విరసం ఏభై ఏళ్ళ మహాసభల సందర్భంగా, విరసం గురించి నా అభిప్రాయం అడిగారు మీరు. నేను విరసం మీద, గతంలోనే చాలాసార్లు రాశాను. విరసం మీద, నా గత అభిప్రాయాల్ని మార్చుకోవడానికి, విరసంలో ఈనాటికీ కొత్త మార్పులేవీ లేవు.
విరసంతో నాకు భిన్నాభిప్రాయాలు వున్నా, 1985లో, వరంగల్‌లో విరసం మీటింగులో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడాను. 1990ల చివర్లో, విరసం వారి సిటీ యూనిట్ నడిపిన ‘అవగాహనా తరగతి’లో, మార్క్స్ ‘కాపిటల్’లో వున్న విషయాల క్రమం గురించి మాట్లాడాను. 2005లో, విరసాన్ని ప్రభుత్వం నిషేధించినప్పుడు, ఆ నిషేధాన్ని వ్యతిరేకించే, నిరసన పత్రం మీద సంతకం చేశాను.
‘విరసం’ వారు, తమ ప్రణాళికలో ‘మార్క్సియన్ సోషలిజమే’ తమ ధ్యేయంగా ప్రకటించుకున్నారు. కానీ, ఆ అవగాహన, ఆ సంఘం ప్రవర్తనలో, గడిచిన 50 ఏళ్ళల్లో ఎక్కడా కనపడలేదు నాకు.
విరసంలో, ప్రారంభంలో, నాయకులుగా ఆసనాలు ఎక్కిన వాళ్ళల్లో కొందరిలో, బహుభార్యత్వం, బహిరంగ వ్యభిచారం, తాగుబోతుతనం, జంధ్యం వేసుకోవడం, దయ్యాల్నీ– భూతాల్నీ– మంత్రాల్నీ– అతీత శక్తుల్నీ సైన్సులుగా చెప్పడం– వంటి లక్షణాలు కనిపించాయి.
విరసం సభ్యులు, అలాంటి నాయకుల్ని ఎందుకు ఎంచుకున్నారు? అంతకుముందే, కవులుగా, రచయితలుగా, కొన్ని కొన్ని కీర్తులతో వున్న వారు, తమకు నాయకులవడం, ఆ సంఘ సభ్యులకు నచ్చిందనుకోవాలి. బైట కీర్తులుండటం వేరూ, మార్క్సియన్ సంఘంలో నాయకత్వ అర్హతలుండటం వేరూ కదా? అంటే, ఒక సంఘం, తన ప్రణాళికలో వున్న సిద్ధాంతాన్ని బట్టి, సభ్యులు చేరాలని ఆశించడం గాక; బైటి వారి కీర్తుల్ని బట్టి, సభ్యుల్ని ఆకర్షించాలని ఆశించడం ఇది!
ఈ విప్లవ సంఘం, తన 50 ఏళ్ళ మహాసభలకి జనాన్ని సమీకరించడానికి, 156 మంది బైటి వారితో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పర్చుకుంది. వారు ‘విరసం’లో సభ్యులు కారు; బైట కీర్తులు గల వారు. వీరు ఏమి చెయ్యాలి? అక్కడక్కడా సమావేశాలు జరిపి, జనాలతో, ‘విరసం మహాసభలకు రండి!’ అని చెప్పాలి. ఈ ప్రచారం బైటి వాళ్ళు చెయ్యాలా? ఆ పని చెయ్యడానికి, విరసానికి సభ్యులు లేరా? బూర్జువా సంఘాల సంప్రదాయాలనే విప్లవ సంఘాలు అనుకరించడం ఇది.
విరసం వెబ్‌సైట్‌లోనూ, ఆహ్వాన సంఘం పేరుతో వేసిన కరపత్రంలోనూ అతిశయమూ, ఆత్మస్తుతీ చూడొచ్చు. విరసానికి యాభై ఏళ్ళు నిండటం ‘చారిత్రక సందర్భం’ అట! సంఘం ప్రారంభంలో ఎంత మంది వున్నారూ, యాభై ఏళ్ళలో సంఘం ఎంత విస్తరించింది? ఆ చరిత్ర కావాలి. విరసం పుట్టాకే, కళా సాహిత్య రంగాలలో ‘‘ద్రుష్టి కోణమే మారిపోయింది’’ అట! విరసం వారి దయ్యాల తత్వశాస్త్ర వ్యాసాల ముద్రణా, పునర్ముద్రణా కూడా కొత్త ద్రుష్టికోణమే అన్న మాట! సాహిత్య విమర్శని మౌలికంగా మార్చేసింది–అట! శ్రమదోపిడీని వివరించే మార్క్సిజంతో సంబంధం లేని ‘బ్రాహ్మణీయ’,‘మనువాద’,‘హిందూత్వ’ వంటి పదజాలాన్ని విరివిగా ఉపయోగించడం ఏమి విమర్శనా పద్ధతి? స్త్రీ–పురుష సమానత్వానికీ, కుల నిర్మూలనకూ మార్క్సిజం పనికి రాదనే ఫెమినిస్టు ధోరణుల్నీ, దళితవాద ధోరణుల్నీ ‘మార్క్సియన్ సోషలిజం’ద్రుష్టితో నీళ్ళు నమలకుండా ఎదుర్కోక పోవడం ఏ రకం విమర్శనా పద్ధతి?
‘‘రచయిత అంటే వ్యవస్తకూ, రాజ్యానికీ నిరంతర ప్రతిపక్షం అనే ఆదర్శాన్ని తన ఆచరణ ద్వారా నిరూపిస్తున్నది’’ అని కితాబు! సంస్త ప్రారంభం నించీ ఇప్పటి వరకూ, సంస్తలో ముఖ్యస్తానాల్లో ఉండిన వాళ్ళందరూ, రాజ్యానికి ‘నిరంతరం ప్రతి పక్షంగా’ఉన్నారా? రాజ్యం ఇచ్చే బహుమతులూ, పదవులూ పొందే వారిని మీటింగులలోనూ, ఆహ్వాన సంఘాలలోనూ కూచో పెట్టుకునే ఆచరణ ఏ ఆదర్శాన్ని నిరూపిస్తున్నది?
సాహిత్యంలో అనేక అంశాల్లో విరసం ‘గణనీయమైన క్రుషి చేస్తోంది’ అని ప్రశంస. విరసం తన మాసపత్రికని క్రమం తప్పకుండా అనుకున్న సమయానికి తీసుకు రాగలుగుతోందా? ఎందుకీ అతిశయాలూ, ఆత్మస్తుతులూ? ఏ విప్లవ సంఘమైనా, తనకు చేతనైనంతా, చేయగలిగినంతా చేస్తుంది, చెయ్యాలి. దాన్ని చూసుకుని మురిసిపోయి, బడాయిలు పోకూడదు.
ఇక నిర్బంధాలు అంటారా? తేలుకి కుట్టడం ఎంత సహజమో, దోపిడీ రాజ్యాంగ యంత్రాంగానికి నిర్బంధం అంత సహజం. విప్లవ రచయితలనే కాదు, అంధ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు– వంటి వారు, చిన్న పాటి డిమాండ్లు అడిగినా, వారిని లాఠీలతో కొట్టిస్తారు; గుర్రాలతో తొక్కిస్తారు. దీనిని ప్రతిఘటించడానికి, సాధారణ ప్రజా చైతన్యం సరిపోదు. దోపిడీ శ్రమ సంబంధాలూ, వర్గాలూ, వర్గ ప్రయోజనాలూ, వర్గ పోరాటం వంటి విషయాలు ముందు విప్లవ రచయితలు తెలుసుకుని, వాటిని శ్రామిక వర్గ ప్రజలకి తెలిసేలా ఎంత వరకూ చేస్తున్నారూ– అనే దాన్ని బట్టి ప్రతిఘటన వుంటుంది. అంతే గానీ, మనం చాలా చేసేశాం ఈ యాభై ఏళ్ళలో, ఉద్యమం శరవేగంగా దూసుకుపోతోంది–అనే ధోరణిలో ఉంటే, అంగుళం కూడా ముందుకు పోలేరు. - రంగనాయకమ్మ
విరసం గురించి మరోసారి
Published Mon, Jan 6 2020 12:54 AM | Last Updated on Mon, Jan 6 2020 12:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment