Prostitution Profession
-
ఆ వృత్తులకు గౌరవాలు ఏ సమాజంలోనూ దొరకవు
కొన్నాళ్ళ కిందట ఒక ఇంటర్వ్యూ చూశాను. సెక్స్ వర్కర్ల సంఘానికి ప్రతినిధిగా వున్న ఒక స్త్రీ ఇచ్చిన ఇంటర్వ్యూ అది. వ్యభిచారాన్ని ఒక పని (వర్క్) గానూ, ఆ పని చేసే వారిని ‘సెక్సు వర్కర్లు’ గానూ, గుర్తించి, వారిని సానుభూతితో కాక గౌరవంగా చూడాలని ఆ ఇంటర్వ్యూ సారాంశం. ఇలాంటి వాదన, కొత్త దేమీ కాదు. పాతికేళ్ళ కిందట (1997లో) కలకత్తా లోని ఒక మహిళా సంఘం వారు ‘‘సెక్స్ వర్కర్స్ మానిఫెస్టో’’ అని ఒక ప్రణాళికనే విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చేసిన వాదనలు గానీ, చూపిన పరిష్కారాలు గానీ, ఆడ వాళ్ళని మరింత అధోగతికి దిగజార్చేవిగా ఉన్నాయి. క్లుప్తంగా కొన్నిటిని చూద్దాం. (1) ‘సెక్సు’ని ఒక ‘పని’గా, ఒక ‘వృత్తి’గా అనడం పచ్చి వ్యాపార దృష్టి! స్త్రీలని ‘సెక్స్ ఆబ్జెక్ట్స్’గా (‘భోగ్య వస్తువు’గా), తిరుగుబోతు పురుషులకు అందుబాటులో ఉంచడం తప్పులేదనే దృష్టి అది! ఇలాంటి దృష్టిని ‘పితృస్వామ్య’ దృష్టి అనీ, ‘పురుషాధిక్య భావజాలం’ అనీ అనొచ్చు. కానీ, ఇక్కడ ఆ భావాల్ని ప్రకటించినది, పురుషుడు కాదు, ఒక స్త్రీ! అంటే, జీవశాస్త్ర పరంగా స్త్రీలు, పురుషుల నించీ వేరుగా ఉంటారే గానీ, సామాజికంగా స్త్రీల భావాలు, పురుషుల భావాల నించీ తేడాగా ఉండవని అర్ధం! కట్నం కోసం వేధించే వాళ్ళూ, వ్యభిచార గృహాలు నడిపే వాళ్ళూ ప్రధానంగా స్త్రీలే కదా? (2) వ్యభిచారాన్ని ఒక ‘వృత్తి’గా చెప్పే సంస్కర్తలు, సమాజంలో, స్త్రీ పురుషుల సంబంధాలు ఎలా ఉండాలని చెపుతున్నారు? ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం కేవలం శారీరక సంబంధమేనా? ఒక కుటుంబంగా ఉండడమూ, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరూ బాధ్యతలు పంచుకోవడమూ ఉండాలా, అక్కరలేదా? డబ్బు– ఆదాయ దృష్టితో వ్యభిచారాన్ని సమర్ధిస్తే, ఇంకా మానవ సంబంధాల నేవి ఎలా ఉంటాయి? (3) వ్యభిచారిణుల్ని ‘కార్మికులు’గా గుర్తించమని పోరాడుతున్నారట! పోరాటాలు జరగాల్సింది, ‘ఒళ్ళమ్ము కుని’ బ్రతికే నీచ స్థితి నించీ తప్పించి, గౌరవంగా బ్రతికే ఉద్యోగాలు చూపించమనే డిమాండుతో! (4) ఆర్ధిక అవసరాల వల్ల బ్రతుకుతెరువు కోసం ఈ ‘పని’లోకి వస్తున్నారని ఈమె చెపుతున్నారు. అంటే గతి లేకే వస్తున్నట్టు కాదా? మరి, ‘స్వచ్ఛందంగా’ వస్తున్నారని సమర్ధించుకోవడం ఏమిటి? (5) ‘భర్త బాధ్యతగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువగా వస్తుంటారు’ అని అంటున్నారు. కానీ, భర్తలు బాధ్యతగా లేని సంసారాలు అనేక లక్షలుంటాయి. ఆ స్త్రీలందరూ ఇదే వ్యభిచారాన్ని బ్రతుకుతెరువుగా చేసుకుంటు న్నారా? చేసుకోవాలా? (6) ‘మా వాళ్ళెవరూ, ఈ పనిని బ్రతుకుతెరువుకోసమే గానీ ఆదాయ వనరుగా చూడర’ని ఒక పక్క చెపుతూ, ఇంకో పక్క పాచి పనుల వల్ల వచ్చే ఆదాయం పిల్లల్ని ఇంజనీ రింగూ, మెడిసినూ చదివించడానికి సరిపోదనడం అంటే, వ్యభిచారాన్ని (‘ఈ పనిని’) ఆదాయ వనరుగా చూడ్డం కాదా? (7) ‘పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పిందంటున్నారు. పరస్పరం అంగీకారమైతే, ఒకరు మాత్రమే డబ్బులివ్వడం, ఇంకోరు తీసుకోవడమెందుకు? ఇద్దరికీ అది శృంగారమైతే, ఆ మొగవాడే ఆ ఆడదానికి డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఆడది కూడా, ఆ మగవాడికి డబ్బు ఇవ్వాల్సిందే కదా? అలా ఎందుకు జరగదు? (8) వ్యభిచారిణులు, ఆ ‘వృత్తి’ ద్వారా డబ్బు చక్కగా సంపాదించి, పిల్లల్ని డాక్టర్లనీ, ఇంజనీర్లనీ చెయ్యగలుగు తున్నారట! ఈ పాతికవేల మందీ, తమ పిల్లల్లో ఒకటి రెండు వందల మంది పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేశారను కుందాం. అన్ని వేలల్లో, మిగతా పిల్లల సంగతి ఏమిటి? అయినా తమ పిల్లల్ని డబ్బు సంపాదించే ఉద్యోగులుగా చేయడానికేనా ఆ తల్లులు వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించేది? డబ్బు బాగా సంపాదించకుండా, మాములు కూలి పనులతో, పేదరికంతో బ్రతికే స్త్రీలను మూర్ఖులుగా అనుకోవాలా? (క్లిక్: అబార్షన్ హక్కుకు గొడ్డలిపెట్టు) (9) చివరికి చెప్పుకోవాలిసిన మాట, గౌరవాలకు తగిన నడతలకే గౌరవాలు దొరుకుతాయి గానీ, వ్యభిచారాలూ, దొంగతనాలూ, హత్యలూ వంటి ‘వృత్తులకు’ గౌరవాలు ఏ సమాజంలోనూ దొరకవు. దాన్ని డబ్బు పోసి కొనలేరు. వ్యభిచారిణుల పిల్లలైనా, వాళ్ళు కూడా అదే దారిలో వెళితే తప్ప, వాళ్లయినా, తల్లుల్ని గౌరవించరు! గౌరవించలేరు! గౌరవించకూడదు! (క్లిక్: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి) - రంగనాయకమ్మ సుప్రసిద్ధ రచయిత్రి -
ముంబాయి టు కామారెడ్డి
కామారెడ్డి క్రైం: మనిషిలోని బలహీనతలను సొమ్ము చేసుకునే దిశగా వ్యభిచార వృత్తి కొత్తరూపం దాల్చుతోంది. కస్టమర్లను ఆకర్షించడం, వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు రాబట్టేందుకు అందమైన యువతులను దూరప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఏకంగా ముంబాయితోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి యువతులను తెప్పిస్తున్నట్లు వెల్లడవుతోంది. కామారెడ్డిలో ఈ చీకటి వ్యాపారం చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ముంబాయి, విజయవాడ ప్రాంతాల నుంచి యువతులను తెప్పించి వ్యభిచారం నడిపిస్తున్నారు. ముంబాయి నుంచి వేశ్యగా వచ్చిన ఓ యువతికి నిర్వాహకులతో డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదం పోలీసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని రిమాండ్‌కు పంపారు. జిల్లా కేంద్రంలో హైటెక్ పద్ధతిలో వ్యభిచార గృహాలు నడుస్తున్నాయని చెప్పడానికి ఇదో నిదర్శనం. విచ్చలవిడిగా నిర్వహణ... బస్టాండ్, రైల్వేస్టేషన్లు, రద్దీగా ఇతర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి విచ్చలవిడిగా మారింది. పట్టణంలో ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. రోడ్ల వెంబడి కొన్ని చోట్ల అడ్డాలుగా ఏర్పడి వ్యభిచారం వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల ఉండే వ్యాపార సముదాయాలు, చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ఇలాంటి వ్యవహరంలో తలదూర్చడం ఎందుకులే అనుకుని సర్దుకుపోతున్నారు. కొత్త బస్టాండ్ ఎదురుగా రోడ్ల పక్కనే బహిరంగంగా చెట్లకింద బైఠాయించి వ్యభిచారానికి సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తుండడం ఇటీవలి కాలంలో పెరిగింది. రోడ్ల వెంబడి బేరాలు కుదుర్చుకుని సమీపంలోని లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయమేనైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఎక్కువగా వ్యభిచార వ్యవహారాలు జరిగేవి. అక్కడ గొడవలు కావడంతో కొంతకాలంగా అడ్డాలను కొత్తబస్టాండ్ ప్రాంతానికి మార్చారు. ఎంతో మంది అమాయకులు ఇలాంటి వారి బారిన పడి అన్ని రకాలుగా నష్టపోతున్నారు. పెరుగుతున్న అడ్డాలు... కామారెడ్డిలోని అశోక్‌నగర్, స్నేహపురి కాలనీ, ఎన్జీఓస్, పంచముఖి హనుమాన్, బతుకమ్మకుంట కాలనీల్లో వ్యభిచార గృహాలు వెలుస్తున్న ట్లు తెలుస్తోంది. స్నేహపురి కాలనీలో 3 నుంచి 4కు పైగా వ్యభిచార గృహాలు ఉన్నాయని కాలనీ వాసులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ నిర్వహించే వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. కొంతకాలం తర్వా త ఈ చీకటి వ్యాపారం మళ్లీ ప్రారంభమైంది. తా జాగా ముంబాయి నుంచి ఓ యువతిని తెచ్చి ఖరీ దైన వ్యభిచారం చేయించిన ఘటన స్నేహపురి కా లనీలో చోటు చేసుకుంది. డబ్బుల వ్యవహారంలో వివాదం తలెత్తి కేసు నమోదైంది. బాధితురాలని ఓ ఆశ్రయానికి తరలించిన పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఖరీదైన వ్యభిచారం గృహాలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎంతో మంది ఉన్నతస్థానంలో ఉన్నవారు, యువకులను ఆకర్షిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. లాడ్జీలపై కొరవడిన నిఘా... జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాం తాల్లో ఉన్న కొన్ని లాడ్జీలు వ్యభిచార వృత్తినే ఆధా రంగా చేసుకుని నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్తబస్టాండ్ ప్రాంతంలోని కొందరు లాడ్జీల నిర్వాహకులు వ్యభిచార కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో క్రమం తప్పకుండా లాడ్జీలపై దాడులు జరిగేవి. ఇటీవలి కాలంలో లాడ్జీల నిర్వహణపై పోలీసుశాఖ నిఘా కొరవడింది. కనీస చర్యలు కనిపించడం లేదు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఇలాంటి లాడ్జీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ రిమాండ్ కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్హెచ్ఓ రామక్రిష్ణ శుక్రవారం తెలిపా రు. అనంతపురంనకు చెందిన రాధ కొంతకాలం గా కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీలో ఇల్లు కొని నివాసం ఉంటుంది. ఆమె ముంబాయి, కో ల్కతాల నుంచి అమ్మాయిలను తెప్పించి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తుంది. డబ్బులకు ఒప్పందం చేసుకుని వచ్చిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తుంది. ఒప్పందం చేసుకుని డబ్బులు ఇవ్వనందుకు పీర్యా అనే ముంబాయికి చెందిన యువతి రాధతో గొడవపడి పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేసిందని ఎస్హెచ్ఓ తెలిపారు. కేసు న మోదు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను రిమాండ్‌కు తరలించామన్నారు. వ్యభిచారంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చర్యలు తీసుకుంటాం... పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారని ఫిర్యాదు అందడంతో విచారణ జరిపి కేసు నమోదు చేశాం. ఇకపై ఎవరైనా అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. –రామకృష్ణ, ఎస్హెచ్ఓ, కామారెడ్డి. -
స్త్రీలోక సంచారం
ఆదాయం పన్ను కట్టకుండా, ఈ ఏడాది జూన్ నుంచి అజ్ఞాతంలో ఉన్న చైనీస్ నటి, మోడల్, టీవీ నిర్మాత, పాప్ సింగర్ ఫ్యాన్ బింగ్‌బింగ్ అనూహ్యంగా వైబో డాట్ కామ్‌లో ప్రత్యక్షమై తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఆదాయం పన్ను అధికారులకు, తన అభిమానులకు క్షమాపణ తెలిపారు. ఆదాయ పన్ను శాఖ తనను కట్టమని ఆదేశించిన 13 కోట్ల డాలర్లను తల తాకట్టు పెట్టయినా తీర్చుకుంటానని మాట ఇచ్చారు. సమాజంలో విశ్వసనీయతను కోల్పోయి తన అభిమానులకు చెడ్డ పేరు తెచ్చానని ఆవేదన చెందారు. ఆమె చెల్లించవలసిన పదమూడు కోట్ల డాలర్లలో ఏడు కోట్ల డాలర్ల వరకు పెనాల్టీలే ఉన్నాయి! చైనా చట్టం ప్రకారం తొలిసారి పన్ను ఎగవేసిన వారికి జరిమానా ఉంటుంది తప్ప జైలు శిక్ష ఉండదు. ఆ విధంగా ఫ్యాన్ బింగ్బింగ్కి ఊరట లభించినట్లే. అందాల రాణిగా చైనా యువకులు ఆరాధిస్తుండే ఫ్యాన్ ఇప్పటి వరకు ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా 2014 నాటి ‘ఎక్స్–మెన్ : డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’ లోని బ్లింక్ పాత్రతో ఆమె ప్రేక్షకుల ఆదరణకు పొందారు. మరో చైనీస్ వెర్షన్ ‘ఐరన్ మ్యాన్ 3’లో వేసిన చిన్న పాత్రకు కూడా గుర్తింపు వచ్చింది. ఇక కాన్స్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడైతే అనేకసార్లు ఆమె జగదేక సుందరిగా ప్రశంసలు అందుకున్నారు. టెక్సాస్‌కు చెందిన ఒక యువతి ఫేస్‌బుక్‌పై కేసు వేసింది. తన 15 ఏళ్ల వయసులో ఫేస్బుక్ ద్వారా ఒక అపరిచిత వ్యక్తి తనతో స్నేహం చేసుకుని తనని నమ్మించి, రేప్ చేసి, కొట్టి, వ్యభిచార వృత్తిలోకి తోసేశాడని ఆమె ఆరోపించింది. ‘‘నాలాగే ఎందరో చిన్నా రులు ఫేస్బుక్ పరిచయాల కారణంగా దగా పడుతున్నారు. ఈ సంగతి ఫేస్బుక్ నిర్వాహకులకు కూడా తెలుసు. అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కనుక ఫేస్‌బుక్‌పై న్యాయమూర్తులే చర్య తీసుకోవాలి’’ అని ఆ యువతి కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు, ప్రస్తుతం మూత పడి ఉన్న ‘బ్యాక్పేజ్ డాట్ కామ్’ వెబ్ సైట్ వ్యవస్థాపకుల పైన కూడా ఆమె కేసు వేసింది. అయితే ఈమె ఆరోపణలపై స్పందించడానికి ఫేస్బుక్ నుంచి కానీ, బ్యాక్పేజ్ డాట్ కామ్ సంస్థ నుంచి కానీ ఎవరూ అందుబాటులో లేరు. దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ వాగ్వాదాల అనంతరం ఎట్టకేలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘టాంపన్ టాక్సు’ను (శానిటరీ నేప్కిన్ పన్ను) రద్దు చేయాలని నిర్ణయించింది. 2000లో ఆ దేశం జి.ఎస్.టి.ని అమల్లోకి తెచ్చినప్పుడు ఆరోగ్య ఉత్పతులైన కండోమ్స్, సన్‌స్క్రీన్ లోషన్ల మీద, ఆహార పదార్థాల మీద మొదట విధించిన 10 శాతం పన్నుకు మినహాయింపును ఇచ్చింది. అయితే శానిటరీ నేప్కిన్ల మీద, ఇతర స్త్రీల పరిశుభ్ర ఉత్పత్తులపైన జి.ఎస్.టి.ని అలాగే ఉంచేసింది. దీనిపై.. మహిళలను చిన్నచూపు చూస్తున్నారంటూ.. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై వాదనకు దిగాయి. నేప్కిన్స్ మీద జి.ఎస్.టి.ని తొలగించాల్సిందే అని పట్టుపట్టాయి. కేంద్రం దిగిరాకపోవడంతో.. ‘స్టాప్ టాక్సింగ్ మై పీరియడ్’, ‘మెన్స్ట్రువల్ అవెంజర్స్’ వంటి ఉద్యమాలు మొదలై.. పన్ను రద్దు కోసం డిమాండ్ చేస్తున్న రాజకీయ పక్షాలకు మద్దతు ఇవ్వడంతో... టాంపన్ పన్ను రూపంలో ఏటా వస్తున్న సుమారు 2 కోట్ల డాలర్ల రాబడిని వదులుకోడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం తప్పనిసరై సిద్ధమైంది. ∙ -
వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు
బుచ్చిరెడ్డిపాళెం: తనను తల్లి, మేనమామలు వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని, తట్టుకోలేక బంధువుల ఇంటికి వచ్చానని నందా గౌతమి(26) అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ఆమె విలేకరులతో మాట్లాడారు. తనకు మేనమామ మూర్తి(36)తో వివాహమైందని, తన తల్లి ఈశ్వరమ్మ తనను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తోందని వాపోయింది. దీంతో బుచ్చిరెడ్డిపాళెంలో మామ వరుసైన పరంధామయ్య ఇంటికి వచ్చానన్నారు. అయితే తన తల్లి, మేనమామతోపాటు మరికొందరు మూడు రోజుల క్రితం బుచ్చిరెడ్డిపాళెంలోని మామ ఇంటికి వచ్చారని, అక్కడ మాటల నేపథ్యంలో తోపులాట జరిగిందని, అక్కడి నుంచి వెళ్లి దాడి చేసినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని గౌతమి వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరింది. కేసు నమోదు తన కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చిన తనతోపాటు మరికొందరిపై పరంధామయ్య మరికొందరు దాడి చేసి గాయపరిచారని ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై ప్రసాద్‌రెడ్డిని సంప్రదించగా గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చేరారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం గౌతమి ఫిర్యాదు చేసిందన్నారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
యువతుల అక్రమ రవాణాలో స్త్రీలదే కీలకపాత్ర!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో యువతులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపే ముఠాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ వ్యవహారాల్లో మహిళలే కీలక పాత్ర పోషిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) ప్రత్యేక బృందాలు చేసిన దాడుల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రానికి చెందిన యువతులతోపాటు పొరుగు రాష్ట్రాల యువతులను చంద్రాపూర్‌కు తరలించి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపినట్లు సమాచారం అందుకున్న సీఐడీ ఎస్పీ కె.వేణుగోపాలరావు నేతృత్వంలోని బృందం ఈనెల 22న అక్కడకు చేరుకుంది. చంద్రాపూర్ పోలీసుల సహకారంతో పలు వ్యభిచార గృహాలపై దాడులు చేసి మొత్తం 39 మంది యువతులను కాపాడింది. బాధితుల్లో తెలంగాణకు చెందిన 18 మంది యువతులు, ఆరుగురు మైనర్లు, మహారాష్ట్రకు చెందిన 11 మంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన చెరొకరు ఉన్నట్లు గుర్తించింది. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన 46 మంది నిందితులను గుర్తించి వారిలో 44 మందిని అరెస్టు చేసింది. వీరిలో 30 మంది మహిళలే ఉండటంతో అధికారులు సైతం ముక్కున వేలేసుకున్నారు. నిందితుల్ని అక్కడి కోర్టులో హాజరుపరిచిన అధికారులు పీటీ వారంట్‌పై గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాధిత యువతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఆయా అధికారులకు అప్పగించిన సీఐడీ బృందం తెలంగాణ, ఏపీలకు చెందిన వారిని రెస్క్యూ హోంలకు తరలించి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెల్స్... యువతుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా కేంద్రాల్లో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యభిచార కేంద్రాలకు యువతులను తరలించే ముఠాల ఆటకట్టించేందుకు జిల్లాల స్థాయి నుంచి కృషి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక విభాగంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు 423 కేసులు నమోదయ్యాయని, సీఐడీ దాడుల్లో 646 మంది బాధితులకు విముక్తి కలిగిందని ఆయన వివరించారు. 715 మంది నిందితులు, 325 మంది విటులను అరెస్టు చేశామన్నారు. విలేకరుల సమావేశంలో ఐజీ బాలనాగదేవి పాల్గొన్నారు.