గురి తప్పని చికిత్స
విశాఖ మెడికల్: గిరిజన మహిళ కంటి నుంచి మెదడులోకి గుచ్చుకున్న బాణాన్ని కేజీహెచ్ న్యూరో సర్జరీ, ప్రాంతీయ కంటి ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. చూపు తీసుకురాడానికి విఫలయత్నం చేశారు. ఈనెల 12 కేజీహెచ్ అత్యవసర ఆపరేషన్‌థియేటర్‌లో జరిగిన క్లిష్టమైన శస్త్ర చికిత్సను ఏకకాలంలో న్యూరోసర్జరీ, కంటి వైద్యులు నిర్వహించారు. జీకేవీధి మండలం లంకపాకల గ్రామానికి చెందిన 40ఏళ్ల జి.సుభద్రపై భర్త తాగిన మైకంతో ఈనెల 11న బాణంతో దాడి చేశాడు. బాణం ఆమె కుడికంటిలోంచి మెదడులోని టెంపోరల్ లోబ్‌లోకి చొచ్చుకుపోయింది.
గుచ్చుకున్న బాణాన్ని తీసే క్రమంలో బాణం నుంచి పుల్ల వేరుకావడంతో అదే రోజు ఆమెను జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం 12వ తేదీ సాయంత్రం కేజీహెచ్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆమెకు ఎక్స్‌రే, సీటీస్కాన్‌లు నిర్వహించిన అనంతరం అత్యవసర ప్రాతిపదికన రెండు గంటలు శ్రమించి మెదడులోకి చొచ్చుకుపోయిన బాణాన్ని ప్రాణహాని లేకుండా బయటకు తీశామన్నారు.
ఈ శస్త్రచికిత్సను న్యూరోసర్జరీ విభాగాధిపతి కె.సత్యవరప్రసాద్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహరావు ఆధ్వర్యంలో వైద్యులు నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.మదుసూదనబాబు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సూపరింటెండెంట్ పేర్కొన్నారు.