సరే, భారతం కాలంలోనే ఉండండి! | Well, do not hesitate to India at the time | Sakshi
Sakshi News home page

సరే, భారతం కాలంలోనే ఉండండి!

Published Sat, May 16 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

సరే, భారతం కాలంలోనే ఉండండి!

సరే, భారతం కాలంలోనే ఉండండి!

ప్రాచీన సాహిత్యమే కాదు, ఆధునిక, అత్యాధునిక సాహిత్యాలైనా,న్యాయ విమర్శకీ, హేతుబద్ధ విమర్శకీ నిలిస్తేనే, అవి ఎల్లకాలమూ నిలుస్తాయి. ‘‘ఇదండీ మహాభారతం’’ పేరుతో నేను రాసిన పుస్తకం గురించి, ‘‘ఇదండీ రంగనాయకమ్మ వ్యాఖ్యానం’’ అనీ, ‘‘అలా ఉందామా?’’ అనీ, చిన్నా - పెద్దా పేర్లతో వచ్చిన ఒక వ్యాసం చూశాను. (‘సాక్షి’ డైలీ, మే 10. వ్యాసకర్త పి.రామకృష్ణ)
 వ్యాసకర్త వెలిబుచ్చిన సందేహాల సారాంశం అంతా, ఆ వ్యాసంలో, చివరి పెద్ద పేరాలో వుంది. వ్యాస సారాంశం అదే కాబట్టి, ఆ పేరాని శ్రద్ధగా చూడాలి. ఆ పెద్ద పేరా: ‘‘రంగనాయకమ్మ గారి ‘విమర్శ’ను అన్వయించి చూస్తే, మనకు ప్రాచీన సాహిత్యమంటూ మిగలదు. వేల ఏళ్ళుగా ఉన్న సాహితీ వృక్షాలను విషవృక్షాలని నరికేస్తే ఏమవుతుంది? భారతం గురించి రంగనాయకమ్మ గారే చేసిన అభివర్ణనల్లో ఒక్కటైన ‘‘మొగ్గా పువ్వూ లేని, కాయా పండూ లేని మోడు’’లుగా మనం మిగిలి ఉంటాం. అలా ఉందామా?’’ - ఇదీ వ్యాసకర్త ప్రశ్న!
 ప్రాచీన సాహిత్యమే కాదు, ఆధునిక, అత్యాధునిక సాహిత్యాలైనా, న్యాయ విమర్శకీ, హేతుబద్ధ విమర్శకీ నిలిస్తేనే, అవి ఎల్లకాలమూ నిలుస్తాయి. ఏ విమర్శలకూ నిలవని సాహిత్యాలకు అర్హమైన స్థానాలు, పురావస్తు ప్రదర్శన శాలలూ, గ్రంథాలయాలలో ప్రత్యేక బీరువాలూనూ.

జనాలలో, విమర్శలు చెయ్యగల విజ్ఞానమూ, చైతన్యమూ లేకపోతే, అది రాకపోతే, వేల యేళ్ళుగా వున్న సాహితీ విషవృక్షాలు, లక్షల యేళ్ళయినా అలాగే విష ఫలాలు అందిస్తూ నిలిచి వుంటాయి. రామాయణ, భారతాల్ని ‘కావ్యాలు’గా గాక, మొత్తంగా మత గ్రంథాలుగా మార్క్సిస్టులు భావించవచ్చునా - అని వ్యాసకర్త ప్రశ్న! ఒక రచన, కావ్యమా, మత గ్రంథమా; పద్యమా, వచనమా; అనే తేడాలతో సంబంధం లేదు. అది ఏం బోధిస్తోంది - అనేదే ప్రధాన విషయం. వ్యాసకర్త, మార్క్సిస్టుల ప్రస్తావన తెచ్చారు కాబట్టి, రష్యా మార్క్సిస్టు ‘లునచర్‌స్కీ’, చైనా మార్క్సిస్టు మావో, ఆ ఇద్దరూ, ఏ విమర్శలో అయినా, ‘విషయమూ - రూపమూ’ అనే అంశాల్ని ఎలా చూడాలని చెప్పారో, ఆ మాటలు చూస్తే, మార్క్సిస్టుల బాధ్యత ఏమిటో తెలుస్తుంది. ‘విషయం’ న్యాయమైనదిగానూ, ‘రూపం’ కళాత్మకమైనదిగానూ వుండాలనే, ఆ ఇద్దరూ చెప్పారు.

లునచర్‌స్కీ: ‘మార్క్సిస్టు విమర్శకులు, తమ విశ్లేషణకు లక్ష్యంగా మొదట, రచనలో వున్న విషయాన్ని చూస్తారు. ఆ విషయానికి సామాజిక బృందాలతో వున్న సంబంధాల్నీ, ఆ సామాజిక బృందాలపై ఆ రచన కలగజేసే ప్రభావాల్నీ వివరి స్తారు. ఆ తర్వాత, విమర్శకులు, ‘రూపం’ దగ్గరికి వస్తారు. ఆ రూపం, ఆ విషయానికి వున్న లక్ష్యాన్ని నెరవేర్చగలిగే విధంగా వుందో లేదో చూస్తారు’ (ఆన్ లిటరేచర్ అండ్ ఆర్ట్). ‘రూపం’ అనేది, విషయాన్ని నెరవేర్చగల ‘కళ’తో వుండాలని చెప్పడమే ఇది. కళా నైపుణ్యం అక్కరలేదని చెప్పడం కాదు.

మావో: ‘కళా, సాహిత్య విమర్శలో, రెండు ప్రమాణాలున్నాయి. రాజకీయమైనదీ, కళాత్మకమైనదీనూ. రాజకీయ దృక్పథం నించి చూస్తే, ఆ విషయం పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా వున్నప్పటికీ, కొన్ని రచనల్లో కళాత్మక ప్రతిభ కనిపిస్తుంది. ఒక రచనలో విషయం ఎంత అభివృద్ధికరమైనది అయినా, ఆ రచన కళాత్మకంగా లేకపోతే, అది శక్తిహీనం అయిపోతుంది. అటు, గొప్ప కళాత్మకతతో వున్న విషయం అభివృద్ధి నిరోధకం అయినప్పుడూ; ఇటు, గొప్ప అభివృద్ధికర విషయం, ఏ మాత్రమూ కళాశక్తి లేని, నినాదప్రాయ శైలిగా వున్నప్పుడూ; ఆ రెంటికీ, మనం, సమానంగా వ్యతిరేకం.’ (ఆన్ లిటరేచర్ అండ్ ఆర్ట్ ).

రచనలో కళాత్మకత వుండవలసిందే. చక్కగా తయారవని రచనలో ఎంత మంచి విషయం వున్నా, అది చదువరిని ప్రభావితం చెయ్యదు. అయితే, గొప్ప కళాత్మకతతో వున్న విషయం ప్రజలకు పనికి రానిది అయితే? ఆ కవిత్వాల సొగసులూ, ఆ సంగీత రాగాలూ, ఆ పనికి మాలిన విషయానికే ప్రజల్ని బానిసల్ని చేస్తాయి.

కులభేదాలూ, పురుషాహంకారాలూ, సతీ సహగమనాలూ, స్వర్గ నరకాలూ, వగైరా వగైరా అభివృద్ధి వ్యతిరేక విషయాలు, కవిత్వ సొగసులతో, సంగీత రాగాలతో మెరిసిపోతూ వుంటే, అవి ప్రజల్ని తాగుడుమత్తులో ముంచేసినట్టు, కవిత్వాల మత్తులో ముంచేస్తాయి. ఆ సందర్భాల్లో కళాశక్తులు, ప్రజలకు ద్రోహం చేస్తాయి.

కావ్యాల్లో గొప్ప కళాసౌరభాలు వుంటే, ఆ కళానైపుణ్యాల్ని నేర్చుకోవాలిగానీ, ఆ విషయాల్ని కాదు. త్యాగరాజు కృతుల్లో గొప్ప రాగాలు దొరికితే, ఆ సంగీత జ్ఞానాన్ని నేర్చుకోవాలి గానీ, ఆ విషయాల్ని కాదు.
 
 వ్యాసకర్త చేసిన ఇంకో విమర్శ:‘విమర్శలో విమర్శకుల స్వీయాభిప్రాయాలు కనిపించరాదు’ అని! మరి, విమర్శలో, విమర్శ చేసే వాళ్ళ అభిప్రాయాలు గాక, పొరుగింటి - ఎదురింటి వాళ్ళ అభిప్రాయాలు వుంటాయా? ఈ వ్యాసకర్త విమర్శలో, ఆయన స్వీయాభిప్రాయాలు గాక, వాళ్ళ వెనకింటి వాళ్ళ అభిప్రాయాలు వున్నాయా?
 
‘నన్నయ, తిక్కనలు మాత్రం వరాల్నీ శాపాల్నీ నమ్మి రాశారా? అవి వుండవని వాళ్ళకి మాత్రం తెలీదా?’ - అంటూ వ్యాసకర్త, ఆ కవుల పరువుల్నీ తీసేశారు. ఆ కవులు, వాళ్ళు నమ్మినవే వాళ్ళు రాశారంటే, వాళ్ళ పరువు వాళ్ళకే వుంటుంది. వాళ్ళు నమ్మకుండానే రాశారంటే, జనాల్ని మూఢత్వాల్లో ముంచి వుంచాలని రాశారని అర్థమే కదా? భారతాన్ని విమర్శిస్తే, దాని కవిత్వ సౌందర్యాలకు దూరమై మోడులై పోతామని జడిసేవాళ్ళు, భారతాన్నే నెత్తిన పెట్టుకుని, దాని కాలంలోనే వుండి పొండి! మీకు నచ్చే కాలంలోనే, అవును, అక్కడే అలాగే వుండండి!
 
 రంగనాయకమ్మ
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement