Ranganayakamma
-
అసలు కావలిసింది ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి!’
దేశ పౌరుల్లో కొందరికి భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు. దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే ఉంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేని మీద యాజమాన్యం ఉంది? దేశంలో, నిత్యం 24 గంటలూ ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు సుఖ శాంతుల్లో ఉమ్మడితనం ఉందా? ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు మాత్రమే! ‘ఒకే ఇంట్లో వున్న ఇద్దరు వ్యక్తులకు రెండు వేరు వేరు చట్టాలు వుంటే, ఆ కుటుంబం సవ్యంగా సాగుతుందా, చెప్పండి?’ అని ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తల్ని అడిగిన వార్త, పది రోజులుగా ఒక చర్చనీయాంశం అయింది! అన్ని మతాల వారినీ ఒకే రకపు పౌరులుగా చేయాలనే ప్రయత్నంతో, ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానం ఎంత అవసరమో చెప్పడానికి మోదీ తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఉపన్యాసం అది! దేశంలో, ఐదు రాష్ట్రాలలో, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, అన్న బోధనగా ఆ మాటల్ని అర్ధం చేసుకోవచ్చు. ముస్లిం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఎలానూ రావని ఆ పార్టీకి తెలుసు. కాబట్టి, హిందూ ఓటర్లలో అత్యధికుల్ని తన వైపు తిప్పుకోవడానికే బీజేపీ చేసే ప్రయత్నం అది. ఆ విధంగా భారత దేశ ప్రజలందర్నీ పౌరులుగా కాక, హిందువులుగా, ముస్లిములుగా, విభజించడానికే మోదీ వేసిన ఎత్తుగడ అది– అని కొన్ని ప్రతిపక్షాలు సరిగానే విమర్శిస్తున్నాయి. ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానపు మంచి చెడ్డల గురించి చెప్పుకోవాలంటే, ముందు అది ఏమిటో కనీసంగా తెలియాలి. ఒక దేశంలోనే కాదు, ప్రపంచం లోనే వున్న ఆడా, మగా పౌరులందరికీ, మతం, కులం, ప్రాంతం వంటి తేడాలు లేకుండా, పౌరుల వ్యక్తిగత జీవితాల్నీ, కుటుంబ జీవితాల్నీ శాసించే, ఒకే రకమైన చట్టం (‘స్మృతి’) ఉండవలిసిందే! ఎందుకంటే, ఉదాహరణకి, ఒకటి రెండు మతాల్లో, పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో పెళ్ళిళ్ళు! ఇంకో మతంలో, పెళ్ళయిన వాళ్ళు విడిపోవడంలో స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అసాధ్యమైనంత కష్టం! మతాల్లో, ఆస్తి హక్కులు ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ వేరు వేరుగా! మొగవాడి దృష్టిలో ఆడది తక్కువ! ఆడదాని దృష్టిలో మొగవాడు ఎక్కువ! ఈ విధంగా, పెళ్ళీ, విడాకులూ, దత్తతా, ఆస్తి హక్కూ, వంటి విషయాల్లో, వేరు వేరు మతస్తుల ఆచారాలూ, నియమాలూ, వేరు వేరే! ఎందుకూ? భారత్‌లో, మతాల గురించీ, కులాల గురించీ, సమానత్వాల బోధనలతో మాట్లాడే వాళ్ళు, అసలు బ్రతుకు తెరువుకి పునాది కారణం అయిన ఆదాయాల్లో తేడాల గురించి ఎందుకు ఎత్తరు? ‘ఉమ్మడి పౌర స్మృతి’ కోసం ప్రయత్నించాలని, భారత రాజ్యాంగంలో కూడా ఒక చోట చెప్పారని తెలుస్తుంది! కానీ, దాన్ని సాధించడానికి సరైన పునాదిగా ఏ పరిస్థితులు ఏర్పడాలో భారత రాజ్యాంగం చెప్పదు! ఎవరి మతాచారాల్ని వారు ఆచరించే హక్కులు ఉండవచ్చని ఒక వేపు చెపుతూనే, ‘మతాలతో నిమిత్తం లేకుండా’ పౌరులందరికీ, వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు సంబంధించి ఒకే చట్టం ఉండాలని ఇంకో పక్క సూచిస్తుంది. ఎంత గడుసు రాజ్యాంగం! ఒకటి ‘ప్రాధమికమైన హక్కూ’! రెండోది కేవలం ‘సూచన’! సూచన, నిబంధనగా ఎప్పటికీ అవదు. ఉమ్మడి పౌర స్మృతి కూడా నిజానికి సూచన వంటిదే! కానీ, దాన్ని చట్టంగా నిలబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు. మోదీని, బీజేపీ కార్యకర్తలు ఈ తర్కంతో అడగాలి: అయ్యా! తమరు ఉమ్మడి పౌర స్మృతి పేరుతో పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలంటున్నారు! ఆ స్మృతి, కేవలం వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు మాత్రమే కదా? మరి, పౌరులందరూ ఆర్ధికంగా ఒకే స్తితిలో లేరు! ‘ఆర్ధికంగా’ అంటే, ‘రూపాయి నోట్ల’ పరంగా కాదు, శ్రమలు చేయడాల పరంగా, ఉత్పత్తి కార్యాల పరంగా! దేశ పౌరుల్లో, కొందరికి భారీ భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు. దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే వుంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేనిమీద యాజమాన్యం వుంది? దేశంలో, నిత్యం, 24 గంటలూ, ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు, సుఖ శాంతుల్లో ఉమ్మడితనం వుందా? ఆడవాళ్ళ గృహ కార్యాలలో, పిల్లల పెంపకాల్లో, వృద్ధుల సంరక్షణల్లో, పురుషుల ఉమ్మడి పాత్ర వుందా? శ్రామిక జనంలో, మేధా శ్రామికులు వేరూ, శారీరక శ్రమల వారు వేరూ! శ్రమలు చేయడాల్లో ఉమ్మడితనం లేకపోతే, పౌరులుగా సమానులా? ఈ రకంగా ఆర్ధిక అసమానతల గురించి స్పష్టంగా గ్రహిస్తూ, మోదీ వంటి నాయకుల్ని అడగవలిసిన ప్రశ్న ఏమిటి? వ్యవసాయంలో, పరిశ్రమల్లో, రవాణాల్లో, సమస్త శ్రమల్లోనూ కాదా; ఏ ఒక్క శ్రమలో అయినా వేలు పెట్టని పౌరులకూ, రాత్రింబవళ్ళూ డ్యూటీలతో సతమతమయ్యే పౌరులకూ మధ్య ఉమ్మడితనం ఉన్నట్టా? ఇది వుందో లేదో ప్రశ్న లేకుండా, పెళ్ళికో, విడాకులకో, దత్తతకో, దీనికో, దానికో ఉమ్మడి చట్టాలా? హక్కులే సమానంగా, ఉమ్మడిగా లేనప్పుడు, ఉమ్మడి పౌర çస్మృతి గురించి ఉపన్యాసం ఇస్తున్నారేమీ మహాశయా?– అని మోదీని ప్రజలందరూ ప్రశ్నించలేరా? ఎన్నికల ముచ్చట్లలోనూ, నాయకుల ఆరాధనల్లోనూ మునిగిపోయిన ఏ పార్టీ ప్రజలకైనా, ఏ ప్రశ్నలూ రావు. ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? ‘ఉమ్మడి ఆర్ధిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు! ఉమ్మడి ఆర్ధిక స్మృతి అంటే: మానవుల మనుగడకు ఆధారమైన భూములూ, గనులూ, అడవులూ, పరిశ్రమలూ, రవాణా సాధనాలూ వంటి ఉత్పత్తి సాధనాలు, పౌరులందరి ఉమ్మడి ఆస్తిగా, అంటే, ‘సమాజపు ఆస్తి’ గా ఉన్నప్పుడు! అలా ఉంచే చట్టమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! చిన్న పిల్లలూ, వృద్ధులూ, అనారోగ్యంతో వున్నవారూ తప్ప, ఇతర స్త్రీ–పురుషులందరూ, వేరు వేరు విలువలు కలిగిన, ఉత్పత్తి కార్యాలలో బాధ్యతలు కలిగి వుండే విధానమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! ఆ విధానమే ఉమ్మడి పౌర స్మృతికి దారితీయగలదు! శ్రమ దోపిడీని అనుమతించే వర్గ భేదాల రాజ్యాంగ పాలన వున్న చోట, తర్క రహిత మతాచారాలు జీవితాల్ని శాసిస్తూ వుంటాయి. సమానత్వం లేని శ్రమ విభజన వల్ల తలెత్తిన కుల వ్యవస్త ఉన్నంతవరకూ, కుల కట్టుబాట్లూ, కులాచారాలూ, సమస్త కులాల పౌరుల్నీ ఎంతగానో లొంగదీస్తాయి! ఉమ్మడి ఆర్ధిక వ్యవస్త లేని సమాజంలో, దుర్భరమైన దారిద్య్రం కారణంగా, స్త్రీలని భోగ్య వస్తువులుగా కొనడాలూ, అమ్మడాలూ వంటి ‘వృత్తులు’ పుట్టుకొచ్చి సాగుతున్నాయి. కేవలం ఉమ్మడి పౌర çస్మృతి వల్ల, మతం గానీ, కులం గానీ, వ్యభిచారం వంటి ‘వృత్తులు’ గానీ మాయం అవుతాయా? ఉన్న అసమానతల మీద సంస్కరణలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. నిజమే! కానీ, మౌలికమైన మార్పులు అత్యవసరమైన సమాజంలో, చిట్టి పొట్టి సంస్కరణలు స్తిరపడతాయా? ‘ఉమ్మడి పౌర స్మృతి’ని వ్యతిరేకించే వారు, ముస్లిం ఆడకూతుర్లకూ (‘ముసల్మాన్ బేటియా’), ముస్లింలలో వెనకబడ్డ ‘పాస్మండా’ కులాలకూ ద్రోహం చేస్తున్నారు– అని వాపోయింది ప్రధాని కరుణా హృదయం! మరి, మొన్న బిల్కిస్ బానోనీ, ఇతర ముస్లిం స్త్రీలనీ అత్యాచారాలకు గురిచేసిన నేరస్తుల్ని, బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడం ‘ముస్లిం బేటీయా’లకు ద్రోహం చేయడం అవలేదా? రంగనాయకమ్మ వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత్రి -
కావాల్సింది ‘వర్గ పోరాటాల చరిత్ర’
విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, ‘ఉభయ’ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్నజీవులని చెప్పరు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన కొన్ని పాఠ్యపుస్తకాలలో వున్న చరిత్రకి సంబంధించిన కొన్ని పాఠాల్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీసివెయ్యడం ఆరు నెలల కిందట (2022 జులైలో) జరిగింది. అది ఇప్పుడు ఒక వివాదంగా వుంది. కేంద్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగానూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో రకంగానూ చరిత్ర పాఠాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి! గతంలో ఎప్పుడు, ఎలాంటి మార్పులు చేశారు– అనే వివరాలలోకి వెళ్ళడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతోన్న వివాదాన్నే ప్రధానంగా చూడాలి. సెంట్రల్ సిలబస్‌లో 6వ తరగతి నించీ 12వ తరగతి వరకూ వున్న సోషలూ, చరిత్రా పాఠాలు పిల్లలకి భారంగా తయారయ్యాయి కాబట్టి కొన్ని పాఠాల్ని తీసివెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వం అంటే, అధికార పార్టీకి అనుకూలంగా వుండే ప్రొఫెసర్ల కమిటీ అన్నమాట! ‘సిలబస్ హేతుబద్ధీకరణ’ అనే పేరుతో, కొన్ని పాఠాలు తీసేశారు. వాటిలో అతి ప్రధానమైనది – దాదాపు 4 వందల యేళ్ళు పాలించిన మొఘల్ చక్రవర్తుల చరిత్ర. అలాగే, గాంధీ హత్యా, గుజరాత్లో మత కల్లోలాలూ, వగైరా, వగైరా. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మొఘలుల పాలనకు విపరీతమైన ప్రాముఖ్యం ఇచ్చారనీ, ప్రాచీన హిందూ రాజుల చరిత్రకి ప్రాధాన్యం లేదనీ, దక్షిణ భారత దేశాన్నీ, ఈశాన్య భారతాన్నీ ఏలిన రాజుల్ని పట్టించుకోలేదనీ, కాంగ్రెసు మీద బీజేపీ సమర్థకుల విమర్శ. ముస్లిం మైనారిటీలను బుజ్జగించి, వారి ఓట్లను పొందడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లిం పాలకులకు అంత ప్రాధాన్యం ఇచ్చిందని కాంగ్రెసు మీద బీజేపీ ఆరోపణ. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మార్పులు, మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎన్నికల్లో మెజారిటీ హిందూ మతస్థుల ఓట్లను రాబట్టడా నికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాల వాదన! విద్యలో ‘ప్రభుత్వ జోక్యం’ అనేది ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. ఆ ప్రభుత్వ జోక్యానికి వుండే పెట్టు బడిదారీ వర్గ స్వభావాన్ని కార్మికవర్గ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని ఆ ప్రణాళిక ఉద్దేశం. ఆ దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్సూ, బీజేపీ – రెండూ బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపా డేవే. అలా కాపాడడం కోసం, అధికార పీఠం ఎక్కడానికి, అవి ఎంచుకునే పద్ధతులు తేడాగా వుంటాయి. ఉదాహరణకి, బీజేపీ ఎందుకు హిందూ మెజారిటీ ఓట్ల మీద ఆధారపడుతుందీ అనే విషయం అర్థం చేసుకోవాలంటే, 1906లో ఏర్పడ్డ ‘ముస్లిం లీగ్’ గురించీ, 1915లో ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’ గురించీ తెలుసుకోవాలి. అప్పుడు ఆ మతాలకు చెందిన భూస్వాములకూ, పరిశ్రమాధిపతు లకూ, వర్తకులకూ, రాజకీయ నాయకులకూ, అటువంటి వారి ప్రయోజనాల మధ్య వున్న వైరుధ్ధ్యాలను పరిశీలించాలి. అదంతా ఇక్కడ వీలుకాదు. సారాంశం ఏమిటంటే, మత సంస్థలు గానీ,మతంతో ముడిపడి వున్న రాజకీయాలు గానీ, నిజంగా మతాలకు సంబంధించిన అంశాలు కావు. ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ళకిందట మతం పేరుతో జరిగిన యుద్ధాల్లో కూడా, ఎంగెల్సు చెప్పి నట్టు, ‘స్పష్టమైన భౌతిక వర్గ ప్రయోజనాలు వుండినాయి’! ‘ఆ నాటి వర్గపోరాటాలు మత నినాదాల దుస్తులలో వుండి, వేరువేరు వర్గాల ప్రయోజనాలూ, అవసరాలూ, డిమాండ్లూ వంటివి, మతం అనే తెరవెనక మరుగు పడ్డాయ’నే విషయాన్ని ‘జర్మనీలో రైతు యుద్ధం’ అనే పుస్తకంలో ఎంగెల్సు చాలా వివరంగా చెపుతాడు. అది ఈ నాటికీ వాస్తవమే. పైకి, తక్షణంగా, ఒక కారణం (ఉదా: గోధ్రా రైలు దహనం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు) కనిపించినప్పటికీ, అనేక లింకుల ద్వారా చరిత్రని పరికిస్తే – మనకి పాలకవర్గ ప్రయో జనాలు కనిపిస్తాయి. ‘వర్గ ప్రయోజనం’ అన్నప్పుడు రెండు వేరు వేరు వర్గాలు– అనే కాదు; ఒకే వర్గంలోనే, రెండు వేరు వేరు సెక్షన్ల ప్రయోజనాల మధ్యకూడా వైరుద్ధ్యాలు ఉంటాయి. వర్గాలుగానూ, ఉపవర్గాలుగానూ చీలివున్న సమాజంలో, పాలక వర్గ ప్రయోజనాలను కాపాడడానికి, ఒకే ఒక్క రాజకీయ పార్టీయే వుండదు. అనేక పార్టీలు వుంటాయి. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. ఈ చరిత్ర పుస్తకాలలో రాజుల్నీ, చక్రవర్తుల్నీ చిత్రించేటప్పుడు ఒక పక్షం మేధావులు అన్ని మతాల పాలకుల్నీ కొంత ‘సంస్కరణ వాద దృక్పథం’తో చూపుతారు. ఇంకో పక్షం మేధావులు హిందూ పాల కుల్ని మాత్రమే గొప్ప చేస్తూ, ముస్లిం రాజుల్ని దుష్టులుగా చూపు తారు. చిత్రం ఏమిటంటే, ఉభయ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులే స్వయంగా దోపిడీదారులనీ, వాళ్ళు శ్రామిక జనాలనించీ లాగిన కౌలూ, వడ్డీ, లాభాల వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీదే బతికిన వాళ్ళనీ మాత్రం గుర్తించరు. వాళ్ళ వీరత్వం గురించీ, యుద్ధ కళల గురించీ, కళా పోషణల గురించీ, వాళ్ళ పాండిత్య ప్రతిభల గురించీ, మత సామరస్యాల గురించీ, వాళ్ళ దైవభక్తి గురించీ, దానశీలతల గురించీ... ఇలా, ఇలా చిత్రించుకుంటూ పోతారు, ఇరుపక్షాల వారూ కూడా! అంతేగానీ, ఆ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువ రాణులూ, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదనీ, వాళ్ళది వందలాది సేవక పరివారం మీద ఆధారపడిన పరమ సోమరి జీవితం అనీ మాత్రం ఎక్కడా ఒక్క ముక్క అయినా రాయరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ చెప్పరు (స్కూలు పుస్తకాల్లో కాదు గానీ, చరిత్రకి సంబంధించిన ఇతర రచనల్లో, వర్గాల గురించీ, వర్గ పోరాటాల గురించీ రాసిన మేధావులు కొందరైనా వున్నారు). చరిత్రకి సంబంధించిన పాఠ్యపుస్తకాల వివాదం చూశాక, శ్రామిక వర్గ పక్షం వహించే రచయితలు చెయ్యాల్సింది ఏమిటి? ‘పిల్లల కోసం వర్గపోరాట చరిత్ర పాఠాలు’ రాయడం! ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం’ పేరుతో రాసినట్టు, వర్గ దృక్పథంతో కొన్ని చరిత్ర పాఠాలు రాయాలనివుంది నాకు. బీజేపీ ప్రభుత్వం అంటే భయం లేదుగానీ, నా ‘హెర్నియా’ జబ్బు రాయనిస్తుందో లేదో చూడాలి! రంగనాయకమ్మ వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి -
కావాల్సింది ‘వర్గ పోరాటాల చరిత్ర’
విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, ‘ఉభయ’ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన కొన్ని పాఠ్యపుస్తకాలలో వున్న చరిత్రకి సంబంధించిన కొన్ని పాఠాల్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీసివెయ్యడం ఆరు నెలల కిందట (2022 జులైలో) జరిగింది. అది ఇప్పుడు ఒక వివాదంగా వుంది. కేంద్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగానూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో రకంగానూ చరిత్ర పాఠాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి! గతంలో, ఎప్పుడు ఎలాంటి మార్పులు చేశారు– అనే వివరాలలోకి వెళ్ళడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతోన్న వివాదాన్నే ప్రధానంగా చూడాలి. సెంట్రల్ సిలబస్‌లో 6వ తరగతి నించీ 12వ తరగతి వరకూ వున్న సోషలూ, చరిత్రా పాఠాలు పిల్లలకి భారంగా తయారయ్యాయి కాబట్టి కొన్ని పాఠాల్ని తీసివెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వం అంటే, అధికార పార్టీకి అనుకూలంగా వుండే ప్రొఫెసర్ల కమిటీ అన్నమాట! ‘సిలబస్ హేతుబద్ధీకరణ’ అనే పేరుతో, కొన్ని పాఠాలు తీసేశారు. వాటిలో అతి ప్రధానమైనది, దాదాపు 4 వందల యేళ్ళు పాలించిన మొఘల్ చక్రవర్తుల చరిత్ర. అలాగే, గాంధీ హత్యా, గుజరాత్లో మత కల్లోలాలూ, వగైరా, వగైరా. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మొఘలుల పాలనకు విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చారనీ, ప్రాచీన హిందూ రాజుల చరిత్రకి ప్రాధాన్యత లేదనీ, దక్షిణ భారత దేశాన్నీ, ఈశాన్య భారతాన్నీ ఏలిన రాజుల్ని పట్టించుకోలేదనీ, కాంగ్రెసు మీద బీజేపీ సమర్థకుల విమర్శ. ముస్లిం మైనారిటీలను బుజ్జగించి, వారి ఓట్లను పొందడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లిం పాలకులకు అంత ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెసు మీద బీజేపీ ఆరోపణ. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మార్పులు, మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎన్నికల్లో మెజారిటీ హిందూ మతస్తుల ఓట్లను రాబట్టడా నికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాల వాదన! విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ అనేది ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. ఆ ప్రభుత్వ జోక్యానికి వుండే పెట్టు బడిదారీ వర్గ స్వభావాన్ని కార్మికవర్గ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని, ఆ ప్రణాళిక ఉద్దేశం. ఆ దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్సూ, బీజేపీ, రెండూ బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపా డేవే. అలా కాపాడడం కోసం, అధికార పీఠం ఎక్కడానికి, అవి ఎంచుకునే పద్ధతులు తేడాగా వుంటాయి. ఉదాహరణకి, బీజేపీ ఎందుకు హిందూ మెజారిటీ ఓట్లమీద ఆధారపడుతుందీ అనే విషయం అర్థం చేసుకోవాలంటే, 1906లో ఏర్పడ్డ ‘ముస్లిం లీగ్’ గురించీ, 1915లో ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’ గురించీ తెలుసుకోవాలి. అప్పుడు ఆ మతాలకు చెందిన భూస్వాములకూ, పరిశ్రమాధిపతు లకూ, వర్తకులకూ, రాజకీయ నాయకులకూ, అటువంటి వారి ప్రయోజనాల మధ్య వున్న వైరుధ్యాలను పరిశీలించాలి. అదంతా ఇక్కడ వీలుకాదు. సారాంశం ఏమిటంటే, మత సంస్థలు గానీ, మతంతో ముడిపడి వున్న రాజకీయాలు గానీ, నిజంగా మతాలకు సంబంధించిన అంశాలు కావు. ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ళ కిందట మతం పేరుతో జరిగిన యుద్ధాల్లో కూడా, ఎంగెల్సు చెప్పి నట్టు, ‘స్పష్టమైన భౌతిక వర్గ ప్రయోజనాలు వుండినాయి’! ‘ఆ నాటి వర్గపోరాటాలు మత నినాదాల దుస్తులలో వుండి, వేరువేరు వర్గాల ప్రయోజనాలూ, అవసరాలూ, డిమాండ్లూ వంటివి, మతం అనే తెరవెనక మరుగు పడ్డాయ’నే విషయాన్ని ‘జర్మనీలో రైతు యుద్ధం’ అనే పుస్తకం లో ఎంగెల్సు చాలా వివరంగా చెపుతాడు. అది ఈ నాటికీ వాస్తవమే. పైకి, తక్షణంగా, ఒక కారణం (ఉదా: గోద్రా రైలు దహనం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు) కనిపించినప్పటికీ, అనేక లింకుల ద్వారా చరిత్రని పరికిస్తే, మనకి పాలకవర్గ ప్రయో జనాలు కనిపిస్తాయి. ‘వర్గ ప్రయోజనం’ అన్నప్పుడు రెండు వేరు వేరు వర్గాలు– అనే కాదు; ఒకే వర్గంలోనే, రెండు వేరు వేరు సెక్షన్ల ప్రయోజనాల మధ్యకూడా వైరుధ్యాలు ఉంటాయి. వర్గాలుగానూ, ఉపవర్గాలుగానూ, చీలివున్న సమాజంలో, పాలక వర్గ ప్రయోజనాలను కాపాడడానికి, ఒకే ఒక్క రాజకీయ పార్టీయే వుండదు. అనేక పార్టీలు వుంటాయి. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. ఈ చరిత్ర పుస్తకాలలో రాజుల్నీ, చక్రవర్తుల్నీ, చిత్రించేటప్పుడు, ఒక పక్షం మేధావులు అన్ని మతాల పాలకుల్నీ కొంత ‘సంస్కరణ వాద దృక్పథం’తో చూపుతారు. ఇంకో పక్షం మేధావులు హిందూ పాల కుల్ని మాత్రమే గొప్ప చేస్తూ, ముస్లిం రాజుల్ని దుష్టులుగా చూపు తారు. చిత్రం ఏమిటంటే, ఉభయ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులే స్వయంగా దోపిడీ దారులనీ, వాళ్ళు శ్రామిక జనాలనించీ లాగిన కౌలూ, వడ్డీ, లాభాల వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీదే బతికిన వాళ్ళనీ మాత్రం గుర్తించరు. వాళ్ళ వీరత్వం గురించీ, యుద్ధ కళల గురించీ, కళా పోషణల గురించీ, వాళ్ళ పాండిత్య ప్రతిభల గురించీ, మత సామరస్యాల గురించీ, వాళ్ళ దైవభక్తి గురించీ, దానశీలతల గురించీ... ఇలా, ఇలా చిత్రించుకుంటూ పోతారు, ఇరుపక్షాల వారూ కూడా! అంతేగానీ, ఆ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువ రాణులూ, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదనీ, వాళ్ళది వందలాది సేవక పరివారం మీద ఆధారపడిన పరమ సోమరి జీవితం అనీ మాత్రం, ఎక్కడా ఒక్క ముక్క అయినా రాయరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమమీదా, చేతి వృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు (స్కూలు పుస్తకాల్లో కాదు గానీ, చరిత్రకి సంబంధించిన ఇతర రచనల్లో, వర్గాల గురించీ, వర్గ పోరాటాల గురించీ రాసిన మేధావులు కొందరైనా వున్నారు). చరిత్రకి సంబంధించిన పాఠ్యపుస్తకాల వివాదం చూశాక, శ్రామిక వర్గ పక్షం వహించే రచయితలు చెయ్యాల్సింది ఏమిటి? ‘పిల్లల కోసం వర్గపోరాట చరిత్ర పాఠాలు’ రాయడం! ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం’ పేరుతో రాసినట్టు, వర్గ దృక్పధంతో కొన్ని చరిత్ర పాఠాలు రాయాలనివుంది నాకు. బీజేపీ ప్రభుత్వం అంటే భయం లేదుగానీ, నా ‘హెర్నియా’ జబ్బు రాయనిస్తుందో లేదో చూడాలి! వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ -
మాంద్యం ముప్పు ఎవరికి?
నవంబరు 9న ‘మెటా’ అనే కంపెనీ తన ఉద్యోగుల్లో 11 వేల మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ‘ట్విట్టర్’ అనే కంపెనీ 3 వేల 7 వందల మందినీ, ‘బైజూ’ అనే కంపెనీ 2 వేల 5 వందల మందినీ.. ఇలా అనేక డజన్ల కంపెనీలు తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని వందల్లో, వేలల్లో తీసేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా గత 6 నెలల నించీ జరుగుతూనే వుంది. మొన్న జులై నెలలో ‘అమెజాన్’ అనే కంపెనీ లక్షమందిని ఉద్యోగాల్లో నించీ తీసేసింది. ఈ జాబితా చాలా పొడుగ్గా వుంటుంది. ఈ ఉద్యోగాలు పోవడం అనేది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకే కాదు, వస్తువులు తయారు చేసే పరిశ్రమల్లో (మాన్యుఫ్యాక్చర్ రంగంలో) కూడా లక్షల్లో జరుగుతోంది. కొన్ని నెలలుగా ఆర్థిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం సేకరించే సంస్థల (ఉదా: సి.ఎం.ఐ.ఇ) నివేదికలు చూస్తే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికుల్ని ఉద్యోగాల్లో నించీ తీయదలుచుకుంటే వాళ్ళకి గులాబీ రంగు కాగితం (పింక్ స్లిప్) మీద ‘రేపటి నించీ నువ్వు పనిలోకి రానక్కరలేదు’ అని రాసిచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక ఎక్కడెక్కడో నివసించే ఉద్యోగులందరినీ ఒక తెర మీద కనిపించేలాగా సమా వేశపరిచి (దీన్ని బడాయిగా ‘జూమ్ మీటింగ్’ అని చెప్పుకుంటారు.) చల్లగా చావు కబురు చెపుతారు. ఆ మధ్య ‘బెటర్.కామ్’ అనే కంపెనీ ఒకే ఒక్క జూమ్ సమావేశం పెట్టి ఒక్క దెబ్బతో 3 వేలమంది ఉద్యోగుల్ని ‘రేపటినించీ మీరు పనిలోకి రానక్కర లేదు’ అని చెప్పేశారని ఒక వార్త! ఇంతగా ఉద్యోగాలు పోవడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. కేవలం పెట్టుబడిదారీ విధానంతోనే అది మొదలైంది. గత సమా జాలలో లేదు. బానిసలకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఫ్యూడల్ కౌలు రైతులకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఎటొచ్చీ ఈనాటి కార్మికులకే (వీళ్ళది ‘వేతన బానిసత్వం’ అంటాడు మార్క్స్) ఈ నిరుద్యోగ సమస్య వుంది. కార్మికులు అన్నప్పుడు వాళ్ళు శారీరక శ్రమలు చేసేవారే అనుకోకూడదు. మేధాశ్రమలు చేసే వారందరూ (ఉదా: టీచర్లూ, డాక్టర్లూ, జర్నలిస్టులూ) కూడా కార్మికులే! ఉద్యోగుల్ని తీసేయడానికి కంపెనీల వాళ్ళు చెప్పుకునే కారణాలు (సాకులు) కొన్ని: 1. కంపెనీకి ఆదాయాన్ని మించిన ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగుల సంఖ్యని తగ్గించుకోవడం మినహా మార్గం లేదు. 2. ఉద్యోగులు ఎక్కువగానూ, సమర్థంగానూ ఉత్పత్తి చెయ్యడం లేదు. (దీన్నే ఉత్పాదకత –ప్రొడక్టివిటీ – సమస్యగా చెపుతారు). 3. బ్యాంకులు వడ్డీరేట్లని పెంచేస్తూ పోతున్నాయి. ఇలాంటప్పుడు, వ్యాపారాన్ని నడపాలన్నా, పెంచాలన్నా అప్పులు తీసుకోవాలంటే పెంచిన వడ్డీ రేట్లు పెద్ద భారం. అందుకే ఉన్న ఉద్యోగుల్ని తగ్గించి, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడమే మార్గం. 4. ఇతర దేశాలలో కూడా ఇవే పరిస్థితులు ఉండడం వల్ల ఎగుమతులు కూడా తగ్గి పోతున్నాయి. 5. ఒకే రకమైన సరుకులు తయారు చేసే ఇతర కంపెనీలతో పోటీ ఒకటి తలనొప్పిగా వుంది. 6. తయారైన సరుకులు మందకొడిగా (నెమ్మదిగా) అమ్ముడవుతున్నాయి. (దీన్నే ‘మాంద్యం’ అంటారు. కాబట్టి, ఉన్న సరుకులు అమ్ముడు కాకుండా కొత్త సరుకులు తయారు చేయించడం కుదరదు. అందుచేత, కొంతమందిని ఉద్యోగాల్లోనించీ తీసివేయక తప్పదు). ఈ రకమైన పరిస్థితిని చూపించి ఆర్థికవేత్తలు ‘ముంచుకొస్తున్న మాంద్యం’ అని హెచ్చరికలు చేస్తారు. అంతేగానీ తయారైన సరుకుల అమ్మకాలు మందకొడిగా ఎందుకు జరుగుతాయి? దానికి పరిష్కారం ఏమిటి?– అనే ప్రశ్నలకు వారి దగ్గిర సరైన సమాధానం వుండదు. మార్క్స్ తన ‘కాపిటల్’ లో విమర్శించినట్టు, ‘‘పాఠ్య పుస్తకాల ప్రకారం ఉత్పత్తి విధానం సాగించి వుంటే సంక్షోభాలు సంభ వించవు.. అని నొక్కి చెప్పడం ద్వారా పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు సంతృప్తి పడతారు’’. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే, అనేక కంపెనీల్లో సరుకుల గుట్టలు మార్కెట్ అవసరాల్ని మించిపోయి ఆకాశం ఎత్తున పెరిగిపోవడం వల్ల! ఈ గుట్టలు పెరగడం ఎందుకు జరుగు తుందంటే, ఆ ఉత్పత్తుల్ని తయారు చేయించే వాళ్ళ మధ్య సమష్టి ప్లాను లేకపోవడం వల్ల! ఆ సమిష్టి ప్లాను లేకపోవడం ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళందరూ ప్రైవేటు పెట్టుబడిదారులు అవడం వల్ల! పెట్టుబడిదారీ జన్మ ప్రారంభమైన తర్వాత, ఆ జన్మకి లక్ష్యం లాభం రేటే! ఆ లక్ష్యానికి ఒక పరిమితీ, ఒక నీతీ, ఏదీ ఉండదు. ఆఖరికి మార్కెట్ అవసరాల్ని గమనించుకోవాలనే తెలివి అయినా ఉండదు. పోటీలో నిలబడడానికి ఏకైక మార్గం – ఉత్పత్తి శక్తుల్ని పెంచడం! అంటే, సరుకుల్ని తక్కువ ఖర్చులతో తయారుచేసి, వెనకటి ధరలతోనే అమ్మాలని ప్రయత్నం! ఆ రకంగా కొంతకాలం జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కంపెనీల నిండా సరుకుల గుట్టలు పేరుకుపోయి కనపడతాయి. అమ్మకాలు మందగించిన ప్రమాద సంకేతాలు ఎదురవుతాయి. దాన్ని గమనించుకున్న కంపెనీ యజమాని, పునరుత్పత్తి క్రమాల్ని తగ్గించెయ్యడం గానీ, ఆపెయ్యడం గానీ చేస్తాడు. అలా ఆపెయ్యడం వల్ల కార్మికులతో అవసరం తగ్గిపోతుంది. ఆ కంపెనీ నించి ఒక పిడికెడు మంది కార్మికులు తప్ప, మిగతా అందరూ ఉద్యోగాలు పోయి వీధుల్లో పడతారు. అసలు కార్మిక వర్గంలో, కొంత జనం ఎప్పుడూ నిరుద్యోగంలోనే వుంటారు. కానీ, సంక్షోభాల కాలాల్లో ముంచుకువచ్చే నిరుద్యోగాల పరిస్థితి అలాంటిది కాదు. ఒక కంపెనీలో నిన్నటి దాకా 100 మంది కార్మికులు వుంటే, ఇవ్వాల్టికి కనీసం 90 మంది నిరుద్యోగులైపోతారు. ఇది ఒక్క శాఖలోనే కాదు, అనేక శాఖల్లో జరుగుతుంది. శారీరక శ్రమల్లోనూ, మేధా శ్రమల్లోనూ కూడా ఇది జరుగుతుంది. సరుకుల పునరుత్పత్తి క్రమాలే తగ్గిపోయి, యంత్రాలే ఆగిపోయినప్పుడు, ఇక కార్మికులతో ఏం అవసరం ఉంటుంది? అయితే, ఆ కార్మికులందరూ ఏమైపోతారు? రెగ్యులర్‌గా జీతాలు అందుతూ వున్నప్పుడే కార్మిక కుటుంబాలు, సమస్యల వలయాల్లో కూరుకుపోయి వుంటాయి. అలాంటి కుటుంబాలకు జీతాలే ఆగిపోతే, తిండే ఉండదు. అద్దె ఇళ్ళు ఖాళీ చేసి చెట్ల కిందకి చేరవలసి వస్తుంది, చెట్లయినా వుంటే! పిల్లల్ని స్కూళ్ళు మానిపించవలసి వస్తుంది. ఆకలి – జబ్బులు మొదలవుతాయి. వైద్యం ఉండదు. చావులు ప్రారంభం! బతికి వుంటే పిచ్చెత్తడాలూ, ఆత్మహత్యలూ, నేరాలూ పెరిగి పోతాయి. కార్మిక జనాలు పిట్టలు రాలినట్టు రాలి పోతారు. ఉదాహరణకి, ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశంలో 2021లో లక్షా 64 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళలో 43 వేలమంది రోజూ వారీ కూలీలూ, నిరుద్యోగులూనూ అని తేలింది. లెక్కకు రానివి ఎన్నో! రంగనాయకమ్మ, ప్రముఖ రచయిత్రి -
రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?
ఒక దేశపు కరెన్సీ మారకం రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల విలువ సమానంగా ఉంటే, మారకాల సమస్య, ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్య మాత్రమే. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగుమతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు. ఇటీవల తరచుగా వినిపిస్తున్న ఒక వార్త: ‘డాలరుతో మారకంలో రూపాయి విలువ పడి పోతోంది’–అని. రూపాయి ‘మారకం విలువ రేటు’లో మార్పునకి కారణాన్ని తెలుసుకోవా లంటే, ‘మారకం’ అంటే ఏమిటో, ‘మారకం విలువ’ అంటే ఏమిటో ముందు తెలియాలి. సరుకుల ‘మారకం’ అంటే, ఒక వ్యక్తిగానీ, ఒక దేశంగానీ, ఒక సరుకుని బైటికి ఇచ్చి, ఇంకో సరుకుని బైటినించీ తీసుకోవడమే. సరుకుకి ‘మారకం విలువ’ అంటే, ఆ సరుకుని తయారు చేయడానికి పట్టిన శ్రమ కాలమే. ఎక్కువ శ్రమ జరిగితే ఎక్కువ విలువ, తక్కువ శ్రమకి తక్కువ విలువ. ఏ సరుకుని తయారు చేయడానికైనా, మొదట ప్రకృతిలో దొరికే సహజ పదార్థం ఏదో ఒకటి వుండాలి. ప్రకృతి సహజ పదార్థం మీద శ్రమ జరిగితే, ఏదో ఒక వస్తువు తయారవుతుంది. ఆ వస్తువుని అమ్మకానికి పెడితే, అదే ‘సరుకు’. ఒక సరుకు తయారు కావడానికి జరిగిన శ్రమని కొలవడానికి వున్న సాధనం అది జరిగిన ‘కాలమే’. గంటలో, రోజులో, నెలలో, సంవత్సరాలో! సరుకుని, మారకం కోసం ఇవ్వడం అంటే, దాన్ని అమ్మడమే. అప్పుడు ఆ సరుకు వల్ల ‘కొంత డబ్బు’ వస్తుంది. ‘డబ్బు’ అంటే, సరుకుని తయారుచేసిన శ్రమ కాలమే– అని గ్రహించాలి. డబ్బుకి వెనక, ఆధారంగా వుండేది బంగారం అనే లోహం! బంగారం కూడా ఇతర సరుకుల లాగే, మొదట గనుల్లో దొరికే సహజ పదార్థం తోటీ, దానిమీద జరిగే శ్రమల తోటీ తయారవుతుంది. మారకం విలువ రేటునీ, తర్వాత ఆ రేటులో మార్పునీ తెలుసుకోవడానికి, మొదట ఇంత వరకూ చూసిన విషయాలు చాలు. 2 దేశాల డబ్బుల మధ్య మారకం విలువ రేటు ఏర్పడడానికి ఆధారం – ఆ 2 దేశాల డబ్బుకీ వెనక వుండే కొంత కొంత బరువుగల బంగారాలే. డాలర్ దేశపు డబ్బు వెనక 4 గ్రాముల బంగారం వుందనీ, రూపాయి దేశపు డబ్బు వెనక 2 గ్రాముల బంగారం వుందనీ అనుకుందాం. అప్పుడు ఒక డాలరు= 2 రూపాయలు అవుతుంది. ఇది, ఆ రెండు దేశాల డబ్బులకు వున్న మారకం విలువ రేటు. ఇది, ఆ దేశాల డబ్బు వెనక వున్న బంగారాల కొలతల్ని బట్టే! ఈ కొలతలు మారడానికి, వేరే వేరే కారణాలు కూడా వుండొచ్చు. 2వ ప్రపంచ యుద్ధకాలం తర్వాత, డాలర్ దేశంలో (అమె రికాలో), ఆర్థిక పరిస్థితులు ఇతర దేశాలలో కన్నా ‘అభివృద్ధి’ చెంది వున్నాయి. ముఖ్యంగా, ఆ నాడు ఏ దేశంలోనూ లేనన్ని బంగారు నిల్వలు డాలరు దేశంలో వున్నాయి. దానివల్ల, డాలరు దేశపు ఆధిక్యం పెరిగింది. అప్పట్నించీ ‘అంతర్జాతీయ ధనం’గా డాలరుని దాదాపు అన్ని దేశాలూ అంగీకరిస్తూనే వున్నాయి. వేరు వేరు దేశాల మధ్య ఎగుమతులతో, దిగుమతులతో ‘విదేశీ వర్తకాలు’ జరుగుతూ వుంటాయి. ఒక దేశం ఇంకో దేశానికి కొంత డబ్బు ఇవ్వవలిసి వస్తే, ఆ డబ్బు లెక్కని, ఆ 2 దేశాల డబ్బులకూ వున్న మారకం రేటు ప్రకారమే లెక్క చూడాలి. ఒక దేశం నించి, ఆ రెండో దేశం డబ్బుకి ఎన్ని డాలర్లు వస్తాయో కూడా లెక్క చూసి, ఆ డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఒక దేశపు కరెన్సీ మారకం విలువ రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతుల విలువలూ, దిగుమతుల విలువలూ సమానంగా వుంటే, వేరు వేరు దేశాల డబ్బు మారకాల సమస్య, కేవలం ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్యగా మాత్రమే వుంటుంది. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగు మతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు. భారత దేశం ఏ దేశానికి చెల్లించవలిసి వచ్చినా, సాధారణంగా డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, అప్పుడు భారత దేశానికి డాలర్లు అవసరం. ఆ డాలర్లు ఎంత మొత్తంలో కావాలీ – అనేది, భారత దేశం ఇతర దేశాలకు చేసిన ఎగుమతుల, దిగుమతుల విలువ ఎంతా– అనే లెక్క (కరెంట్ ఎకౌంటు) మీద ఆధార పడి వుంటుంది. గత కొంత కాలంగా, భారత దేశానికి దిగుమతుల కోసం (ఉదాహరణకి: క్రూడ్ ఆయిల్ కోసం) అయ్యే ఖర్చు ఎక్కువగా వుండడం వల్ల, భారత దేశం ఇతర దేశాల దిగుమతుల కోసం చెల్లించేదాన్ని ఎక్కువ డాలర్లలోనే చెల్లించాలి. కాబట్టి డాలర్లని కొనడం కోసం డాలర్లు అమ్మే కరెన్సీ మార్కెట్‌కి వెళ్ళాలి. డాలరు అనేది, బియ్యం లాంటి వాడకం సరుకు కాకపోయినప్పటికీ, అది కరెన్సీలను అమ్మే, కొనే మార్కెట్లో ఒక సరుకుగా అయింది. ఏ సరుకుకి అయినా, దాని సప్లై తక్కువగా వుంటే, అది దొరకడం కష్టం కాబట్టి దాని కోసం డిమాండ్ పెరిగి, దాని ధర పెరుగుతుంది. అలాగే, డాలర్లని కొనవలిసిన పరిస్థితిలో, దాని ధర తగ్గడమో, పెరగడమో జరుగుతుంది. ఈ దశలో, ఏ దేశం అయినా, ఇతర దేశాలకు చెల్లించవలిసిన దిగుమతుల డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, డాలర్లకి డిమాండు ఎక్కువగా వుంటుంది. అప్పుడు డాలర్లని ఎక్కువ ధరలతో కొనాలి. అలాంట ప్పుడు ఒక డాలర్‌కి, గతంలో కంటే ఎక్కువ రూపాయిలు ఇచ్చి కొన వలిసి వస్తుంది. ఉదాహరణకి, డాలరు ధర పెరుగుతూ, పెరుగుతూ, కిందటి నెలలో 70 రూపాయిలు అయింది. ఆ ధర ఇప్పుడు 80 కూడా దాటేసింది. పత్రికల్లో, ‘‘డాలరు మిలమిల, రూపాయి వెల వెల!’’ అనే హెడ్డింగులు కనిపిస్తున్నాయి. అంటే, రూపాయి విలువ తగ్గుతూ, తగ్గుతూ పోతోంది. అంటే, డాలరుని ప్రతీసారీ ఎక్కువ రూపా యలతో కొనవలిసి వస్తోంది. అలా కొన్న డాలర్లని, దిగుమతుల చెల్లింపుల కోసం ఇవ్వాలి. రూపాయి దేశం, డాలర్ల కోసం, వేల వేల రూపాయల్ని ఖర్చు పెట్టెయ్యవలిసి వస్తుంది. (రూపాయి మారకం విలువ తగ్గిన ఈ సమస్య ఈ దేశంలోనే సరుకుల్ని కొనడానికి వర్తిస్తుందా? దీన్ని ఇక్కడ వివరించలేము.) ఈ సమస్యకు పరిష్కారం, వీలైనంత వరకూ ప్రతీ దేశమూ, తన దగ్గిరవున్న వనరులతో, కావలిసిన వస్తువుల్ని సొంతంగా తయారు చేసుకోవడమే! తప్పనిసరి వాటికోసం మాత్రమే వేరే దేశాల దిగుమతుల మీద ఆధారపడొచ్చు. కానీ, లాభాల కోసం పోటీపడే పెట్టుబడిదారీ విధానంలో, అది సాధ్యం కాదు. ఎందుకంటే, పెట్టు బడిదారుల మధ్య, ‘దేశంలో ఎన్ని సరుకుల్ని అమ్మగలం? విదేశాలకు ఎన్ని సరుకుల్ని అమ్మగలం?’ అనే ఒక సమష్టి ప్లానింగు వుండదు. సమష్టి ప్లానింగు వుండని చోట ఎగుమతులూ, దిగుమతులూ సమానంగా వుండవు. అలా వుండనప్పుడు మారకం రేట్లు కూడా స్థిరంగా వుండవు. రంగనాయకమ్మ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి -
ఆ వృత్తులకు గౌరవాలు ఏ సమాజంలోనూ దొరకవు
కొన్నాళ్ళ కిందట ఒక ఇంటర్వ్యూ చూశాను. సెక్స్ వర్కర్ల సంఘానికి ప్రతినిధిగా వున్న ఒక స్త్రీ ఇచ్చిన ఇంటర్వ్యూ అది. వ్యభిచారాన్ని ఒక పని (వర్క్) గానూ, ఆ పని చేసే వారిని ‘సెక్సు వర్కర్లు’ గానూ, గుర్తించి, వారిని సానుభూతితో కాక గౌరవంగా చూడాలని ఆ ఇంటర్వ్యూ సారాంశం. ఇలాంటి వాదన, కొత్త దేమీ కాదు. పాతికేళ్ళ కిందట (1997లో) కలకత్తా లోని ఒక మహిళా సంఘం వారు ‘‘సెక్స్ వర్కర్స్ మానిఫెస్టో’’ అని ఒక ప్రణాళికనే విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చేసిన వాదనలు గానీ, చూపిన పరిష్కారాలు గానీ, ఆడ వాళ్ళని మరింత అధోగతికి దిగజార్చేవిగా ఉన్నాయి. క్లుప్తంగా కొన్నిటిని చూద్దాం. (1) ‘సెక్సు’ని ఒక ‘పని’గా, ఒక ‘వృత్తి’గా అనడం పచ్చి వ్యాపార దృష్టి! స్త్రీలని ‘సెక్స్ ఆబ్జెక్ట్స్’గా (‘భోగ్య వస్తువు’గా), తిరుగుబోతు పురుషులకు అందుబాటులో ఉంచడం తప్పులేదనే దృష్టి అది! ఇలాంటి దృష్టిని ‘పితృస్వామ్య’ దృష్టి అనీ, ‘పురుషాధిక్య భావజాలం’ అనీ అనొచ్చు. కానీ, ఇక్కడ ఆ భావాల్ని ప్రకటించినది, పురుషుడు కాదు, ఒక స్త్రీ! అంటే, జీవశాస్త్ర పరంగా స్త్రీలు, పురుషుల నించీ వేరుగా ఉంటారే గానీ, సామాజికంగా స్త్రీల భావాలు, పురుషుల భావాల నించీ తేడాగా ఉండవని అర్ధం! కట్నం కోసం వేధించే వాళ్ళూ, వ్యభిచార గృహాలు నడిపే వాళ్ళూ ప్రధానంగా స్త్రీలే కదా? (2) వ్యభిచారాన్ని ఒక ‘వృత్తి’గా చెప్పే సంస్కర్తలు, సమాజంలో, స్త్రీ పురుషుల సంబంధాలు ఎలా ఉండాలని చెపుతున్నారు? ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం కేవలం శారీరక సంబంధమేనా? ఒక కుటుంబంగా ఉండడమూ, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరూ బాధ్యతలు పంచుకోవడమూ ఉండాలా, అక్కరలేదా? డబ్బు– ఆదాయ దృష్టితో వ్యభిచారాన్ని సమర్ధిస్తే, ఇంకా మానవ సంబంధాల నేవి ఎలా ఉంటాయి? (3) వ్యభిచారిణుల్ని ‘కార్మికులు’గా గుర్తించమని పోరాడుతున్నారట! పోరాటాలు జరగాల్సింది, ‘ఒళ్ళమ్ము కుని’ బ్రతికే నీచ స్థితి నించీ తప్పించి, గౌరవంగా బ్రతికే ఉద్యోగాలు చూపించమనే డిమాండుతో! (4) ఆర్ధిక అవసరాల వల్ల బ్రతుకుతెరువు కోసం ఈ ‘పని’లోకి వస్తున్నారని ఈమె చెపుతున్నారు. అంటే గతి లేకే వస్తున్నట్టు కాదా? మరి, ‘స్వచ్ఛందంగా’ వస్తున్నారని సమర్ధించుకోవడం ఏమిటి? (5) ‘భర్త బాధ్యతగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువగా వస్తుంటారు’ అని అంటున్నారు. కానీ, భర్తలు బాధ్యతగా లేని సంసారాలు అనేక లక్షలుంటాయి. ఆ స్త్రీలందరూ ఇదే వ్యభిచారాన్ని బ్రతుకుతెరువుగా చేసుకుంటు న్నారా? చేసుకోవాలా? (6) ‘మా వాళ్ళెవరూ, ఈ పనిని బ్రతుకుతెరువుకోసమే గానీ ఆదాయ వనరుగా చూడర’ని ఒక పక్క చెపుతూ, ఇంకో పక్క పాచి పనుల వల్ల వచ్చే ఆదాయం పిల్లల్ని ఇంజనీ రింగూ, మెడిసినూ చదివించడానికి సరిపోదనడం అంటే, వ్యభిచారాన్ని (‘ఈ పనిని’) ఆదాయ వనరుగా చూడ్డం కాదా? (7) ‘పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పిందంటున్నారు. పరస్పరం అంగీకారమైతే, ఒకరు మాత్రమే డబ్బులివ్వడం, ఇంకోరు తీసుకోవడమెందుకు? ఇద్దరికీ అది శృంగారమైతే, ఆ మొగవాడే ఆ ఆడదానికి డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఆడది కూడా, ఆ మగవాడికి డబ్బు ఇవ్వాల్సిందే కదా? అలా ఎందుకు జరగదు? (8) వ్యభిచారిణులు, ఆ ‘వృత్తి’ ద్వారా డబ్బు చక్కగా సంపాదించి, పిల్లల్ని డాక్టర్లనీ, ఇంజనీర్లనీ చెయ్యగలుగు తున్నారట! ఈ పాతికవేల మందీ, తమ పిల్లల్లో ఒకటి రెండు వందల మంది పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేశారను కుందాం. అన్ని వేలల్లో, మిగతా పిల్లల సంగతి ఏమిటి? అయినా తమ పిల్లల్ని డబ్బు సంపాదించే ఉద్యోగులుగా చేయడానికేనా ఆ తల్లులు వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించేది? డబ్బు బాగా సంపాదించకుండా, మాములు కూలి పనులతో, పేదరికంతో బ్రతికే స్త్రీలను మూర్ఖులుగా అనుకోవాలా? (క్లిక్: అబార్షన్ హక్కుకు గొడ్డలిపెట్టు) (9) చివరికి చెప్పుకోవాలిసిన మాట, గౌరవాలకు తగిన నడతలకే గౌరవాలు దొరుకుతాయి గానీ, వ్యభిచారాలూ, దొంగతనాలూ, హత్యలూ వంటి ‘వృత్తులకు’ గౌరవాలు ఏ సమాజంలోనూ దొరకవు. దాన్ని డబ్బు పోసి కొనలేరు. వ్యభిచారిణుల పిల్లలైనా, వాళ్ళు కూడా అదే దారిలో వెళితే తప్ప, వాళ్లయినా, తల్లుల్ని గౌరవించరు! గౌరవించలేరు! గౌరవించకూడదు! (క్లిక్: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి) - రంగనాయకమ్మ సుప్రసిద్ధ రచయిత్రి -
ఏది దొరికితే అది చదవడం పఠనం కాదు
సమకాలీన తెలుగు సాహితీ ప్రపంచంలో రంగనాయకమ్మ ఓ ఫైర్‌బ్రాండ్. ఎంతటి ప్రతికూలతలెదురైనా, తాను నమ్మిన విలువల, సిద్ధాంతాల విషయంలో రవ్వంత రాజీ పడకుండా, ఎనిమిది పదుల వయసులోనూ(1939 సెప్టెంబర్ 21న జన్మించారు), అవిశ్రాంతంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే వున్నారు. ఆమెను రాజీలేని మనిషిగా ఎంతగా ఇష్టపడే వారు ఉన్నారో, అంతగానూ వ్యతిరేకించేవారూ ఉన్నారు. బలిపీఠం, స్వీట్ హోమ్, జానకి విముక్తి వంటి 15 నవలలూ, 70 కథలూ, భాషా విషయాలూ సహా సమకాలీన అంశాలపై లెక్కకు మిక్కిలి వ్యాసాలు రాశారు. ఆమె రాసిన రామాయణ విషవృక్షం అత్యంత వివాదాస్పదమైంది. ఏ కమ్యూనిస్టు పార్టీ ముట్టుకోని, మార్క్స్ మూలరచన ‘పెట్టుబడి’ని తేలికైన పద్ధతిలో పరిచయం చేశారు. రచనల లక్ష్యం, రచయితల – పాఠకుల మధ్య అనుబంధం, తరాలతోపాటే వస్తున్న మార్పులు... వంటి అంశాలపై, రంగనాయకమ్మ వెలిబుచ్చుతున్న ఆలోచనల సమాహారం. మీ దృష్టిలో, పాఠకుల నుంచి ఏదైనా ఆశించి రచన చేయాలా? అవును. రచయితలు, తాము రాసే వాటిని పాఠకులు అంగీకరించాలని కోరుకుంటారు. అలా కాకపోతే, రచయిత, తను తెలుసుకున్నది, తనే తెలుసుకుని వూరుకోవచ్చు కదా? దాని కోసం రాత ఎందుకు? ఒక రచయిత, భక్తినో, దాని వ్యతిరేకతనో, దేనినో ఒక్క దాన్నే రాస్తాడు గానీ, ఆ రెంటినీ సమర్థిస్తూ రాయడు. ఆ రచయిత, తను రాసే విషయాన్ని పాఠకులు కూడా అంగీకరించాలనే భావిస్తాడు. వెనకటి కాలపు కవులైనా అదే; ఈ కాలంలో అయినా అదే. ఇది సామాజిక ప్రయోజనం కలిగిస్తుంది అని మీరు ఒక గిరి గీసుకుని రచన చేసినపుడు, అది ప్రచార సాహిత్యమై పోదా? సమాజమే వేరు వేరు ప్రయోజనాలతో వుంటుంది. ఆ నిజాన్ని తెలుసుకుంటే, ఏ ప్రయోజనాన్ని కోరే రచయితలు, ఆ ప్రయోజనం కోసమే గిరి గీసుకుంటారని తెలుస్తుంది. రచయితకు భావజాలం వున్నట్టే, పాఠకుడికీ అతని భావజాలం అతనికి వుంటుంది. ఈ అంతరాలను అధిగమించి, దగ్గరి దారులు నిర్మించడం ఎలా? ఇది జరగాలంటే, 2 విషయాల్ని బట్టి వుంటుంది. (1) రచయిత ఇచ్చే రచనలో భావాలు ఎటువంటివి? (2) ఆ రచనని చదివే పాఠకుడి భావాలు ఎటువంటివి? – ఈ 2 విషయాల్ని బట్టే చివరి ఫలితం వుంటుంది. ఒక రచన, హేతుబద్ధంగా వుందనుకుందాం. దాన్ని చదివే ఒక పాఠకుడి భావాలు, అప్పటికే ‘భక్తి’ చుట్టూ వుంటాయి అనుకుందాం. అలాంటి పాఠకుడికి, ఆ రచనలో తర్కాలు నచ్చితే, అతను మారి, తన పాత భావాలు వదిలేస్తే, అప్పుడు, ఆ రచనకీ, ఆ పాఠకుడికీ, ఏకీభావం ఏర్పడుతుంది. అదే రచనని, అదే రకపు భావాలు గల ఇంకో పాఠకుడు చదివితే, అతడి హేతుబద్ధ భావాలు, మరింతగా స్థిరపడతాయి. ఒక రచనకీ, ఒక పాఠకుడికీ తేడాలు వుంటే, ఆ రెంటికీ, ఎప్పటికీ ఏకీభావం వుండనే వుండదా? ఇలాగే అనుకుంటే, అసలు సమాజంలో వున్న చెడ్డ ఎప్పటికీ మారదు– అనే అర్థానికి రావలసి వస్తుంది. అసలు సమాజం వైరుధ్యాలతో వుంది. ఆ వైరుధ్యాలు లేనిదిగా మారే మార్గం వుంది. అది జరిగే మార్గంలో అయితేనే, రచయితలూ, పాఠకులూ ఒకే హేతుబద్ధ భావాలతో మారతారు. పాఠకుడి మనసుకు హత్తుకు పోయేలా చెప్పడంలో, మీ దృష్టిలో ఏ ప్రక్రియ అనువు? కథా, నవలా, నాటకాలూ – వంటి రచనలే ఏ పాఠకులకైనా అనువుగా ఉంటాయి. ఈ రకం రచనల్లో కథ పొడగునా పాత్రలూ, వాళ్ళ సంభాషణలూ, వాళ్ళ ప్రవర్తనలూ, వాళ్ళ సమస్యలూ, వుంటాయి. వాటిని చదువుతోంటే, తోటి మనుషుల్ని చూస్తున్నట్టు వుంటుంది. పాఠకులకు కూడా అటువంటి అనుభవాలూ, సమస్యలూ వుంటే, సమాజం అర్థం అవుతుంది. పాటలైతే లయ బద్ధంగా, ఏదో ఒక రాగంతో వుండి, వినే వాళ్ళని ముగ్ధుల్ని చేస్తాయి. మతాలు అనేవి, మనుషుల్ని లొంగదీసేది, వాటి పాటల రాగాల వల్లే గానీ, కేవలం దేవుళ్ళ వర్ణనల వల్ల కాదు. కవిత్వాలూ, వ్యాసాలూ, ఏ ప్రభావాల్నీ ఇవ్వలేవని కాదు. వ్యాసాలు, ఎంత వివేకాల్ని ఇచ్చేవి అయినా, కథకీ, వ్యాసానికీ, ప్రభావాలు చూపడంలో తేడా మాత్రం వుంటుంది. తరం మారే కొద్దీ పాఠకుల అభిరుచుల్లో, ఆలోచనల్లో, వస్తున్న మార్పులు ఏమైనా గమనించారా? ‘తరాలు మారడం’ అంటే, మనుషుల ‘వయసులు’ మారడమే కాదు. తరాలు మారడం అంటే, సమాజానికి అత్యవసరం అయిన ఉత్పత్తుల్ని ఇచ్చే ఉత్పత్తి సంబంధాలు మారడమే. పాత కాలంలో బానిసత్వం వుంటే, ఆ బానిసలే కౌలు రైతులుగా మారితే, ఈనాటి సమాజం అంతా ప్రధానంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంతో సాగే సమాజమే. పాఠకుల అభిరుచుల్లో, గతంలో అయినా, ఈ కాలంలో అయినా, గుణగణాలన్నీ ఒకటే. గత సమాజమూ, ఈనాటి సమాజమూ, రెండూ ఒకే రకం గుణం గలవి కాబట్టి. మనుషుల అభిరుచులు, తరాలు మారడాన్నిబట్టి కాదు. వాడే ఉత్పత్తుల్లో మార్పుల్ని బట్టి. కెరీరిజమే, డబ్బు సంపాదనే, ఈ కాలపు యువత లక్ష్యంగా మారిపోయినపుడు, రచయితగా ఏం చెప్పినా ఏం ప్రయోజనం? ‘కెరీరిజమ్’ అంటే, ఉద్యోగాల్లోనే కాదు, కళల్లోనే కాదు, ఏ విషయంలో నైనా, నీతి నియమాలు లేకుండా పైకి ఎగబాకాలనే పిచ్చే కదా? ‘డబ్బు సంపాదన’ని పెంచుకోవాలనుకునేది కూడా అటువంటిదే. ఈ తప్పుడు కాంక్షలు, ఈ కాలపు లక్ష్యాలే కాదు. ఇటువంటివన్నీ వెనకటి కాలంనించీ వున్నవే. యువతలోనే కాదు; యువతని తయారు చేసే పెద్దల్లో కూడా ఇవే లక్ష్యాలు. పెద్దలకైనా, పిన్నలకైనా, ఎందుకు ఏర్పడుతున్నాయో– అని చెప్పే రచనలు నిరుపయోగం అంటారా? తప్పుల్ని వివరిస్తే ప్రయోజనం లేకుండా అవుతుందా? కాకపోతే, ఆ ప్రయోజనం రేపే కనపడదు. పఠనాభిలాష కోల్పోతున్న యువత ఏం మిస్ అవుతోంది? ‘పఠనం’ మీద అభిలాషని యువత, పూర్తిగా కోల్పోవడం లేదు. వాళ్ళు మిస్ అయ్యేది, ‘సమాజం ఎంత తప్పుడుగా సాగుతూ వుందో తెలుసుకోవడాన్ని. ‘పఠనం’ అంటే, ఏది దొరికితే అది చదవడం కాదు. సమస్యల్ని ఎదుర్కొనే అవగాహనని ఇచ్చే పఠనమే అవసరం. నవలలు చదివే వారు తగ్గారని చెప్పి, వ్యక్తిత్వ వికాస పుస్తకాల వైపు మళ్ళిన రచయితలున్నారు. పాఠకుల అవసరాలకు తగ్గట్టుగా, రచయిత తనను తాను మలచు కోవాలా? పాఠకుల్ని తయారు చేసేది, పత్రికలే, పుస్తకాలే. వాటి ప్రభావాలే పాఠకుల్ని తయారు చేస్తాయి. పాఠకులకు తగ్గట్టుగా రచయిత మారడం కాదు; రచయిత, తన లాభం కోసమే తను తయారవుతాడు. ‘వ్యక్తిత్వ వికాసం’ కోసం, నిజమైన వికాస మార్గాలు చూపిస్తే, ఆ ‘వికాసం’ అవసరమే. కానీ, ‘వికాసం’ పేరుతో, తప్పుడు మార్గాల్ని బోధిస్తే, అది తప్పు అనీ, అది వికాసం కాదనీ, పాఠకులకు తెలియదు. ఆ రచయితకి మాత్రం డబ్బు కుప్పలు! మీరెప్పుడైనా వ్యక్తిత్వ వికాసం వైపు దృష్టి సారించారా? పాఠకుల వ్యక్తిత్వాలు, వికాసవంతంగా ఎదగాలనేదే నా భావం. కానీ, అది డబ్బు పిచ్చితో కాదు. వ్యక్తిత్వానికి వికాసమే. ఒక చిన్న ఉదాహరణ: హిమాలయ పర్వతాల మీద జీవితాన్ని ఏర్పర్చుకుని మత క«థలు చెప్పుకుంటూ బ్రతికే ‘స్వామీ రామానంద’ అనే ఆయన, ‘కాపిటల్ పరిచయం’ చదివి, అది ముగిసే నాటికే, మత కథల ప్రచారాన్ని ఆపేశాడు. ‘కాపిటల్ పుస్తకం నాకు ఇరవై యేళ్ళ కిందటే తెలిస్తే, నా జీవితం ఈ దారిలో నడిచేదా?’ అన్నాడు. పుస్తకాల్లో సరియైన తర్క విధానం వుంటే, అది పాఠకుల వ్యక్తిత్వం మీద క్రమంగా అయినా పని చేస్తుంది. విమర్శ పట్ల మీరు వ్యక్తిగతంగా అనుసరించే పంథా? నా రాతల్లో ఎక్కడైనా, ఏదైనా తప్పు వుందని తార్కికమైన విమర్శలే వస్తే, వాటిని తప్పకుండా తీసుకుంటాను. నా పొరపాట్లు, నాకే అర్థమయితే నేనే దిద్దుకుంటాను. నా పొరపాట్ల గురించి, నా పుస్తకాల్లో, ‘కొత్త ముందు మాటలు’ రాశాను. మీరు మీ ప్రచురణలను సబ్సిడీ ధరలకు ఇస్తున్నారు. ప్రతి కాపీపైనా నష్టంతో ఎంతకాలం ఇవ్వగలరు? ‘సబ్సిడీ ధర’ అంటే అర్థం, ఒక పరిశ్రమ తన సరుకుని తక్కువ ధరకు ఇచ్చినా, మిగిలిన ధరని ఆ పరిశ్రమకి ప్రభుత్వం ఇస్తుంది. ఆ పరిశ్రమకి పూర్తి ధర అందుతుంది. నా పుస్తకాల ధరలు, ‘సబ్సిడీ ధరలు’ కావు. ఈ దోపిడీ సమాజం, మంచి సమాజంగా మారాలనీ, ఆ మార్పుని పాఠకులు అర్థం చేసుకోవాలనీ, ఆశించి, అలా తక్కువ ధరలు పెట్టడం! ‘ఎంత కాలం ఇలా చేస్తారు?’ అన్నారు. వీలైనంత కాలం. ఇంట్లో వాళ్ళకి మేధా శ్రమల జీతాలు వున్నాయి. ఆ జీతాలతో ఇతర ఆస్తులు అక్కర లేదు. ఇంటర్వ్యూ: గోవిందరాజు చక్రధర్ -
బయటపడ్డ రంగనాయకమ్మ కేసుల చిట్టా
సాక్షి, గుంటూరు : విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ కేసుల చిట్టాలను పోలీసులు బయటపెట్టారు. ఆమెపై ఇదివరకు పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రంగనాయకమ్మపై 2011 నుంచి పలు క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. 2011లో ఓ కేసులో ఆమెకు గుంటూరు కోర్డు 5వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే 2014లో ఆమెపై నమోదైన ఓ సివిల్ కేసు విచారణ సందర్భంగా రూ.15.40 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించిట్లు రికార్డులో తేలింది. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!) ఇక వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ 2014, 2015ల్లో నమోదైన 3 క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గుంటూరు, మార్కాపురం కోర్టుల్లో 4 క్రిమినల్ కేసుల్లో విచారణ జరుగుతోంది. అవికాక తాజాగా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల కేసులోనూ రంగనాయకమ్మ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన రంగనాయకమ్మ వ్యవహారశైలిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమె చేసిన గత పోస్టులన్నింటినీ గమనిస్తే కావాలనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నట్లు అర్థమవుతోందని వారందరూ అభిప్రాయపడుతున్నారు. -
రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!
సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ వ్యవహారశైలిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన గత పోస్టులన్నింటినీ గమనిస్తే కావాలనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నట్లు అర్థమవుతోందని వారందరూ అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఆమె చేస్తున్న దుష్ప్రచారంపై సీఐడీ కేసు నమోదుచేసి విచారణకు పిలిస్తే టీడీపీ అగ్రనేతలు రంగనాయకమ్మకు దన్నుగా నిలవడం చూస్తుంటే సర్కారుపై ఆ వర్గం కావాలనే బురదజల్లే కార్యక్రమం చేపట్టినట్లు అర్థమవుతోందని వారు తీవ్రంగా ఎండగట్టారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మీకు ఈ డ్రామాలు దేనికమ్మా అంటూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నెటిజన్లు శనివారం ముక్తకంఠంతో ప్రశ్నించారు. పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడంలేదా అంటూ నిలదీశారు. పెద్ద వయస్సు అంటూ మీరు చేసిన నేరాన్ని తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని. ఆ వయసులో ప్రభుత్వం మీద పోస్టింగులు ఎలా పెట్టారని ప్రశ్నించారు. చరిత్రలో ఇంత గొప్పగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ప్రభుత్వం మరొకటి ఉందా? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చే పథకాలేమిటి? అంత గొప్ప నాయకుడైతే ఎందుకు చిత్తుగా ఓడాడు? అంటూ నిలదీశారు. దేశ చరిత్రలోనే జగనన్న ప్రభుత్వం రికార్డు స్థాయిలో 28 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీకి రంగం సిద్ధంచేసింది. ఏ రకంగా చూసుకున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అంటూ వివరించారు. -
ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా పోస్టులు
-
విరసం గురించి మరోసారి
విరసం ఏభై ఏళ్ళ మహాసభల సందర్భంగా, విరసం గురించి నా అభిప్రాయం అడిగారు మీరు. నేను విరసం మీద, గతంలోనే చాలాసార్లు రాశాను. విరసం మీద, నా గత అభిప్రాయాల్ని మార్చుకోవడానికి, విరసంలో ఈనాటికీ కొత్త మార్పులేవీ లేవు. విరసంతో నాకు భిన్నాభిప్రాయాలు వున్నా, 1985లో, వరంగల్‌లో విరసం మీటింగులో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడాను. 1990ల చివర్లో, విరసం వారి సిటీ యూనిట్ నడిపిన ‘అవగాహనా తరగతి’లో, మార్క్స్ ‘కాపిటల్’లో వున్న విషయాల క్రమం గురించి మాట్లాడాను. 2005లో, విరసాన్ని ప్రభుత్వం నిషేధించినప్పుడు, ఆ నిషేధాన్ని వ్యతిరేకించే, నిరసన పత్రం మీద సంతకం చేశాను. ‘విరసం’ వారు, తమ ప్రణాళికలో ‘మార్క్సియన్ సోషలిజమే’ తమ ధ్యేయంగా ప్రకటించుకున్నారు. కానీ, ఆ అవగాహన, ఆ సంఘం ప్రవర్తనలో, గడిచిన 50 ఏళ్ళల్లో ఎక్కడా కనపడలేదు నాకు. విరసంలో, ప్రారంభంలో, నాయకులుగా ఆసనాలు ఎక్కిన వాళ్ళల్లో కొందరిలో, బహుభార్యత్వం, బహిరంగ వ్యభిచారం, తాగుబోతుతనం, జంధ్యం వేసుకోవడం, దయ్యాల్నీ– భూతాల్నీ– మంత్రాల్నీ– అతీత శక్తుల్నీ సైన్సులుగా చెప్పడం– వంటి లక్షణాలు కనిపించాయి. విరసం సభ్యులు, అలాంటి నాయకుల్ని ఎందుకు ఎంచుకున్నారు? అంతకుముందే, కవులుగా, రచయితలుగా, కొన్ని కొన్ని కీర్తులతో వున్న వారు, తమకు నాయకులవడం, ఆ సంఘ సభ్యులకు నచ్చిందనుకోవాలి. బైట కీర్తులుండటం వేరూ, మార్క్సియన్ సంఘంలో నాయకత్వ అర్హతలుండటం వేరూ కదా? అంటే, ఒక సంఘం, తన ప్రణాళికలో వున్న సిద్ధాంతాన్ని బట్టి, సభ్యులు చేరాలని ఆశించడం గాక; బైటి వారి కీర్తుల్ని బట్టి, సభ్యుల్ని ఆకర్షించాలని ఆశించడం ఇది! ఈ విప్లవ సంఘం, తన 50 ఏళ్ళ మహాసభలకి జనాన్ని సమీకరించడానికి, 156 మంది బైటి వారితో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పర్చుకుంది. వారు ‘విరసం’లో సభ్యులు కారు; బైట కీర్తులు గల వారు. వీరు ఏమి చెయ్యాలి? అక్కడక్కడా సమావేశాలు జరిపి, జనాలతో, ‘విరసం మహాసభలకు రండి!’ అని చెప్పాలి. ఈ ప్రచారం బైటి వాళ్ళు చెయ్యాలా? ఆ పని చెయ్యడానికి, విరసానికి సభ్యులు లేరా? బూర్జువా సంఘాల సంప్రదాయాలనే విప్లవ సంఘాలు అనుకరించడం ఇది. విరసం వెబ్సైట్లోనూ, ఆహ్వాన సంఘం పేరుతో వేసిన కరపత్రంలోనూ అతిశయమూ, ఆత్మస్తుతీ చూడొచ్చు. విరసానికి యాభై ఏళ్ళు నిండటం ‘చారిత్రక సందర్భం’ అట! సంఘం ప్రారంభంలో ఎంత మంది వున్నారూ, యాభై ఏళ్ళలో సంఘం ఎంత విస్తరించింది? ఆ చరిత్ర కావాలి. విరసం పుట్టాకే, కళా సాహిత్య రంగాలలో ‘‘ద్రుష్టి కోణమే మారిపోయింది’’ అట! విరసం వారి దయ్యాల తత్వశాస్త్ర వ్యాసాల ముద్రణా, పునర్ముద్రణా కూడా కొత్త ద్రుష్టికోణమే అన్న మాట! సాహిత్య విమర్శని మౌలికంగా మార్చేసింది–అట! శ్రమదోపిడీని వివరించే మార్క్సిజంతో సంబంధం లేని ‘బ్రాహ్మణీయ’,‘మనువాద’,‘హిందూత్వ’ వంటి పదజాలాన్ని విరివిగా ఉపయోగించడం ఏమి విమర్శనా పద్ధతి? స్త్రీ–పురుష సమానత్వానికీ, కుల నిర్మూలనకూ మార్క్సిజం పనికి రాదనే ఫెమినిస్టు ధోరణుల్నీ, దళితవాద ధోరణుల్నీ ‘మార్క్సియన్ సోషలిజం’ద్రుష్టితో నీళ్ళు నమలకుండా ఎదుర్కోక పోవడం ఏ రకం విమర్శనా పద్ధతి? ‘‘రచయిత అంటే వ్యవస్తకూ, రాజ్యానికీ నిరంతర ప్రతిపక్షం అనే ఆదర్శాన్ని తన ఆచరణ ద్వారా నిరూపిస్తున్నది’’ అని కితాబు! సంస్త ప్రారంభం నించీ ఇప్పటి వరకూ, సంస్తలో ముఖ్యస్తానాల్లో ఉండిన వాళ్ళందరూ, రాజ్యానికి ‘నిరంతరం ప్రతి పక్షంగా’ఉన్నారా? రాజ్యం ఇచ్చే బహుమతులూ, పదవులూ పొందే వారిని మీటింగులలోనూ, ఆహ్వాన సంఘాలలోనూ కూచో పెట్టుకునే ఆచరణ ఏ ఆదర్శాన్ని నిరూపిస్తున్నది? సాహిత్యంలో అనేక అంశాల్లో విరసం ‘గణనీయమైన క్రుషి చేస్తోంది’ అని ప్రశంస. విరసం తన మాసపత్రికని క్రమం తప్పకుండా అనుకున్న సమయానికి తీసుకు రాగలుగుతోందా? ఎందుకీ అతిశయాలూ, ఆత్మస్తుతులూ? ఏ విప్లవ సంఘమైనా, తనకు చేతనైనంతా, చేయగలిగినంతా చేస్తుంది, చెయ్యాలి. దాన్ని చూసుకుని మురిసిపోయి, బడాయిలు పోకూడదు. ఇక నిర్బంధాలు అంటారా? తేలుకి కుట్టడం ఎంత సహజమో, దోపిడీ రాజ్యాంగ యంత్రాంగానికి నిర్బంధం అంత సహజం. విప్లవ రచయితలనే కాదు, అంధ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు– వంటి వారు, చిన్న పాటి డిమాండ్లు అడిగినా, వారిని లాఠీలతో కొట్టిస్తారు; గుర్రాలతో తొక్కిస్తారు. దీనిని ప్రతిఘటించడానికి, సాధారణ ప్రజా చైతన్యం సరిపోదు. దోపిడీ శ్రమ సంబంధాలూ, వర్గాలూ, వర్గ ప్రయోజనాలూ, వర్గ పోరాటం వంటి విషయాలు ముందు విప్లవ రచయితలు తెలుసుకుని, వాటిని శ్రామిక వర్గ ప్రజలకి తెలిసేలా ఎంత వరకూ చేస్తున్నారూ– అనే దాన్ని బట్టి ప్రతిఘటన వుంటుంది. అంతే గానీ, మనం చాలా చేసేశాం ఈ యాభై ఏళ్ళలో, ఉద్యమం శరవేగంగా దూసుకుపోతోంది–అనే ధోరణిలో ఉంటే, అంగుళం కూడా ముందుకు పోలేరు. - రంగనాయకమ్మ -
కత్తి మహేష్‌పై వేటు తగదు
శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ) : రాముడు, రామాయణం గురించి కత్తి మహేష్ విమర్శించాడని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ తెలం గాణ ప్రభుత్వం, డీజీపీ అతనిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడం తగదని దళిత ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కత్తి మహేష్ దళిత కులానికి చెందినవాడని బహిష్కరించారని, అగ్రకులస్తుడైతే అంత ధైర్యం చేయరన్నారు. తక్షణమే నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాముడుమీద, రామాయణం మీద అనేక విమర్శలు చేసిన, రాసిన ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ మీద గాని, రచయిత ఆరుద్రపైన, చలం, ప్రముఖ న్యాయవాది రామ్జఠ్మాలానీపై ఎటువంటి శిక్షలు వేయకుండా దళితుడిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం హేయమైన చర్య అని అన్నారు. ఈ సమావేశంలో దళిత ఆదివాసీ జేఏసీ నాయకులు కలివరపు సింహాచలం, కల్లేపల్లి రామ్‌గోపాల్, పోతల దుర్గారావు, డి.గణేష్, కంఠ వేణు, అంపోలు ప్రతాప్, మిస్క కృష్ణయ్య, బోసు మన్మథరావు, ఎస్.ఎబేరు పాల్గొన్నారు. -
సరే, భారతం కాలంలోనే ఉండండి!
ప్రాచీన సాహిత్యమే కాదు, ఆధునిక, అత్యాధునిక సాహిత్యాలైనా,న్యాయ విమర్శకీ, హేతుబద్ధ విమర్శకీ నిలిస్తేనే, అవి ఎల్లకాలమూ నిలుస్తాయి. ‘‘ఇదండీ మహాభారతం’’ పేరుతో నేను రాసిన పుస్తకం గురించి, ‘‘ఇదండీ రంగనాయకమ్మ వ్యాఖ్యానం’’ అనీ, ‘‘అలా ఉందామా?’’ అనీ, చిన్నా - పెద్దా పేర్లతో వచ్చిన ఒక వ్యాసం చూశాను. (‘సాక్షి’ డైలీ, మే 10. వ్యాసకర్త పి.రామకృష్ణ) వ్యాసకర్త వెలిబుచ్చిన సందేహాల సారాంశం అంతా, ఆ వ్యాసంలో, చివరి పెద్ద పేరాలో వుంది. వ్యాస సారాంశం అదే కాబట్టి, ఆ పేరాని శ్రద్ధగా చూడాలి. ఆ పెద్ద పేరా: ‘‘రంగనాయకమ్మ గారి ‘విమర్శ’ను అన్వయించి చూస్తే, మనకు ప్రాచీన సాహిత్యమంటూ మిగలదు. వేల ఏళ్ళుగా ఉన్న సాహితీ వృక్షాలను విషవృక్షాలని నరికేస్తే ఏమవుతుంది? భారతం గురించి రంగనాయకమ్మ గారే చేసిన అభివర్ణనల్లో ఒక్కటైన ‘‘మొగ్గా పువ్వూ లేని, కాయా పండూ లేని మోడు’’లుగా మనం మిగిలి ఉంటాం. అలా ఉందామా?’’ - ఇదీ వ్యాసకర్త ప్రశ్న! ప్రాచీన సాహిత్యమే కాదు, ఆధునిక, అత్యాధునిక సాహిత్యాలైనా, న్యాయ విమర్శకీ, హేతుబద్ధ విమర్శకీ నిలిస్తేనే, అవి ఎల్లకాలమూ నిలుస్తాయి. ఏ విమర్శలకూ నిలవని సాహిత్యాలకు అర్హమైన స్థానాలు, పురావస్తు ప్రదర్శన శాలలూ, గ్రంథాలయాలలో ప్రత్యేక బీరువాలూనూ. జనాలలో, విమర్శలు చెయ్యగల విజ్ఞానమూ, చైతన్యమూ లేకపోతే, అది రాకపోతే, వేల యేళ్ళుగా వున్న సాహితీ విషవృక్షాలు, లక్షల యేళ్ళయినా అలాగే విష ఫలాలు అందిస్తూ నిలిచి వుంటాయి. రామాయణ, భారతాల్ని ‘కావ్యాలు’గా గాక, మొత్తంగా మత గ్రంథాలుగా మార్క్సిస్టులు భావించవచ్చునా - అని వ్యాసకర్త ప్రశ్న! ఒక రచన, కావ్యమా, మత గ్రంథమా; పద్యమా, వచనమా; అనే తేడాలతో సంబంధం లేదు. అది ఏం బోధిస్తోంది - అనేదే ప్రధాన విషయం. వ్యాసకర్త, మార్క్సిస్టుల ప్రస్తావన తెచ్చారు కాబట్టి, రష్యా మార్క్సిస్టు ‘లునచర్స్కీ’, చైనా మార్క్సిస్టు మావో, ఆ ఇద్దరూ, ఏ విమర్శలో అయినా, ‘విషయమూ - రూపమూ’ అనే అంశాల్ని ఎలా చూడాలని చెప్పారో, ఆ మాటలు చూస్తే, మార్క్సిస్టుల బాధ్యత ఏమిటో తెలుస్తుంది. ‘విషయం’ న్యాయమైనదిగానూ, ‘రూపం’ కళాత్మకమైనదిగానూ వుండాలనే, ఆ ఇద్దరూ చెప్పారు. లునచర్స్కీ: ‘మార్క్సిస్టు విమర్శకులు, తమ విశ్లేషణకు లక్ష్యంగా మొదట, రచనలో వున్న విషయాన్ని చూస్తారు. ఆ విషయానికి సామాజిక బృందాలతో వున్న సంబంధాల్నీ, ఆ సామాజిక బృందాలపై ఆ రచన కలగజేసే ప్రభావాల్నీ వివరి స్తారు. ఆ తర్వాత, విమర్శకులు, ‘రూపం’ దగ్గరికి వస్తారు. ఆ రూపం, ఆ విషయానికి వున్న లక్ష్యాన్ని నెరవేర్చగలిగే విధంగా వుందో లేదో చూస్తారు’ (ఆన్ లిటరేచర్ అండ్ ఆర్ట్). ‘రూపం’ అనేది, విషయాన్ని నెరవేర్చగల ‘కళ’తో వుండాలని చెప్పడమే ఇది. కళా నైపుణ్యం అక్కరలేదని చెప్పడం కాదు. మావో: ‘కళా, సాహిత్య విమర్శలో, రెండు ప్రమాణాలున్నాయి. రాజకీయమైనదీ, కళాత్మకమైనదీనూ. రాజకీయ దృక్పథం నించి చూస్తే, ఆ విషయం పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా వున్నప్పటికీ, కొన్ని రచనల్లో కళాత్మక ప్రతిభ కనిపిస్తుంది. ఒక రచనలో విషయం ఎంత అభివృద్ధికరమైనది అయినా, ఆ రచన కళాత్మకంగా లేకపోతే, అది శక్తిహీనం అయిపోతుంది. అటు, గొప్ప కళాత్మకతతో వున్న విషయం అభివృద్ధి నిరోధకం అయినప్పుడూ; ఇటు, గొప్ప అభివృద్ధికర విషయం, ఏ మాత్రమూ కళాశక్తి లేని, నినాదప్రాయ శైలిగా వున్నప్పుడూ; ఆ రెంటికీ, మనం, సమానంగా వ్యతిరేకం.’ (ఆన్ లిటరేచర్ అండ్ ఆర్ట్ ). రచనలో కళాత్మకత వుండవలసిందే. చక్కగా తయారవని రచనలో ఎంత మంచి విషయం వున్నా, అది చదువరిని ప్రభావితం చెయ్యదు. అయితే, గొప్ప కళాత్మకతతో వున్న విషయం ప్రజలకు పనికి రానిది అయితే? ఆ కవిత్వాల సొగసులూ, ఆ సంగీత రాగాలూ, ఆ పనికి మాలిన విషయానికే ప్రజల్ని బానిసల్ని చేస్తాయి. కులభేదాలూ, పురుషాహంకారాలూ, సతీ సహగమనాలూ, స్వర్గ నరకాలూ, వగైరా వగైరా అభివృద్ధి వ్యతిరేక విషయాలు, కవిత్వ సొగసులతో, సంగీత రాగాలతో మెరిసిపోతూ వుంటే, అవి ప్రజల్ని తాగుడుమత్తులో ముంచేసినట్టు, కవిత్వాల మత్తులో ముంచేస్తాయి. ఆ సందర్భాల్లో కళాశక్తులు, ప్రజలకు ద్రోహం చేస్తాయి. కావ్యాల్లో గొప్ప కళాసౌరభాలు వుంటే, ఆ కళానైపుణ్యాల్ని నేర్చుకోవాలిగానీ, ఆ విషయాల్ని కాదు. త్యాగరాజు కృతుల్లో గొప్ప రాగాలు దొరికితే, ఆ సంగీత జ్ఞానాన్ని నేర్చుకోవాలి గానీ, ఆ విషయాల్ని కాదు. వ్యాసకర్త చేసిన ఇంకో విమర్శ:‘విమర్శలో విమర్శకుల స్వీయాభిప్రాయాలు కనిపించరాదు’ అని! మరి, విమర్శలో, విమర్శ చేసే వాళ్ళ అభిప్రాయాలు గాక, పొరుగింటి - ఎదురింటి వాళ్ళ అభిప్రాయాలు వుంటాయా? ఈ వ్యాసకర్త విమర్శలో, ఆయన స్వీయాభిప్రాయాలు గాక, వాళ్ళ వెనకింటి వాళ్ళ అభిప్రాయాలు వున్నాయా? ‘నన్నయ, తిక్కనలు మాత్రం వరాల్నీ శాపాల్నీ నమ్మి రాశారా? అవి వుండవని వాళ్ళకి మాత్రం తెలీదా?’ - అంటూ వ్యాసకర్త, ఆ కవుల పరువుల్నీ తీసేశారు. ఆ కవులు, వాళ్ళు నమ్మినవే వాళ్ళు రాశారంటే, వాళ్ళ పరువు వాళ్ళకే వుంటుంది. వాళ్ళు నమ్మకుండానే రాశారంటే, జనాల్ని మూఢత్వాల్లో ముంచి వుంచాలని రాశారని అర్థమే కదా? భారతాన్ని విమర్శిస్తే, దాని కవిత్వ సౌందర్యాలకు దూరమై మోడులై పోతామని జడిసేవాళ్ళు, భారతాన్నే నెత్తిన పెట్టుకుని, దాని కాలంలోనే వుండి పొండి! మీకు నచ్చే కాలంలోనే, అవును, అక్కడే అలాగే వుండండి! రంగనాయకమ్మ -
ఈ కాలమ్ మీదే : చర్చావేదిక
ఏకాలంలో జరిగినా అన్యాయం అన్యాయమే! - రంగనాయకమ్మ ‘ఆనాటి విషయాన్ని ఈనాటి దృష్టితో విమర్శించడం తగునా?’ అని వి.ఎ.కె. రంగారావుగారు వేసిన ప్రశ్న, కొన్ని సందర్భాలకే గానీ, అన్ని సందర్భాలకూ వర్తించదు. వేల సంవత్సరాల నాటి ఒక పండితుడు ‘వర్గ భేదాల’ గురించి చెప్పకపోతే, దాన్ని నేరంగా పరిగణించడం సాధ్యం కాదు. కానీ, ఆ పండితుడే సతీసహగమనాన్ని సమర్థిస్తూ చెప్తే, దాన్ని ‘ఆనాటి విషయం’గా జమకట్టనక్కరలేదు. ఆ వ్యక్తికి ఆ విషయం మీద ఆనాడైనా ‘కరుణ’ ఉండాలి. అది చాలు! అది లేకపోతే, అది నేరమే. ‘స్వర్గ సీమ’లో భార్యాభర్తల విషయాన్ని ‘ఆనాటి విషయం’గా తీసివెయ్యవలసింది కాదు. భర్త ప్రవర్తన, ఆనాడు కూడా నీచమైనదే. ఆ భర్తకి పశ్చాత్తాపం కలిగితే, అది స్వంత ఆత్మవేదనతో జరగాలి. ఆ నటి వదిలేసింది కాబట్టి బైటికి రావడం, పశ్చాత్తాపం అవదు. అప్పటికే పత్రిక పని పోగొట్టుకుని, నటి వదిలేశాక, బికారిగా వీధుల్లో తిరుగుతూ ఇంటికి చేరినట్టు చూపిస్తే, అదా పశ్చాత్తాపం? నీచమైన మాటలు మాట్లాడి వెళ్ళినవాడు, పశ్చాత్తాపంతో దగ్దమవుతూ తిరిగి వచ్చిన వాడైతే, అతడే భార్య కాళ్ళ మీద ఎందుకు పడకూడదు? డెరైక్టర్‌కి ఆ భావం లేకపోతే, ఆ భర్త తల వాల్చి కన్నీళ్ళు కారుస్తూ భార్య ముందు నించోవచ్చు. ఏ తప్పూ చెయ్యని ఆ భార్యనే అతడి కాళ్ళ మీద ఎందుకు పడెయ్యాలి? ఆ ముగింపులో, ఆ భార్యకి ఏమైనా న్యాయం జరిగిందా? ఆ న్యాయం, ఆనాడైనా అసాధ్యమా? ఆ భార్యకి న్యాయం జరగదేదని ఆనాడు కాకపోతే, ఈనాటికైనా తెలుసుకోవద్దా? ‘ఆనాటి విషయం అది’ అని ప్రతీ వెనకటిదాన్నీ సరిపెట్టుకుంటూ ఉంటే, ఇక వెనకటి తప్పుల్ని తెలుసుకునేది ఎలాగ? దిద్దుకునేది ఎలాగ? ఆ భార్య, బిడ్డల భవిష్యత్తుని పటిష్టం చేసుకోవడం కోసం భర్తని ఆహ్వానించిందని ఈ పండితుడి వాదం! ఆ తండ్రి వల్ల బిడ్డలకేదో క్షేమం అవుతుందని ఆ భార్య నమ్మితే అది ఆమె అమాయకత్వమే. సైగల్ పాటలో నేను రాసిందే సరైనది. ఆ పాటలో పదాలు, ‘స్వర్గసీమ’లో ఇలా ఉంటాయి - ‘దుఃఖ్ కే హై దునియా బాబా! ఆంఖ్ ఖోల్ కే దేఖో బాబా!’ - ఇది పూర్తిగా సైగల్ కంఠమే. ‘స్వర్గసీమ’ మీద నా విమర్శ, ‘మగవారిని దుమ్మెత్తి పొయ్యడానికే జరిగిందనీ, కథలో ఆ భర్తని పాడు చేసింది ఇంకో స్త్రీయేననీ’ కె.ఎన్.టి శాస్త్రిగారి వాదం! పురుషుల కోసం గృహాల్లో పతివ్రతల్నీ, గృహాల బైట జారిణుల్నీ, సమాజం ఏనాడో ఏర్పాటుచేసి ఉంచింది కదా? ఇక్కడ ఆ జారిణి సంగతి అనవసరం. సమస్య అంతా భార్యాభర్తలదే. తప్పు చేసిన వాణ్ణి అందలం ఎక్కించి, ఏ తప్పూ ఎరగని భార్యనే అతడి బానిసని చెయ్యడమా భార్యకి చేసిన న్యాయం? ఈ పెద్దలు ఆ తప్పుని తెలుసుకోకపోతే, ఇక తెలుసుకోగలిగేది ఏముంటుంది? నేను ‘స్వర్గసీమ’లో, ‘చెడ్డనే కాదు, ఎన్నో ‘మంచి’ విషయాలు కూడా చూశాను, చెప్పాను. మీకు మాత్రం మంచిచెడ్డల విభజన లేదు. ఏ చెడ్డని అయినా, ఒకనాటి మంచిగానే జమ కట్టగలరు మీరు. ‘చెడ్డల’ వైపు వీపులు తిప్పి, ప్రతీ చెడ్డనీ ‘మంచి’గానే స్వీకరించగలరు మీరు. ఏది ఎలా జరిగినా అది మీకు స్వర్గమే. కానీ, ఈ స్వర్గ వాదాలతో కూడా మంచిచెడ్డలు బైట పడకుండా దాగిపోవు. ‘అన్యాయం’ అనేది ఏకాలంలో జరిగినా, అది అన్యాయమే. అన్యాయం అనేది. న్యాయం ఎప్పుడూ అవదు. సినిమా వాళ్లకే కాదు, మనకూ ఈ జబ్బు! - డా. నాగసూరి వేణుగోపాల్ సినిమా వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది- అనే శీర్షికలో రంగనాయకమ్మ రాసిన వ్యాసం ప్రచురించి చాలా మంచి పని చేశారు. అరశతాబ్దం నుంచి ఈ ‘స్వర్గసీమ’ సినిమా గురించి చాలా సందర్భాలలో, చాలా మంది చర్చించడం మనకు తెలుసు! బిఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభ, భానుమతి గానం, నటన; నాగయ్య సామర్థ్యం, రజనిగారి సంగీత వరుసలు... ఇలా చాలా చోట్ల ‘స్వర్గ సీమ’ గురించి ప్రస్తుతిస్తారు. కానీ కథా వస్తువు ఇలా ఉందనే చర్చ ఈ పాతిక, ముప్పయ్యేళ్ళతో జరిగినట్టు కనబడలేదు. అంతకు ముందు జరిగిందేమో నాకు తెలియదు. ‘స్వర్గసీమ’ అనబడే గొప్ప సినిమాలో కథావస్తువు ఇంత అర్థరహితంగా ఉందా? అనే సందేహం భయంకరంగా ఆందోళన కలిగిస్తున్నది! అందరూ గొప్పది అంటున్నారు - మనం కూడా అందాం. అందరూ ఆలోచించకుండా చూస్తున్నారు - మనం కూడా అలాగే చూద్దాం... అనే రీతిలో ఐదారు దశాబ్దాలు అప్రతిహతంగా సాగిపోవడం చాలా విచిత్రంగా ఉంది. దేన్ని అయినా దాని అసలు విలువతోనే చూడాలి. అలా చూడకపోవడం, చూడలేకపోవడం గురించి మనం చర్చించుకోవాలి. ఇలాంటి దృష్టి లేకుండా ఎందుకు మనం సాగిపోతున్నామో కూడా తర్చించుకోవాలి. కొత్త పుస్తకాలు పక్కనపెట్టి ఈ పాత సినిమా చూశానని రంగనాయకమ్మ తన వ్యాసంలో పేర్కొన్నారు. నిజంగా మంచి పని చేశారు. పుస్తకాలు మేధావులకు, సినిమాలు మామూలు జనాలకు అనే అభిప్రాయం ఉంది. నిజానికి ప్రభావం విషయంలో సినిమాలతో పుస్తకాలను పోల్చలేం. సకల కళల సమాహారమైన సినిమా సాంకేతిక సౌలభ్యంతో విచ్చుకుపోతోంది. వస్తువు తుక్కుగా ఉన్నా ఇతర దినుసులతో - ఇంకా మాట్లాడితే స్వర్గసీమలాగానే విజయవంతమవుతోంది. కనుక పుస్తకాలతో సినిమాలను అసలు పోల్చలేం. పుస్తకం కూడా సాంకేతిక విజ్ఞానం తోడ్పాటుతో నేడు మరిన్ని సౌలభ్యాలతో సాగుతోంది. అయినా కూడా సినిమా సాధించుకున్న తీరుతో పోల్చలేం. కనుక సినిమా ప్రభావం చాలా చాలా ఎక్కువ! రచయితలు, మేధావులు అనుకుంటే పాత సినిమాలతో పాటు కొత్త సినిమాలు సైతం చర్చ అవుతాయి. ఇప్పుడు కరపత్రం వేసి, అదనంగా ఖర్చు పెట్టనక్కరలేదు. ఈ మెయిళ్ళు, ఫేస్బుక్, బ్లాగులు వగైరా టెక్నాలజి కూడా పత్రికల ఉత్తరాల శీర్షికతో పాటు అందుబాటులో ఉంది. ఈ విషయాలను స్థూలంగా మాట్లాడినప్పుడు కనీసం పుస్తకాలనైనా కూలంకషంగా మనం తర్కిస్తున్నామా? అనే ఆలోచన వస్తుంది. ‘స్వర్గసీమ’ గురించి మనందరి కళ్ళు తెరిపించిన రంగనాయకమ్మ కొంతకాలం క్రితం అచ్చంగా ఇలాంటిపనే మరొకటి చేశారు. కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన ‘సైన్స్ వ్యాసాలు’లో అర్థరహితమైన విషయాలు గురించి ఇలాంటి వ్యాసం ద్వారా బట్టబయలు చేశారు. ఆ పుస్తకం వెలువడి దశాబ్దం దాటినా - కొ.కు.లోని హేతురాహిత్యాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. రంగనాయకమ్మ ఆ పుస్తకం దుమ్ము దులిపారు. కానీ తర్వాత జరిగిన చర్చ సమగ్రమైంది కాదు. కొత్తదయినా, పాతదయినా సినిమా అయినా, పుస్తకమైనా నిరంతరం పరిశీలించబడాల్సిందే! సమాజంలో ఎక్కువ మందికి దోహదపడే విషయాలుంటే వాటి గురించి ప్రస్తావించి ప్రాచుర్యంలోకి తేవాలి. అలాగే సమాజానికి పనికిరాని, హాని కల్గించే విషయాలను ఎక్కడున్నా పట్టుకొని, తప్పక బట్టబయలు చేయాలి, తూర్పారబట్టాలి! పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
సినిమాల వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది
నిన్న ఒక పాత సినిమా, మంచీ-చెడ్డా రెండూ ఉన్నది, చూశాను. చాలా సంవత్సరాల కిందట చూసిందే. అందులో ఒక్క పాట తప్ప మిగతావన్నీ దాదాపు మర్చిపోయాను. అదే సినిమా కొత్తగా చూస్తున్నట్టు చూశాను నిన్న. సినిమాలో పాటలు అద్భుతం! మొత్తం తెలుగు సినిమా ప్రపంచంలో గొప్పదైన పాట ఒకటి ఉంది. అందులో మాటలు కూడా అచ్చంగా మనుషులు మాట్లాడుకున్నట్టే, పాత్రలకు తగినట్టుగా ఉన్నాయి. కథ అయితే, నిజం కథగా మొదలై, నిజం కథగానే ముగిసింది. అనేక కొంపల్లో జరిగే నిజాలు అవే కావచ్చు. అయినా ముగింపు అంత తుక్కుగా జరిగితే, ఇక ఎందూకూ ఆ సినిమా? కేవలం పాటల కోసమేనా? నేను ఎప్పుడూ పాత సినిమాల కోసమే వెతుకుతాను. వాటిల్లో కూడా కథల్లో ముగింపుల్ని ఖూనీలు చేసేస్తూ ఉంటారు. ఈ సినిమాలోనూ పెద్ద ఖూనీయే జరిగింది. అయినా, పాత సినిమాల్లో హాయి అయిన పాటలు కొన్ని అయినా దొరుకుతాయని సంతోషం! అందుకే కొత్త పుస్తకాలు కూడా పక్కన పెట్టి ఈ సినిమాతో గడిపాను. ‘‘గృహమే కదా స్వర్గసీమా’’ అని పాడతాడు ఆ గృహస్తుడు. భార్య వీణ వాయిస్తోంటే, అతగాడు కంఠం కలుపుతూ ఉంటాడు. అతగాడు పాటగాడే కాదు, రాతగాడైన కవి కూడా. కళాపోషకుడిగా పేరూ! స్వర్గ సీమ రుచి తెలిసిపోయినట్టు పాడేవాడు, ఒక నాటకాల నటి వెంటబడి ‘‘హాయి సఖీ’’ అంటూ ఆ సఖికి సఖుడై గానం ప్రారంభించి, తన గృహ స్వర్గసీమని నరక సీమ చేసేస్తాడు. ఈ సినిమాలో భానుమతి పాడిన ‘‘ఓహోహో పావురమా’’ పాట అందరూ వినే వింటారు. అందులో సాహిత్యం, సంగీతం, కంఠం, అన్నీ మధురాతి మధురాలు. అది ఎవరైనా విని ఉండకపోయినా, విన్నామనే చెప్పుకోండి! లేకపోతే పరువు పోతుంది, ఉండదు. ఆ నటికి ఒక నాటకం రాసి పెట్టడం కోసం ఆ కవి, రోజంతా ఆ నటి దగ్గరే గడుపుతూ కొంపకి తిన్నగా రావడం ఎగ్గొడుతూ ఉంటాడు. అతని భార్య అతి వినయంగా భర్తతో, ‘‘మీరు ఆ నాటకం రాసే పని మన ఇంటి దగ్గరే చేసుకోకూడదా?’’ అంటుంది, పాపం వొణుకుతూనే. ఆ కళాకారుడు అతి నిర్లక్ష్యంగా, ‘‘అస్తమానూ ఇంట్లో నీ మొహం చూస్తూ కూర్చోవాలా? నిన్నూ నీ పిల్లల్నీ పోషించడానికే కదా నాటకం రాస్తున్నాను?’’ అనేసి రుస రుసలతో వెళ్ళిపోతాడు. అలా ఒకటి రెండు సార్లు అయ్యాక అసలు ఇంటికి రావడమే బంద్ చేస్తాడు. పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి, నటి పాడినట్టు, ‘‘తరుణ యవ్వనము పొంగి పొరలే వలపు కౌగిలిలో ఓలలాడే’’ స్వర్గ సీమలో మునిగిపోతాడు. ‘స్వర్గ సీమ’ అనేది ఒక భ్రమ! ఒక కల్పన! దాన్ని ఎలా ఊహిస్తే, అదే స్వర్గ సీమగా కనపడుతుంది. ఒకప్పుడు గృహమే స్వర్గసీమ. ఇప్పుడు గృహం బయటే స్వర్గ సీమ! గృహమే స్వర్గ సీమ అయిన వాడికైతే పరాయి సంబంధాలు స్వర్గ సీమలు కాలేవు. మన కవి కోరే స్వర్గ సీమ అంతా, పర స్త్రీ పొందే! ఇంటి నించి భార్య జడుస్తూ ఫోనులు చేస్తే, అతగాడు ఫోను ముట్టడు. ఎప్పటికో ఆ నటే ఆ ఫోను ఎత్తి, కవి భార్యని ఖయ్యిమని కసురుతుంది. భార్య దీనంగా ఉత్తరం రాస్తే, మన కళాపోషకుడు, ఆ ఉత్తరాన్ని ముట్టకుండా, ‘‘తల తిక్క రాతలు’’గా కొట్టిపారేస్తాడు. ఆ భార్యకి ఏడుపేగానీ, ఏడుపుతో పాటు చీమ తలకాయంతైనా కోపం రాదు. ఆ దేహం రక్తమాంసాలున్న దేహమేనా అని డౌటు వచ్చే వాళ్ళకి వస్తుంది. ఆ ఇల్లాలు తన భర్త నడత గురించి శోక రాగాలతో కృష్ణుడి బొమ్మకి చెప్పుకుంటుంది! ఆ కృష్ణుడికి 8 మంది పెళ్ళాలూ, 16 వేల మంది ప్రియురాళ్ళూ అని, ఆమెకి తెలియకపోవచ్చునేమో గానీ, సినిమా తీసిన బి.ఎన్.రెడ్డి గారికీ తెలీదా? ఆమె, తన ఘోషని ఏ బొమ్మకి చెప్పుకున్నా దండగేగానీ, పోనీ చెప్పుకుంటే, ఒకే భార్య గల రాముడి బొమ్మకి చెప్పుకోవాలా, ఆడదాన్ని చూస్తే వదలని కృష్ణుడి బొమ్మకి చెప్పుకోవాలా? దేనికి చెప్పుకున్నా ఆ బొమ్మ ఆ భర్తని తీసుకురాదు గానీ, అక్కడ రాముడి బొమ్మని పెట్టించాలని తెలియలేదా డెరైక్టరు గారికి? ఇక, ఆ భార్య, ఒక పాకలోకి మారి మిషను కుట్టుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ గడుపుతోంది. కానీ భర్తగారి ఫొటోని గోడకి తగిలించి, దానికి రోజూ కొత్త పూలు పెడుతూ!నటితో కలిసి నాటకాలాడేస్తోన్న మన కళాకారుడికి స్టేజి మీదే ఒక ప్రమాదం జరిగి ఆ నటి పోషణలోనే మంచం పట్టాడు. ఆ నాటకాల రంభ, వీణ్ణి వొదిలేసి, వీడికన్నా ఘనుణ్ణి పట్టింది. మంచం పట్టిన ప్రేమికుడు ఫోనులు చేస్తే, ఆ ప్రేయసి పలకదు. ఫోన్ల తర్వాత పలికితే ఖయ్యిమని పలుకుతుంది. తన ప్రేయసి ఇంకోణ్ణి ‘పట్టిన’ సంగతి మన కవికి తెలుస్తుంది. ఇక ఆమె దగ్గర చోటు లేదు. ఆ నటి, ఆ రెండోవాడితో, నాటకాలాడుకుంటూ పాడుకుంటూ, కీర్తి పెంచుకుంటూ, నిశ్చింతగా గడిపేస్తోంది. ఆమె అవసరం అదీ! ఇక, మన కవి, మంచం దిగాడు. ఇల్లు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? రంభ వొదిలేసింది కాబట్టి. అంతే గానీ తన తప్పు తనకి తెలిసి కాదు. ఆత్మ విమర్శతో కలిగిన బాధ కాదు. ఆ రంభ, ఇంకా తనతో నాటకాలు రాయించుకుంటూనే ఉంటే, ఆ కవికి ఇల్లు గుర్తొచ్చేదా? అలా జరగదు. నిలవ నీడ లేకే ఇల్లు గుర్తు! తను చాలా పశ్చాత్తాప పడిపోతున్నట్టు గడ్డం పెంచేశాడు. పశ్చాత్తాపాలకు గుర్తు ఎప్పుడూ గడ్డాలే. లేకపోతే క్షవరానికి డబ్బులు లేకనో! అక్కడే డెరైక్టరు గారు, సైగల్ పాటలోనించి రెండు మాటలు ఇరికించారు, ‘‘దునియా అంతా దుఃఖం బాబా, కళ్ళు తెరిచి చూడు!’’ అంటూ! మనవాడికి ఎవరో ఆ దుఃఖం తెచ్చిపెట్టినట్టు! ఆ గడ్డాలతో తిరుగుతూ తిరుగుతూ పెళ్ళాం ఉన్న పాక దగ్గరికే వస్తాడు. అది రాత్రి పూటే. ఆ ఇల్లాలు పాక తలుపు బార్లాగా తెరిచి పెట్టేసి ఉంచింది. మిషను పని చేసుకుంటూ మిషను మీదే తల వాల్చి కునుకు తీస్తోంది. చిన్న పిల్లలిద్దరూ మంచం మీద నిద్రలు! మనవాడు పాకలోకి జొరబడి గోడ మీద తన ఫొటోని పూలతో చూశాడు. మంచం మీద నిద్ర పోతోన్న పిల్లల తలలు నిమురుతూ ప్రేమలు కురిపించాడు. (అతడి పశ్చాత్తాపాన్ని అందరూ నమ్ముతారని డెరైక్టరు గారు అనుకున్నట్టున్నారు. నేను నమ్మలేదనుకోండీ). మిషను మీద భార్య ఎలాగో తల ఎత్తేసరికి, ఇతగాడు గుమ్మం బైటికి తప్పుకున్నాడు. పశ్చాత్తాపంతో దగ్ధమై పోతున్నవాడు అలా పారిపోవడం ఎందుకు? ఆమె ముందే తల వాల్చుకుని నిలబడరాదూ? బైటికి వెళ్ళిపోతోన్న వాణ్ణి చూసి ఆ ఇల్లాలు, ‘‘దొంగ, దొంగ’’ అని అరిచింది. అతడు తన భర్తేనేమోనని అనుమానం కూడా వచ్చింది ఆమెకి. దీపం ఎత్తి పట్టుకుని వాడు ఎవడా అని చూడడానికి బైల్దేరింది గుమ్మం బైటికి. వాణ్ణి దొంగే అనుకుంటే, వాడు బైటికి పోయాడు కాబట్టి, వెంటనే తలుపులు మూసేసుకోవాలి. లేదా, అతణ్ణి తన భర్తేనేమో అనుకుంటే, అతను రాదల్చుకుంటే లోపలికి అతనే వస్తాడనుకోవాలి. తను దీపం పట్టుకెళ్ళి అతడి మొహం పరిశీలిస్తుందా! మన ఇల్లాలు అదే చేసింది. వాడు ఇంకెవరు? భర్తే! దీపం అవతల పారేసి, భర్త కాళ్ళ మీద పడిపోయింది! పడితే వాడు పడాలి, భార్య కాళ్ళ మీద! అలా పడి, ‘‘తప్పు చేశాను, తప్పు చేశాను’’ అంటూ దొర్లి దొర్లి ఏడవాలి. భర్త అలా ఏడిస్తే, ‘‘పోనీలే, తప్పు తెలుసుకున్నాడులే. ఏడుస్తున్నాడులే’’ అని భార్య సరిపెట్టుకుందని, ఆ భార్యని మనం సరిపెట్టుకోవచ్చు. అసలా భర్త ఎలా నించున్నాడంటే, పెళ్ళామే తన కాళ్ళ మీద పడాలన్నట్టుగా నిటారుగా నించున్నాడు! ఆ పిచ్చిది అలాగే పడిందిగా, వచ్చేశాడు చాలని? ఇక ఆ తర్వాత, పాక మాయమైంది. ‘‘గృహమే కదా స్వర్గ సీమా’’ అంటూ ఆ భర్త ఎగురుతూ మళ్ళీ పాడేస్తున్నాడు!! ఆ భార్య కూడా ‘‘గాలివాన వెలసె’’ అని పాడేసి, తన ఘోర అవమానాన్ని ‘గాలివాన’తో పోల్చుకుంది. అదీ ‘స్వర్గ సీమ!’ భార్యకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సంస్కరించే ముగింపు ఉండాలి. ఆ మంచి ముగింపు ఇలా ఉండాలి: ఆ గడ్డాల భర్త, భార్య ముందు మొహం వేళ్ళాడేసుకుని నించుంటాడు. అప్పుడు ఆ భార్య అంటుంది. ‘‘పిల్లలు నా పిల్లలే. నా పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను. నువ్వు పోషించనక్కర లేదు. నువ్వు మళ్ళీ మా జీవితాల్లోకి వస్తే, నేను రోజూ నీ మొహం చూస్తూ ఉండాలా? నేనే కొన్నాళ్ళు ఎవడితోనో తిరిగి వస్తే, నేను రావడమే చాలని నువ్వు నా కాళ్ళ మీద పడతావా?’’ అని అడుగుతుంది. అలా అడుగుతూ, అతని పశ్చాత్తాపం నిజమా అని కూడా సందేహిస్తూ చూస్తూ ఉంటుంది. అంతలో, ఆకాశంలోంచి, ‘‘ఓహో పావురమా’’ పాట వినపడుతుంది రయ్యిమంటూ, ఆ నాటకాల నటి వీడి కోసం మళ్ళీ వెతుకుతోంది. ఎందుకంటే, ఆ రెండో వాడు దీని డబ్బంతా ఎత్తుకుని పారిపోయాడు. ఆ నటికి మళ్ళీ కొత్త కొత్త నాటకాలు రాసి యిచ్చే పాత కవి కావలసి వచ్చాడు. అందుకే మళ్ళీ ఆ పావురం పాట ఎత్తుకుంది. పెళ్ళాం ముందు నిలబడ్డ పశ్చాత్తాపాల వాడు, మొహం అటు వైపు తిప్పేశాడు. ఆ కీర్తివంతురాలు, ఆ నాట్యకత్తె, ఆ మధురగాయని, ఆ కళాకారిణి, ఆ సుందరాంగి, మళ్ళీ దొరకబోతోంది! మన కళాకారుడు, పాకలో నించి ఒక్క ఊపుతో బైటికి పరుగుతీశాడు. భార్య ఆశ్చర్యపోతూ చూసింది కొంతసేపు. అతడి పశ్చాత్తాపం అబద్ధమని అప్పటికి స్పష్టంగా గ్రహించింది. చప్పున కదిలి తలుపులు మూసేసింది. గోడ మీద ఫొటో తీసి కింద పెట్టింది. ఆమె మొహంలో విచారం లేదు. మనిషి ప్రశాంతంగా అయింది. పిల్లల దగ్గిర కూర్చుని చక్కని పాట ఎత్తుకుంది. ‘‘మనం తల్లీ పిల్లలం మనం ఒకరికి ఒకరం మన గూడే మన స్వర్గం! మన పాకే మన స్వర్గసీమ! మన యంత్రమే, మన సూదీ దారాలే, మన ఆయుధాలు! మీ రక్షకురాలిని నేనే, నా సంరక్షకులు మీరే! చాలు మనకీ సంతోషం చాలు మనకీ ఆనందం ఇదే ఇదే మన స్వర్గ సీమ!’’ పిల్లలు నిద్రలు లేస్తారు. వాళ్ళు కూడా ఆ పాటలో కలుస్తారు. ఆ తల్లి, మిషను మీద కూర్చుని కుట్టు పని చేస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు జల జలా వర్షిస్తున్నాయి. అయినా, ఆమె మొహం ప్రశాంతతతో ప్రకాశిస్తోంది. - ముగింపు ఇలా ఉంటే, అది ఆ తల్లీ బిడ్డలకు న్యాయం. సినిమాల వాళ్ళకి డబ్బు జబ్బు ఉంటుంది. లాభం జబ్బు! పెట్టిన ఖర్చులు వెనక్కి వస్తే చాలదు. లాభం రావాలి! అత్యధిక లాభం రావాలి! ఆ భార్య, భర్త కాళ్ళ మీద పడకపోతే, టిక్కెట్లు కొనే భర్తలు పెళ్ళాల్ని సినిమాకి తీసుకురారని సినిమా వాళ్ళకి భయం! సగం టికెట్లు అమ్ముడు కావని దడ! అందుకే ఆడ వాళ్ళని బానిసల్ని చేస్తారు. వాళ్ళ జీవితాల్నీ, కుటుంబాల్నీ, స్వర్గ సీమల్నీ, ఖూనీలు చేస్తారు. ఆ ఖూనీయే జరిగింది ఈ కథ ముగింపులో! ఈ సినిమా ఏం చెప్పిందంటే, భర్తలు బైటికిపోయి ప్రియురాళ్ళతో తిరిగి రాగానే, అతడు రావడమే చాలని భార్యలు ఆనందంతో అతడి కాళ్ళమీద పడాలి! మళ్ళీ పోయినా, మళ్ళీ వస్తాడని, ఓపికతో నిరీక్షించాలి!- ఇదే కదా స్వర్గసీమలు నిలిచే మార్గం! - రంగనాయకమ్మ -
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత... చేరా ఇక లేరు
ఖమ్మం కల్చరల్/మధిర: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త పంథా సృష్టించిన ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు చేకూరి రామారావు(చేరా) (80) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని నివాసంలో గురువారం సాయంత్రం ధ్యానం చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. చేకూరి రామారావుకు భార్య రంగనాయకమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన ముగ్గురు పిల్లలు యుఎస్‌లో ఉంటున్నారు. ఆయన స్వస్థలం మధిర మండలం ఇల్లెందులపాడు గ్రామం. ఆయన 1934, అక్టోబర్ 1న చేకూరి లింగయ్య-భారతమ్మ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కాచెళ్లెళ్లు ఉన్నారు. చేరా కొంతకాలం గుంటూరు జిల్లా నర్సారావుపేటలో ఉన్నారు. మచిలీపట్నంలో హెచ్ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆ తరువాత, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ పూర్తిచేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో భాషాశాస్త్రంపై పరిశోధనలు సాగించారు. అనంతరం, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో భాషా శాస్త్రవేత్తగా పనిచేసి అక్కడే ఉద్యోగ విరమణ పొందారు. ఆధునిక భాషా శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తెలుగు భాషా శాస్త్రంలో నూతన ఒరవడిని సృష్టించారు. ‘చేరాతలు’ పేరుతో పత్రికలలో సుదీర్ఘకాలంపాటు సాహితీ కాలం కొనసాగించారు. ‘సృ్మతి కిణాంకం’ అనే వ్యాస సంపుటికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగు సాహితీ విమర్శలో కొత్త ఒరవడికి చేరా నాంది పలికారు. ఆయన రాసిన ‘సాహిత్య విమర్శ’, ‘పరామర్శ’, ‘చేరాతలు’, ‘రెండు పదులపైన’, ‘ఇంగ్లిష్-తెలుగు పత్రికా పదకోశం’, ‘ముత్యాల సరాల ముచ్చట్లు’, ‘వచన పద్యం’ తదితర పుస్తకాలు రాశారు. ఆయన రచించిన ‘తెలుగులో వెలుగులు’ అనే భాషా పరిశోధనా వ్యాసానికి మంచి గుర్తింపు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన సందర్భంగా 2002లో ఆయనను ఖమ్మంలో ‘సాహితీ స్రవంతి’ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి తదితర ప్రముఖులు ఘనంగా సన్మానించారు. తెలుగు సాహితీ వినీలాకాశంలో కాంతి వెలుగులు విరజిమ్మిన ‘చేరా’ మృతి సాహితీప్రియులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎంపీ పొంగులేటి సంతాపం చేకూరి రామారావు మృతిపట్ల ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారని నివాళులర్పించారు. తెలుగు సాహితీలోకానికి ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు.