కొన్నాళ్ళ కిందట ఒక ఇంటర్వ్యూ చూశాను. సెక్స్ వర్కర్ల సంఘానికి ప్రతినిధిగా వున్న ఒక స్త్రీ ఇచ్చిన ఇంటర్వ్యూ అది. వ్యభిచారాన్ని ఒక పని (వర్క్) గానూ, ఆ పని చేసే వారిని ‘సెక్సు వర్కర్లు’ గానూ, గుర్తించి, వారిని సానుభూతితో కాక గౌరవంగా చూడాలని ఆ ఇంటర్వ్యూ సారాంశం. ఇలాంటి వాదన, కొత్త దేమీ కాదు. పాతికేళ్ళ కిందట (1997లో) కలకత్తా లోని ఒక మహిళా సంఘం వారు ‘‘సెక్స్ వర్కర్స్ మానిఫెస్టో’’ అని ఒక ప్రణాళికనే విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చేసిన వాదనలు గానీ, చూపిన పరిష్కారాలు గానీ, ఆడ వాళ్ళని మరింత అధోగతికి దిగజార్చేవిగా ఉన్నాయి. క్లుప్తంగా కొన్నిటిని చూద్దాం.
(1) ‘సెక్సు’ని ఒక ‘పని’గా, ఒక ‘వృత్తి’గా అనడం పచ్చి వ్యాపార దృష్టి! స్త్రీలని ‘సెక్స్ ఆబ్‌జెక్ట్స్’గా (‘భోగ్య వస్తువు’గా), తిరుగుబోతు పురుషులకు అందుబాటులో ఉంచడం తప్పులేదనే దృష్టి అది! ఇలాంటి దృష్టిని ‘పితృస్వామ్య’ దృష్టి అనీ, ‘పురుషాధిక్య భావజాలం’ అనీ అనొచ్చు. కానీ, ఇక్కడ ఆ భావాల్ని ప్రకటించినది, పురుషుడు కాదు, ఒక స్త్రీ! అంటే, జీవశాస్త్ర పరంగా స్త్రీలు, పురుషుల నించీ వేరుగా ఉంటారే గానీ, సామాజికంగా స్త్రీల భావాలు, పురుషుల భావాల నించీ తేడాగా ఉండవని అర్ధం! కట్నం కోసం వేధించే వాళ్ళూ, వ్యభిచార గృహాలు నడిపే వాళ్ళూ ప్రధానంగా స్త్రీలే కదా?
(2) వ్యభిచారాన్ని ఒక ‘వృత్తి’గా చెప్పే సంస్కర్తలు, సమాజంలో, స్త్రీ పురుషుల సంబంధాలు ఎలా ఉండాలని చెపుతున్నారు? ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం కేవలం శారీరక సంబంధమేనా? ఒక కుటుంబంగా ఉండడమూ, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరూ బాధ్యతలు పంచుకోవడమూ ఉండాలా, అక్కరలేదా? డబ్బు– ఆదాయ దృష్టితో వ్యభిచారాన్ని సమర్ధిస్తే, ఇంకా మానవ సంబంధాల నేవి ఎలా ఉంటాయి?
(3) వ్యభిచారిణుల్ని ‘కార్మికులు’గా గుర్తించమని పోరాడుతున్నారట! పోరాటాలు జరగాల్సింది, ‘ఒళ్ళమ్ము కుని’ బ్రతికే నీచ స్థితి నించీ తప్పించి, గౌరవంగా బ్రతికే ఉద్యోగాలు చూపించమనే డిమాండుతో!
(4) ఆర్ధిక అవసరాల వల్ల బ్రతుకుతెరువు కోసం ఈ ‘పని’లోకి వస్తున్నారని ఈమె చెపుతున్నారు. అంటే గతి లేకే వస్తున్నట్టు కాదా? మరి, ‘స్వచ్ఛందంగా’ వస్తున్నారని సమర్ధించుకోవడం ఏమిటి?
(5) ‘భర్త బాధ్యతగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువగా వస్తుంటారు’ అని అంటున్నారు. కానీ, భర్తలు బాధ్యతగా లేని సంసారాలు అనేక లక్షలుంటాయి. ఆ స్త్రీలందరూ ఇదే వ్యభిచారాన్ని బ్రతుకుతెరువుగా చేసుకుంటు న్నారా? చేసుకోవాలా?
(6) ‘మా వాళ్ళెవరూ, ఈ పనిని బ్రతుకుతెరువుకోసమే గానీ ఆదాయ వనరుగా చూడర’ని ఒక పక్క చెపుతూ, ఇంకో పక్క పాచి పనుల వల్ల వచ్చే ఆదాయం పిల్లల్ని ఇంజనీ రింగూ, మెడిసినూ చదివించడానికి సరిపోదనడం అంటే, వ్యభిచారాన్ని (‘ఈ పనిని’) ఆదాయ వనరుగా చూడ్డం కాదా?
(7) ‘పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పిందంటున్నారు. పరస్పరం అంగీకారమైతే, ఒకరు మాత్రమే డబ్బులివ్వడం, ఇంకోరు తీసుకోవడమెందుకు? ఇద్దరికీ అది శృంగారమైతే, ఆ మొగవాడే ఆ ఆడదానికి డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఆడది కూడా, ఆ మగవాడికి డబ్బు ఇవ్వాల్సిందే కదా? అలా ఎందుకు జరగదు?
(8) వ్యభిచారిణులు, ఆ ‘వృత్తి’ ద్వారా డబ్బు చక్కగా సంపాదించి, పిల్లల్ని డాక్టర్లనీ, ఇంజనీర్లనీ చెయ్యగలుగు తున్నారట! ఈ పాతికవేల మందీ, తమ పిల్లల్లో ఒకటి రెండు వందల మంది పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేశారను కుందాం. అన్ని వేలల్లో, మిగతా పిల్లల సంగతి ఏమిటి? అయినా తమ పిల్లల్ని డబ్బు సంపాదించే ఉద్యోగులుగా చేయడానికేనా ఆ తల్లులు వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించేది? డబ్బు బాగా సంపాదించకుండా, మాములు కూలి పనులతో, పేదరికంతో బ్రతికే స్త్రీలను మూర్ఖులుగా అనుకోవాలా? (క్లిక్: అబార్షన్ హక్కుకు గొడ్డలిపెట్టు)
(9) చివరికి చెప్పుకోవాలిసిన మాట, గౌరవాలకు తగిన నడతలకే గౌరవాలు దొరుకుతాయి గానీ, వ్యభిచారాలూ, దొంగతనాలూ, హత్యలూ వంటి ‘వృత్తులకు’ గౌరవాలు ఏ సమాజంలోనూ దొరకవు. దాన్ని డబ్బు పోసి కొనలేరు. వ్యభిచారిణుల పిల్లలైనా, వాళ్ళు కూడా అదే దారిలో వెళితే తప్ప, వాళ్లయినా, తల్లుల్ని గౌరవించరు! గౌరవించలేరు! గౌరవించకూడదు! (క్లిక్: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి)
- రంగనాయకమ్మ
సుప్రసిద్ధ రచయిత్రి
Comments
Please login to add a commentAdd a comment