ఆదాయం పన్ను కట్టకుండా, ఈ ఏడాది జూన్ నుంచి అజ్ఞాతంలో ఉన్న చైనీస్ నటి, మోడల్, టీవీ నిర్మాత, పాప్ సింగర్ ఫ్యాన్ బింగ్‌బింగ్ అనూహ్యంగా వైబో డాట్ కామ్‌లో ప్రత్యక్షమై తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో ఆదాయం పన్ను అధికారులకు, తన అభిమానులకు క్షమాపణ తెలిపారు. ఆదాయ పన్ను శాఖ తనను కట్టమని ఆదేశించిన 13 కోట్ల డాలర్లను తల తాకట్టు పెట్టయినా తీర్చుకుంటానని మాట ఇచ్చారు. సమాజంలో విశ్వసనీయతను కోల్పోయి తన అభిమానులకు చెడ్డ పేరు తెచ్చానని ఆవేదన చెందారు. ఆమె చెల్లించవలసిన పదమూడు కోట్ల డాలర్లలో ఏడు కోట్ల డాలర్ల వరకు పెనాల్టీలే ఉన్నాయి! చైనా చట్టం ప్రకారం తొలిసారి పన్ను ఎగవేసిన వారికి జరిమానా ఉంటుంది తప్ప జైలు శిక్ష ఉండదు. ఆ విధంగా ఫ్యాన్ బింగ్‌బింగ్‌కి ఊరట లభించినట్లే. అందాల రాణిగా చైనా యువకులు ఆరాధిస్తుండే ఫ్యాన్ ఇప్పటి వరకు ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా 2014 నాటి ‘ఎక్స్–మెన్ : డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’ లోని బ్లింక్ పాత్రతో ఆమె ప్రేక్షకుల ఆదరణకు పొందారు. మరో చైనీస్ వెర్షన్ ‘ఐరన్ మ్యాన్ 3’లో వేసిన చిన్న పాత్రకు కూడా గుర్తింపు వచ్చింది. ఇక కాన్స్ ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడైతే అనేకసార్లు ఆమె జగదేక సుందరిగా ప్రశంసలు అందుకున్నారు.
టెక్సాస్‌కు చెందిన ఒక యువతి ఫేస్‌బుక్‌పై కేసు వేసింది. తన 15 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ద్వారా ఒక అపరిచిత వ్యక్తి తనతో స్నేహం చేసుకుని తనని నమ్మించి, రేప్ చేసి, కొట్టి, వ్యభిచార వృత్తిలోకి తోసేశాడని ఆమె ఆరోపించింది. ‘‘నాలాగే ఎందరో చిన్నా రులు ఫేస్‌బుక్ పరిచయాల కారణంగా దగా పడుతున్నారు. ఈ సంగతి ఫేస్‌బుక్ నిర్వాహకులకు కూడా తెలుసు. అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కనుక ఫేస్‌బుక్‌పై న్యాయమూర్తులే చర్య తీసుకోవాలి’’ అని ఆ యువతి కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు, ప్రస్తుతం మూత పడి ఉన్న ‘బ్యాక్‌పేజ్ డాట్ కామ్’ వెబ్ సైట్ వ్యవస్థాపకుల పైన కూడా ఆమె కేసు వేసింది. అయితే ఈమె ఆరోపణలపై స్పందించడానికి ఫేస్‌బుక్ నుంచి కానీ, బ్యాక్‌పేజ్ డాట్ కామ్ సంస్థ నుంచి కానీ ఎవరూ అందుబాటులో లేరు.
దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ వాగ్వాదాల అనంతరం ఎట్టకేలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘టాంపన్ టాక్సు’ను (శానిటరీ నేప్‌కిన్ పన్ను) రద్దు చేయాలని నిర్ణయించింది. 2000లో ఆ దేశం జి.ఎస్.టి.ని అమల్లోకి తెచ్చినప్పుడు ఆరోగ్య ఉత్పతులైన కండోమ్స్, సన్‌స్క్రీన్ లోషన్‌ల మీద, ఆహార పదార్థాల మీద మొదట విధించిన 10 శాతం పన్నుకు మినహాయింపును ఇచ్చింది. అయితే శానిటరీ నేప్‌కిన్‌ల మీద, ఇతర స్త్రీల పరిశుభ్ర ఉత్పత్తులపైన జి.ఎస్.టి.ని అలాగే ఉంచేసింది. దీనిపై.. మహిళలను చిన్నచూపు చూస్తున్నారంటూ.. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై వాదనకు దిగాయి. నేప్‌కిన్స్ మీద జి.ఎస్.టి.ని తొలగించాల్సిందే అని పట్టుపట్టాయి. కేంద్రం దిగిరాకపోవడంతో.. ‘స్టాప్ టాక్సింగ్ మై పీరియడ్’, ‘మెన్‌స్ట్రువల్ అవెంజర్స్’ వంటి ఉద్యమాలు మొదలై.. పన్ను రద్దు కోసం డిమాండ్ చేస్తున్న రాజకీయ పక్షాలకు మద్దతు ఇవ్వడంతో... టాంపన్ పన్ను రూపంలో ఏటా వస్తున్న సుమారు 2 కోట్ల డాలర్ల రాబడిని వదులుకోడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం తప్పనిసరై సిద్ధమైంది. ∙
స్త్రీలోక సంచారం
Published Fri, Oct 5 2018 12:30 AM | Last Updated on Fri, Oct 5 2018 12:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment