మీడియాతో మాట్లాడుతున్న డీకే అరుణ.చిత్రంలో రఘునందన్‌రావు, రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని, బీజేపీ నేతలను అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. గులాబీ కండువాలు కప్పుకున్న కార్యకర్తల మాదిరిగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తమపై కక్ష సాధింపునకు పాల్పడుతున్న పోలీసు అధికారుల పేర్లను బీజేపీ కార్యకర్తలు రాసిపెట్టుకోవాలని కోరారు.
‘వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. అతి చేసిన పోలీసుల రుణం ఏ మాత్రం ఉంచుకోకుండా వారి సంగతి చూద్దాం..వారి లెక్కలు సరిచేద్దాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్‌కు ఎందుకింత భయం? అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారా? మీ బెదిరింపులకు బీజేపీ భయపడదు. గత ఎన్నికల్లోనూ పోలీసులతోనే గెలిచామని, రాబోయే ఎన్నికల్లో కూడా గెలుస్తామనే అహంకారంతో ఉన్న మిమ్మల్ని భరించే ప్రసక్తే లేదు.. ఖబడ్దార్ కేసీఆర్.. నిన్ను ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు రోజులు లెక్క పెడుతున్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
వెంకటరమణారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు?
కామారెడ్డిలో జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేసి రోజంతా ఎక్కడెక్కడో తిప్పారని, అసలు ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గజ్వేల్ అభివృద్ధి మాదిరే కామారెడ్డి కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో గజ్వేల్ అభివృద్ధిని చూసివద్దామని అనుకున్న వెంకటరమణారెడ్డిని అక్కడకు వెళ్లకుండా అక్రమంగా అడ్డుకున్నారని విమర్శించారు.
‘సీఎం కేసీఆర్ గజ్వేల్ ను నిజంగా అబివృద్ధి చేస్తే అయనను ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడ అభివృద్ధి జరగలేదనే విషయం బయట పడుతుందని భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. గజ్వేల్ ఏమీ కేసీఆర్ ఫామ్‌హౌజ్ కాదు కదా... అని ఆమె నిలదీశారు. వెంటనే వెంకటరమణా రెడ్డిని విడుదల చేసి గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మార్చిన చరిత్ర కేసీఆర్‌దేనని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment