ఆర్థిక రంగం ఆణిముత్యాలు | Women in india leading the Financial Sector | Sakshi
Sakshi News home page

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

Published Sun, Mar 4 2018 10:26 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Women in india leading the Financial Sector - Sakshi

‘‘సుదీర్ఘ కాలంగా ఆర్థికరంగం అంటే కేవలం పురుషులకే పరిమితమైన రంగంగా ఉంటూ  వచ్చింది.  అది బ్యాంకింగ్ రంగమైనా, బీమా, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు ఇలా ఏ రంగమైనా  అది మహిళలకు సంబంధించింది కాదనే భావన. దాదాపు మహిళలందరూ ఈ భావనతోనే ఈ రంగాలవైపు (ఆసక్తి వున్నా) వెనకడుగు వేస్తూ వచ్చారు. కానీ ఆ తరువాత  ఈ పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది.  వివిధ  రంగాలతోపాటు  ఆర్థిక రంగంలో కూడా  మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం మొదలు పెట్టారు. ‘‘విత్తం అంటే  కేవలం పురుషుల సొత్తే’’ కాదంటూ తమ సత్తా చాటడం  మొదలు పెట్టారు.  వారిలో  ప్రముఖమైన మహిళల్ని ఇపుడు చూద్దాం’’.

చందా కొచ్చర్
జోధ్ పూర్‌లో  జన్మించిన చందా కొచ్చర్ భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంక్  ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈవోగా తన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.     1984 లో ట్రైనీగా ప్రారంభమైన ఆమె ప్రయాణం బ్యాంకు అత్యున్నత అధికారిగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయబావుటా ఎగరేస్తూ  అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యంతో దెబ్బతిన్న సమయంలో ఆమె బ్యాంకును విజయపథంలో నడిపించారు. ఆమె నాయకత్వంలోనే ఐసీఐసీఐ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకులలో ఒకటిగా  నిలవడం  గమనించాల్సిన విషయం.  దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె నిలవడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు.  ఆర్థిక రంగంలో ఆమె చేసిన విశేష  సేవలకు గాను 2010లో ఆమెకు పద్మభూషణ్ దక్కంది. అలా మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి  ఎండీదాకా సాగిన చందా కొచ్చర్  ప్రస్థానం  బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించాలనుకునే  అనేకమంది యువతులకు ప్రేరణ.

ఉషా అనంతసుబ్రమణియన్

30 సంవత్సరాలకు పైగా  సుదీర్ఘ అనుభవం ఉషా అనంత సుబ్రమణియన్ సొంతం. స్టాటస్టిక్స్ లో దిట్ట. ప్రస్తుతం, అలహాబాద్ బ్యాంక్ సీఎండీగా ఉన్న ఉషా బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, భారతీయ మహిళా బ్యాంక్ లాంటి బ్యాంకులకు సారధ్యం వహించారు.అనంత సుబ్రమణియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ)తో యాక్ట్యుయేరియల్ డిపార్ట్మెంట్లో స్పెషలిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించారు.   స్టాటస్టిక్స్‌లో ఆమెకున్న పట్టుతో తన  సామర్ధ్యాలకు మరింత పదును పెట్టుకున్నారు.  ఈ   నేపథ్యంలోనే ఆస్తులు క్షీణిస్తూ....దయనీయ పరిస్థితుల్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) పరిశీలనలో ఉన్న ప్రభుత్వ రంగ  బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్  సారధ్య బాధ్యతలు ఆమెకు అప్పగించారు.  తన  అనుభవం,  ప్రతిభతో బ్యాంకును కష్టాలనుంచి గట్టెక్కిండచడంతోపాటు.. లాభాల బాట పట్టించిన ఘనతను సాధించారామె. ముఖ్యంగా మొట్టమొదటి  భారతీయ మహిళా బ్యాంకు స్థాపనలో ఆమె కృషి ప్రధానంగా చెప్పుకోదగ్గది. (భారతీయ మహిళా బ్యాంకు ఇపుడు ఎస్‌బీఐలో విలీనమైంది).

శిఖా శర్మ
భారతదేశంలో మూడవ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ.  1980 లో ఐసిఐసిఐ బ్యాంక్‌లో తన కెరీర్ను ప్రారంభించారు. ఆ సమయంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్,  ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్  అండ్ రిటైల్ ఫైనాన్స్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. ఆర్ధిక రంగంలో మూడు దశాబ్దాల విశేష అనుభవంతో యాక్సిస్ బ్యాంకు  సారధ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.అలాగే  ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ విభాగంలో తనదైన ముద్రతో యాక్సిస్ బ్యాంకును అగ్రభాగంలో నిలిపే లక్ష్యంతో సాగుతున్నారు.

అరుంధతి భట్టాచార్య
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగబ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  208 సంవత్సరాల ఎస్బీఐచరిత్రలో, ఈ ఘనతను సాధించిన మొదటి మహిళగా భట్టాచార్య గుర్తింపు పొందారు.  ఫోర్బ్స్ 'మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్’ 2016 లో 25వ స్థానంలో  నిలిచారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు  రెండేళ్ల సెబాటికల్ లీవ్ విధానాన్ని  ఆమె పరిచయం చేశారు.  దీన్నిమహిళలు ప్రసూతి సెలవు లేదా పెద్దల సంరక్షణల బాధ్యతల సందర్భంగా వినియోగించుకోవచ్చు.అలాగే సర్వైకల్ క్యాన్సర్ టీకాను మహిళా ఉద్యోగులందరు ఉచితంగా  పొందే  సౌకర్యాన్ని కల్పించారు.

చిత్ర రామకృష్ణ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)  స్థాపనలో  కీలక పాత్ర పోషించిన వారిలో  చిత్రా రామకృష్ణ ప్రముఖులు. అంతేకాదు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) కు బలమైన   పోటీదారుగా ఎన్ఎస్ఈని నిలపడంలో ఆమె కృషి చాలా ఉంది. మార్కేట్‌ రెగ్యులేటరీ సెబీకి కూడా ఆమె తన సేవలనందించారు. చార్టర్డ్  అకౌంటెంట్‌గా  కెరియర్ ను  ప్రారంభించిన చిత్ర ఐడీబీఐ బ్యాంకులో ప్రాజెక్ట్ ఫైనాన్స్  విభాగంలో  పనిచేశారు. 1992లో ఎన్‌ఎస్‌ఈ ఏర్పడినప్పటినుంచి వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె 2013లో (20 ఏళ్ల తరువాత)   సీఈవో, ఎండీగా నియమితులయ్యారు. అదే సంవత్సరం ఫోర్బ్స్ ఇండియన్ విమెన్ లీడర్  పురస్కారం గెలుచుకున్నారు. డిసెంబరు 2, 2016 న ఆమె పదవికి రాజీనామా  చేశారు.

ఉషా సంగ్వాన్
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా  సంస్థ లైఫ్  ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కి మొట్టమొదటి మహిళా ఎండీ ఉషా సంగ్వాన్‌. సాధారణంగా ఎల్‌ఐసీకి  టెక్నికల్‌గా నలుగురు ఎండీలు సారధ్యం వహిస్తారు. అయితే నలుగురు ఎండీలు కంపెనీని వీడిన  అనంతరం ఎండీ పదవిన చేపట్టిన ఉషా  సంస్థను ఆరునెలలపాటు  ఒంటి  చేత్తో  నడిపించడం విశేషం. ఈ కాలంలో ఎల్‌ఐసి మార్కెట్ వాటా 70 శాతంనుంచి  71శాతానికి పెరిగింది. క్లెయియ్‌ పరిష్కార నిష్పత్తి 99.6 శాతం వద్ద ఉంది.  

వాణి  కోలా
బెంగళూరు ఆధారిత కోలారి క్యాపిటల్‌ వ్యవస్థాపకురాలు, ఎండీ  వాణి కోలా.  కోలారి క్యాపిటల్‌ను నెలకొల్పినప్పటినుంచీ విజయపథంలో నడిపించారు. తద్వారా దేశంలో వెంచర్ పెట్టుబడి సంస్థలలో ఒకటిగా నిలిపారు.  22 ఏళ్లపాటు సిలికాన్‌ వ్యాలీలో, 10సంవత్సరాలు వెంచర్‌ క్యాపిటలిస్టుగా   సేవలనందించారు.  సిలికాన్‌ వ్యాలీలో సర్టస్‌ సంస్థకు  వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా ఉన్నారు. అంతకుముందు ఇ- ప్రొక్యూర్‌ మెంట్‌ కంపెనీ రైట్‌ వర్క్స్‌కు  సీఈవోగా  పనిచేశారు.2005 లో భారతదేశానికి తిరిగి వచ్చిన  ఆరు  నెలలకాలంలోనే  210 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు  పెట్టారు.   ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌   సహా దాదాపు 60 స్టార్టప్‌ కంపెనీల్లో 650 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను సాధించిన ఘనత ఆమె సొంతం. 1964లో హైదరాబాద్‌లో జన్మించిన వాణి కోలా ఉస్మానియా యూనివర్శిటీలో, అరిజోనా  యూనివర్శిటీలో విద్యనభ్యసించారు.

ఇంద్రనూయి
1955లో తమిళనాడులోని మద్రాసులో జన్మించిన ఇంద్రనూయి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆహార, పానీయాల కంపెనీ పెప్సీకోకు సీయీవోగా ఎదిగారు. ఫోర్బ్స్‌ వారు ప్రకటించిన ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో 13వ స్థానంలో నిలిచారు. 2001లో ఆమె పెప్సీకో కంపెనీలో చేరినప్పుడు సంస్థ నికర లాభం 2.7బిలియన్‌ డాలర్లు ఉండగా ప్రస్తుతం అది 6.5బిలియన్‌ డాలర్లకు చేరుకోవడంలో ఆమె చేసిన కృషి అమోఘం. ఆమె కృషికి తగ్గ ఫలితంగా ఆమె ప్రస్తుతం సంవత్సరానికి 18.6మిలియన్‌ డాలర్ల వేతనాన్ని అందుకుంటున్నారు.

కావేరి కళానిధి మారన్‌
సన్‌ టీవీ మానేజింగ్‌ డైరెక్టర్‌గా సంవత్సరానికి 18మిలియన్‌ డాలర్ల వేతనాన్ని పొందుతున్నారు. ఇన్ఫోసిస్‌ సీయీవో వేతనం కంటే కూడా ఇది అధికం. 2010 నుంచి 2015 వరకూ స్పైస్‌జెట్‌ చైర్మన్‌గా పనిచేశారు.

కిరణ్‌ మజుందార్‌ షా
బెంగెళూరులో బయోకాన్‌ బయోటెక్నాలజీ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం సంస్థ మానేజింగ్‌  డైరెక్టర్‌ గా ఉన్నారు. సంవత్సరానికి రూ.16కోట్ల వేతనం పొందుతూ దేశంలో అత్యంత ధనవంతురాలుగా గుర్తింపు పొందుతున్న మహిళ. భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రాలలో ఆమె చేసిన రచనలకు గాను 2014లో ఒత్మేర్‌ గోల్డమెడల్‌ పొందారు. ఐఐఎమ్‌ బెంగుళూరుకు చైరపర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఉర్వి పిరమాల్‌
సంవత్సరానికి రూ.10కోట్ల వేతనం పొందుతూ  నాల్గో స్థానంలో నిలిచారు ఉర్వి పిరమాల్‌, అశోక్‌ పిరమాల్‌ సంస్థ అధినేత్రి. తన 32వ ఏట భర్తను కోల్పొయారు. తదనంతరం కుటుంబ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. కుటుంబ వ్యాపారం విడిపోయిన తర్వాత ఉర్వి పిరమాల్‌కు తన వాటాగా ఒక టెక్సటైల్‌ మిల్, రెండు ఇంజనీరింగ్‌ సంస్థలు లభించాయి.  పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను ఆమె  తిరిగి లాభాల  బాట పట్టించారు. ప్రస్తుతం ఈ సంస్థల సంవత్సర  ఆదాయం రూ.1600కోట్లు.

ఆర్తీ సుబ్రమణియన్‌
‘‘ఉత్తమమైనది తప్ప మరేమి వద్దు’’ ఇదే ఆర్తీ సుబ్రమణియన్‌ పాటించే సూత్రం. అదే ఆమెను టీసీఎస్‌ లాంటి టాప్‌ కంపెనీకి ఎక్సిక్యూటీవ్‌ డైరెక్టరుగా ఎదిగేలా చేసింది. ఆమె ఈడీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత  సాధించిన అతి గొప్ప విజయం పాస్‌పోర్టు సేవా ప్రాజెక్టు. పాస్‌పోర్టు జారీ ప్రక్రియను పూర్తిగా మార్చి డిజిటైజేషన్‌ చేశారు. టీసీఎస్‌ చరిత్రలోనే బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌లో సభ్యురాలైన తొలి మహిళ. ఆమె తోటి ఉద్యోగులు ఆమెను ప్రేమగా ‘మిస్‌.ఫిక్సిట్‌’ అని పిలుచుకుంటారు.

వనిత నారయానణ్‌
టెక్‌ దిగ్గజం ఐబీఎమ్‌ గురించి మనలో చాలా మందికి తెలుసు. బీటెక్‌ చదివిన ప్రతి విద్యార్ధి ఐబీఎమ్‌లో ఉద్యోగం గురించి కలలు కంటుంటారు. వనితా నారయానణ్‌ కూడా అలానే అనుకుంది, అనుకోవడమే కాకుండా అందులో ఉద్యోగం కూడా సంపాదించారు. 1985లో ఐబీఎమ్‌లో సాధరణ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 2013లో ఐబీఎమ్‌ ఇండియాకు మానేజింగ్‌ డైరెక్టర్‌గా, ఇండియా/సౌత్‌ ఆసియాకు రిజనల్‌ మేనేజర్‌గా నియమితులయ్యారు. 25 సంవత్సరాల నుంచి వివిధ దేశాల్లో పర్యటిస్తూ, వేర్వేరు రకాల వ్యక్తులతో పనిచేస్తున్నారు. 2013-14లో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కాన్ఫేడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీలో సభ్యురాలిగా పనిచేశారు.

నీలమ్‌ ధావన్‌
​హెచ్‌పీ కంప్యూటర్లు, ప్రింటర్లకు ఉన్న డిమాండ్‌ అందరికీ తెలిసిందే. అంత గొప్ప పేరు ఉన్న కంపెనీకి ఇండియాలో మానేజింగ్‌ డైరెక్టరుగా నియమితులయ్యారు నీలం ధావన్‌. కేవలం కంప్యూటర్లు, ప్రిటింగ్‌ పరికరాలకే పరిమితమైన కంపేని సేవలను బీపీవో, సాఫ్ట్‌వేర్‌, పరిశోధన - సేవలకు కూడా విస్తరించి ప్రస్తుతం హెచ్‌పీ కంపెనీని దేశంలో ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీగా నిలబెట్టారు. హెచ్‌పీలో చేరడానికంటే ముంది నీలం 2005నుంచి 2008వరకూ మైక్రోసాఫ్ట్‌ ఇండియాకు మానేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. హెచ్‌సీఎల్‌, ఐబీఎమ్‌ కంపెనీల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.

అరుణ జయంతి
2011 సెప్టెంబరులో కాప్‌జెమిని సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన అరుణ జయంతిది ఈ రంగలో రెండు దశాబ్దల అనుభవం. సీయీవోగా చేయడానికి కంటే ముంది అరుణ కాప్‌ జెమినిలో ఔవుట్‌ సోర్సింగ్‌ విభాగానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆమె ప్రపంచవ్యాప్తంగా  కంపెనీ ఔవుట్‌సోర్సింగ్‌ సేవల విలువలను గణనీయంగా పెంచారు. సీయీవోగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే భారతీయ వ్యాపార రంగంలో తన ఉనికిని చాటుకున్నారు. 2013లో ఇండియా టుడే వారు ప్రకటించిన ఇండియన్‌ వుమేన్‌ ఇన్‌ ద కార్పొరేట్‌ వరల్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు‌.

క్రితిగా రెడ్డి
సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా తన శాఖలను విస్తరించింది ఈ కంపెనీ. ఇంతపెద్ద కంపెనీలో భారతదేశం నుంచి ఉద్యోగంలో చేరిన తొలి మహిళ క్రితిగా రెడ్డి. 2010లో ఉద్యోగంలో చేరిన క్రితిగా రెడ్డి ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో తన సేవలను విస్తరించేందుకుగాను హైదరాబాదులో ప్రారంభించిన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫార్చున్‌ పత్రిక ప్రకటించే టాప్‌ 50 మోస్ట్‌ పవర్‌ఫుల్‌ వుమెన్‌ ఇన్‌ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. పిల్లలు, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు.

కుముద్‌ శ్రీనివాసన్‌
1987లో ఇంటెల్‌ కంపెనీలో చేరిన కుముద్‌ శ్రీనివాసన్‌ బిజినేస్‌, ఇనఫర్‌మేషన్‌ సిస్టమ్స్‌లో వేర్వేరు బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం భారత్‌లో ఇంటెల్‌కు జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరులోని ఐఐఐటీ గవర్నింగ్‌ బాడీలో సభ్యురాలిగా పనిచేశారు.

తన్యా దుబాష్‌
గోద్రెజ్‌ ఉత్పత్తులకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో తెలిసిన విషయమే. సబ్బుల దగ్గర నుంచి లాకర్ల వరకూ ఎనో ఉత్పత్తులను తయారుచేస్తుంది ఈ ​కంపెనీ. కానీ ఒకానొక సందర్భంలో కంపెనీలో మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని ముందు గుర్తించి నష్టం వాటిల్లకుండా చూసి కంపెనీని  తిరిగి పుంజుకునేలా చేసిన ఘనత తన్యా దుబాష్‌ది. తన్యా దుబాష్‌, ఆది గోద్రెజ్‌ పెద్ద కుమార్తే. తన్యా దుబాష్‌ భారతీయ మహిళ బ్యాంకు బోర్డు మెంబరు.

సునితా రెడ్డి
వైద్యరంగంలో అపోలో ఆసుపత్రులది విశిష్ట స్థానం. 2014లో సునితా రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆరోగ్యసేవలను విస్తరస్తూ పోతు ఉన్నారు. ప్రస్తుతం అపోలో ఆరోగ్య సేవలను గ్రామాలకూ కూడా విస్తరించారు. ఆమె హర్వర్డ్‌ బిజినేస్‌ స్కూల్‌ ఇండియా అడ్వైసరీ బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు.

శాంతి ఏకాంబరం
ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగంలో ఎంతటి పోటి ఉందో అందరికి తెలిసిన విషయమే. ఇంత తీవ్ర పోటిని తట్టుకుని నిలబడాలంటే ఎంతో ముందు చూపు ఉన్న నాయకత్వం అవసరం. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తే శాంతి ఏకాంబరం, ప్రముఖ కోటాక్‌ మహింద్ర బ్యాంక్‌ ప్రెసిడెంట్‌. 2014లో ఆమె బాధ్యతలు తీసుకున్న వెంటనే డిజిటల్‌ ఉత్పత్తుల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగానే వేర్వేరు భాషల్లో బ్యాంక్‌ సర్వీసులను అందిచడం, అల్ఫా సేవింగ్స్‌ అకౌంట్స్‌, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా డబ్బులను పంపిచడం వంటి నూతన విధానాలను ప్రవేశపెట్టారు. ఆమె చేసిన మార్పుల వల్ల 2015లో రూ.21,113గా ఉన్న ఖాతాదారుల ద్రవ్య నిల్వలు 2016 మార్చి నాటికి రూ.32,987 కోట్లకు చేరుకున్నాయి.

చౌహన్‌ సాలుజా
పార్లే-జీ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది  బిస్కెట్లు. అంతా ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ ఒకానొక సమయంలో అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల కంపెనీల నుంచి తీవ్ర పోటిని ఎదుర్కొవాల్సి వచ్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీ పగ్గాలు చేపట్టింది చౌహాన్‌ సాలుజా, కంపెనీ వ్యవస్థాపకుడు  ప్రకాశ్‌ సాలుజా పెద్ద కుమార్తే. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధించిన అతిపెద్ద విజయం కంపెనీ తయారి సంస్థను ఉత్తారాఖండ్‌లో నెలకొల్పడం.

రోశిని నాడార్‌
హెచ్‌సీఎల్‌ అంటే ఐటీ సేవలు అందించే సంస్థగానే గుర్తింపు ఉంది. కానీ రోశిని నాడార్‌ కంపెనీ  సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 2014లో రోశిని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐటీ సేవలకే పరిమతమయిన కంపెనీ ఆరోగ్యరంగంలో అడుగు పెట్టింది, నైపుణ్య శిక్షణ కోసం హెచ్‌సీఎల్‌ టాలెంట్‌ కేర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇవి విజయవంతంగా పనిచేస్తున్నాయి.


రేఖ మీనన్‌
అక్సెంచర్‌ కంపెనీకి 2000 సంవత్సరంలో భారతదేశంలో కేవలం 300మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మరి ప్రస్తుతం...? 1,40,000మంది అవును అక్షరాల లక్షానలబై వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ సాధించిన ఈ అభివృద్ధి వెనక రేఖా మీనన్‌ క్రమశిక్షణ, కృషి, అంకితభావం ఉన్నాయి.

 ప్రియా నాయర్‌
1995లో హిందూస్థాన్‌ యూనీలివర్‌ కంపెనీలో మానేజ్‌మెంట్‌ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం కంపెనీలో ముఖ్య విభాగమైన హోమ్‌ కేర్‌ డివిజన్‌కు ఎగ్సిక్యూటీవ్‌ డైరెక్టరుగా ఎదిగారు. మార్కెట్‌లో వస్తున్న పోటి కంపెనీ ఉత్పత్తులకు ధీటుగా ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడ్తూ కంపెనీని విస్తరిస్తూ పోతు ఉన్నారు.

ఏక్తా కపూర్‌
సగటు భారతీయ ప్రేక్షకులను ముఖ్యంగా ఆడవారిని టీవీల ముందు కట్టిపడేసి, ధారవాహికలకు భారీ హంగులు అద్దిన బుల్లితెర రాణి ఏక్తా కపూర్‌. బాలాజీ టెలిఫిల్మ్‌ అనే సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన ధారవాహికలను నిర్మిస్తూన్నారు ఏక్తా కపూర్‌. అంతేకాదు సిని నిర్మాణ రంగంలోనూ ప్రవేశించి తన​ ప్రతిభను చాటుకుంటున్నారు.

నీతా అంబాని
మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అంబానీల ఇంట అడుగుపెట్టారు నీతా అంబాని. రిలయన్స్‌ సంస్థల అభివృద్ధిలో ఆమె పాత్రను మరవలేము.ఇంత పేరుప్రఖ్యాతులు వచ్చినా ఆమె  తన మూలాలను మరిచిపోలేదు. అందుకే కంపెనీ లాభాల్లోంచి కొంత వాటాను తిరిగి సమాజాభివృద్ధికే కేటాయించే ఉద్ధేశంతో  కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే సవాళ్లను ముందే గుర్తించడం, అందుకు తగ్గ పరిష్కారాలను కనుక్కొవడం ఆమె ప్రత్యేకత.

వీరు తమ అసమాన ప్రతిభా పాటవాలతో  అటు తాము నేతృత్వం వహిస్తున్న కంపెనీలను విజయపథం వైపు నడిపించడం మాత్రమే కాదు  ఫైనాన్షియల్‌  సెక్టార్‌లో గణనీయమైన కృషి చేశారు.  కొన్ని పనులను,  బాధ్యతలను మహిళలు నిర్వహించలేరు అనేది కేవలం అపోహ మాత్రమేనని నిరూపించారు.   అవకాశాలు కల్పిస్తే..బాధ్యతలు అప్పగిస్తే  ఏ రంగమైనా  రాణించి తీరతామని చాటి పెట్టారు. తద్వారా యావత్‌  మహిళాలోకానికి ప్రేరణగా నిలిచారు.

ధరణి
సూర్యకుమారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement