ఈ కాలమ్ మీదే : చర్చావేదిక | This column is yours: Discussion Forum | Sakshi
Sakshi News home page

ఈ కాలమ్ మీదే : చర్చావేదిక

Published Mon, Feb 9 2015 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

This column is yours: Discussion Forum

ఏకాలంలో జరిగినా అన్యాయం అన్యాయమే!

 - రంగనాయకమ్మ
 
‘ఆనాటి విషయాన్ని ఈనాటి దృష్టితో విమర్శించడం తగునా?’ అని వి.ఎ.కె. రంగారావుగారు వేసిన ప్రశ్న, కొన్ని సందర్భాలకే గానీ, అన్ని సందర్భాలకూ వర్తించదు. వేల సంవత్సరాల నాటి ఒక పండితుడు ‘వర్గ భేదాల’ గురించి చెప్పకపోతే, దాన్ని నేరంగా పరిగణించడం సాధ్యం కాదు. కానీ, ఆ పండితుడే సతీసహగమనాన్ని సమర్థిస్తూ చెప్తే, దాన్ని ‘ఆనాటి విషయం’గా జమకట్టనక్కరలేదు. ఆ వ్యక్తికి ఆ విషయం మీద ఆనాడైనా ‘కరుణ’ ఉండాలి. అది చాలు! అది లేకపోతే, అది నేరమే.
 
‘స్వర్గ సీమ’లో భార్యాభర్తల విషయాన్ని ‘ఆనాటి విషయం’గా తీసివెయ్యవలసింది కాదు. భర్త ప్రవర్తన, ఆనాడు కూడా నీచమైనదే. ఆ భర్తకి పశ్చాత్తాపం కలిగితే, అది స్వంత ఆత్మవేదనతో జరగాలి. ఆ నటి వదిలేసింది కాబట్టి బైటికి రావడం, పశ్చాత్తాపం అవదు. అప్పటికే పత్రిక పని పోగొట్టుకుని, నటి వదిలేశాక, బికారిగా వీధుల్లో తిరుగుతూ ఇంటికి చేరినట్టు చూపిస్తే, అదా పశ్చాత్తాపం? నీచమైన మాటలు మాట్లాడి వెళ్ళినవాడు, పశ్చాత్తాపంతో దగ్దమవుతూ తిరిగి వచ్చిన వాడైతే, అతడే భార్య కాళ్ళ మీద ఎందుకు పడకూడదు? డెరైక్టర్‌కి ఆ భావం లేకపోతే, ఆ భర్త తల వాల్చి కన్నీళ్ళు కారుస్తూ భార్య ముందు నించోవచ్చు. ఏ తప్పూ చెయ్యని ఆ భార్యనే అతడి కాళ్ళ మీద ఎందుకు పడెయ్యాలి? ఆ ముగింపులో, ఆ భార్యకి ఏమైనా న్యాయం జరిగిందా? ఆ న్యాయం, ఆనాడైనా అసాధ్యమా? ఆ భార్యకి న్యాయం జరగదేదని ఆనాడు కాకపోతే, ఈనాటికైనా తెలుసుకోవద్దా?

‘ఆనాటి విషయం అది’ అని ప్రతీ వెనకటిదాన్నీ సరిపెట్టుకుంటూ ఉంటే, ఇక వెనకటి తప్పుల్ని తెలుసుకునేది ఎలాగ? దిద్దుకునేది ఎలాగ? ఆ భార్య, బిడ్డల భవిష్యత్తుని పటిష్టం చేసుకోవడం కోసం భర్తని ఆహ్వానించిందని ఈ పండితుడి వాదం! ఆ తండ్రి వల్ల బిడ్డలకేదో క్షేమం అవుతుందని ఆ భార్య నమ్మితే అది ఆమె అమాయకత్వమే.
 సైగల్ పాటలో నేను రాసిందే సరైనది. ఆ పాటలో పదాలు, ‘స్వర్గసీమ’లో ఇలా ఉంటాయి - ‘దుఃఖ్ కే హై దునియా బాబా! ఆంఖ్ ఖోల్ కే దేఖో బాబా!’  - ఇది పూర్తిగా సైగల్ కంఠమే.
     
‘స్వర్గసీమ’ మీద నా విమర్శ, ‘మగవారిని దుమ్మెత్తి పొయ్యడానికే జరిగిందనీ, కథలో ఆ భర్తని పాడు చేసింది ఇంకో స్త్రీయేననీ’ కె.ఎన్.టి శాస్త్రిగారి వాదం! పురుషుల కోసం గృహాల్లో పతివ్రతల్నీ, గృహాల బైట జారిణుల్నీ, సమాజం ఏనాడో ఏర్పాటుచేసి ఉంచింది కదా? ఇక్కడ ఆ జారిణి సంగతి అనవసరం. సమస్య అంతా భార్యాభర్తలదే. తప్పు చేసిన వాణ్ణి అందలం ఎక్కించి, ఏ తప్పూ ఎరగని భార్యనే అతడి బానిసని చెయ్యడమా భార్యకి చేసిన న్యాయం? ఈ పెద్దలు ఆ తప్పుని తెలుసుకోకపోతే, ఇక తెలుసుకోగలిగేది ఏముంటుంది?

నేను ‘స్వర్గసీమ’లో, ‘చెడ్డనే కాదు, ఎన్నో ‘మంచి’ విషయాలు కూడా చూశాను, చెప్పాను. మీకు మాత్రం మంచిచెడ్డల విభజన లేదు. ఏ చెడ్డని అయినా, ఒకనాటి మంచిగానే జమ కట్టగలరు మీరు. ‘చెడ్డల’ వైపు వీపులు తిప్పి, ప్రతీ చెడ్డనీ ‘మంచి’గానే స్వీకరించగలరు మీరు. ఏది ఎలా జరిగినా అది మీకు స్వర్గమే. కానీ, ఈ స్వర్గ వాదాలతో కూడా మంచిచెడ్డలు బైట పడకుండా దాగిపోవు. ‘అన్యాయం’ అనేది ఏకాలంలో జరిగినా, అది అన్యాయమే. అన్యాయం అనేది. న్యాయం ఎప్పుడూ అవదు.
 
సినిమా వాళ్లకే కాదు, మనకూ ఈ జబ్బు!

- డా. నాగసూరి వేణుగోపాల్

 సినిమా వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది- అనే శీర్షికలో రంగనాయకమ్మ రాసిన వ్యాసం ప్రచురించి చాలా మంచి పని చేశారు. అరశతాబ్దం నుంచి ఈ ‘స్వర్గసీమ’ సినిమా గురించి చాలా సందర్భాలలో, చాలా మంది చర్చించడం మనకు తెలుసు! బిఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభ, భానుమతి గానం, నటన; నాగయ్య సామర్థ్యం, రజనిగారి సంగీత వరుసలు... ఇలా చాలా చోట్ల ‘స్వర్గ సీమ’ గురించి ప్రస్తుతిస్తారు. కానీ కథా వస్తువు ఇలా ఉందనే చర్చ ఈ పాతిక, ముప్పయ్యేళ్ళతో జరిగినట్టు కనబడలేదు. అంతకు ముందు జరిగిందేమో నాకు తెలియదు.

 ‘స్వర్గసీమ’ అనబడే గొప్ప సినిమాలో కథావస్తువు ఇంత అర్థరహితంగా ఉందా? అనే సందేహం భయంకరంగా ఆందోళన కలిగిస్తున్నది! అందరూ గొప్పది అంటున్నారు - మనం కూడా అందాం. అందరూ ఆలోచించకుండా చూస్తున్నారు - మనం కూడా అలాగే చూద్దాం... అనే రీతిలో ఐదారు దశాబ్దాలు అప్రతిహతంగా సాగిపోవడం చాలా విచిత్రంగా ఉంది. దేన్ని అయినా దాని అసలు విలువతోనే చూడాలి. అలా చూడకపోవడం, చూడలేకపోవడం గురించి మనం చర్చించుకోవాలి. ఇలాంటి దృష్టి లేకుండా ఎందుకు మనం సాగిపోతున్నామో కూడా తర్చించుకోవాలి.
 
కొత్త పుస్తకాలు పక్కనపెట్టి ఈ పాత సినిమా చూశానని రంగనాయకమ్మ తన వ్యాసంలో పేర్కొన్నారు. నిజంగా మంచి పని చేశారు. పుస్తకాలు మేధావులకు, సినిమాలు మామూలు జనాలకు అనే అభిప్రాయం ఉంది. నిజానికి ప్రభావం విషయంలో సినిమాలతో పుస్తకాలను పోల్చలేం. సకల కళల సమాహారమైన సినిమా సాంకేతిక సౌలభ్యంతో విచ్చుకుపోతోంది. వస్తువు తుక్కుగా ఉన్నా ఇతర దినుసులతో - ఇంకా మాట్లాడితే స్వర్గసీమలాగానే విజయవంతమవుతోంది. కనుక పుస్తకాలతో సినిమాలను అసలు పోల్చలేం. పుస్తకం కూడా సాంకేతిక విజ్ఞానం తోడ్పాటుతో నేడు మరిన్ని సౌలభ్యాలతో సాగుతోంది. అయినా కూడా సినిమా సాధించుకున్న తీరుతో పోల్చలేం. కనుక సినిమా ప్రభావం చాలా చాలా ఎక్కువ!
 
రచయితలు, మేధావులు అనుకుంటే పాత సినిమాలతో పాటు కొత్త సినిమాలు సైతం చర్చ అవుతాయి. ఇప్పుడు కరపత్రం వేసి, అదనంగా ఖర్చు పెట్టనక్కరలేదు. ఈ మెయిళ్ళు, ఫేస్‌బుక్, బ్లాగులు వగైరా టెక్నాలజి కూడా పత్రికల ఉత్తరాల శీర్షికతో పాటు అందుబాటులో ఉంది.
 
ఈ విషయాలను స్థూలంగా మాట్లాడినప్పుడు కనీసం పుస్తకాలనైనా కూలంకషంగా మనం తర్కిస్తున్నామా? అనే ఆలోచన వస్తుంది. ‘స్వర్గసీమ’ గురించి మనందరి కళ్ళు తెరిపించిన రంగనాయకమ్మ కొంతకాలం క్రితం అచ్చంగా ఇలాంటిపనే మరొకటి చేశారు. కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన ‘సైన్స్ వ్యాసాలు’లో అర్థరహితమైన విషయాలు గురించి ఇలాంటి వ్యాసం ద్వారా బట్టబయలు చేశారు. ఆ పుస్తకం వెలువడి దశాబ్దం దాటినా - కొ.కు.లోని హేతురాహిత్యాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. రంగనాయకమ్మ ఆ పుస్తకం దుమ్ము దులిపారు. కానీ తర్వాత జరిగిన చర్చ సమగ్రమైంది కాదు.

కొత్తదయినా, పాతదయినా సినిమా అయినా, పుస్తకమైనా నిరంతరం పరిశీలించబడాల్సిందే! సమాజంలో ఎక్కువ మందికి దోహదపడే విషయాలుంటే  వాటి గురించి ప్రస్తావించి ప్రాచుర్యంలోకి తేవాలి. అలాగే సమాజానికి పనికిరాని, హాని కల్గించే విషయాలను ఎక్కడున్నా పట్టుకొని, తప్పక బట్టబయలు చేయాలి, తూర్పారబట్టాలి!
 
 
పాఠకులకు ఆహ్వానం
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ  చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు.  మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ,
సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34  ఇ-మెయిల్: sakshireaders@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement