
న్యూఢిల్లీ: బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రకటనను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, ఇది భారత రాజ్యాంగంపై దాడేనని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని ఎన్నికల్లో గెలవగానే ఎంపీలతో ప్రమాణం చేయించాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనను కాంగ్రెస్ కోరుతోందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు కాని వ్యక్తి వ్యాఖ్యలపై సభలో చర్చ ఎందుకని కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.
విభజన ఆలోచనను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అన్నారు. డీకే అనుచితంగా మాట్లాడినట్లు తేలితే సభా హక్కుల కమిటీ చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా ఆదరణ ఉందంటూ ఎన్నికలను శాశ్వతంగా రద్దు చేయడం ఖాయమంటూ దుయ్యబట్టారు. లోక్‌సభ సభ్యుల వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చించవచ్చని గతంలోనే ఆదేశాలిచ్చానని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు.