మోకాలి ఎముకల తాలూకు మృదులాస్థి (కార్టిలేజ్) అరిగాక... మోకాలి కదలికల్లో ఒకదానితో మరొకటి ఒరుసుకుంటే తీవ్రమైన నొప్పి రావడం... ఈ అరుగుదల తీవ్రత నాలుగో దశకు చేరాక మోకాలి మార్పిడి (నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ) అవసరం ఏర్పడటం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లో చేసే నీ రీప్లేస్‌మెంట్ చికిత్సల స్థానంలో ఇప్పుడు రోబో సహాయంతో శస్త్రచికిత్స (రోబోటిక్ సర్జరీ) వంటి అధునాతన పద్ధతులు అమల్లోకొచ్చాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్(Robots ) నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ(knee Replacement Surgery)తో ఉండే సౌలభ్యాలూ, అనుకూలత గురించి తెలుసుకుందాం.
మోకాలి ఎముకల అరుగుదల అనేక విధాలుగా జరుగుతుంది. ఈ అరుగుదలను ఆర్థరైటిస్‌గా పేర్కొంటారు. ఇందులో దశలు ఉంటాయి. ఒకదశ దాటాక (నాలుగో దశ) ఇక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స వల్లనే నొప్పి తగ్గుతుంది. గతంలోనూ... ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల అనేక శస్త్రచికిత్స పద్ధతుల్లో వచ్చినట్టే మోకాలి మార్పిడి చికిత్సల్లో సైతం రోబోటిక్ సర్జరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
అందునా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేస్తూ... అత్యంత సునిశితంగా (ప్రెసిషన్‌తో) శస్త్రచికిత్స చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక రోబోల సహాయాన్ని వైద్యులు తీసుకుంటున్నారు. సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే ఈ అధునాతన పద్ధతిలో జరిగే శస్త్రచికిత్సతో ప్రయోజనాలేమిటో చూద్దాం.
కృత్రిమ పరికరాలు చాలాకాలం పాటు మన్నడం : లోపల అమర్చాల్సిన పరికరాలను చాలా సునిశితత్వంతో అత్యంత ఖచ్చితమైన స్థానాల్లో అమర్చడం వల్ల అవి త్వరగా రాసుకుపోవడం, ఒరుసుకు΄ోవడం జరగవు. దాంతో చాలాకాలం పాటు మన్నికతో ఉంటాయి.
తక్కువ నొప్పి: రోబోటిక్ శస్త్రచికిత్సలో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది.
చాలా తక్కువ దుష్ప్రభావాలు: చాలా ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స జరిగిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వంటి దుష్ప్రభావాలు రావడం చాలా తక్కువ.
టైలర్ సర్జికల్ అప్రోచ్ : అందరి దేహ భాగాలూ, వాటితో పనిచేసే తీరుతెన్నులు ఒకేలా ఉండవు. దాంతో బాధితుల మోకాలి చుట్టూ ఉండే టెండన్లు, లిగమెంట్లు సరిగ్గా అమరి΄ోయేలా వారి అవసరాలకు తగ్గట్లుగా కృత్రిమ ఉపకరణాల రూపకల్పన, లోపల వాటి అమరిక అత్యంత ఖచ్చితత్వంతో జరగడంతో గతంలోని వారి వ్యక్తిగత అవయవం లాగానే మోకాలి భాగాలు అమరిపోతాయి. ఇంకా చెప్పాలంటే సంప్రదాయ చికిత్సలో శస్త్రచికిత్స చేసి లోపలి భాగాలను చూసేవరకు కండరాల పరిస్థితి అంతగా తెలియదు.
అనుభవజ్ఞులైన శస్త్రచికిత్స నిపుణులు తమ అంచనా ప్రకారం శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అయితే రోబోటిక్ సర్జరీలో కండరాల తీరుతెన్నులు శస్త్రచికిత్స ముందే స్పష్టంగా తెలుస్తాయి. ఫలితంగా ఖచ్చితమైన శస్త్రచికిత్సకు అవకాశం దొరుకుతుంది.
దాంతో శస్త్రచికిత్స తర్వాత మోకాలు ముందుకూ వెనక్కు కదలడం (ఎక్స్‌టెన్షన్, ఫ్లెక్షన్) వంటి కదలికలు చాలా బాగుంటాయి. అందునా మోకాలి దగ్గర వంగడం అనేది సంప్రదాయ చికిత్స కంటే మరింత ఎక్కువగా ఉంటుంది. బాగుంటుంది. మోకాలు ఒంచేటప్పుడు సైతం నొప్పి చాలా తక్కువ.
వేగంగా కోలుకోవడం
రోబోటిక్ శస్త్రచికిత్స అత్యంత సునిశితత్వంతో జరగడంతో గాయం చాలా త్వరగా తగ్గుతుంది. ఇక దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా చాలా తక్కువగా ఉండటం ఫలితంగా చాలా వేగంగా కోలుకుని, చాలా త్వరగా ఇంటికెళతారు.
మరింత ఎక్కువ సునిశితత్వం
ఇలాంటి అత్యాధునిక రోబోల సహాయంతో చేసే శస్త్రచికిత్సలో సర్జన్‌ల ముందర బాధితుల తాలూకు మోకాలి 3–డి ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. సంప్రదాయ చికిత్సల్లో ఇది అంత పూర్తిగా, స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఫలితంగా కృత్రిమ మోకాలి ఎముకల భాగాల్ని అమర్చేటప్పుడు మునుపు ఉన్నట్లే సరిగ్గా అమరిపోయేలా అమర్చడానికి వీలవుతుంది.
ఎవరికి
ఈ శస్త్రచికిత్సలు
గతంలో శస్త్ర చికిత్స చేయించుకుని విఫలమైనవాళ్లు (వీళ్లలో మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా ఉండటం, కాలు కదిలిస్తున్నప్పుడు నొప్పి ఉండటం వంటి లక్షణాలుంటాయి), అరుగుదల చాలా ఎక్కువగా (సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్) ఉన్నవారికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతుండేవారికి, అలాగే ఇక నొప్పి నివారణ మందులూ, ఇతర చికిత్సలు పనిచేయని వారికి ఈ రోబోటిక్ శస్త్రచికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది.
(చదవండి: ఆ టైమ్‌లోనూ ఐరన్ యువతిలా...)
Comments
Please login to add a commentAdd a comment