సమకాలీన తెలుగు సాహితీ ప్రపంచంలో రంగనాయకమ్మ ఓ ఫైర్‌బ్రాండ్. ఎంతటి ప్రతికూలతలెదురైనా, తాను నమ్మిన విలువల, సిద్ధాంతాల విషయంలో రవ్వంత రాజీ పడకుండా, ఎనిమిది పదుల వయసులోనూ(1939 సెప్టెంబర్ 21న జన్మించారు), అవిశ్రాంతంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే వున్నారు. ఆమెను రాజీలేని మనిషిగా ఎంతగా ఇష్టపడే వారు ఉన్నారో, అంతగానూ వ్యతిరేకించేవారూ ఉన్నారు. బలిపీఠం, స్వీట్ హోమ్, జానకి విముక్తి వంటి 15 నవలలూ, 70 కథలూ, భాషా విషయాలూ సహా సమకాలీన అంశాలపై లెక్కకు మిక్కిలి వ్యాసాలు రాశారు. ఆమె రాసిన రామాయణ విషవృక్షం అత్యంత వివాదాస్పదమైంది. ఏ కమ్యూనిస్టు పార్టీ ముట్టుకోని, మార్క్స్ మూలరచన ‘పెట్టుబడి’ని తేలికైన పద్ధతిలో పరిచయం చేశారు. రచనల లక్ష్యం, రచయితల – పాఠకుల మధ్య అనుబంధం, తరాలతోపాటే వస్తున్న మార్పులు... వంటి అంశాలపై, రంగనాయకమ్మ వెలిబుచ్చుతున్న ఆలోచనల సమాహారం.
మీ దృష్టిలో, పాఠకుల నుంచి ఏదైనా ఆశించి రచన చేయాలా?
అవును. రచయితలు, తాము రాసే వాటిని పాఠకులు అంగీకరించాలని కోరుకుంటారు. అలా కాకపోతే, రచయిత, తను తెలుసుకున్నది, తనే తెలుసుకుని వూరుకోవచ్చు కదా? దాని కోసం రాత ఎందుకు? ఒక రచయిత, భక్తినో, దాని వ్యతిరేకతనో, దేనినో ఒక్క దాన్నే రాస్తాడు గానీ, ఆ రెంటినీ సమర్థిస్తూ రాయడు. ఆ రచయిత, తను రాసే విషయాన్ని పాఠకులు కూడా అంగీకరించాలనే భావిస్తాడు. వెనకటి కాలపు కవులైనా అదే; ఈ కాలంలో అయినా అదే.
ఇది సామాజిక ప్రయోజనం కలిగిస్తుంది అని మీరు ఒక గిరి గీసుకుని రచన చేసినపుడు, అది ప్రచార సాహిత్యమై పోదా?
సమాజమే వేరు వేరు ప్రయోజనాలతో వుంటుంది. ఆ నిజాన్ని తెలుసుకుంటే, ఏ ప్రయోజనాన్ని కోరే రచయితలు, ఆ ప్రయోజనం కోసమే గిరి గీసుకుంటారని తెలుస్తుంది.
రచయితకు భావజాలం వున్నట్టే, పాఠకుడికీ అతని భావజాలం అతనికి వుంటుంది. ఈ అంతరాలను అధిగమించి, దగ్గరి దారులు నిర్మించడం ఎలా?
ఇది జరగాలంటే, 2 విషయాల్ని బట్టి వుంటుంది. (1) రచయిత ఇచ్చే రచనలో భావాలు ఎటువంటివి? (2) ఆ రచనని చదివే పాఠకుడి భావాలు ఎటువంటివి? – ఈ 2 విషయాల్ని బట్టే చివరి ఫలితం వుంటుంది. ఒక రచన, హేతుబద్ధంగా వుందనుకుందాం. దాన్ని చదివే ఒక పాఠకుడి భావాలు, అప్పటికే ‘భక్తి’ చుట్టూ వుంటాయి అనుకుందాం. అలాంటి పాఠకుడికి, ఆ రచనలో తర్కాలు నచ్చితే, అతను మారి, తన పాత భావాలు వదిలేస్తే, అప్పుడు, ఆ రచనకీ, ఆ పాఠకుడికీ, ఏకీభావం ఏర్పడుతుంది. అదే రచనని, అదే రకపు భావాలు గల ఇంకో పాఠకుడు చదివితే, అతడి హేతుబద్ధ భావాలు, మరింతగా స్థిరపడతాయి. ఒక రచనకీ, ఒక పాఠకుడికీ తేడాలు వుంటే, ఆ రెంటికీ, ఎప్పటికీ ఏకీభావం వుండనే వుండదా? ఇలాగే అనుకుంటే, అసలు సమాజంలో వున్న చెడ్డ ఎప్పటికీ మారదు– అనే అర్థానికి రావలసి వస్తుంది. అసలు సమాజం వైరుధ్యాలతో వుంది. ఆ వైరుధ్యాలు లేనిదిగా మారే మార్గం వుంది. అది జరిగే మార్గంలో అయితేనే, రచయితలూ, పాఠకులూ ఒకే హేతుబద్ధ భావాలతో మారతారు.
పాఠకుడి మనసుకు హత్తుకు పోయేలా చెప్పడంలో, మీ దృష్టిలో ఏ ప్రక్రియ అనువు?
కథా, నవలా, నాటకాలూ – వంటి రచనలే ఏ పాఠకులకైనా అనువుగా ఉంటాయి. ఈ రకం రచనల్లో కథ పొడగునా పాత్రలూ, వాళ్ళ సంభాషణలూ, వాళ్ళ ప్రవర్తనలూ, వాళ్ళ సమస్యలూ, వుంటాయి. వాటిని చదువుతోంటే, తోటి మనుషుల్ని చూస్తున్నట్టు వుంటుంది. పాఠకులకు కూడా అటువంటి అనుభవాలూ, సమస్యలూ వుంటే, సమాజం అర్థం అవుతుంది. పాటలైతే లయ బద్ధంగా, ఏదో ఒక రాగంతో వుండి, వినే వాళ్ళని ముగ్ధుల్ని చేస్తాయి. మతాలు అనేవి, మనుషుల్ని లొంగదీసేది, వాటి పాటల రాగాల వల్లే గానీ, కేవలం దేవుళ్ళ వర్ణనల వల్ల కాదు. కవిత్వాలూ, వ్యాసాలూ, ఏ ప్రభావాల్నీ ఇవ్వలేవని కాదు. వ్యాసాలు, ఎంత వివేకాల్ని ఇచ్చేవి అయినా, కథకీ, వ్యాసానికీ, ప్రభావాలు చూపడంలో తేడా మాత్రం వుంటుంది.
తరం మారే కొద్దీ పాఠకుల అభిరుచుల్లో, ఆలోచనల్లో, వస్తున్న మార్పులు ఏమైనా గమనించారా?
‘తరాలు మారడం’ అంటే, మనుషుల ‘వయసులు’ మారడమే కాదు. తరాలు మారడం అంటే, సమాజానికి అత్యవసరం అయిన ఉత్పత్తుల్ని ఇచ్చే ఉత్పత్తి సంబంధాలు మారడమే. పాత కాలంలో బానిసత్వం వుంటే, ఆ బానిసలే కౌలు రైతులుగా మారితే, ఈనాటి సమాజం అంతా ప్రధానంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంతో సాగే సమాజమే. పాఠకుల అభిరుచుల్లో, గతంలో అయినా, ఈ కాలంలో అయినా, గుణగణాలన్నీ ఒకటే. గత సమాజమూ, ఈనాటి సమాజమూ, రెండూ ఒకే రకం గుణం గలవి కాబట్టి. మనుషుల అభిరుచులు, తరాలు మారడాన్నిబట్టి కాదు. వాడే ఉత్పత్తుల్లో మార్పుల్ని బట్టి.
కెరీరిజమే, డబ్బు సంపాదనే, ఈ కాలపు యువత లక్ష్యంగా మారిపోయినపుడు, రచయితగా ఏం చెప్పినా ఏం ప్రయోజనం?
‘కెరీరిజమ్’ అంటే, ఉద్యోగాల్లోనే కాదు, కళల్లోనే కాదు, ఏ విషయంలో నైనా, నీతి నియమాలు లేకుండా పైకి ఎగబాకాలనే పిచ్చే కదా? ‘డబ్బు సంపాదన’ని పెంచుకోవాలనుకునేది కూడా అటువంటిదే. ఈ తప్పుడు కాంక్షలు, ఈ కాలపు లక్ష్యాలే కాదు. ఇటువంటివన్నీ వెనకటి కాలంనించీ వున్నవే. యువతలోనే కాదు; యువతని తయారు చేసే పెద్దల్లో కూడా ఇవే లక్ష్యాలు. పెద్దలకైనా, పిన్నలకైనా, ఎందుకు ఏర్పడుతున్నాయో– అని చెప్పే రచనలు నిరుపయోగం అంటారా? తప్పుల్ని వివరిస్తే ప్రయోజనం లేకుండా అవుతుందా? కాకపోతే, ఆ ప్రయోజనం రేపే కనపడదు.
పఠనాభిలాష కోల్పోతున్న యువత ఏం మిస్ అవుతోంది?
‘పఠనం’ మీద అభిలాషని యువత, పూర్తిగా కోల్పోవడం లేదు. వాళ్ళు మిస్ అయ్యేది, ‘సమాజం ఎంత తప్పుడుగా సాగుతూ వుందో తెలుసుకోవడాన్ని. ‘పఠనం’ అంటే, ఏది దొరికితే అది చదవడం కాదు. సమస్యల్ని ఎదుర్కొనే అవగాహనని ఇచ్చే పఠనమే అవసరం.
నవలలు చదివే వారు తగ్గారని చెప్పి, వ్యక్తిత్వ వికాస పుస్తకాల వైపు మళ్ళిన రచయితలున్నారు. పాఠకుల అవసరాలకు తగ్గట్టుగా, రచయిత తనను తాను మలచు కోవాలా?
పాఠకుల్ని తయారు చేసేది, పత్రికలే, పుస్తకాలే. వాటి ప్రభావాలే పాఠకుల్ని తయారు చేస్తాయి. పాఠకులకు తగ్గట్టుగా రచయిత మారడం కాదు; రచయిత, తన లాభం కోసమే తను తయారవుతాడు. ‘వ్యక్తిత్వ వికాసం’ కోసం, నిజమైన వికాస మార్గాలు చూపిస్తే, ఆ ‘వికాసం’ అవసరమే. కానీ, ‘వికాసం’ పేరుతో, తప్పుడు మార్గాల్ని బోధిస్తే, అది తప్పు అనీ, అది వికాసం కాదనీ, పాఠకులకు తెలియదు. ఆ రచయితకి మాత్రం డబ్బు కుప్పలు!
మీరెప్పుడైనా వ్యక్తిత్వ వికాసం వైపు దృష్టి సారించారా?
పాఠకుల వ్యక్తిత్వాలు, వికాసవంతంగా ఎదగాలనేదే నా భావం. కానీ, అది డబ్బు పిచ్చితో కాదు. వ్యక్తిత్వానికి వికాసమే. ఒక చిన్న ఉదాహరణ: హిమాలయ పర్వతాల మీద జీవితాన్ని ఏర్పర్చుకుని మత క«థలు చెప్పుకుంటూ బ్రతికే ‘స్వామీ రామానంద’ అనే ఆయన, ‘కాపిటల్ పరిచయం’ చదివి, అది ముగిసే నాటికే, మత కథల ప్రచారాన్ని ఆపేశాడు. ‘కాపిటల్ పుస్తకం నాకు ఇరవై యేళ్ళ కిందటే తెలిస్తే, నా జీవితం ఈ దారిలో నడిచేదా?’ అన్నాడు. పుస్తకాల్లో సరియైన తర్క విధానం వుంటే, అది పాఠకుల వ్యక్తిత్వం మీద క్రమంగా అయినా పని చేస్తుంది.
విమర్శ పట్ల మీరు వ్యక్తిగతంగా అనుసరించే పంథా?
నా రాతల్లో ఎక్కడైనా, ఏదైనా తప్పు వుందని తార్కికమైన విమర్శలే వస్తే, వాటిని తప్పకుండా తీసుకుంటాను. నా పొరపాట్లు, నాకే అర్థమయితే నేనే దిద్దుకుంటాను. నా పొరపాట్ల గురించి, నా పుస్తకాల్లో, ‘కొత్త ముందు మాటలు’ రాశాను.
మీరు మీ ప్రచురణలను సబ్సిడీ ధరలకు ఇస్తున్నారు. ప్రతి కాపీపైనా నష్టంతో ఎంతకాలం ఇవ్వగలరు?
‘సబ్సిడీ ధర’ అంటే అర్థం, ఒక పరిశ్రమ తన సరుకుని తక్కువ ధరకు ఇచ్చినా, మిగిలిన ధరని ఆ పరిశ్రమకి ప్రభుత్వం ఇస్తుంది. ఆ పరిశ్రమకి పూర్తి ధర అందుతుంది. నా పుస్తకాల ధరలు, ‘సబ్సిడీ ధరలు’ కావు. ఈ దోపిడీ సమాజం, మంచి సమాజంగా మారాలనీ, ఆ మార్పుని పాఠకులు అర్థం చేసుకోవాలనీ, ఆశించి, అలా తక్కువ ధరలు పెట్టడం! ‘ఎంత కాలం ఇలా చేస్తారు?’ అన్నారు. వీలైనంత కాలం. ఇంట్లో వాళ్ళకి మేధా శ్రమల జీతాలు వున్నాయి. ఆ జీతాలతో ఇతర ఆస్తులు అక్కర లేదు.
ఇంటర్వ్యూ: గోవిందరాజు చక్రధర్
ఏది దొరికితే అది చదవడం పఠనం కాదు
Published Mon, Sep 21 2020 12:30 AM | Last Updated on Mon, Sep 21 2020 12:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment