నవంబరు 9న ‘మెటా’ అనే కంపెనీ తన ఉద్యోగుల్లో 11 వేల మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ‘ట్విట్టర్’ అనే కంపెనీ 3 వేల 7 వందల మందినీ, ‘బైజూ’ అనే కంపెనీ 2 వేల 5 వందల మందినీ.. ఇలా అనేక డజన్ల కంపెనీలు తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని వందల్లో, వేలల్లో తీసేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా గత 6 నెలల నించీ జరుగుతూనే వుంది. మొన్న జులై నెలలో ‘అమెజాన్’ అనే కంపెనీ లక్షమందిని ఉద్యోగాల్లో నించీ తీసేసింది. ఈ జాబితా చాలా పొడుగ్గా వుంటుంది. ఈ ఉద్యోగాలు పోవడం అనేది కేవలం సాఫ్ట్‌వేర్ కంపెనీలకే కాదు, వస్తువులు తయారు చేసే పరిశ్రమల్లో (మాన్యుఫ్యాక్చర్ రంగంలో) కూడా లక్షల్లో జరుగుతోంది. కొన్ని నెలలుగా ఆర్థిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం సేకరించే సంస్థల (ఉదా: సి.ఎం.ఐ.ఇ) నివేదికలు చూస్తే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది.
అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికుల్ని ఉద్యోగాల్లో నించీ తీయదలుచుకుంటే వాళ్ళకి గులాబీ రంగు కాగితం (పింక్ స్లిప్) మీద ‘రేపటి నించీ నువ్వు పనిలోకి రానక్కరలేదు’ అని రాసిచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక ఎక్కడెక్కడో నివసించే ఉద్యోగులందరినీ ఒక తెర మీద కనిపించేలాగా సమా వేశపరిచి (దీన్ని బడాయిగా ‘జూమ్ మీటింగ్’ అని చెప్పుకుంటారు.) చల్లగా చావు కబురు చెపుతారు. ఆ మధ్య ‘బెటర్.కామ్’ అనే కంపెనీ ఒకే ఒక్క జూమ్ సమావేశం పెట్టి ఒక్క దెబ్బతో 3 వేలమంది ఉద్యోగుల్ని ‘రేపటినించీ మీరు పనిలోకి రానక్కర లేదు’ అని చెప్పేశారని ఒక వార్త!
ఇంతగా ఉద్యోగాలు పోవడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. కేవలం పెట్టుబడిదారీ విధానంతోనే అది మొదలైంది. గత సమా జాలలో లేదు. బానిసలకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఫ్యూడల్ కౌలు రైతులకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఎటొచ్చీ ఈనాటి కార్మికులకే (వీళ్ళది ‘వేతన బానిసత్వం’ అంటాడు మార్క్స్) ఈ నిరుద్యోగ సమస్య వుంది. కార్మికులు అన్నప్పుడు వాళ్ళు శారీరక శ్రమలు చేసేవారే అనుకోకూడదు. మేధాశ్రమలు చేసే వారందరూ (ఉదా: టీచర్లూ, డాక్టర్లూ, జర్నలిస్టులూ) కూడా కార్మికులే!
ఉద్యోగుల్ని తీసేయడానికి కంపెనీల వాళ్ళు చెప్పుకునే కారణాలు (సాకులు) కొన్ని: 1. కంపెనీకి ఆదాయాన్ని మించిన ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగుల సంఖ్యని తగ్గించుకోవడం మినహా మార్గం లేదు. 2. ఉద్యోగులు ఎక్కువగానూ, సమర్థంగానూ ఉత్పత్తి చెయ్యడం లేదు. (దీన్నే ఉత్పాదకత –ప్రొడక్టివిటీ – సమస్యగా చెపుతారు). 3. బ్యాంకులు వడ్డీరేట్లని పెంచేస్తూ పోతున్నాయి. ఇలాంటప్పుడు, వ్యాపారాన్ని నడపాలన్నా, పెంచాలన్నా అప్పులు తీసుకోవాలంటే పెంచిన వడ్డీ రేట్లు పెద్ద భారం. అందుకే ఉన్న ఉద్యోగుల్ని తగ్గించి, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడమే మార్గం. 4. ఇతర దేశాలలో కూడా ఇవే పరిస్థితులు ఉండడం వల్ల ఎగుమతులు కూడా తగ్గి పోతున్నాయి. 5. ఒకే రకమైన సరుకులు తయారు చేసే ఇతర కంపెనీలతో పోటీ ఒకటి తలనొప్పిగా వుంది. 6. తయారైన సరుకులు మందకొడిగా (నెమ్మదిగా) అమ్ముడవుతున్నాయి. (దీన్నే ‘మాంద్యం’ అంటారు. కాబట్టి, ఉన్న సరుకులు అమ్ముడు కాకుండా కొత్త సరుకులు తయారు చేయించడం కుదరదు. అందుచేత, కొంతమందిని ఉద్యోగాల్లోనించీ తీసివేయక తప్పదు).
ఈ రకమైన పరిస్థితిని చూపించి ఆర్థికవేత్తలు ‘ముంచుకొస్తున్న మాంద్యం’ అని హెచ్చరికలు చేస్తారు. అంతేగానీ తయారైన సరుకుల అమ్మకాలు మందకొడిగా ఎందుకు జరుగుతాయి? దానికి పరిష్కారం ఏమిటి?– అనే ప్రశ్నలకు వారి దగ్గిర సరైన సమాధానం వుండదు. మార్క్స్ తన ‘కాపిటల్’ లో విమర్శించినట్టు, ‘‘పాఠ్య పుస్తకాల ప్రకారం ఉత్పత్తి విధానం సాగించి వుంటే సంక్షోభాలు సంభ వించవు.. అని నొక్కి చెప్పడం ద్వారా పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు సంతృప్తి పడతారు’’.
ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే, అనేక కంపెనీల్లో సరుకుల గుట్టలు మార్కెట్ అవసరాల్ని మించిపోయి ఆకాశం ఎత్తున పెరిగిపోవడం వల్ల! ఈ గుట్టలు పెరగడం ఎందుకు జరుగు తుందంటే, ఆ ఉత్పత్తుల్ని తయారు చేయించే వాళ్ళ మధ్య సమష్టి ప్లాను లేకపోవడం వల్ల! ఆ సమిష్టి ప్లాను లేకపోవడం ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళందరూ ప్రైవేటు పెట్టుబడిదారులు అవడం వల్ల! పెట్టుబడిదారీ జన్మ ప్రారంభమైన తర్వాత, ఆ జన్మకి లక్ష్యం లాభం రేటే! ఆ లక్ష్యానికి ఒక పరిమితీ, ఒక నీతీ, ఏదీ ఉండదు. ఆఖరికి మార్కెట్ అవసరాల్ని గమనించుకోవాలనే తెలివి అయినా ఉండదు.
పోటీలో నిలబడడానికి ఏకైక మార్గం – ఉత్పత్తి శక్తుల్ని పెంచడం! అంటే, సరుకుల్ని తక్కువ ఖర్చులతో తయారుచేసి, వెనకటి ధరలతోనే అమ్మాలని ప్రయత్నం! ఆ రకంగా కొంతకాలం జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కంపెనీల నిండా సరుకుల గుట్టలు పేరుకుపోయి కనపడతాయి. అమ్మకాలు మందగించిన ప్రమాద సంకేతాలు ఎదురవుతాయి. దాన్ని గమనించుకున్న కంపెనీ యజమాని, పునరుత్పత్తి క్రమాల్ని తగ్గించెయ్యడం గానీ, ఆపెయ్యడం గానీ చేస్తాడు. అలా ఆపెయ్యడం వల్ల కార్మికులతో అవసరం తగ్గిపోతుంది. ఆ కంపెనీ నించి ఒక పిడికెడు మంది కార్మికులు తప్ప, మిగతా అందరూ ఉద్యోగాలు పోయి వీధుల్లో పడతారు. అసలు కార్మిక వర్గంలో, కొంత జనం ఎప్పుడూ నిరుద్యోగంలోనే వుంటారు. కానీ, సంక్షోభాల కాలాల్లో ముంచుకువచ్చే నిరుద్యోగాల పరిస్థితి అలాంటిది కాదు. ఒక కంపెనీలో నిన్నటి దాకా 100 మంది కార్మికులు వుంటే, ఇవ్వాల్టికి కనీసం 90 మంది నిరుద్యోగులైపోతారు. ఇది ఒక్క శాఖలోనే కాదు, అనేక శాఖల్లో జరుగుతుంది. శారీరక శ్రమల్లోనూ, మేధా శ్రమల్లోనూ కూడా ఇది జరుగుతుంది. సరుకుల పునరుత్పత్తి క్రమాలే తగ్గిపోయి, యంత్రాలే ఆగిపోయినప్పుడు, ఇక కార్మికులతో ఏం అవసరం ఉంటుంది?
అయితే, ఆ కార్మికులందరూ ఏమైపోతారు? రెగ్యులర్‌గా జీతాలు అందుతూ వున్నప్పుడే కార్మిక కుటుంబాలు, సమస్యల వలయాల్లో కూరుకుపోయి వుంటాయి. అలాంటి కుటుంబాలకు జీతాలే ఆగిపోతే, తిండే ఉండదు. అద్దె ఇళ్ళు ఖాళీ చేసి చెట్ల కిందకి చేరవలసి వస్తుంది, చెట్లయినా వుంటే! పిల్లల్ని స్కూళ్ళు మానిపించవలసి వస్తుంది. ఆకలి – జబ్బులు మొదలవుతాయి. వైద్యం ఉండదు. చావులు ప్రారంభం! బతికి వుంటే పిచ్చెత్తడాలూ, ఆత్మహత్యలూ, నేరాలూ పెరిగి పోతాయి. కార్మిక జనాలు పిట్టలు రాలినట్టు రాలి పోతారు. ఉదాహరణకి, ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశంలో 2021లో లక్షా 64 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళలో 43 వేలమంది రోజూ వారీ కూలీలూ, నిరుద్యోగులూనూ అని తేలింది. లెక్కకు రానివి ఎన్నో!
రంగనాయకమ్మ,
ప్రముఖ రచయిత్రి
Comments
Please login to add a commentAdd a comment