుస్తారు. ఆ తల్లి, మిషను మీద కూర్చుని కుట్టు పని చేస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు జల జలా వర్షిస్తున్నాయి. అయినా, ఆమె మొహం ప్రశాంతతతో ప్రకాశిస్తోంది. - ముగింపు ఇలా ఉంటే, అది ఆ తల్లీ బిడ్డలకు న్యాయం. సినిమాల వాళ్ళకి డబ్బు జబ్బు ఉంటుంది. లాభం జబ్బు! పెట్టిన ఖర్చులు వెనక్కి వస్తే చాలదు. లాభం రావాలి! అత్యధిక లాభం రావాలి!

 ఆ భార్య, భర్త కాళ్ళ మీద పడకపోతే, టిక్కెట్లు కొనే భర్తలు పెళ్ళాల్ని సినిమాకి తీసుకురారని సినిమా వాళ్ళకి భయం! సగం టికెట్లు అమ్ముడు కావని దడ! అందుకే ఆడ వాళ్ళని బానిసల్ని చేస్తారు. వాళ్ళ జీవితాల్నీ, కుటుంబాల్నీ, స్వర్గ సీమల్నీ, ఖూనీలు చేస్తారు. ఆ ఖూనీయే జరిగింది ఈ కథ ముగింపులో!

ఈ సినిమా ఏం చెప్పిందంటే, భర్తలు బైటికిపోయి ప్రియురాళ్ళతో తిరిగి రాగానే, అతడు రావడమే చాలని భార్యలు ఆనందంతో అతడి కాళ్ళమీద పడాలి! మళ్ళీ పోయినా, మళ్ళీ వస్తాడని, ఓపికతో నిరీక్షించాలి!- ఇదే కదా స్వర్గసీమలు నిలిచే మార్గం!
 
 - రంగనాయకమ్మ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement