H
-
‘ప్రత్యేక దేశం’ వ్యాఖ్యలపై పార్లమెంట్లో రగడ
న్యూఢిల్లీ: బడ్జెట్లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రకటనను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, ఇది భారత రాజ్యాంగంపై దాడేనని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని ఎన్నికల్లో గెలవగానే ఎంపీలతో ప్రమాణం చేయించాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనను కాంగ్రెస్ కోరుతోందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు కాని వ్యక్తి వ్యాఖ్యలపై సభలో చర్చ ఎందుకని కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. విభజన ఆలోచనను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అన్నారు. డీకే అనుచితంగా మాట్లాడినట్లు తేలితే సభా హక్కుల కమిటీ చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా ఆదరణ ఉందంటూ ఎన్నికలను శాశ్వతంగా రద్దు చేయడం ఖాయమంటూ దుయ్యబట్టారు. లోక్‌సభ సభ్యుల వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చించవచ్చని గతంలోనే ఆదేశాలిచ్చానని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. -
చైనా గోడ దూకినా తప్పు లేదు...
‘‘ఈ మనసుందే.. అది ప్రేమించే వరకు బాగానే ఉంటుంది. కానీ ప్రేమించగానే ఆలోచించడం మానేస్తది. తనకోసం ఏమైనా చేసేయొచ్చు.. ఏమడిగినా ఇచ్చేయొచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినప్పుడు తన మోహం మీద వచ్చే చిరునవ్వు, అది చూసి మన మనసులో కలిగే అనందం. అబ్బబ్బబ్బా... దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్గాడి గోడ ఏంటి? పక్క దేశం చైనా గోడ దూకినా తప్పులేదు..’’ అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్‌తో ‘నా సామిరంగ’లోని భాస్కర్ లవ్‌స్టోరీ వీడియో విడుదలైంది. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా, మరో హీరోయిన్ రుక్సార్ కీలక పాత్రలో నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్, కుమారి పాత్రలో రుక్సార్, వరలక్ష్మి పాత్రలో ఆషికా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటించిన భాస్కర్ పాత్ర తాలూకు వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి. -
హెలిప్యాడ్‌ను అలానే ఎందుకు రూపొందిస్తారో తెలుసా?
ఆకాశంలో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లను మనమంతా చూసేవుంటాం. విమానాలు ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే అవసరం అవుతుంది. హెలికాప్టర్లు ఎక్కడైనా ల్యాండ్ అవుతాయి.అయితే హెలికాప్టర్ ఆగేందుకు నిర్దేశిత ప్రదేశంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.ఇది వృత్తాకారంలో కనిపిస్తుంది. దీనిలోపలనే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అయితే ఈ వృత్తాకారం లోపల ఇంగ్లీషు బాషలోని హెచ్ అక్షరం రాసివుంటుంది. ఇలా ఎందుకు రాస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని అన్ని దేశాలలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేప్రాంతంలో హెచ్ అని రాసివుంటుంది. హెలికాప్టర్లను వీవీఐపీలు వినియోగిస్తారనే సంగతి మనకు తెలిసిందే. హెలికాప్టర్ల వినియోగానికి సంబంధించి పలు దేశాల్లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు ఒక్కోసారి హెలిప్యాడ్లను తయారు చేస్తుంటారు. దీనిలో రూపొందించే హెచ్ ఆకారం హెలికాప్టర్ నడిపే పైలెట్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. దీని కారణంగానే హెలికాప్టర్ ముందుభాగం, వెనుకభాగం ఎటువైపు ఉంచాలనేది పైలెట్‌కు తెలుస్తుంది. దీనిని తగిన రీతిలో నిలిపివుంచడం వలన హెలికాప్టర్లో ప్రయాణించేవారికి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. సాధారణంగా వీవీఐపీ కేటగిరీలోకి వచ్చేవారు ఎంతో బిజీగా ఉంటారు. వీరి సమయం వృథాకాకుండా ఉండేందుకు కూడా హెలిప్యాడ్ రూపకల్పన ఉపకరిస్తుంది. చదవండి: ‘స్నేక్ వైన్’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే... -
అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించం
జమ్మూ: జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. సాధారణ పౌరులను ముష్కరులు హత్య చేస్తున్నారని, ఇలాంటి ఘోరాలకు చరమగీతం పాడుతామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ప్రధాని మోదీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఇప్పటికే 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 నాటికి మరో రూ.51,000 కోట్ల పెట్టుబడులు రప్పిస్తామని, వీటితో జమ్మూకశ్మీర్‌లో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం జమ్మూకశ్మీర్‌కు వచ్చిన అమిత్ షా ఆదివారం భగవతీ నగర్లో ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల పాటు ఇక్కడ పరిపాలన సాగించిన మూడు కుటుంబాలు ప్రజలకు చేసిందేమీ లేదని పరోక్షంగా కాంగ్రెస్, నేషనల్, కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)పై మండిపడ్డారు. ఈరోజు రూ.15,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, ఆ మూడు కుటుంబాలు కలిసి వారి మొత్తం పాలనా కాలంలో ఇలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. అమిత్ షా ఆదివారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో సంభాషించారు. మీ కుటుంబాల బాగోగులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్కగా చూసుకుంటుందని, ఎలాంటి ఆందోళన చెందకుండా దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. సరిహద్దులోని చిట్టచివరి కుగ్రామం మక్వాల్‌లో అమిత్ షా పర్యటించారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు గ్రామస్తులతో చెప్పారు. ఐఐటీ కొత్త క్యాంపస్ ప్రారంభం రూ.210 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–జమ్మూ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. -
విదేశీ కోచ్‌లు కాదు... వ్యవస్థ బాగుండాలి
న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విదేశీ కోచ్‌ల రాకతో మొత్తం మారిపోతుందనుకుంటే పొరపాటని... ముందు వ్యవస్థ బాగుంటేనే అన్ని బాగుంటాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ‘మన క్రీడా ప్రగతికి విదేశీ కోచ్‌లు కీలక భూమిక పోషిస్తారు. నిజానికి వారి సేవలు అవసరం కూడా.... భిన్నదేశాలకు చెందిన కోచ్‌ల మేళవింపు మనకు మేలు చేస్తుంది. క్రీడల్లో మనకు నైపుణ్యం లేని చోట ప్రారంభ దశలో విదేశీ సహాయ బృందాలు కావాల్సిందే. అయితే విజయవంతంగా రాణిస్తున్న జట్లకూ విదేశీ కోచ్‌లే ఉండాలంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. దీని వల్ల మన వ్యవస్థకు న్యాయం జరగదు. విదేశీ కోచ్‌లను సలహాదారులుగా వినియోగించుకోవచ్చు. కానీ ముఖ్యమైన కోచింగ్ బాధ్య తలు, అధికారాలు స్వదేశీ కోచ్‌లకే అప్పజెప్పాలి. ఆటగాళ్లు విదేశీ కోచ్‌ల నుంచి నేర్చుకోవడం ముఖ్యమే. అలాగే ఎప్పుడో ఒకప్పుడు వాళ్లను వదులుకోవాలి. ఎందుకంటే వాళ్లు మనల్ని ద్వితీయ శ్రేణి జట్టుగానే తయారు చేస్తున్నారు. కారణం వాళ్లూ ద్వితీయ శ్రేణి కోచ్‌లే! వాళ్ల దేశంలోని అత్యుత్తమ కోచ్‌లు వారి ఆటగాళ్లకు సేవలందిస్తారు. రెండో ఉత్తమ కోచ్‌లు ఇతర దేశాలకు తరలి వెళతారు’ అని ఆయన వివరించారు. -
నవమికి రాముడు?
‘ఆదిపురుష్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్ , రావణుడి ప్రాతలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. శ్రీరామ నవమి పండగ సందర్భంగా వచ్చే నెల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రదర్శకుడు ఓం రౌత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ఏప్రిల్ రెండోవారం వరకు జరగుతుందని సమాచారం. -
రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి రావాలని ఎన్నడూ అనుకోలేదని ప్రధాని మోదీ వెల్లడించారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఒక భాగమై, దేశ ప్రజలకు సాధ్యమైనంత మేరకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సహనం, సంయమనం, పరిణతి చూపిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రధాని ఆకాశవాణిలో మాసాంతపు ‘మన్ కీ బాత్’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ (నేషనల్ కేడెట్ కార్ప్స్) కేడెట్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ‘రాజకీయాల్లోకి ప్రవేశించాలని కానీ, రాజకీయాల గురించి కానీ ఎన్నడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు రాజకీయ నేతగా మారా. దేశ సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నా. దేశ సేవకే పూర్తిగా అంకితమైపోయా’అని ప్రధాని తెలిపారు. ‘చదవడం నాకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతా. అప్పుడప్పుడు సినిమాలు, చాలా తక్కువగా టీవీ చూస్తుంటా. కానీ, గూగుల్ ప్రభావం పుస్తక పఠనంపై పడింది. ఏ విషయం గురించి అయినా గూగుల్‌లో వెంటనే తెలుసుకోవచ్చు. అందుకే పుస్తకాలు చదవడం తగ్గిపోయింది’ అని అన్నారు. ‘పాఠశాల రోజుల్లో ఎన్సీసీ కేడెట్‌గా చాలా క్రమశిక్షణతో ఉండేవాడిని. అందుకే ఎన్నడూ శిక్షకు గురికాలేదు. ఓసారి చెట్టు కొమ్మపై గాలిపటం దారంలో ఇరుక్కున్న పావురాన్ని రక్షించేందుకు చెట్టెక్కా. పై అధికారి నన్ను శిక్షిస్తారని అక్కడున్న వారంతా అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు’అని చిన్ననాటి ఘటనను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. అయోధ్య తీర్పు అనంతర పరిస్థితులపై ప్రధాని మాట్లాడుతూ.. ‘జాతి ప్రయోజనాలకే పెద్దపీట అని 130 కోట్ల మంది దేశ ప్రజలు మరోసారి నిరూపించారు. ఆ తీర్పును విశాల హృదయంతో ఆహ్వానించారు. సహనం, సంయమనం, పరిణతి చూపిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ఐకమత్యం, శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. విశాఖ స్కూబా డైవర్లకు ప్రధాని ప్రత్యేక ప్రశంసలు పర్యావరణం, సుముద్ర జీవుల పరిరక్షణకు విశాఖకు చెందిన ‘ప్లాటిపస్ ఎస్కేప్’అనే సంస్థకు చెందిన స్కూబా డైవర్లు చేస్తున్న కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ వీరిని మన్ కీ బాత్‌లో ప్రశంసిం చారు. వీరు తీరానికి 100 మీటర్ల దూరంలో సుముద్ర గర్భం లోపలికి వెళ్లి అక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగిస్తున్నారని, రెండు వారాల్లో 4 వేల కేజీల ప్లాస్టిక్‌ను తొలగించినట్లు తనకు తెలిసిందని ప్రధాని వివరించారు. ఈ ప్రక్రియలో స్కూబా డైవర్లకు స్థానికులు సహకరిస్తున్నారని, వీరి చిరు ప్రయత్నం ఇప్పుడు ఉద్యమంగా మారుతోందన్నారు. -
గురి తప్పని చికిత్స
విశాఖ మెడికల్: గిరిజన మహిళ కంటి నుంచి మెదడులోకి గుచ్చుకున్న బాణాన్ని కేజీహెచ్ న్యూరో సర్జరీ, ప్రాంతీయ కంటి ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. చూపు తీసుకురాడానికి విఫలయత్నం చేశారు. ఈనెల 12 కేజీహెచ్ అత్యవసర ఆపరేషన్థియేటర్లో జరిగిన క్లిష్టమైన శస్త్ర చికిత్సను ఏకకాలంలో న్యూరోసర్జరీ, కంటి వైద్యులు నిర్వహించారు. జీకేవీధి మండలం లంకపాకల గ్రామానికి చెందిన 40ఏళ్ల జి.సుభద్రపై భర్త తాగిన మైకంతో ఈనెల 11న బాణంతో దాడి చేశాడు. బాణం ఆమె కుడికంటిలోంచి మెదడులోని టెంపోరల్ లోబ్లోకి చొచ్చుకుపోయింది. గుచ్చుకున్న బాణాన్ని తీసే క్రమంలో బాణం నుంచి పుల్ల వేరుకావడంతో అదే రోజు ఆమెను జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం 12వ తేదీ సాయంత్రం కేజీహెచ్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆమెకు ఎక్స్‌రే, సీటీస్కాన్లు నిర్వహించిన అనంతరం అత్యవసర ప్రాతిపదికన రెండు గంటలు శ్రమించి మెదడులోకి చొచ్చుకుపోయిన బాణాన్ని ప్రాణహాని లేకుండా బయటకు తీశామన్నారు. ఈ శస్త్రచికిత్సను న్యూరోసర్జరీ విభాగాధిపతి కె.సత్యవరప్రసాద్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహరావు ఆధ్వర్యంలో వైద్యులు నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.మదుసూదనబాబు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సూపరింటెండెంట్ పేర్కొన్నారు.