యువతుల అక్రమ రవాణాలో స్త్రీలదే కీలకపాత్ర!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో యువతులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపే ముఠాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ వ్యవహారాల్లో మహిళలే కీలక పాత్ర పోషిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) ప్రత్యేక బృందాలు చేసిన దాడుల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రానికి చెందిన యువతులతోపాటు పొరుగు రాష్ట్రాల యువతులను చంద్రాపూర్‌కు తరలించి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపినట్లు సమాచారం అందుకున్న సీఐడీ ఎస్పీ కె.వేణుగోపాలరావు నేతృత్వంలోని బృందం ఈనెల 22న అక్కడకు చేరుకుంది.
చంద్రాపూర్ పోలీసుల సహకారంతో పలు వ్యభిచార గృహాలపై దాడులు చేసి మొత్తం 39 మంది యువతులను కాపాడింది. బాధితుల్లో తెలంగాణకు చెందిన 18 మంది యువతులు, ఆరుగురు మైనర్లు, మహారాష్ట్రకు చెందిన 11 మంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన చెరొకరు ఉన్నట్లు గుర్తించింది. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన 46 మంది నిందితులను గుర్తించి వారిలో 44 మందిని అరెస్టు చేసింది.
వీరిలో 30 మంది మహిళలే ఉండటంతో అధికారులు సైతం ముక్కున వేలేసుకున్నారు. నిందితుల్ని అక్కడి కోర్టులో హాజరుపరిచిన అధికారులు పీటీ వారంట్‌పై గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాధిత యువతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఆయా అధికారులకు అప్పగించిన సీఐడీ బృందం తెలంగాణ, ఏపీలకు చెందిన వారిని రెస్క్యూ హోంలకు తరలించి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెల్స్...
యువతుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా కేంద్రాల్లో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యభిచార కేంద్రాలకు యువతులను తరలించే ముఠాల ఆటకట్టించేందుకు జిల్లాల స్థాయి నుంచి కృషి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక విభాగంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు 423 కేసులు నమోదయ్యాయని, సీఐడీ దాడుల్లో 646 మంది బాధితులకు విముక్తి కలిగిందని ఆయన వివరించారు. 715 మంది నిందితులు, 325 మంది విటులను అరెస్టు చేశామన్నారు. విలేకరుల సమావేశంలో ఐజీ బాలనాగదేవి పాల్గొన్నారు.