మొన్న మైక్రోసాఫ్ట్, ట్విట్టర్... నిన్న వాట్సప్, ఫేస్‌బుక్‌ల మాతృసంస్థ మెటావర్స్... నేడు అమెజాన్... హెచ్‌పీ! వరుసగా ఉద్యోగాల్లో కోతల వార్తలే. అమెరికన్ టెక్ సంస్థలు అనేకం ఉద్యోగస్థుల్ని తగ్గించుకొనే పనిలో పడడంతో వేలమంది వీధిన పడనున్నారు. సదరు సంస్థల భారతీయ శాఖల్లో పనిచేస్తున్న మనవాళ్ళ మీదా అనివార్యంగా ఆ ప్రభావం ఉండనుంది. ఏ రోజు ఏ కంపెనీ ‘పింక్ స్లిప్’ ఇస్తుందో తెలియని కంగారు పుట్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక పరిణామాలతో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా మారింది. లాభాలు పడిపోతూ, ప్రపంచమంతటా మాంద్యం తప్పదనే భయం నెలకొంది. అమెజాన్ నుంచి డిస్నీ దాకా దిగ్గజ టెక్ సంస్థలు శ్రామికశక్తిని పునర్వ్యవస్థీకరించు కుంటున్నదీ అందుకే. ఎక్కడికెళ్ళి ఆగుతుందో తెలియని ఈ పరిస్థితి భారత్ సైతం అప్రమత్తం కావాలని గుర్తుచేస్తోంది.
శ్రామికశక్తి పునర్మూల్యాంకనంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 850కి పైగా టెక్ కంపెనీల్లో లక్షా 37 వేల వైట్ కాలర్ ఉద్యోగులు ఇంటి బాట పట్టాల్సి వచ్చిందని ఓ అంతర్జాతీయ అంచనా. లిఫ్ట్, స్ట్రైప్, కాయిన్‌బేస్, షాపిఫై, నెట్‌ఫ్లిక్స్, శ్నాప్, రాబిన్‌హుడ్, చైమ్, టెస్లా అనేక సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా కేంద్రంగా నడుస్తున్న భారీ సంస్థలు ఒక్క గత నెలలోనే 33,843 ఉద్యోగాలకు మంగళం పలికాయి. ఉద్యోగాల కోత సుమారు 13 శాతానికి ఎగబాకింది. 2021 ఫిబ్రవరి నుంచి గత నెల వరకు చూస్తే – ఒకే నెలలో ఇన్ని ఉద్యోగాలపై వేటు పడడం ఇదే అత్యధికం.
పులి మీద పుట్రలా గూగుల్ సైతం ఈ వారం ఉద్వాసనల బాట పట్టింది. లక్షా 87 మందితో టెక్ రంగంలో అతి పెద్ద ఉద్యోగ సంస్థ అయిన గూగుల్ 10 వేల మందిని ఇంటికి సాగనంపడానికి సిద్ధమవుతోందని ప్రాథమిక వార్త. ఆ సంస్థకు అననుకూలమైన మార్కెట్ పరిస్థితులు నెలకొన్నాయి. పైపెచ్చు సంస్థలో గణనీయమైన వాటాతో యాజమాన్య నిర్ణయాలను ప్రభావితం చేసే ‘యాక్టివిస్ట్ హెడ్జ్ ఫండ్’ నుంచి ఒత్తిడి ఉంది. అలా 6 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకొనే పనిలోకి దిగింది. పని తీరులో రేటింగు అతి తక్కువగా ఉన్నవారినే తొలగిస్తామన్నది గూగూల్ చెబుతున్న మాట. దానికి సమర్థమైన ర్యాంకింగ్ విధానం ఉందంటున్నా, అది ఏ మేరకు లోపరహితమో చెప్పలేం.
ప్రస్తుత కోతల పరిస్థితి గూగుల్ స్వయంకృతమని నిపుణుల మాట. అవసరానికి మించి శ్రామిక శక్తి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెట్టి గత త్రైమాసికంలో ఆ సంస్థ ఎడాపెడా కొత్త ఉద్యోగస్థుల్ని తీసుకుంది. అదీ భారీ వేతనాలకు తీసుకోవడం మెడకు గుదిబండైంది. లాక్‌డౌన్లలో పని నడపడానికి అమెరికా లాంటి చోట్ల తీసుకున్న ఉద్యోగాలు ఇప్పుడు వాటికి ఎక్కువయ్యాయి. ఉద్యోగస్థానాల్లో గణనీయంగా ఊపందుకున్న ఆటోమేషన్ ప్రభావం సరేసరి. వెన్నాడుతున్న ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా అనంతర విక్రయాలు తగ్గాయి. ఫలితంగా పదేళ్ళుగా వీర విజృంభణలో ఉన్న టెక్‌సంస్థలు కొత్త వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సి వచ్చింది. ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్థ హెచ్‌పీ వచ్చే 2025 చివరికి 6 వేల ఉద్యోగాలను తగ్గించుకుంటామని ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ 10 వేల మందికి పింక్ స్లిప్పులు ఇస్తామనేసరికి, మన దేశంలోని దాని శాఖలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ‘మీ అంతట మీరు ఉద్యోగాలు వదిలేయం’డంటూ అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ‘స్వచ్ఛంద వీడ్కోలు పథకం’ (వీఎస్పీ) ప్రకటించడం చర్చ రేపుతోంది. మూకుమ్మడిగా ఇంటికి సాగనంపడాన్ని వ్యతిరేకిస్తూ మన కార్మిక శాఖకు ఫిర్యాదులు రావడం, వీఎస్పీ వివరాలను అందించాలంటూ మన ప్రభుత్వం ఇక్కడి శాఖను అడగడం చకచకా జరిగాయి. నిజానికి, కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా, ఐరోపాలు మూడూ బాగా మందగించాయి. అందుకే, వచ్చే 2023లో ప్రపంచానికి మాంద్యం తప్పదని వరల్డ్ బ్యాంక్ అధ్యయనం. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నిదానించి, మరిన్ని దేశాలు మాంద్యం లోకి జారితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని ప్రజానీకం దుష్పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది.
ప్రపంచానికి మెడ మీద కత్తిలా మాంద్యం భయపెడుతున్న వేళ, మనమూ అప్రమత్తం కావాలి. ప్రపంచీకరణతో ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ విపణికి మనం ముడిపడి ఉన్నాం. ముందు జాగ్రత్త చర్యలకు దిగాలంటున్నది అందుకే. రానున్న పరిణామాల్ని దీటుగా ఎదుర్కోవడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నామన్నది కీలకం. ప్రపంచశ్రేణి టెక్ సంస్థల కార్యకలాపాల్లో మన ఐటీ సంస్థల ప్రమేయముంది గనక ఉద్యోగ విపణిలో సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఐటీ రంగంలో మొదలైన కోతలు ఇతర రంగాలకూ పాకే ముప్పుంది. సత్వరం మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే మార్గాలు వెతకాలి. అదనపు పెట్టుబడులు వచ్చేలా, ఉత్పాదకత పెరిగేలా విధానాలు నిర్ణయించడం దారిద్య్ర నిర్మూలనకూ, వృద్ధికీ కీలకం.
కార్మిక హక్కులను నీరుగార్చి, ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని అనిశ్చితి, అభద్రత కల్పించడం ఏ రంగానికైనా మంచివి కావు. అసలే కరోనాలో ఉపాధి పోయి రోజువారీ శ్రామికులు చిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వైట్ కాలర్ ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితీ అదే అంటే ఉన్న సంక్షోభం ఇంకా తీవ్రమవుతుంది. ఇప్పటికీ మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మెరుగ్గా ఉందంటున్న పాలకులు మేకిన్ ఇండియా స్వప్నాలను చూపడమే కాక, ఉద్యోగక్షేత్రంలోనూ దాని ఫలాలు అందించగలిగితే మంచిది. కిందపడ్డా మళ్ళీ పైకి లేస్తాం!
Comments
Please login to add a commentAdd a comment