శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో ఎవరూలేరని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టుల్లో ఒక్కటైనా చంద్రబాబు పూర్తిచేసి ప్రారంభించిన దాఖలాల్లేవన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించి విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది.
2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారాలు అందించి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు వంశధార ఫేజ్–2, స్టేజ్–2ని, ఆఫ్‌షోర్ వంటి పనులను ప్రారంభించింది వైఎస్సార్ అని, వాటిని పూర్తిచేసేందుకు వైఎస్ జగన్ నిధులు కేటాయించారు. హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల నీరు చేరేలా లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతులిచ్చారు.
అలాగే, నేరడి బ్యారేజీ అడ్డంకులు తొలగించేందుకు ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు జగనన్నే స్వయంగా వెళ్లారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు అన్ని పనులు చేస్తున్నాం. జిల్లాలోని అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్‌లు ఏనాడైనా జిల్లాలో ప్రాజెక్టులపై దృష్టిపెట్టారా? నిర్వాసితుల పరిహారాలను తెలుగు తమ్ముళ్లు మింగేయలేదా? ఇక వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు శరవేగంగా చేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వైఎస్సార్ హయాంలో ప్రారంభిస్తే ఇద్దరు సీఎంలు మారినా ఏ ఒక్కరూ పట్టించుకోకుండా గాలికొదిలేశారు.
బాబు, పవన్‌లకు ఎందుకంత కోపం..
విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తున్నామనే అక్కసుతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌లు రాద్ధాంతం చేస్తున్న తీరుచూస్తే ఉత్తరాంధ్ర ప్రజలపై ఎంత కోపం ఉందో అర్థమవుతోంది. విశాఖలో పవన్, శ్రీకాకుళం జిల్లాలో బాబు ఒకేరోజు సందర్శించి ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణం జగన్ అని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రం విభజనకు చంద్రబాబే సహకరించి ఇప్పుడు ఏమీ తెలియనట్లు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక విద్యుత్, గ్యాస్, పెట్రోలు, నిత్యావసర ధరల పెంపు దేశవ్యాప్తంగా ఉన్నాయా ఒక్క ఏపీలోనే ఉన్నాయా అనేది ప్రజలందరూ గమనించాలి.
Comments
Please login to add a commentAdd a comment