chanda kochhar
-
చందా కొచ్చర్ అరెస్టుపై.. సీబీఐకి కోర్టు మొట్టికాయలు!
ముంబై: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)పై బాంబే హైకోర్టు మెట్టికాయలు వేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అరెస్ట్ అంశంలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్, జస్టిస్ ఎన్. ఆర్.బోర్కర్ డివిజన్ బెంచ్ 2024 ఫిబ్రవరి 6న కొచ్చర్ దంపతుల అరెస్టును చట్టవిరుద్ధమని పేర్కొంది. జనవరి 2023లో మరొక బెంచ్ వారికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వును ధృవీకరించింది. కోర్టు జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల్లో.. కొచ్చర్ దంపతులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అందుకు తగ్గ ఆదారాల్ని చూపించలేకపోయారని, కాబట్టే సీబీఐ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భావిస్తున్నట్లు అనూజా ప్రభుదేశాయ్, ఎన్ఆర్ బోర్కర్ల ధర్మాసనం తెలిపినట్లు వెలుగులోకి వచ్చిన కోర్టు ఉత్తర్వులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం తగదు ‘చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి సాధారణ అరెస్టులు అధికార దుర్వినియోగానికి సమానం’ అని కోర్టు పేర్కొంది. కానీ కొచ్చర్ దంపతులు విచారణకు సహకరించనందున అరెస్ట్ చేశామని సీబీఐ కోర్టుకు విన్నవించుకుంది. అయితే, విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు నిందితులకు ఉందని.. సీబీఐ వాదనను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్భంధం చేయకూడదు. విచారణ చేస్తున్న సమయంలో అలా చేస్తున్నట్ల మౌనంగా ఉండే హక్కును కల్పిస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
చందా కొచ్చర్ దంపతులకు భారీ ఊరట!
ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియో కాన్ లోన్ కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ దంపతులకు భారీ ఊరట లభించింది. చందా కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సబబేనని స్పష్టం చేసింది. రుణాల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తమని అక్రమంగా అరెస్ట్ చేసిందని, తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చార్‌లు కోర్టు మెట్లెక్కారు. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ మధ్యంతర బెయిల్‌ను జారీ చేసింది. తాజాగా, మధ్యంతర బెయిల్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తులు అనూజా ప్రభుదేశాయ్,ఎన్ఆర్ బోర్కర్లతో కూడిన ధర్మాసనం.. ‘చందా కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఆర్డర్‌ను ధృవీకరించాం’ అని తెలిపారు. అంతేకాదు, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ అరెస్ట్ చేయడం అక్రమమని బాంబే హైకోర్టు పేర్కొంది. 2023 జనవరి 9న కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సబబేనని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్ సంస్థకు రుణాలు ఇచ్చారన్న కేసులో కొచ్చర్ దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నేరం అంగీకరించకపోవడమంటే విచారణకు సహకరించడం లేదని అర్థం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. 2022లో అరెస్ట్ వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంకు రుణం కేసుకు సంబంధించి చందా కొచ్చర్ దంపతులను 2022 డిసెంబర్ 23న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కొచ్చర్తో పాటు వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. చందా కొచ్చర్ దంపతులతో పాటు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీలను ఉల్లంఘించి ధూత్ ప్రమోట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల క్రెడిట్ మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది. నేరపూరిత కుట్రకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద 2019లో నమోదైన ఎఫ్ఐఆర్లో వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తోపాటు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఐసీఐసీ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆయన భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ నిందితులుగా చేర్చింది. -
ఎంతటి దుర్భర పరిస్థితి? చందా కొచ్చర్‌కు సుప్రీం కోర్టులోనూ తప్పని నిరాశ
దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపుతో అగ్రస్థానానికి ఎదిగి సంచలనం సృష్టించిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ కుంభకోణంలో ఇరుక్కుని కేసులను ఎదుర్కొంటూ తన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ సుప్రీం కోర్టులోనూ తీవ్ర నిరాశే ఎదురైంది. బ్యాంకు నుంచి తన పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి చందా కొచ్చర్ దాఖలు చేసిన అప్పీల్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు డిసెంబర్ 8న నిరాకరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చందా కొచ్చర్ గతంలో బాంబే హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేయగా డివిజన్ బెంచ్ తిరస్కరించింది. తాజాగా ఆ డివిజన్ బెంచ్ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కొచ్చర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. బాంబే హైకోర్టు తీర్పు అన్యాయమని, బ్యాంకు మొదట్లో కొచ్చర్‌కు రిటైర్మెంట్ ప్రయోజనాలను అందించేందుకు అంగీకరించి తర్వాత వెనక్కితీసుకుందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ ఏడాది మే నెలలో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి పదవీ విరమణ ప్రయోజనాలను కోరుతూ ఆమె చేసిన మధ్యంతర దరఖాస్తును తిరస్కరించిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో పదవి నుంచి చందా కొచ్చర్ తొలగింపును సమర్థించిన బాంబే హైకోర్టు దీనిపై ఆమె వేసిన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఆమె వేసిన మధ్యంతర పిటిషన్‌ను గతేడాది నవంబర్‌లో కొట్టేసింది. 2018లో ఆమె దక్కించుకున్న 6.90 లక్షల షేర్లతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2018 మేలో తనపై విచారణ ప్రారంభం కాగానే చందా కొచ్చర్ సెలవుపై వెళ్లిపోయారు. ఆ తరువాత ముందస్తు రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని ఆమోదించిన ఐసీఐసీఐ బ్యాంక్ టెర్మినేషన్ ఫర్ కాజ్'గా పరిగణించి ఆర్బీఐ నుంచి అనుమతి కూడా కోరినట్లు తెలిపింది. కాగా 2019 జనవరిలో దాఖలు చేసిన చార్జిషీట్లో చందా కొచ్ఛర్ ఆధ్వర్యంలోని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిందని సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు తరువాత నిరర్థక ఆస్తులుగా మారాయని, ఫలితంగా బ్యాంకుకు తప్పుడు నష్టం, రుణగ్రహీతకు, నిందితులకు తప్పుడు లాభం కలిగిందని సీబీఐ అభియోగం మోపిన సంగతి తెలిసిందే. -
ఆ సెక్షన్ వర్తిస్తే.. చందా కొచ్చర్ దంపతులకు సుప్రీంకోర్టు నోటీసులు
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. రుణ మోసం కేసులో బాంబే హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సవాలు చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు దీనిపై చందా కొచ్చర్ దంపతుల స్పందన కోరింది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం సీబీఐ పిటిషన్‌పై చందా కొచ్చర్ దంపతులకు నోటీసులు జారీ చేసి మూడు వారాల్లోగా స్పందనను తెలియజేయాలని కోరింది. సెక్షన్ 409 వర్తిస్తే.. సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ, ఐపీసీలోని సెక్షన్ 409 (ప్రభుత్వ సేవకుడి నేరపూరిత నమ్మక ద్రోహం)ను పరిగణనలోకి తీసుకోకుండా, నేరానికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని హైకోర్టు తప్పుగా భావించిందని తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం ముద్దాయిలకు పది సంవత్సరాల నుంచి జీవత ఖైదు శిక్ష పడే ఆస్కారం ఉందన్నారు. ప్రైవేట్ బ్యాంకు అయినప్పుడు ఐపీసీ సెక్షన్ 409 ఎలా వర్తిస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. బ్యాంకు ప్రైవేట్ కావచ్చు కానీ అందులో ప్రజాధనం ఉంటుందని అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానమిచ్చారు. దీనిపై చందా కొచ్చర్ దంపతులకు నోటీసులు జారీ చేసి మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మోసం కేసుకు సంబంధించి 2022 డిసెంబర్ 23న చందా కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్టు చేసింది. అయితే విచక్షణను ఉపయోగించకుండా యాంత్రికంగా చందా కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేసిందని ఆక్షేపిస్తూ బాంబే హైకోర్ట్ జనవరి 9న వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై..
ఐసీఐసీఐ బ్యాంకులో ఆ సంస్థ మాజీ సీఈవో చందాకొచ్చర్ ముడుపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనని ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో పదవి నుంచి అక్రమంగా తొలగించారంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండు వారాల తర్వాత ఆమె వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. లక్షల కోట్ల ఆస్తులు. వేల సంఖ్యలో ఉద్యోగులు. పురుషాధిక్య వ్యాపార రంగం. ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ. అయితేనేం అంకెలతో గారడీ చేసే ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా.. బ్యాంకర్లకు మెగస్టార్లా..తోటి ఉద్యోగులకు దేవుడిలా కనిపించిన చందాకొచ్చర్ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 2018లో అప్పట్లో చందాకొచ్చర్ క్విడ్ ప్రోకో’ వ్యవహారం వెలుగులోకి రావడంతో అక్టోబర్ 4, 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ చందాకొచ్చర్‌తో స్వచ్ఛంద రాజీనామా చేయించింది. 4 నెలల తర్వాత బాంబే హైకోర్టు సైతం బ్యాంక్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైందేనని, చందా కొచ్చర్ సీఈవో పదవిలో కొనసాగేందుకు అనర్హులుగా తీర్పిచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చందా కొచ్చర్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. పలు నివేదికల ప్రకారం.. అదే సమయంలో, తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెన్ఫిట్స్, ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ (ఈఎస్ఓపీఎస్) అందిచాలని కోరింది. టెర్మినేషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, చందా కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్, అతని కంపెనీకి లాభం చేకూర్చిన వీడియోకాన్ గ్రూప్‌కు క్విడ్ ప్రోకో లోన్లు రూ. 3,250 కోట్లు ఇచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ డైరెక్టర్లు మాజీ సీఈవోకి ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ (ఈఎస్ఓపీఎస్) తోపాటు వేతనాన్ని నిలిపివేసింది. ఇప్పుడు అదే అంశాన్ని చందా కొచ్చర్ సుప్రీం కోర్టుకు చేసిన అప్పీల్లో వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ విఫలం ఐసీఐసీఐ బ్యాంక్ తన పదవీ విరమణ తర్వాత సంస్థ అందించే ప్రయోజనాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని నిరోధించాలని సుప్రీంకు విన్నవించారు. తన వద్ద ఉన్న 6,90,000 షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లపై అనుమతించాలని అన్నారు. స్టాక్స్ డీల్ చేసే వీలు లేదని తెలిపేలా ఐసీఐసీఐ యాజమాన్యం వద్ద ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేవని హైకోర్టులో నిరూపించుకోవడంలో విఫలమైందని గుర్తు చేశారు. వేధింపులకు గురవుతున్నారు ఒకప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటును దక్కించుకున్నారని, అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును పొందిన తాను ఈ కేసుల కారణంగా 62 ఏళ్ల వయస్సులో తీవ్రమైన మనోవేదకు గురవుతున్నట్లు అప్పీల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్.. బెయిల్‌పై విడుదల చందా కొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3,200 కోట్లకుపైగా లోన్ తీసుకుంది. ఈ లోన్ మంజూరు సమయంలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీరిద్దరినీ ఈనెల 23న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్ఆర్ఎల్), సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు చందా కొచ్చర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొంది. దీపక్ కొచ్చర్ దంపతులతో పాటు వేణుగోపాల్ ధూత్‌లు డిసెంబర్ 2022లో అరెస్టయ్యారు, అయితే ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. కాగా, ఇండియన్ బ్యాంకింగ్ ట్రెండ్‌ను మార్చేసి.. ఆ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్లారు. కానీ ఇప్పుడు కరువైన పలకరింపులు.. కోర్టులు,కేసులు, అరెస్ట్‌లతో ఆమె జీవితం భారం కావడంతో చందా కొచ్చర్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 చందా కొచ్చర్ అక్రమ సామ్రాజ్య పునాదులు కదిలాయి -
రూ.5.3 కోట్ల ఫ్లాట్ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం?
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ వీడియోకాన్ ముడుపుల వ్యవహారంలో బాంబే హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా చందా కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోర్ట్‌ను కోరింది. కొచ్చర్ రూ.64 కోట్ల బ్యాంక్ నిధుల్ని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారని కోర్ట్‌కు సీబీఐ తెలిపింది. చట్టవిరుద్ధంగా బ్యాంక్ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆధారాలున్నాయని పేర్కొంది. అంతేకాదు, తమ విచారణలో రూ.64 కోట్లను కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూ పవర్ రెన్యూవబుల్తో పాటు వీడియోకాన్ కంపెనీలోకి మళ్లించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ లిమోసిన్.. చందా కొచ్చర్ కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై రుణాలకు అనర్హమైన వీడియోకాన్ కంపెనీకి లోన్స్ ఇచ్చేలా తన పదవిని దుర్వినియోగం చేసినట్లు కోర్ట్ ఎదుట వాదించారు. దీంతో పాటు, 2016లో కొచ్చార్ ముంబైలోని చర్చ్‌గేట్ ప్రాంతంలో ఉన్న సీసీఐ చాంబర్స్‌లోని రూ.5.3 కోట్ల విలువైన ఫ్లాట్‌కు కేవలం రూ.11లక్షలే చెల్లించారని అన్నారు. 2021 నవంబర్ నెలలో అదే బిల్డింగ్‌లో ఓ ఫ్లోర్‌కు చందా కొచ్చర్ కుమారుడు అర్జున్ కొచ్చర్ రూ.19.11 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. 11,000 పేజీల ఛార్జ్ షీట్ ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్ గ్రూపు పొందిన తర్వాత.. అందులో కోట్లాది రూపాయలను దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్‌లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులుగా పెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. కేసులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ 11,000 చార్జిషీట్ దాఖలు చేసింది. జులై 3కి వాయిదా తాజాగా,ఆ చార్జిషీట్‌పై విచారణ జరిగింది. విచారణలో కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్ట్‌ను కోరింది. ఇరువురి వాదనలు విన్న బాంబే హైకోర్ట్ కేసు తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ ఎదుట లిమోసిన్ తన వాదనలు కొనసాగించనున్నారు. 2017లోనే తెరపైకి క్విడ్ ప్రో కో వివాదం.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచ్చర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంక్ నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ.1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. చివరిగా :: సీబీఐ నివేదికల ప్రకారం..ఆగస్ట్ 6, 2009లో వీడియోకాన్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా ఉన్న చందా కొచ్చార్ లోన్లు ఇచ్చారని, అదే ఏడాది సెప్టెంబర్ 7 ఆ రుణాల్ని వీడియోకాన్‌కు చెల్లించినట్లు తేలింది. చదవండి👉 ‘అప్పుడు మెగాస్టార్.. ఇప్పుడు ఆర్థిక నేరాలతో అరెస్ట్’ -
కొడుకు పెళ్లికి ముందే.. కొచ్చర్ దంపతులకు భారీ ఊరట, జైలు నుంచి విడుదల
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త చందా కొచ్చర్ అరెస్ట్ అక్రమమంటూ బాంబే హైకోర్ట్ తీర్పు వెలువరించింది. దీంతో మంగళవారం చందా, దీపక్ కొచ్చర్లు జైలు నుంచి విడుదలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియో కాన్ గ్రూప్‌కు రూ.3వేల కోట్ల రుణం మంజూరు చేశారంటూ గతేడాది డిసెంబర్ 23న సీబీఐ అధికారులు కొచ్చర్ దంపతుల్ని అరెస్ట్ చేశారు. జనవరి 25న కొచ్చర్ల కుమారుడు వివాహం జరగాల్సి ఉండగా.... అంతకంటే ముందే వారిద్దరి అరెస్ట్ సరైంది కాదంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్లైంది. కోర్టు తీర్పులో ఏముందంటే? కేసు నమోదు చేసిన నాలుగేళ్ల తర్వాత ఆ జంటను అరెస్టు చేయడానికి గల కారణాన్ని అరెస్ట్ మెమోలలో పేర్కొనలేదని కోర్టు నిన్న తెలిపింది. "అరెస్ట్ మెమోలలో పేర్కొన్న పిటిషనర్లను అరెస్టు చేయడానికి కారణం తప్పనిసరి నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే" అని పేర్కొంది. నిందితులు చేసిన తప్పు ఒప్పుకోకపోతే.. వాళ్లు విచారణకు సహకరించలేమని చెప్పలేమని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం కింద తమ అరెస్టు చట్టవిరుద్ధమని, దర్యాప్తు ప్రారంభించేందుకు చట్టంలోని సెక్షన్ 17ఎ కింద అనుమతి తప్పనిసరి అని, ఈ దర్యాప్తును ప్రారంభించడానికి ఏజెన్సీకి అలాంటి అనుమతి లేదని కొచ్చర్ దంపతులు గతంలో కోర్టు ముందు వాదించారు. కాగా, ఇప్పటి ఐసీఐసీఐ రుణం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ -
Chanda Kochhar: రూ.5.25 కోట్ల ప్లాట్ ఖరీదు రూ.11 లక్షలే!
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ కుంభకోణంలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లోన్ కేసులో ప్రధాన నిందితులైన చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్తో పాటు వేణుగోపాల్ ధూత్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు నిందితుల మధ్య జరిగిన లావాదేవీలను పరిశీలించగా అందులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొచ్చర్ దంపతులకు లంచాలు ఎలా ఇచ్చారంటే? ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా చందా కొచ్చర్ ఆర్బీఐ బ్యాంక్‌లకు విధించిన బ్యాంకింగ్ రెగ్యూలేషన్ యాక్ట్, క్రెడిట్ పాలసీ (రుణ) నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌కు రూ.3250 కోట్లలోన్ మంజూరు చేశారు. అందుకు గాను ధూత్.. కొచ్చర్ కుటుంబానికి లంచాలు ఇచ్చినట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. వడ్డీతో పాటు షేర్ కూడా రుణం మంజూరు తర్వాత భార్య భర్తలైన చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్‌కు వేణుగోపాల్ ధూత్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రుణం విషయంలో అనుకూలంగా వ్యవహరించారనే కారణంగా ధూత్ తన వీడియోకాన్ గ్రూప్‌లో ఆ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా చందాకొచ్చర్‌కు షేర్ ఇవ్వడంతో పాటు సంస్థ నుంచి వచ్చిన లాభాల్లో అధిక మొత్తంలో వడ్డీ ఇచ్చారు. పైగా తన ఖరీదైనా ప్లాటులో నివాసం ఉండేలా కొచ్చర్ దంపతులు ఇచ్చారు. అప్పు తీర్చేందుకు అప్పుగా రూ.300 కోట్ల రుణం సీఈవో పదవితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ శాంక్షనింగ్ కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్న చందా కొచ్చర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ పదవిలో(శాంక్షనింగ్ కమిటీ చైర్ పర్సన్ గా) ఉన్న ఆమె బ్యాంక్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (వీఐఎల్)కు రూ.300కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ రుణాన్ని వీడియోకాన్ గతంలో అదే బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు.. కొత్తగా వందల కోట్లను రుణాన్ని ఇచ్చింది. ఆ తర్వాత శాక్షనింగ్ కమిటీ పదవి నుంచి తప్పుకుంది. రూ.64కోట్లు ముడుపులు అందుకు ప్రతిఫలంగా వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్..చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూ పవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (nrpl) సంస్థ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.64 కోట్లు ముడుపులుగా ఇచ్చినట్లు సీబీఐ తన ఇన్వెస్టిగేషన్లో గుర్తించింది. ఆ రూ.64 కోట్లతో దీపక్ కొచ్చర్ 33.15 మెగా వాట్ల కెపాసిటీతో విండ్ ఫార్మ్ ప్రాజెక్ట్ కావాల్సిన భారీ ఎత్తున చిన్న చిన్న విండ్ టర్బైన్లను కొనుగోలు చేశారు. రూ.5.25 కోట్ల ప్లాట్ ఖరీదు రూ.11 లక్షలే చందా కొచ్చర్, ఆమె కుటుంబం వేణుగోపాల్ ధూత్ నుంచి అన్నీ రకాల లబ్ధి పొందినట్లు దర్యాప్తు అధికారులు విచారణలో స్పష్టమైంది. పైన పేర్కొన్నుట్లుగా రూ.64 కోట్లతో పాటు ముంబైలోని సీసీఐ ఛాంబర్స్‌లో ఉన్న రూ.5.25 కోట్ల ఖరీదైన ఫ్లాటును 1996 నుంచి 2016 వరకు ఫ్రీగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత అదే ప్రాపర్టీని రూ.11లక్షలకు కొనుగోలు చేసిన వీడియోకాన్ గ్రూప్ తెలిపింది. ఈ లావాదేవీలు 2016 లో జరిగాయి. కానీ ఈ ప్లాట్ కొనుగోలు మాత్రం సంవత్సరాల ముందు నుంచి ఒప్పందం జరిగినట్లు సమాచారం. -
వీడియో కాన్ సీఈవో వేణుగోపాల్ ధూత్ అరెస్ట్!
ఐసీఐసీఐ రుణం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించే సమయంలో వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రూ. 3వేల కోట్లుకు పైగా రుణంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ అరెస్ట్ చేసింది. వారిద్దరిని అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఇవాళ (సోమవారం) వేణుగోపాల్ ధూత్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేరపూరిత కుట్ర ఈ సందర్భంగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీపక్ కొచ్చర్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న నూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్ఆర్ఎల్) కంపెనీలతో పాటు కొచ్చర్ దంపతులతో పాటు, వేణుగోపాల్ ధూత్‌ను నిందితులుగా పేర్కొంది. రూ.40వేల కోట్లు రుణంలో ఇదొక భాగం కేసులో అభియోగాల ప్రకారం.. 2010 - 2012 మధ్యకాలంలో వీడియోకాన్ గ్రూప్‌కు బ్యాంకు రుణం మంజూరు చేసిన నెలల తర్వాత, క్విడ్ ప్రోకోలో భాగంగా వేణుగోపాల్ ధూత్ న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో రూ. 64 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అంతేకాదు చందా కొచ్చర్ తన పదవిని దుర్వినియోగం చేసి వీడియోకాన్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసినందుకు ధూత్ నుండి తన భర్త దీపక్ కొచ్చర్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంది. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం నుండి వీడియోకాన్ పొందిన రూ. 40వేల కోట్ల రుణంలో ఇది భాగం . పదవి నుంచి వైదొలగి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్,ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ వీడియోకాన్ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా చందా కొచర్ 2018 అక్టోబర్‌లో కీలక బాధ్యతల నుంచి వైదొలిగారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్బీఐ మార్గదర్శకాలు,బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘించి వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీ బ్యాంక్ రూ. 3,250 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. చందా కొచ్చర్ మాత్రం రుణాల విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కొట్టిపారేశారు. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ -
పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’
వేగంగా డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ కథ అడ్డం తిరిగినప్పుడు కళ్లముందున్న డబ్బు కూడా చేతికొచ్చేలోగా ఆవిరైపోవచ్చు. అప్పుడు చేసిన పాపాలకు ముసుగేసే టైం దొరక్కపోవచ్చు. కష్టపడకుండా వచ్చిన సొమ్మును కాపాడుకోవడం కూడా కష్టమేనని నిరూపించిన సంఘటన చందాకొచ్చర్ స్కాం. కాస్త తెలివితేటలతో బ్యాంకింగ్ వ్యవస్థను అడ్డంగా వాడుకోవచ్చని బయటపెట్టిన ఈ కుంభకోణమే చందా కొచ్చర్ స్కాం. ఏదైనా సాధించడం ఎంత కష్టమో. దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. పవర్ఫుల్ బ్యాంకర్‌గా పేరు తెచ్చుకున్న చందా కొచ్చర్ పొజీషన్ కూడా అదే. లక్షల కోట్ల ఆస్తులు. వేల సంఖ్యలో ఉద్యోగులు. పురుషాధిక్య వ్యాపార రంగం. ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ. అయితేనేం అంకెలతో గారెడీ చేసే ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా.. బ్యాంకర్లకు మెగస్టార్లా..తోటి ఉద్యోగులకు దేవుడిలా కనిపించారు. ఇండియన్ బ్యాంకింగ్ ట్రెండ్‌ను మార్చేసి.. ఆ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్లారు. కానీ కొంతమందిని కొంతకాలమే మోసం చేయొచ్చు. కానీ ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సీఈవోగా ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఏలిన కొచ్చర్ కూడా అలాగే దొరికి పోయారు. బ్యాంకింగ్ రంగంలో నడిచిన కరప్షన్ ఏపీసోడ్ మొత్తం బయటపడింది. చందా కొచ్చర్ అక్రమసామ్రాజ్యం పునాదులతో కదిలాయి. సీబీఐ అరెస్ట్ ఒకప్పుడు మ్యాగజైన్ కవర్ పేజీల మీద మెరిసిన స్టార్ చందా కొచ్చర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. వేణుగోపాల్ ధూత్‌కి చెందిన వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రూ. 3,000 కోట్లకు పైగా రుణాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ముడుపుల వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎస్సార్ గ్రూప్, వీడియోకాన్ గ్రూప్‌లో లాంచాల భాగోతం ఎలా వెలుగులోకి వచ్చింది. ఇచ్చుకో.. పుచ్చుకో 2010లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సాఆర్ స్టీల్‌కి 530 మిలియన్ డాలర్లు అప్పిచ్చింది. ఎస్సార్ ఆయిల్‌కి 350 మిలియన్ డాలర్ల అప్పును పువ్వులో పెట్టి ఇచ్చింది. ఎస్సార్ గ్రూప్‌లోని రెండు కంపెనీలకు అప్పులిచ్చిన తర్వాత లంచాల భాగోతం మొదలైంది. అంటే 2010 నుంచి 2012 మధ్య కాలంలో చందా కొచ్చర్ భర్త దీపా కొచ్చర్ కంపెనీలో పెట్టుబడులను అంటే లంచాల ద్వారా పంపించారు. ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన ఫస్ట్ హ్యాండ్ హోల్డింగ్స్ నాలుగు విడతులుగా న్యూ పవర్లో రూ.325 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. శశిరూయా అల్లుడు అనిరుధ్ భువాల్కాకు చెందిన ఏ1 మోటార్స్ అనే సంస్థ ఏంఎండబ్ల్యూ అనే మరో సంస్థతో న్యూపవర్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసిందని అరవింద్ గుప్తా అనే ఇన్వెస్టర్, సామాజిక కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విలువ ఎంతన్నది బయటకు రాలేదు. అంటే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రెండు కంపెనీలకు అప్పులందాయి. అడిగినంత అప్పు ఇచ్చినందుకు ప్రతిఫలంగా న్యూపవర్‌కు వెళ్లింది. చదవండి👉ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్! తీగలాగితే డొంక కదలింది అప్పులిచ్చిన చందా కొచ్చర్, లంచం తీసుకున్న దీపా కొచ్చర్ భార్యభర్తలు. అప్పులు తీసుకున్న రుయా సోదరులకు పెట్టుబడులు పెట్టిన అనిరుధ్, నిషాంత్ అల్లుళ్లు. ఈ వ్యవహారమే క్విడ్ ప్రోకో అని రిజిష్టార్ ఆఫీస్ కంపెనీస్ నుంచి సేకరించిన సమాచారం తన దగ్గరుందని విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు కొనసాగుతుండగా చందా కొచ్చర్ వీడియోకాన్‌కు రూ.3 వేల కోట్లకు పైగా ఇచ్చిన రుణం ఇచ్చినందుకు గాను తీసుకున్న ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో చందా కొచ్చర్ చీకటి సామ్రాజ్యం ప్రపంచానికి తెలిసింది. తీగలాగితే డొంక కదిలిందిన్నట్లుగా వీడియో కాన్ గ్రూప్‌ల వద్ద నుంచి తీసుకున్న ముడుపులు దెబ్బకు గతంలో ఎస్సాఆర్ గ్రూప్ వ్యవహారం బయటకొచ్చింది. కొచ్చర్ భాగోతంపై ప్రధానికి లేఖ వీడియోకాన్ గ్రూప్‌లో పెట్టుబడిదారు అరవింద్ గుప్తా. ఆ అరవింద్ గుప్తా 2016లో ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్‌ల మధ్య జరిగిన లావాదేవీలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కొచ్చర్ భాగోతాలపై అదే ఏడాది మార్చిలో ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖతో రంగంలో దిగిన ఆర్బీఐ దర్యాప్తు చేసింది. చందా కొచర్ - దీపక్ కొచ్చర్ అరెస్ట్: అక్టోబరు 2016: చందా కొచ్చర్‌పై ఆరోపణలు వెల్లు వెత్తిన తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌లో రుణ అక్రమాలు హైలెట్ అయ్యాయి. రంగంలోకి దిగిన ఆర్బీఐ దర్యాప్తు చేసింది కానీ.. కొచ్చర్ ముడుపుల వ్యవహారాన్ని ఎటూ తేల్చ లేకపోయింది. మార్చి 2018: 31లోన్ తీసుకున్న బ్యాంక్ అకౌంట్లలో సమస్యలను గుర్తించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ బ్యాంక్, ఆర్బీఐకు విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా ఫిర్యాదు చేచేశారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత, సీబీఐ అంతర్గత విచారణను దాఖలు చేసి దీపక్ కొచ్చర్‌ను ప్రశ్నించడం ప్రారంభించింది. ఏప్రిల్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు చందా కొచ్చర్‌కు అండగా నిలిచింది. ఆమెపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. కొన్ని వారాల తర్వాత, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFO) ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు చేసిన వీడియోకాన్ రుణంపై దర్యాప్తు చేయడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిని కోరింది. మే - జూన్ 2018: చందా కొచ్చర్‌పై విజిల్‌బ్లోయర్ తాజా ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ తప్పులు చేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ విచారణ ప్రారంభించడంతో మే నెలలో కొచ్చర్ సెలవుపై వెళ్లారు. జూలై 2018: షోకాజ్ నోటీసుకు తన ప్రత్యుత్తరాన్ని సమర్పించాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొచ్చర్‌ని కోరింది. అక్టోబర్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో బాధ్యతలకు చందా కొచ్చర్ రాజీనామా సమర్పించారు. జనవరి 2019: 2012లో వీడియోకాన్ గ్రూప్‌కు మంజూరైన రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దీపక్ కొచ్చర్, చందా కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ వెంటనే, చందా కొచ్చర్ బ్యాంక్ కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్ర దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 2019: చందా కొచ్చర్‌పై సీబీఐ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. జనవరి 2020: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చందా కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. వీటి విలువ రూ.78 కోట్ల పైమాటే. సెప్టెంబర్ 2020: మనీలాండరింగ్ కేసులో దీపక్ కొచ్చర్‌ను ఈడీ అరెస్టు చేసింది. నవంబర్ 2020: చందా కొచ్చర్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 2021: దీపక్ కొచ్చర్ రూ. 3 లక్షల వ్యక్తిగత బాండ్‌పై విడుదలయ్యారు మే 2022: సీబీఐ చందా కొచ్చర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. డిసెంబర్ 23, 2022: చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సిబిఐ అరెస్టు చేసింది. డిసెంబరు 26, 2022 వరకు వారిని 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి తీసుకుంది. పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి 1984లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన చందా కొచ్చర్.. అతి తక్కువ సమయంలో దేశ బ్యాంకింగ్ రంగంలో స్టార్‌గా ఎదిగారు. అనతి కాలంలో ట్రైనీ నుంచి బ్యాంక్ సీఈవోగా ఆమె ఎదిగిన తీరు అమోఘం..అనర్వచనీయం. 2009 మేలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా, ఎండీగా చందా కొచ్చర్ నియమితులయ్యారు. ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఐసీఐసీఐ బ్యాంక్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రభుత్వ బ్యాంకులకు గట్టి పోటీ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగంలో ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2011లో పద్మ భూషణ్ ప్రదానం చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు కూడా చోటు దక్కింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకుపైగా కాలంలో ఎన్నోసార్లు అత్యంత ప్రభావశీల మహిళగా చందా కొచ్చర్ గుర్తింపును పొందారు. కానీ, ఎంతో అద్భుతంగా సాగుతున్న తన బ్యాంకింగ్ కెరీర్ మెరుపుల నుంచి మరకల వరకు ఇలా కటకటాల వెనక్కి వెళ్తామని బహుశా ఆమె కూడా ఊహించి ఉండరు. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
3 రోజుల పాటు సీబీఐ కస్టడీలో చందా కొచర్, దీపక్ కొచర్
ఐసీఐసీఐ మాజీ సీఈవో, ఎండీ చందాకొచర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టు 3 రోజుల పాటు సీబీఐ కస్టడీని విధించింది. వీడియోకాన్ రుణాల అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరూ 26 తేదీ వరకూ సీబీఐ తన కస్టడీలో ఉంచుకోనుంది. ఈ కేసులో వీరివురిని స్వల్పకాలిక విచారణ తర్వాత శనివారం అరెస్టు చేశారు. విచారణలో వారిద్దరూ సహకరించలేదని, అందుకే అరెస్టు చేశామని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. కాగా 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచర్‌కి చెందిన కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. -
‘ఐసీఐసీఐ’ మాజీ సీఈవో చందా కొచర్ అరెస్ట్
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల్లో అవకతవకలు, మోసం ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి వారిని ముందుగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రశ్నించారు. అయితే, వారు విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. చందా కొచర్, దీపక్ కొచర్లను శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. తొలి చార్జి షీటును కూడా సీబీఐ సత్వరం దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచర్‌కి చెందిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
ఐసీఐసీఐ స్కాం : చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ
బాంబే హైకోర్టులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పదవీ విరమణ తర్వాత కొచ్చర్ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు 2018లో ఆమె సంపాదించిన 6.90 లక్షల షేర్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని జస్టిస్ ఆర్ఐ గహ్లా సింగిల్ బెంచ్ కొచ్చర్‌ను కోరినట్లు పీటీఐ నివేదించింది.దీంతో పాటు గతంలో ఆమె ఏదైనా షేర్లకు సంబంధించి ట్రాన్సాక్షన్, ఇతర వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఉంటే, ఆరు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని గహ్లా అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చాగ్లా మాట్లాడుతూ కొచ్చర్ రాజీనామా సమయంలో వెల్లడించని వాస్తవాలు ఇతర అంశాలపై పూర్తి అవగాహన బ్యాంకుకు లేదన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు విచారణ నివేదిక అందిన తర్వాత మాత్రమే వెల్లడయ్యాయని అన్నారు. కాగా, ఐసీఐసీఐ స్కాంలో చందా కొచర్ వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చందా కొచర్ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ .300 కోట్ల రుణ మొత్తంలో రూ .64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ నుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్ దంపతులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్ భర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు, ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. చందా కొచర్ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం అరెస్టు చేసింది, ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసుకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. రేపు (మంగళవారం) సెషన్స్ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మోసం, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ తోపాటు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, అతని కంపెనీలపై జనవరి 22, 2019 న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, జనవరి 31న, ఐసీఐసీఐ బ్యాంక్ కార్పొరేట్ గ్రూపు 1,875 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలకు సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నఆస్తులను విడుదల చేయాలని కోరుతూ దీపక్ కొచర్‌కు చెందిన పసిఫిక్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల సీజ్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుందని, ఈడీ ఎలాంటి చార్జ్ షీట్ దాఖలు చేయని కారణంగా సంస్థ ఆస్తులను విడుదల చేయాలని కోరింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ ఇలాంటి పిటిషన్ ఇప్పటికే బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని వాదించింది. గత ఏడాది మార్చిలో, పసిఫిక్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఈడీ దాడుల సందర్భంగా డైరీ, హార్డ్ డిస్క్‌తోపాటు 10.5 లక్షలరూపాయలను స్వాధీనం చేసుకుంది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ స్కాం బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు రేపింది. 3,250 కోట్ల రూపాయల కుంభకోణంలో క్విడ్ ప్రో కో కింద అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచర్ తన పదవిని కోల్పోయారు. -
ఐసీఐసీఐపై కౌంటర్ వేయనున్న చందా కొచర్
ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్ తనను సీఈవోగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు 2009 నుంచి 2019 వరకు పొందిన బోనస్‌లను తిరిగి ఇచ్చేయాలన్న ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయంపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రంజిత్, జస్టిస్ కార్నిక్‌తో కూడిన దర్మాసనం వాదనలు విననుంది. మరోవైపు హేతుబద్దమైన ఆధారాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా తనను తొలగించడంపైనే ఆమె పిటిషన్‌లోని ముఖ్య అంశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చందాకొచర్ తరుపున విక్రమ్ నన్‌కాని, సుజయ్ కంతవాలా వాదనలు వినిపిస్తుండగా ఐసీసీఐ బ్యాంక్ తరపున డారియస్ కమ్‌బాటా వినిపించనున్నారు. కాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న చందాకొచర్‌పై వీడియోకాన్ రుణాలకు సంబంధించిన క్రిడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చందా కొచర్, భర్త దీపక్ కొచర్‌తో పాటు ఇతర బంధువులను కూడా చార్జ్ షీటు చేర్చింది. అయితే ప్రారంభంలో చందా కొచర్‌ను వెనకేసుకొచ్చిన బోర్డు, ఆరోపణలపై విచారణకు నియమించిన మాజీ న్యాయమూర్తి బీఎన్ కృష్ణ ఆధ్వర్యంలోని స్వతంత్ర దర్యాప్తు కమిటీ నివేదిక అనంతరం ఆమెపై వేటు వేసిన సంగతి తెలిసిందే. -
చందా కొచ్చర్‌ను మళ్లీ ప్రశ్నించనున్న ఈడీ
ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ మనీల్యాండరింగ్ కేసులో విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విస్తృతం చేయనుంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్తో పాటు బ్యాంకు ఉన్నతాధికారులను మరోసారి ప్రశ్నించనున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో చందా కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్లను గతనెలలో ప్రశ్నించిన ఈడీ వారి స్టేట్మెంట్లను నమోదు చేసింది. చందా కొచ్చర్ ఇచ్చిన సమాధానాలను ఇతర అధికారులను ప్రశ్నించి వారి సమాధానాలతో సరిపోల్చేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో వీడియోకాన్ డీల్ గురించి పూర్తి సమాచారం రాబట్టేందుకు ఈడీ కసరత్తు ముమ్మరం చేసింది. కాగా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కొన్ని వ్యక్తిగత కారణాలతో తనకు కొంత సమయం కావాలని కోరిన చందా కొచ్చర్ త్వరలోనే ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కాగా,ఈ కేసుకు సంబంధించి మనీల్యాండరింగ్ చట్టం కింద చందా కొచ్చర్ ఆమె మరిది రాజీవ్ కొచ్చర్ల ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ యోచిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్‌కు రుణాలు జారీ చేసే క్రమంలో పెద్దమొత్తంలో బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు ముడుపులు ముట్టాయని, అనుచిత లబ్ధిపొందారనే అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. -
మరోసారి ఈడీ ముందుకు కొచర్ దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ మంగళవారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. సోమవారం దాదాపు ఎనిమిది గంటలపాటు వీరిని ఈడీ ప్రశ్నించింది . వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే వారు రావాల్సి ఉన్నా కొంత గడువు కోరడంతో ఈడీ అనుమతించింది. బ్యాంకు రుణాలమంజూరులో మోసం, నగదు బదిలీ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను కొద్ది రోజుల క్రితమే ఈడీ విచారణ చేసింది. సీబీఐ కూడా గతంలో ఆయన్ని ప్రశ్నించింది. వీడియోకాన్ గ్రూప్ రుణాలను ఐసీఐసీఐ బ్యాంక్ పునర్వ్యవస్థీకరించడంలో ఆయన పాత్ర గురించి విచారణ చేసింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపు రూ.1,875 కోట్ల మేర రుణాలివ్వడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఏడాది క్రితం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. చందా కొచర్ సహకారంతో ఐసీఐసీఐ నుంచి రుణాలు తీసుకున్న ధూత్.. ప్రతిగా ఆమె భర్త దీపక్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో ఇన్వెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. -
ఈడీ ముందుకు చందా కొచర్
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే వారు రావాల్సి ఉన్నా కొంత గడువు కోరడంతో ఈడీ అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను కొద్ది రోజుల క్రితమే ఈడీ విచారణ చేసింది. సీబీఐ కూడా గతంలో ఆయన్ని ప్రశ్నించింది. వీడియోకాన్ గ్రూప్ రుణాలను ఐసీఐసీఐ బ్యాంక్ పునర్వ్యవస్థీకరించడంలో ఆయన పాత్ర గురించి విచారణ చేసింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపు రూ.1,875 కోట్ల మేర రుణాలివ్వడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఏడాది క్రితం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. చందా కొచర్ సహకారంతో ఐసీఐసీఐ నుంచి రుణాలు తీసుకున్న ధూత్.. ప్రతిగా ఆమె భర్త దీపక్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో ఇన్వెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. చందా కొచర్, దీపక్ కొచర్ల మంగళవారం మళ్లీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. -
కొచర్‌పై కొనసాగుతున్న ప్రశ్నల వర్షం
ముంబై: అక్రమ ధనార్జన కేసులో సోమవారం వరుసగా నాల్గవరోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందాకొచర్‌ను ప్రశ్నించారు. చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగురోజులుగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్‌కు చెందిన కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ముంబై, ఔరంగాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,875 కోట్ల రుణ మంజూరు విషయంలో తీవ్ర అవకతవకలు, అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈడీ, ఈ అంశంలో తదుపరి విచారణను తీవ్రతరం చేసింది. మార్చి 1 నుంచీ... మార్చి 1న చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్లను సౌత్ ముంబైలోని వారి నివాసంలో ఈడీ అధికారులు మొదటిసారి ప్రశ్నించారు. సోమవా రం ఇక్కడి ఈడీ కార్యాలయంలో ఆమెను అధికారులు తాజాగా ప్రశ్నించారు. కాగా ఆదివారం ఈడీ అధికారులు మాటిక్స్ గ్రూప్ చైర్మన్, ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు రవి రుయా మేనల్లుడు నిషాంత్ కనోడియాను కూడా ప్రశ్నించారు. మారిషస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయన ఫస్ట్‌లాండ్ హోల్డింగ్స్ దీపక్ కొచర్ నిర్వహిస్తున్న నూపవర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ కేసులో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ దూత్‌పై మార్చి 2న ఈడీ అధికారులు అర్ధరాత్రి వరకూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. -
ఈడీ విచారణకు చందా కొచ్చర్ హాజరు
ముంబై : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్ శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. కాగా ఈడీ విచారణకు చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ మేనేజింగ్ డైరక్టర్ వేణుగోపాల్ ధూత్ కూడా హాజరయ్యారు. ప్రయివేట్ కంపెనీలకు మంజూరు చేసిన రుణాల విషయంలో చందా కొచర్‌పై ఐసీఐసీఐను మోసగించడం, క్రిమినల్ కుట్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 1,875 కోట్ల రుణాలిచ్చిన కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ... చందా కొచర్‌తో పాటు వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ నివాసాల్లో నిన్న ఏకకాలంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈడీ విచారణ అనంతరం చందా కొచ్చర్ ఇవాళ మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయినా... ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్ మాత్రం ఇంకా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. -
చందా కొచర్, ధూత్ నివాసాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 1,875 కోట్ల రుణాలిచ్చిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌తో పాటు వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ నివాసాల్లో శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దక్షిణ ముంబైలోని కొచర్ నివాసంలో, ఔరంగాబాద్‌లోని ధూత్ నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. కొచర్ నివాసంలో సోదాలు చేయడం ఇదే తొలిసారి. సీబీఐ ఇప్పటికే ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రైవేట్ కంపెనీలకు మంజూరు చేసిన రుణాల విషయంలో చందా కొచర్‌పై ఐసీఐసీఐను మోసగించడం, క్రిమినల్ కుట్ర ఆరోపణలు ఉన్నాయి. కన్సార్షియంలో భాగంగా వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ ఇచ్చిన రుణాల్లో అవకతవకలేమైనా జరిగాయా అన్న కోణంలో జరిగిన ప్రాథమిక విచారణ (పీఈ) అనంతరం చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధికార్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఐసీఐసీఐ బ్యాంక్ ఏర్పాటు చేసిన జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిటీ కూడా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరీలో చందా కొచర్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల మంజూరీలో చందా కొచర్ పాత్ర కూడా ఉండటం, ఆ తర్వాత ఆమె భర్త దీపక్కి చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో ధూత్ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడవటంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్‌కి ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారాయి. -
చందా కొచర్‌కు ఈడీ షాక్!
న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. వీడియోకాన్‌కు మంజూరు చేసిన రుణాల వివాదంలో ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఈడీ.. చందా కొచర్‌తో పాటు వేణుగోపాల్ ధూత్ ఇంటిపై కూడా రైడ్ చేసింది. కాగా వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణాలు మంజూరు చేయడంలో.. అప్పటి సీఈఓ చందా కొచర్ కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్.. చందా భర్త దీపక్ కొచర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. తొలుత చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు వెనకేసుకొచ్చినప్పటికీ, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. అయితే అంతకు ముందే చందా కొచర్ తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించడంతో పాటు అప్పటిదాకా ఇచ్చిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు మొదలైనవన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు, చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లపై సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల్లో చాలా భాగం మొండిబాకీలుగా మారగా, ఐసీఐసీఐకి రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పట్లో రుణాలు మంజూరు చేసిన కమిటీలో సభ్యులైన పలువురు బ్యాంకింగ్ దిగ్గజాల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో సీబీఐ ప్రస్తావించింది. -
చందా కొచర్‌పై లుక్ అవుట్ నోటీసు
న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు రుణాల వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ తాజాగా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోకుండా చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిపై కేసు నమోదైన వారం వ్యవధిలోనే నోటీసులపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. చందా కొచర్ స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి ఇప్పటిదాకా ఆమెకు సమన్లేమీ జారీ చేయలేదని అధికారవర్గాలు తెలిపాయి. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు పారిపోకుండా నిలువరించేందుకు సీబీఐ లుక్ అవుట్ నోటీసును ఇమిగ్రేషన్ అధికారులకు పంపుతుంది. ఒకవేళ నిందితులు అటువంటి ప్రయత్నమేదైనా చేసిన పక్షంలో ఇమిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, విచారణ సంస్థలకు అప్పజెప్పాల్సి ఉంటుంది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్.. చందా భర్త దీపక్ కొచర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. తొలుత చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు వెనకేసుకొచ్చినప్పటికీ, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. అంతకు ముందే చందా కొచర్ రాజీనామా చేసినప్పటికీ కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించడంతో పాటు అప్పటిదాకా ఇచ్చిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు మొదలైనవన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు, చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లపై సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల్లో చాలా భాగం మొండిబాకీలుగా మారగా, ఐసీఐసీఐకి రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పట్లో రుణాలు మంజూరు చేసిన కమిటీలో సభ్యులైన పలువురు బ్యాంకింగ్ దిగ్గజాల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో సీబీఐ ప్రస్తావించింది. -
చందా కొచ్చర్‌కి సీబీఐ షాక్
-
చందా కొచర్ దోషే!!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ కమిటీ... ఈ వ్యవహారంలో ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం ఈ విషయాలు వెల్లడించింది. చందా కొచర్ ఇప్పటికే రాజీనామా చేసినప్పటికీ... నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. రాజీనామా కాస్తా ఉద్వాసనగా మారడంతో ఆమె పొందిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు, వైద్య చికిత్స పరమైన ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్స్ మొదలైనవి రద్దవుతాయని తెలిపింది. 2009 ఏప్రిల్ నుంచి 2018 మార్చి దాకా చందా కొచర్ పొందిన బోనస్‌లన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. వివాదం వెలుగు చూశాక చాన్నాళ్ల దాకా చందా కొచర్‌ను వెనకేసుకొచ్చిన బ్యాంక్... తాజాగా నివేదిక నేపథ్యంలో స్వరం మార్చడం గమనార్హం. ఈ వివాదంలో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ తదితరులపై సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంక్ నైతిక నియమావళి, విధుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను చందా కొచర్ ఉల్లంఘించారని విచారణ నివేదికలో వెల్లడైంది’ అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఆమె అశ్రద్ధ వల్ల బ్యాంక్ విధానాలు నిర్వీర్యమయ్యాయని ఆక్షేపించింది. ఆకాశం నుంచి అధఃపాతాళానికి.. దేశీ రిటైల్ బ్యాంకింగ్ స్వరూపాన్ని మార్చేసిన అత్యంత శక్తిమంతమైన మహిళగా కొన్నాళ్ల క్రితం దాకా సర్వత్రా ప్రశంసలు అందుకున్న చందా కొచర్ .. వీడియోకాన్ రుణ వివాదంతో అప్రతిష్ట పాలైన సంగతి తెలిసిందే. 2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రూ. 3,250 కోట్ల రుణాల విషయంలో అవకతవకలు జరిగాయని, ఈ లావాదేవీల ద్వారా చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారంటూ కొన్నాళ్ల క్రితం ప్రజావేగు ఒకరు బైటపెట్టడంతో ఈ కేసుపై అందరి దృష్టి మళ్లింది. బ్యాంకు నుంచి రుణం పొందిన వెంటనే వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ .. దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిన కమిటీలో చందా కొచర్ కూడా ఉండటం అనుమానాలు రేకెత్తించింది. ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ముందుగా చందా కొచర్‌ను వెనకేసుకొచ్చినప్పటికీ.. వివాదం మరింత ముదరడంతో వెనక్కి తగ్గింది. 2018 జూన్ 6న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో సమగ్ర విచారణ కోసం స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో పరిశీలించిన డైరెక్టర్లు తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదంపై విచారణ జరుపుతున్న సీబీఐ.. ఇటీవలే చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్ తదితరులపై క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. షాకింగ్ నిర్ణయం తనను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించాలన్న బ్యాంక్ బోర్డు నిర్ణయంపై చందా కొచర్ విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్ర నిరాశకు, షాక్‌కు గురిచేసిందన్నారు. బ్యాంకు మంజూరు చేసే రుణాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలేవీ ఏకపక్షంగా ఉండవని ఆమె స్పష్టం చేశారు. ‘అంతిమంగా సత్యమే జయిస్తుందని నమ్ముతున్నాను. కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో నేనెప్పుడూ వెనుకాడలేదు, ఒక ప్రొఫెషనల్‌గా ఎప్పుడూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు‘ అని చందా కొచర్ చెప్పారు. లాభం 3% డౌన్ రూ. 1,605 కోట్లు ∙మొండిబాకీలకు పెరిగిన కేటాయింపులు న్యూఢిల్లీ: మొండిబాకీలకు కేటాయింపులు పెరగడంతో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో 3 శాతం క్షీణించి రూ.1,605 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.1,650 కోట్లు. క్యూ3లో ఆదాయం రూ. 16,832 కోట్ల నుంచి రూ.20,163 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం వృద్ధితో రూ. 5,705 కోట్ల నుంచి రూ.6,875 కోట్లకు పెరిగింది. ట్రెజరీ ఆదాయం కూడా రూ. 66 కోట్ల నుంచి ఏకంగా రూ.479 కోట్లకు ఎగియగా, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతంగా నమోదైంది. మొండి బాకీలు క్షీణించినప్పటికీ.. వాటికి సంబంధించిన కేటాయింపులు రూ. 3,570 కోట్ల నుంచి రూ. 4,244 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే లాభం 1.1 శాతం క్షీణించి రూ. 1,874 కోట్లుగా నమోదైంది. అనుబంధ సంస్థల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు అసెట్ క్వాలిటీ మెరుగుపడినా.. మొండిబాకీలకు మరింత ప్రొవిజనింగ్ చేయాలని బ్యాంక్ భావించడమే ఇందుకు కారణం. మొత్తం ప్రొవిజనింగ్ 18.89 శాతం పెరిగింది. ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తిని మెరుగుపర్చుకోవడం, గత మొండిబాకీల ప్రభావాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సంస్థ సీఈవో సందీప్ బక్షి తెలిపారు. 2.58 శాతానికి ఎన్పీఏలు.. మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) స్వల్పంగా 7.82% నుంచి 7.75%కి తగ్గాయి. అటు నికర ఎన్పీఏలు 4.20 శాతం నుంచి 2.58 శాతానికి దిగివచ్చాయి. విలువపరంగా చూస్తే మాత్రం స్థూల ఎన్పీఏలు రూ. 46,038 కోట్ల నుంచి రూ.51,591 కోట్లకు పెరగ్గా, నికర మొండిబాకీలు మాత్రం రూ.23,810 కోట్ల నుంచి రూ. 16,252 కోట్లకు తగ్గాయి. బుధవారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 5.29 శాతం ఎగిసి రూ. 365.25 వద్ద క్లోజయ్యింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
చందా కొచర్‌కు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణానికి సంబంధించి బ్యాంకు మాజీ సీఎండీ, ఈ స్కాంలో ప్రధాన నిందితురాలు చందా కొచర్‌కు (56) మరో షాక్ తగిలింది. ఈ స్కాంపై విచారణకు నియమించిన జస్టిస్ శ్రీకృష్ట (స్వతంత్ర కమిటీ) తన రిపోర్టును సంస్థకు అందించింది. వీడియోకాన్ రుణం కేసులో చందాకొచర్ దోషేనని, బ్యాంకునకు సంబంధించిన అంతర్గత నిబంధనలను ఆమె ఉల్లఘించారని స్వతంత్ర విచారణలో కమిటీ తేల్చింది. ఈ మేరకు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ బ్యాంకు బుధవారం ప్రకటన జారీ చేసింది. అలాగే ఈ ఆరోపణలతోనే బ్యాంకు నుంచి ఆమెను తొలగించినట్టు బోర్డు ప్రకటించడం విశేషం. ఆమెకు సంబంధించిన చెల్లింపులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాదు ఏప్రిల్,2009 నుంచి 2018 మార్చివరకు ఆమెకు చెల్లించిన బోనస్, ఇంక్రిమెంట్లు, మెడికల్ ఇన్సూరెన్స్ సహా ఇతర చెల్లింపులను బ్యాంకునకు వెనక్కి చెల్లించాలని పేర్కొంది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీవీడియోకాన్ రుణ కేసులో క్విడ్-ప్రో-ఆరోపణలపై విచారణ జరిపింది. వీడియోకాన్ సంస్థకు రుణాల కేటాయింపు సందర్భంగా చందాకొచర్ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొంది. రెండవ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకులో చోటుచేసుకున్న సుమారు రూ.3250కోట్ల కుంభకోణంలో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్నఆరోపణలతో చందా కొచర్‌తోపాటు, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ ఇప్పటికే ఎప్ఐఆర్ నమోధు చేసిన సంగతి తెలిసిందే. -
వీడియోకాన్ ఐసీఐసీఐ కేసులో కీలక పరిణామం
-
చందా కొచర్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాల వివాదంలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలతో చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కొచర్ తన పదవీకాలంలో వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణ ప్రతిపాదనలను క్లియర్ చేశారని ఎఫ్ఐఆర్లో అభియోగాలు ఉన్నాయి. ఈ లావాదేవీల కారణంగా బ్యాంక్‌కు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వీడియోకాన్ గ్రూప్, దాని అనుబంధ కంపెనీలకు ఇచ్చిన రూ. 1,875 కోట్ల విలువ చేసే ఆరు రుణాలను క్లియర్ చేసిన కమిటీలో సభ్యులైన ప్రస్తుత ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో సందీప్ బక్షితో పాటు ఇతర అధికారులు సంజయ్ చటర్జీ, జరీన్ దారువాలా, రాజీవ్ సబర్వాల్, కేవీ కామత్, హోమీ ఖుస్రోఖాన్ల పాత్రపై కూడా దృష్టి సారించనున్నట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్ఐఆర్ దరిమిలా గురువారం వీడియోకాన్ గ్రూప్, దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, ధూత్ ఒకప్పుడు ప్రమోట్ చేసిన సుప్రీమ్ ఎనర్జీ సంస్థ ముంబై, ఔరంగాబాద్ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. క్విడ్ ప్రో కో వివాదం.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంకు నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్ఐఆర్లో చందా, దీపక్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌పై అభియోగాలు ఉన్నాయి. షేర్లు 3 శాతం దాకా డౌన్.. కొచర్, ధూత్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకదశలో సుమారు మూడు శాతం దాకా పడ్డాయి. బీఎస్ఈలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేరు 2.73% క్షీణించి రూ.2.85 వద్ద, ఐసీఐసీఐ షేరు 0.72% పడి రూ.365 వద్ద క్లోజయ్యాయి. ఇంత జాప్యం ఎందుకు.. ఐసీఐసీఐ కేసులో రిజర్వ్ బ్యాంక్ వ్యవహరించిన తీరును ప్రభుత్వ రంగ(పీఎస్బీ) బ్యాంకర్లు ఆక్షేపించారు. చందా కొచర్‌పై చర్యలకు జాప్యం జరగడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల విషయంలో ఆర్బీఐ వేర్వేరుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ బ్యాంకులను నియంత్రించేందుకు తగినన్ని అధికారాల్లేవన్న ఆర్బీఐ.. మరి ప్రైవేట్ బ్యాంకులపై పూర్తి అధికారాలున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. విధానపరమైన చిన్న చిన్న లోపాలకు కూడా పీఎస్బీల్లో టాప్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ.. స్పష్టమైన ఆధారాలున్నా కొచర్ విషయంలో మాత్రం ఆ పని చేయలేదని బ్యాంకర్లు వ్యాఖ్యానించారు. ప్రక్రియాపరమైన వైఫల్యాల కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, ఇద్దరు ఈడీలపై సత్వరం వేటేసిన ఆర్బీఐ.. కొచర్ విషయంలో మీనమేషాలు లెక్కపెట్టుకుం టూ కూర్చుందని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ సమాఖ్య ఏఐబీవోసీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. విచారణ క్రమం ఇదీ.... ► ఈ వివాదంలో వేణుగోపాల్ ధూత్‌తో పాటు వీడియోకాన్ గ్రూప్ సంస్థలు, ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, ఆయనకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ కేంద్ర బిందువులు. ► మొత్తం రూ. 3,250 కోట్ల రుణాల వివాదంపై 2017 డిసెంబర్లో సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ (వీఐఎల్), వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌తో (వీఐఈఎల్) పాటు ఆ గ్రూప్‌లోని మరో నాలుగు కంపెనీలకు 2009 జూన్ – 2011 అక్టోబర్ మధ్యకాలంలో రూ. 1,875 కోట్ల మేర ఇచ్చిన ఆరు రుణాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని సీబీఐ తేల్చింది. ► వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కి 2009 ఆగస్టు 26న రూ. 300 కోట్ల రుణం, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు 2011 అక్టోబర్ 31న రూ. 750 కోట్లు మంజూరు చేసిన కమిటీలో చందా కొచర్ కూడా ఉన్నారని తేలినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ► 2009 ఆగస్టులో బ్యాంక్ కమిటీ ఆమోదం పొందిన రూ. 300 కోట్ల రుణం అదే ఏడాది సెప్టెంబర్ 7న వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కు మంజూరైంది. తన సొంత సంస్థ సుప్రీం ఎనర్జీ ద్వారా ధూత్ ఆ మర్నాడే .. న్యూపవర్ రెన్యూవబుల్స్కి దొడ్డిదారిన రూ. 64 కోట్లు బదలాయించారని అభియోగాలున్నాయి. ‘తొలి విద్యుత్ ప్లాంట్ కొనుగోలు కోసం దీపక్ కొచర్ సంస్థ న్యూపవర్‌కి లభించిన అత్యధిక మొత్తం పెట్టుబడి ఇది. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరు చేసిందుకు ఈ రూపంలో చందా కొచర్ లబ్ధి పొందినట్లయింది‘ అని సీబీఐ వర్గాలు తెలిపాయి. ► వీఐఎల్, వీఐఈఎల్తో పాటు మిలీనియం అప్లయెన్సెస్, స్కై అప్లయెన్సెస్, టెక్నో ఎలక్ట్రానిక్స్, అప్లికాంప్ ఇండియాకు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలిచ్చింది. వీఐఎల్ నుంచి పొందిన అన్సెక్యూర్డ్ లోన్లను తీర్చేసేందుకు ఈ నాలుగు సంస్థలు.. ఆ రుణాలను ఉపయోగించుకున్నాయని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు మొండిబాకీలుగా మారడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ నష్టం వాటిల్లగా రుణాలు పొందిన నిందితులు మాత్రం ప్రయోజనాలు పొందారని తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలు మంజూరు చేసిన కమిటీలోని సీనియర్ అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాల్సి ఉంటుందని సీబీఐ పేర్కొంది. -
చందకొచర్‌కు కొత్త చిక్కులు తప్పవా?
-
కొచర్‌కు క్లీన్చిట్ చెల్లదన్న ఐసీఐసీఐ బ్యాంకు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూపునకు రుణం జారీ వెనుక ప్రయోజనం పొందారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటూ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో పదవుల నుంచి తప్పుకున్న చందాకొచర్ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమెపై వచ్చిన బంధుప్రీతి ఆరోపణల్లో ఏ మాత్రం సత్యం లేదంటూ 2016 డిసెం బర్లో క్లీన్చిట్ ఇచ్చిన న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, తన నివేదికను ఉపసంహరించుకున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఈ విచారణ నివేదికను ఆధారంగా చేసుకునే ఈ ఏడాది మార్చిలో చందాకొచర్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తాము క్లీన్చిట్ ఇచ్చామని... అమర్‌చంద్ మంగళ్‌దాస్ తన నివేదికను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో అదిక చెల్లుబాటు కాదని బ్యాంకు స్పష్టం చేసింది. ప్రజావేగుల నుంచి వచ్చిన తాజా ఆరోపణలు, బ్యాంకుకు లభించిన అదనపు సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థకు తెలియజేయడంతో, గత తమ నివేదిక ఇక ఎంత మాత్రం చెల్లుబాటు కాదని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది. -
ఐసీఐసీఐకి కొచర్ రాజీనామా!!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. తాజా పరిణామాలతో కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సందీప్ బక్షి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 3 దాకా అయిదేళ్ల పాటు ఆయన ఈ హోదాల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చందా కొచర్‌పై బోర్డు మే నెలలో ఆదేశించిన విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, దర్యాప్తు ఫలితాలు బట్టి బ్యాంకు నుంచి ఆమెకు అందాల్సిన ప్రయోజనాలు అందటమనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రుణ వివాదంపై సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో బ్యాంకు బోర్డు విచారణ కమిటీ ఏర్పాటు చేసినప్పట్నుంచి చందా కొచర్ సెలవులో ఉన్నారు. మరోవైపు, స్వతంత్ర డైరెక్టర్ ఎండీ మాల్యా కూడా ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. గురువారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సుమారు 4 శాతం పెరిగి దాదాపు రూ. 316 వద్ద ముగిసింది రుణం తెచ్చిన తంటా.. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలివ్వడం వెనుక చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, ఈ డీల్‌కు ప్రతిఫలంగా వారు భారీ లంచం తీసుకున్నారనే (క్విడ్‌ప్రోకో) ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం పొందినందుకు ప్రతిగా.. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన అభియోగం. అంతే కాకుండా ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన మారిషస్ సంస్థ ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ నుంచీ న్యూపవర్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. సరిగ్గా 2010లో ఎస్సార్ స్టీల్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చిన నెలలోనే.. న్యూపవర్‌లోకి ఫస్ట్‌ల్యాండ్ నుంచి పెట్టుబడులు రావడం అనుమానాలకు తావిచ్చింది. ఈ రుణాన్ని బ్యాంకు ఆ తర్వాత మొండిబాకీగా వర్గీకరించింది. బక్షి.. మూడు దశాబ్దాల బ్యాంకింగ్ అనుభవం.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సీఈవోగా నియమితులైన సందీప్ బక్షి(58)కి బ్యాంకింగ్ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పైగా అనుభవం ఉంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. ఆరోపణలతో కొచర్ జూన్ నుంచి నిరవధిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో బ్యాంకు తొలుత ఆయన్ను అయిదేళ్ల పాటు హోల్‌టైమ్ డైరెక్టర్, సీవోవోగా నియమించింది. 1986 డిసెంబర్ 1న బక్షి ఐసీఐసీఐ గ్రూప్‌లోని ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ విభాగంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2002 ఏప్రిల్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. 2009 నుంచి 2010 దాకా ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యుటీ ఎండీగా కూడా వ్యవహరించారు. 2010 ఆగస్టు 1న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. పద్మభూషణ్ నుంచి పతనం దాకా... పురుషాధిపత్యం ఉండే ఆర్థిక రంగంలో శక్తిమంతమైన మహిళగా ఎదిగిన చందా కొచర్... అంతలోనే అవమానకర రీతిలో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ హోదా నుంచి నిష్క్ర మించాల్సి రావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న కొచర్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై విచారణలను ఎదుర్కొంటున్నారు. 1984లో ఐసీఐసీఐ లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరాక... చురుకైన పనితీరుతో గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ స్థాయి నుంచి 1990లలో ఐసీఐసీఐ కమర్షియల్ బ్యాంకుగా పరిణామం చెందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గ్రూప్ చైర్మన్ కేవీ కామత్ నిష్క్రమణ అనంతరం.. 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవిని దక్కించుకున్నారు. ఇది శిఖా శర్మ (యాక్సిస్ బ్యాంక్ చీఫ్) వంటి ఇతరత్రా సీనియర్ల నిష్క్రమణకు దారి తీసింది. చందా కొచర్ తన సారథ్యంలో బ్యాంక్‌ను పటిష్ట స్థానానికి చేర్చారు. ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్ పర్యాయపదాలుగా మారేంతగా ఆమె ప్రభావం చూపారు. వీడియోకాన్‌కు రుణాలపై ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో బ్యాంకు బోర్డు ఆమెకు పూర్తి మద్దతుగా నిల్చినా .. ఆ తర్వాత విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. పనితీరుపరంగా చూస్తే.. ఆమె సీఈవో పగ్గాలు చేపట్టినప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్.. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో రెండో స్థానంలోనూ, ప్రైవేట్ రంగంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ కొచర్ వైదొలిగే నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఐసీఐసీఐ మూడో స్థానానికి పడిపోయింది. -
ఐసీఐసీఐపై భగ్గుమన్న షేర్ హోల్డర్స్
వడోదర : ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆగ్రహం పెల్లుబుక్కింది. ఐసీఐసీఐ-వీడియోకాన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈవో చందా కొచర్‌ను ఏజీఎం తీసుకు రావాలని వాటాదారులు డిమాండ్ చేశారు. చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యులు వీడియోకాన్‌కు రుణాలు జారీ చేసే విషయంలో ‘క్విడ్ ప్రో క్వో’ కు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలపై, కొచర్ తమకు సమాధానం చెప్పాలని అన్నారు. బోర్డు పారదర్శకంగా వ్యవహరించలేదని వాటాదారులు మండిపడ్డారు. కొచర్, ప్రస్తుతం వీడియోకాన్ రుణ వివాద విచారణ పూర్తయ్యేంత వరకు సెలవులో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె నేడు(బుధవారం) జరిగిన 24వ వార్షిక సాధారణ సమావేశానికి హాజరు కాలేదు. ఐసీఐసీఐ నూతన చైర్మన్ చతుర్వేది ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఈ సమావేశం జరిగింది. కానీ ఈ సమావేశంలో వాటాదారులు ఆగ్రహం పెల్లుబికింది. తమ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం దొరకడం లేదని వాటాదారుల మండిపడ్డారు. బ్యాంక్‌లో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదంటూ వాటాదారులు హెచ్చరించారు. తమ ముందుకు వచ్చి చందా కొచర్ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. కొచర్ జాబ్‌ను బోర్డు నిర్వహించలేదన్నారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ తన ఏజీఎంను ఆగస్టు 10నే చేపట్టాల్సి ఉంది. కానీ బ్యాంక్ సీఈవోపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో, స్వతంత్ర విచారణకు ఆదేశించేందుకు ఈ సమావేశాన్ని నెల పాటు వాయిదా వేసింది. త్వరలోనే కొచర్‌కు, ఆమె భర్త దీపక్ కొచర్‌కు సెబీ సమన్లు జారీ చేయనున్నట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కొంతమంది బ్యాంక్ టాప్ అధికారులు కూడా, కొచర్ భర్తతో భాగస్వామ్యమై లబ్ది పొందినట్టు తెలిసింది. వారిని వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ డైరెక్టర్‌గా ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్ నియామకం దాదాపు ఖరారైంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్‌కు అనుకూలంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఓటు వేసింది. ఆగష్టు 30, గురువారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలోఈ మేరకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చందా కొచర్‌ను సెలవుపై పంపారు. ఆమెపై ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతుండగా, 2018 జూలై 19 నుంచి ఆమె సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్‌కు అనుకూలంగా ఓటు వేయడంపై విమర్శలు చెలరేగాయి. ఐసీఐసీఐ వీడియోకాన్ రుణాల కుంభకోణంలో ప్రధాన ఆరోపణల నేపథ్యంలో సెలవులో ఉన్న ఆమెకు కంటితుడుపు చర్యగా ఈ డైరెక్టర్ పదవిని కట్టబెడుతున్నారని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ, ఇన్‌గవర్న్ విమర్శించిందికాగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు 80 శాతం వాటా ఉంది. -
కొచర్‌పై విచారణ బ్యాంక్ ప్రతిష్టకు మచ్చే!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచర్‌పై జరుగుతున్న విచారణ మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉందని, ఇది అదనపు వ్యయ భారాలకూ దారితీయవచ్చని ఆ బ్యాంక్ అభిప్రాయపడుతోంది. బ్యాంకు ప్రతిష్టకు ఈ ఉదంతం విఘాతం కలిగించే అంశమని కూడా భావిస్తోంది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు జూలై 31న సమర్పించిన ఒక ఫైలింగ్‌లో బ్యాంక్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. కొచర్‌పై వచ్చిన వివిధ ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక దర్యాపు సంస్థను బ్యాంక్ ఆడిట్ కమిటీ జూన్‌లో ఏర్పాటు చేసినట్లూ బ్యాంక్ వివరణ ఇచ్చింది. వ్యాపార నిర్వహణపై ప్రతికూల ప్రభావం తన భర్త దీపక్ కొచర్ నియంత్రణలోని సంస్థలు, వీడియోకాన్ గ్రూప్ మధ్య లావాదేవీలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలు, అవి మొండిబకాయిలుగా మారడం, వ్యక్తిగత లబ్ది తత్సంబంధ అంశాలకు సంబంధించి చందాకొచర్ ఆశ్రిత పక్షపాతం, క్విడ్ ప్రో కో ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘‘నియంత్రణ సంస్థల విచారణలను బ్యాంక్ ఎదుర్కొంటోంది. విచారణ మరింత లోతుకూ వెళ్లవచ్చు. ఇది బ్యాంకుపై అదనపు వ్యయభారాలను మోపుతుంది. వ్యాపార నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బ్యాంక్ ప్రతిష్టను దిగజార్చే ప్రమాదం ఉంది’’ అని ఎస్ఈసీకి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. ఆరోపణలు, వాటిపై విచారణల నేపథ్యంలో కొచర్ 2018 జూన్ 19 నుంచీ సెలవుపై వెళ్లిన సంగతి తెలిసిందే. తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా సందీప్ బక్షీని బ్యాంక్ నియమించింది. కాగా, బ్యాంక్ అత్యుత్తమ పాలనా నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఐసీఐసీఐ కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది పేర్కొన్నారు. -
ఐసీఐసీఐ సిఇఒ చందా కోచ్చర్‌కు కొత్త కష్టాలు
-
ఇంత జాప్యమా?
అవకతవకల్లో, అసమర్ధతలో, అనేక రకాల ఇతర జాడ్యాల్లో మన దేశంలోని ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏమాత్రం తీసిపోవని ఏణ్ణర్ధంనుంచి రుజువవుతుండగా ఇన్నాళ్లూ తమ బ్యాంకు సీఈఓ, ఎండీ చందా కొచర్‌ను వెనకేసుకొస్తున్న ఐసీఐసీఐ బ్యాంకు ఎట్టకేలకు ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి సందీప్ బక్షికి పగ్గాలు అప్పగించింది. అన్నిటినీ ప్రైవే టీకరిస్తూ పోతే తప్ప ఈ దేశం బాగుపడదని తెగ వాదించే ఆర్థిక రంగ నిపుణులు అందుకు ఐసీఐసీఐ పనితనాన్ని తరచు ఉదహరిస్తూ పరవశించేవారు. కానీ ఇప్పుడు బయటపడిందంతా అందుకు విరుద్ధం. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థత వగైరాలు వెల్లడైనప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లపై కనీసం వెనువెంటనే చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. కానీ ఐసీఐసీఐ బ్యాంకు ఆ పని చేయలేదు. వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరులో అవకతవకలు చోటు చేసుకున్నాయని రెండేళ్లక్రితం ఒక మదుపుదారు ఫిర్యాదు చేసినప్పుడు ఆ సంస్థ మిన్నకుండి పోయింది. మొన్న మార్చిలో ఆ ఆరోపణలే వెల్లువెత్తడం మొదలయ్యాక ఆమెను సమర్థిస్తూ ప్రక టన విడుదల చేసింది. వాటిల్లో నిజానిజాలేమిటన్న సంగతలా ఉంచి తన వంతుగా వెను వెంటనే అంతర్గత విచారణ లేదా బయటివారితో విచారణ జరిపించి, నిజానిజాలు వెల్లడించి ‘అంతా సవ్యంగానే ఉన్నద’ని బ్యాంకు చెప్పగలిగితే, కొచర్ నిజాయితీ వెల్లడికావడంతోపాటు సంస్థ ప్రతిష్ట ఇంతకింతా పెరిగేది. కానీ కొచర్‌పై తమ సంస్థకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయని అది ప్రక టించి ఊరుకుంది. వచ్చిన ఆరోపణలన్నీ దురుద్దేశపూర్వకమైన, నిరాధారమైన వదంతులు మాత్రమేనని చెప్పింది. సంస్థలో 34 ఏళ్లక్రితం మేనేజ్మెంట్ ట్రైనీగా చేరి, తన ప్రతిభాపాటవా లతో ఎదిగి, బ్యాంకు రూపకల్పనలో పాలుపంచుకుని, దాన్ని ఉన్నత స్థాయికి చేర్చడంలో కొచర్ కృషి అసాధారణమైనది. ఆ విషయంలో ఆమెపై బ్యాంకుకు విశ్వాసం, నమ్మకం ఉండటం తప్పేం కాదు. అలా ఉండబట్టే ఆమెకు బ్యాంకు సారథ్య బాధ్య తలు కూడా అప్పగించారనడంలో ఎవరికీ సందేహం లేదు. కానీ వచ్చిన ఆరోపణలపై ఆడిటింగ్ జరిపించి బ్యాంకు మదుపుదార్లలోనూ, ఖాతాదార్లలోనూ ఉన్న సందేహాలను తొలగించడానికి అవి అడ్డు రావలసిన అవసరం లేదు. 2012లో వీడియోకాన్ గ్రూపునకు రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేయడంలో అవక తవకలు చోటు చేసుకున్నాయన్నది ప్రధాన ఆరోపణ. వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్కూ, చందా కొచర్ భర్త దీపక్ కొచర్కూ మధ్య వ్యాపార లావాదేవీలున్నాయని వాటి పర్యవ సానంగానే రుణం లభించిందని ఈ ఆరోపణ చేసినవారు తెలిపారు. రుణం మంజూరయ్యాక దీపక్ కొచర్కూ, మరో బంధువుకూ లబ్ధి చేకూరిందని సాక్ష్యాధారాలతో చూపారు. తీసుకున్న రుణాన్ని వీడియోకాన్ సక్రమంగా చెల్లించి ఉంటే ఈ వ్యవహారం బయటికొచ్చేది కాదు. వచ్చినా దాన్నెవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ అప్పుగా తీసుకున్న రూ. 3,250 కోట్లలో రూ. 2,810 కోట్లను అది ఎగేసింది. దాంతో ఆ మొత్తాన్ని గత ఏడాది నిరర్థక ఆస్తిగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ విషయంలో ఐసీఐసీఐ వివరణ సమర్ధనీయంగా లేదు. వీడియోకాన్‌కు రుణాలిచ్చిన కన్సార్షి యంలో తమది లీడ్ బ్యాంక్ కాదని, ఆ సంస్థకు కన్సార్షియం నుంచి వెళ్లిన మొత్తం రుణంలో తాము ఇచ్చింది 10 శాతం కన్నా తక్కువేనని బ్యాంకు చెప్పింది. అలాగే రుణమివ్వాలన్న నిర్ణయం బ్యాంకు క్రెడిట్ కమిటీదేనని, కమిటీలో ఆమె ఒక సభ్యురాలే తప్ప దానికి చైర్పర్సన్ కారని కూడా వివరించింది. ఇవన్నీ నిజమే కావొచ్చు. కానీ క్రెడిట్ కమిటీ వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరు చేసిన సందర్భంలో తన భర్తకు వీడియోకాన్ గ్రూపు అధినేతతో వ్యాపార సంబంధా లున్నాయని చందా కొచర్ వెల్లడించారా లేదా అన్నది తేల్చాలి. అలాగే రుణం మంజూరయ్యాక ధూత్ నుంచి ఆమె కుటుంబీలకు లబ్ధి చేకూరిందో లేదో ఆరా తీయాలి. రుణం మంజూరైన సమ యంలో ధూత్‌తో తమ కుటుంబీకుల వ్యాపార వ్యవహారాలను చెప్పకపోయి ఉంటే చందా కొచర్ అనౌచిత్యానికీ పాల్పడినట్టే లెక్క. అధిక ఈక్విటీ గల ప్రధాన ప్రమోటర్ నేతృత్వంలో నడిచే హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్ర వంటి బ్యాంకులకూ, ఐసీఐసీఐకీ మధ్య వ్యత్యాసం ఉంది. ఐసీఐసీఐ పూర్తిగా వృత్తి నిపుణులుండే బోర్డు కార్యనిర్వహణలో నడుస్తోంది. సంస్థ అధిపతిగా ప్రధాన ప్రమోటర్ మార్కెట్ స్థితిగతులను అంచనా వేసుకుని, లాభనష్టాలను బేరీజు వేసుకుని ఎలాంటి నిర్ణయానికైనా రాగలుగుతారు. కానీ వృత్తి నిపుణులతో కూడిన బోర్డులు పనితీరు వేరేగా ఉంటుంది. అక్కడ బోర్డులోని నిపుణులంతా ఏ అంశం విషయంలోనైనా అన్ని కోణాల్లోనూ చర్చించుకుని ఒక నిర్ణయానికొస్తారు. ఏ ఒక్కరో బోర్డు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం తక్కువ. కానీ ఐసీఐసీఐలో జరిగిందంతా అందుకు విరుద్ధమని జరిగిన వ్యవహారాన్ని గమనిస్తే అర్ధమవుతుంది. అలా చూస్తే ఇందులో కొచర్‌కు మాత్రమే కాదు... బోర్డు సమష్టి బాధ్యత కూడా ఉంది. ఐసీఐసీఐ వ్యవహారంపై ఫిబ్రవరిలో సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించగా, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబి కూడా రంగంలోకి దిగాయి. బ్యాంకు తనకు తానుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన జస్టిస్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. కొచర్‌ను వెనకేసుకురావడానికి బదులు ఈ పని ముందే చేసి ఉంటే ఐసీఐసీఐ ప్రతిష్ట ఇనుమడించేది. అయితే విచారకరమైన విషయమేమంటే కొచర్‌ను సెలవుపై వెళ్లాలని బోర్డు కోరలేదు. ఆమె తనంత తానుగా వెళ్లారు. ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ విచారణ పూర్తయ్యేవరకూ సెలవు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తీవ్ర ఆరోపణలొచ్చిన ప్పుడైనా నిర్ణయాత్మకంగా, దృఢంగా వ్యవహరించలేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బోర్డుకు తెలియపోవడం ఆశ్చర్యకరం. ఈ విషయంలో తన విధానాలు సవరించుకోవాలి. -
ఐసీఐసీఐ సీవోవోగా సందీప్ భక్షి
-
కొచర్‌కు ‘సెలవు’... కొత్త బాస్‌గా సందీప్ బక్షి
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూపునకు రుణాల మంజూరు వెనుక ఆర్థిక ప్రయోజనాలు ముట్టాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్... ఈ అంశంపై బ్యాంకు స్వతంత్రంగా చేపట్టిన విచారణ పూర్తయ్యే వరకు సెలవుపైనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా పనిచేస్తున్న సందీప్ భక్షి ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా రంగ ప్రవేశం చేయనున్నారు. ఆయన్ను సీవోవోగా ఎంపిక చేస్తూ సోమవారం సమావేశమైన ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19నే (మంగళవారం) సీవోవోగా సందీప్ భక్షి బాధ్యతలు చేపడతారని బ్యాంకు తెలిపింది. ఈ నియామకం వివిధ అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘ఐసీఐసీఐ బ్యాంకు అన్ని వ్యాపారాలను భక్షి పర్యవేక్షించనున్నారు. అలాగే, బ్యాంకు కార్పొరేట్ కార్యకలాపాలను కూడా ఆయనే చూస్తారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అందరూ, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ సైతం ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది’’ అని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. బ్యాంకు ఎండీ, సీఈవో అయిన చందా కొచర్‌కు భక్షి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, అయితే, కొచర్ సెలవు కాలంలో భక్షి బ్యాంకు బోర్డుకు రిపోర్ట్ చేస్తారని తెలియజేసింది. ఇక భక్షి స్థానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా ఎన్ఎస్ కన్నన్ నియామకానికి బ్యాంకు బోర్డు సిఫారసు చేసింది. వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరులో చందాకొచర్ కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు ముట్టాయంటూ ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ బ్యాంకు గత నెలలోనే దీనిపై స్వతంత్ర విచారణ నిర్వహించనున్నట్టు ప్రకటించడం తెలిసిందే. -
చందా కొచర్‌కు బోర్డు షాక్ ఇవ్వనుందా?
-
చందా కొచర్‌కు ఉద్వాసన?
సాక్షి, ముంబై: వీడియోకాన్ రుణ వివాదంలో చిక్కుకున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్‌కు బోర్డు షాక్ ఇవ్వనుందా? బ్యాంకులో ఆమె భవితవ్యం నేడు తేలనుందా? ఈ కుంభకోణంపై విచారణ నేపథ్యంలో సీఈవో పదవినుంచి ఉద్వాసన పలకనున్నారా? నేడు జరగనున్న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. బ్యాంకు మేనేజ్మెంట్ పునర్వవస్థీకరణపై బోర్డు డైరెక్టర్లు చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్యాంకుకు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ వెంచర్ ప్రుడెన్షియల్ లైఫ్‌కు సీఈఓ సందీప్ బక్షిని ఐసీఐసీఐ బ్యాంకు తాత్కాలిక సీఈవోగా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలపై విచారణ పూర్తయ్యేంత వరకు నిరవధిక సెలవులో వెళ్లమని బోర్డు కోరనుందని భావిస్తున్నారు. అలాగే బీఎన్ కృష్ణ విచారణ ప్రతిపాదనకు ఆమోదం, తదుపరి కార్యాచరణపై సమగ్రంగా ఈ సమావేశం చర్చించనుంది. ఈ వార్తలపై బ్యాంకు బోర్డు అధికారికంగా స్పందించాల్సి ఉంది. 1986లో సందీప్ బక్షి ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 2010 నుంచి ఆగస్టు నుంచి ప్రుడెన్షియల్ లైఫ్‌కు సీఈఓగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2009-10 మధ్య కాలంలో బ్యాంకుకు చెందిన రిటైల్ సంస్థకు డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. కాగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచర్‌పై వచ్చిన ఆర్థిక అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని స్వత్రంత కమిటీ విచారణకు ఆమోదం తెలిపారు. కొచర్ భర్త దీపక్ కంపెనీకి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విధంగా చందా కొచర్ వ్యవహరించారనే అభియోగాలొచ్చిన విషయం విదితమే. -
చందా కొచర్ పాత్రపై శ్రీకృష్ణ కమిటీ విచారణ
సాక్షి, ముంబయి : ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్‌పై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ విచారణ చేపడుతోంది. రుణాల మంజూరులో నిబంధనలను ఉల్లంఘిస్తూ, క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని చందా కొచర్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. విచారణ ప్రక్రియ ప్రారంభమైందని సున్నితమైన, వివాదాస్పద అంశం కావడంతో తుది నివేదికకు కొంత సమయం పడుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. చందా కొచర్‌పై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో మే 30న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. తుది విచారణ నివేదిక ఎప్పుడు సమర్పించాలనే దానిపై బోర్డు నిర్థిష్ట గడువును వెల్లడించలేదు. ఫోరెన్సిక్, ఈమెయిళ్ల పరిశీలన, రికార్డులు, సంబంధిత వ్యక్తుల స్టేట్మెంట్ల ఆధారంగా స్వతంత్ర విచారణ సాగుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా సంబంధిత అంశాలన్నింటిపైనా విచారణ చేపట్టి తుది నివేదికను సమర్పిస్తారని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు దాఖలు చేసిన ఫైలింగ్‌లో బ్యాంక్ పేర్కొంది. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించారని ఐసీఐసీఐ బ్యాంక్‌కు, చందా కొచర్‌కు సెబీ నోటీసులు జారీ చేసిన క్రమంలో స్వతంత్ర విచారణకు బ్యాంక్ ఆదేశించింది. వీడియోకాన్ గ్రూప్‌నకు, చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ మధ్య జరిగిన లావాదేవీలపై సెబీ సందేహం వ్యక్తం చేసింది. దీపక్ కొచర్‌కు ఆర్థిక సంబంధాలు కలిగిన వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల జారీలో క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
చందా కొచర్‌కు రూ.25 కోట్ల పెనాల్టీ?
ముంబై : వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన రుణ కేసులో ఆ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచర్‌కు ఉచ్చు బిగిస్తోంది. ఈ రుణ వ్యవహారంలో ఆరోపణలు తీవ్రతరమవుతుండటంతో బ్యాంకు బోర్డు దిగొచ్చి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడం, కొచర్‌కు, బ్యాంకుకు వ్యతిరేకంగా సెబీ నోటీసులు జారీచేయడం మరింత చర్చనీయాంశమైంది. చందా కొచర్ తప్పు చేయలేదంటూ ఓ వైపు నుంచి బ్యాంకు బోర్డు చెబుతూ వస్తుంది. ఒకవేళ ఈ విచారణలో చందా కొచర్ కనుక తప్పు చేసినట్టు వెల్లడైతే, ఆమె భారీ మొత్తంలో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సెబీ జారీచేసిన నోటీసు ప్రకారం ఐసీఐసీఐ బ్యాంకు టాప్ ఎగ్జిక్యూటివ్‌ను ఆ పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించే హక్కు లేదని, కానీ భారీ మొత్తంలో పెనాల్టీ విధించే అవకాశముందని మింట్ రిపోర్టు చేసింది. ఈ జరిమానా గరిష్టంగా రూ.25 కోట్లు లేదా లబ్ది పొందిన మొత్తంలో మూడింతలు ఉంటుందని తెలిపింది. కానీ చందా కొచర్ కేసులో ఎంత జరిమానా విధించాలి అనే విషయంపై సెబీ న్యాయనిర్ణేత అధికారి ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని రిపోర్టు పేర్కొంది. వీడియోకాన్‌కు రుణాలు జారీచేసిన లావాదేవీల వివరాలను వెల్లడించే విషయంలో లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సెబీ తన నోటీసుల్లో పేర్కొంది. నేడు అమెరికా మార్కెట్ రెగ్యులేటరీ ఎస్ఈసీ కూడా ఈ కేసుపై దృష్టిసారించినట్టు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు అమెరికాలో కూడా లిస్ట్ అయి ఉండటమే దీనికి కారణం. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం సెబీని ఎస్ఈసీ ఆశ్రయించింది. ప్రస్తుతం చందాకొచర్ సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా విచారణనను ఎదుర్కొంటున్నారు. వీడియోకాన్ గ్రూపునకు 2012లో అక్రమంగా రూ.3,250 కోట్ల రుణ మంజూరు వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా అనేది ఆరా తీస్తోంది. ఈ ప్రాథమిక విచారణలో భాగంగా సీబీఐ ఇప్పటికే పలువురు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను ప్రశ్నించడంతో పాటు ఆ రుణ లావాదేవీకి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. రుణాన్ని పొందిన వీడియోకాన్ గ్రూపు అందుకు ప్రతిఫలంగా దీపక్ కొచ్చర్ ఆధీనంలోని నూపవర్ రెన్యువబుల్స్ అనే పవన విద్యుత్ సంస్థలో పెట్టుబడులు పెట్టిందనీ, వీడియోకాన్ గ్రూపునకు రుణాలను మంజూరు చేసిన కమిటీలో చందా కొచ్చర్ ఉన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు క్విడ్ ప్రోకో జరగలేదంటూ ఈ ఆరోపణలను వీడియోకాన్ చైర్మన్ ధూత్ తోసిపుచ్చిన సంగతి విదితమే.. -
ఐసీఐసీఐ అక్రమాలపై నోరుమెదపరేం..
సాక్షి, న్యూడిల్లీ : ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల జారీలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి సీఈవో చందా కొచర్‌పై తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై మోదీ సర్కార్ మౌనం దాల్చడాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఐసీఐసీఐ బ్యాంక్ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని, విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని నిలదీసింది. ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు బ్యాంక్ ఖాతాలపై పర్యవేక్షణ, ఖాతాదారులు, డిపాజిటర్లు, షేర్‌హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన మోదీ సర్కార్ తన పెట్టుబడిదారీ స్నేహితులను కాపాడటంలో మునిగితేలుతోందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల వ్యవహారంలో అక్రమాలపై హెచ్చరిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రధాన మంత్రికి లేఖలు, వార్తలు వెల్లువెత్తిన క్రమంలో ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఐసీఐసీఐ బ్యాంక్ అక్రమాలపై మోదీ సర్కార్ మౌనం దాల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బ్యాంకులపై నిఘా కొరవడటంతో రూ 61,036 కోట్ల సొమ్ము రుణాల పేరుతో లూటీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థపై సాధారణ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందన్నారు. -
కొచర్ సెలవుపై రగడ.. వివరణ ఇచ్చిన బ్యాంక్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంక్ ఐసీఐసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) చందా కొచర్‌ను స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు సెలవు మీద వెళ్లాల్సిందిగా బ్యాంక్ బోర్డు ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ కథనాలను బ్యాంక్ బోర్డు తోసిపుచ్చింది. ‘ఇండిపెండెంట్ బోర్డు విచారణ పూర్తయ్యేంతవరకు కొచర్‌ను సెలవు మీద వెళ్లాల్సిందిగా మేం కోరినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. ఆమె వార్షిక సెలవులో ఉన్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే కొచర్ సెలవు తీసుకున్నారు. అంతేకానీ ఇందులో ఎలాంటి బలవంతం లేదు’ అని బ్యాంక్ బోర్డు పేర్కొంది. చందా కొచర్ వారసులను ఎంపిక చేసేందుకు ఎలాంటి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయలేదని కూడా స్పష్టం చేసింది. కాగా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణ మంజూరీ విషయంలో చందా కొచర్ క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొచర్‌పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బ్యాంకు బోర్డు ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. -
చందా కొచర్‌కు షాక్.. ఐసీఐసీఐ ఖండన!
వీడియోకాన్ కుంభకోణంలో తమ సీఈవో చందాకొచర్‌కు షాక్ ఇచ్చినట్టు వచ్చిన కథనాలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. వీడియోకాన్ కుంభకోణంలో స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు చందా కొచర్‌ను సెలవు మీద వెళ్లాల్సిందిగా ఐసీఐసీఐ బోర్డు ఆదేశించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను తోసిపుచ్చిన ఐసీఐసీఐ.. చందా కొచర్ ప్రస్తుతం వార్షిక సెలవులో ఉన్నారని, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఆమె సెలవు తీసుకున్నారని వెల్లడించింది. వీడియోకాన్ సంస్థకు రుణాల విషయంలో చందా కొచర్‌పై క్విడ్ ప్రో కో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీడియోకాన్‌కు రుణాలు అందించినందుకు ప్రతిగా.. ఆమె భర్త సంస్థలోకి వీడియోకాన్ నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన కంపెనీలో వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్ ధూత్ 325 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు ఇటీవల వెలుగుచూసింది. అంతకుముందు ఆమె నేతృత్వంలోని ఐసీఐసీఐ కన్సార్షియం వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణం నిరర్థక ఆస్తి (ఎన్పీఏ)గా గుర్తించడంతో ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ స్కాం విషయంలో కొచర్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని గతంలో ఐసీఐసీఐ బాసటగా నిలిచింది. అయితే, ఈ నెల 29న జరిగిన ఐసీఐసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో కొచర్‌ను సెలవు మీద పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె స్థానంలో కొత్త సీఈవోను ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాలు అన్ని తప్పేనని, తాము అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు అధికార ప్రతినిధి వెల్లడించారు. -
దిగొచ్చిన ఐసీఐసీఐ : కష్టాల్లో చందా కొచర్
సాక్షి, ముంబై : వీడియోకాన్-ఐసీఐసీ స్కాంలో ఎట్టకేలకు ఐసీఐసీఐ బ్యాంకు దిగి వచ్చింది. ఈ కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా ఐసీఐసీఐ పేర్కొంది. రుణాల వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ చందా కొచర్‌పై ఆరోపణలను మొదట్లో కొట్టిపారేసిన బ్యాంకు, తాజాగా వాటిపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఇందుకోసం ఏకసభ్య కమిటీని నియమించింది. బ్యాంక్ నియమావళిని ఎలా ఉల్లంఘనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలుబ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపిందన్న కోణంలో విచారణ సాగుతుందని బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. బ్యాంక్ నియమావళిని ఉల్లంఘించిన కేసులో చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ విచారించనున్నది. దీని కోసం బ్యాంక్ బోర్డు.. ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. వీడియోకాన్ సంస్థకు రూ. 3,800 కోట్ల రుణ వ్యవహారంలో చందాకొచ్చర్ సాయం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2012లో వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రుణం ఇచ్చింది. వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్, చందాకొచర్ భర్త దీపక్ కొచర్, మరో ఇద్దరు బంధవులు కలిసి 2008లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. వీడియోకాన్కిచ్చిన వేలకోట్ల రుణం 2017నాటికి మొండి బకాయిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌కు కొచర్ రుణాలిచ్చేందుకు తోడ్పాటు అందించారని, ఫలితంగా ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇందులో చందాకొచర్ ప్రమేయం ఏమీ లేదని అప్పట్లో ఐసీఐసీఐ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని, చందాకొచ్చర్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని గట్టిగా వాదించడం, ఈ విషయంలో ఐసీఐసీఐ బోర్డులో కూడా విభేదాలొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. చందాకొచర్ భర్త దీపక్, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లను అనుమానితులుగా చేర్చింది. -
చందా కొచర్‌కు సెబీ నోటీసులు
-
చందా కొచర్‌కు సెబీ నోటీసులు
ముంబై: వీడియోకాన్ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాలకు సంబంధించి ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నోటీసు జారీ చేసింది. ఈ లావాదేవీల వివరాలను వెల్లడించే విషయంలో లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఇందులో పేర్కొంది. చందా కొచర్ భర్త దీపక్ కొచర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా ఈ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెబీ నోటీసులకు తగు వివరణ ఇవ్వనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ రుణం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల మేర రుణం పొందిన వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్... దీపక్ కొచర్‌కి చెందిన న్యూపవర్ రెన్యువబుల్స్‌లో రూ. 64 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచర్ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేలా ఈ లావాదేవీలు క్విడ్ ప్రో కో ప్రాతిపదికన జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై సీబీఐ ప్రాథమిక విచారణ జరుపుతోంది. -
రెండోసారి దీపక్ కొచ్చర్‌కు ఐటీ నోటీసులు
-
బ్లాక్‌చెయిన్ ప్రమాణాలపై ఐసీఐసీఐ కసరత్తు
ముంబై: దేశీ బ్యాంకింగ్ రంగంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రమాణాల రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ తెలిపారు. ఇందుకోసం ఇతర బ్యాంకులు, భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆమె వివరించారు. ట్రేడ్ ఫైనాన్స్‌కి సంబంధించి కొనుగోలుదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్ సంస్థలు, బీమా సంస్థలు మొదలైనవన్నీ కూడా భాగస్వాములుగా ఉండే బ్లాక్‌చెయిన్ ఆధారిత వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చందా కొచర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్ రూపంలో సత్వర ఆర్థిక లావాదేవీలకు తోడ్పడే తమ బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫాంను ఇప్పటికే 250 కార్పొరేట్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. -
చిక్కుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ భవితవ్యం
-
కొచర్‌పై వేటు తప్పదా..?
ముంబై: వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రూ.3,250 కోట్లు రుణమిచ్చిన వ్యవహారం మరింత ముదురుతోంది. చివరికి కొచర్ పదవికి ఎసరు పెట్టే స్థాయికెళుతోంది. ఈ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచర్‌కు పరోక్ష లబ్ధి చేకూరిందంటూ ఆరోపణలు రాగా తొలుత ఆమెకు బ్యాంకు బాసటగా నిలిచింది. కొచర్ పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. బ్యాంక్ వెబ్సైట్ తెరిచిన ప్రతి ఒక్కరికీ... బోర్డు బాసటగా నిలుస్తోందన్న విషయం స్పష్టంగా కనిపించింది. అయితే, ఈ అంశంపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు చేస్తుండడం వంటి పరిణామాలతో కొచర్ విషయంలో బోర్డు రెండుగా చీలినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొచర్ తన పదవి నుంచి తక్షణం తçప్పుకుంటే బావుంటుందని కొందరు డైరెక్టర్లు కోరుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కొచర్ పదవిలో కొనసాగటాన్ని స్వతంత్ర డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తదుపరి కార్యాచరణ తేల్చేందుకు బోర్డు ఈ వారంలోనే సమావేశం కానుంది. వాస్తవానికి కొచర్ ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంది. అయితే, కొచర్‌ను పదవి నుంచి తప్పుకోవాలని కొందరు బోర్డు సభ్యులు కోరుతున్నట్టు వచ్చిన వార్తలు అసత్యమని బ్యాంకు అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో 12 మంది సభ్యులున్నారు. వీరిలో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు. ఇందులో బ్యాంకు చైర్మన్ ఎంకే శర్మ, ఎల్ఐసీ హెడ్ కూడా ఉన్నారు. ఒకరు ప్రభుత్వ నామినీ కాగా, ఐదుగురు బ్యాంకు తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు. కొచర్‌పై ఆర్బీఐ తేలుస్తుంది: ఆర్థిక శాఖ ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచర్‌పై వచ్చిన ఆరోపణలను ఆర్బీఐ పరిశీలిస్తోందని, ఇందులో తమ పాత్ర ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కొచర్ ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా కొనసాగాలా, లేదా అన్నది ఆర్బీఐ తేలుస్తుందని పేర్కొంది. ఆర్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంకు బోర్డుకు దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉందని వివరించింది. 3 కోట్ల ఐసీఐసీఐ షేర్లను కొన్న మెరిల్ లించ్ డీల్ విలువ రూ.823 కోట్లు న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్‌పై ప్రతికూల వార్తలు హల్చల్ చేస్తున్నప్పటికీ, ఈ షేర్లను విదేశీ సంస్థలు జోరుగా కొనుగోలు చేస్తున్నాయి. మెరిల్ లించ్ మార్కెట్స్ సింగపూర్ పీటీఈ సంస్థ సోమవారం 2.94 కోట్ల ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు విలువ రూ.823.40 కోట్లుగా ఉంటుందని అంచనా. ఒక్కో షేర్ సగటు కొనుగోలు ధర రూ.280. బెయిల్లీ గిఫోర్డ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్ ఈ షేర్లను విక్రయించింది. సోమవారం ఐసీఐసీఐ షేర్ బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ.280.45 వద్ద ముగిసింది. -
చందా కొచర్ పై ఎఫ్ఐఆర్కు డిమాండ్
సాక్షి, ముంబయి : రూ వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ ప్రజలను మోసగించారని బీజేపీ ఆగ్నేయ ఢిల్లీ ఎంపీ ఉదిత్ రాజ్ ఆరోపించారు. చందా కొచర్ దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. దీపక్ కొచర్ కు వ్యాపార అనుబంధం ఉన్న వీడియోకాన్ గ్రూప్‌కు రుణాల జారీలో అవినీతి, ప్రలోభాల పర్వం ఆరోపణలపై సీబీఐ ప్రస్తుతం ప్రాధమిక దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. కొచర్ కుటుంబానికి కేసులో కీలక సంబంధాలున్నాయనే కోణంలో చందా కొచర్ మరిది రాజీవ్ కొచర్ ను సీబీఐ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాజీవ్‌కు సంబంధించిన కంపెనీకి డీల్ దక్కేలా ఆమె వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. వేణుగోపాల్ ధూత్ నేతృత్వంలోని వీడియోకాన్ గ్రూప్‌కు రుణాల మంజూరులో అవినీతి జరిగిందని ఐసీఐసీఐ షేర్ హోల్డర్ అరవింద్ గుప్తా ఫిర్యాదుతో వెలుగుచూసిన ఈ కేసుపై సీబీఐ ప్రాధమిక దర్యాప్తు చేపట్టింది. అరవింద్ గుప్తా ఫిర్యాదును పరిశీలించిన మీదట చందా కొచర్ తన భర్త దీపక్, వీడియోకాన్ గ్రూప్‌తో నేరపూరిత కుట్రకు పాల్పడి వేల కోట్ల ప్రజాధనాన్ని రుణాల పేరుతో దారి మళ్లించారని స్పష్టంగా అవగతమవుతోందని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ ఆరోపించారు. -
చందా కొచర్ రాజీనామా? రెండుగా చీలిన బోర్డు
న్యూఢిల్లీ : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందా కొచర్ భవితవ్యంపై ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు రెండుగా చీలింది. వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రుణ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేయడంతో, చందా కొచర్‌కు పదవి గండం తెచ్చిపెట్టింది. చందా కొచర్ రాజీనామా చేయాల్సిందిగా కొంతమంది బోర్డు సభ్యులు కోరుతున్నారు. మరికొంత మంది సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. చందా కొచర్‌కు అండంగా నిలుస్తున్నారు. ఇలా బ్యాంకు బోర్డు సభ్యులు రెండుగా చీలినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కొంతమంది వెలుపల ఉన్న డైరెక్టర్లు చందా కొచర్ ఐసీఐసీఐ సీఈఓగా కొనసాగడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై ఐసీఐసీఐ బోర్డు సభ్యులు ఈ వారంలోనే సమావేశం కాబోతున్నట్టు కూడా పేర్కొన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా కొచర్ పదవి కాలం 2019 మార్చి 31 వరకు ఉంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బోర్డులో మొత్తం 12 మంది సభ్యులున్నారు. చైర్మన్ ఎంకే శర్మ ఆధ్వర్యంలో ఈ బోర్డు నడుస్తోంది. 12 మంది సభ్యులో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు, ఒకరు ప్రభుత్వ నామినీ, ఐదుగురు ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లున్నారు. క్విడ్ ప్రో కో ప్రతిపాదికన వీడియోకాన్ గ్రూప్‌కు చందా కొచర్ రుణం మంజూరు చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంపై బోర్డు సమాధానం కూడా ఇచ్చింది. రుణాల జారీలో ఎలాంటి క్విడ్ ప్రో కో లేదని, సీఈఓ కొచర్‌పై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని బోర్డు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఆమెపై ఆ విశ్వాసం సన్నగిల్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చందా కొచ్చర్ కుటుంబీకులు ఉన్నట్లు ఆధారాలు వెలుగుచూడటంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. దీంతో సీఈవోగా చందా కొచర్ కొనసాగడంపై బోర్డు సభ్యులు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే కొచర్ భర్త దీపక్ కొచర్‌పై, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌పై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా ప్రారంభించింది. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ ఐసీఐసీఐ అధికార ప్రతినిధి ఖండించారు. కొచర్ రాజీనామా చేయాలని బోర్డు సభ్యులు కోరుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా అధికార ప్రతినిధి ఈ మేరకు స్పందించారు. కొచర్ రాజీనామా వార్తలతో, ఈ బ్యాంకు షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఒకవేళ సీఈవోగా చందా కొచర్ రాజీనామా చేస్తే, షేర్లు మరింత కిందకి దిగజారనున్నాయని విశ్లేషకులు చెప్పారు. -
వివాదాల్లో చిక్కుకున్న బ్యాంకింగ్ రాణులు
-
రాజీవ్ కొచర్‌ను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూపునకు 2012లో ఐసీఐసీఐ బ్యాంకు జారీ చేసిన రూ.3,250 కోట్ల రుణానికి సంబంధించిన కేసులో బ్యాంకు సీఈవో చందా కొచర్ భర్త సోదరుడు రాజీవ్ కొచర్‌ను సీబీఐ శుక్రవారం విచారించింది. వీడియోకాన్ గ్రూపునకు రుణ పునరుద్ధరణకు సంబంధించి రాజీవ్ కొచర్‌ను సీబీఐ అధికారులు తొమ్మిది గంటల పాటు పలు కోణాల్లో ప్రశ్నించారు. రాజీవ్ కొచర్‌కు చెందిన అవిస్టా అడ్వైజరీ సర్వీసెస్ పేరుతో వీడియోకాన్ గ్రూపునకు అందించిన రుణ సలహా సేవలపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విదేశానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్న రాజీవ్ కొచర్‌ను సీబీఐ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను అధికారులు విచారించారు. ఈ విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. వీడియోకాన్‌కు రుణం మంజూరు చేయడం ద్వారా బ్యాంకు సీఈవో చందాకొచర్‌కు పరోక్షంగా రూ.60 కోట్లకు పైగా లబ్ధి కలిగిందన్న ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. ఈ ఆరోపణల్లో నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. విచారణలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని తేలితే అప్పుడు నిందితులపై కేసులు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతుంది. రుణం మంజూరు తర్వాత వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూత్, చందాకొచర్ భర్త దీపక్ కొచర్ ఏర్పాటు చేసిన న్యూపవర్ రెన్యువబుల్స్‌కు నిధులు అందించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, చందాకొచర్‌పై వచ్చిన ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంకు యాజమాన్యం ఇప్పటికే ఖండించిన విషయం విదితమే. చందాకొచర్, ఆమె భర్త,ధూత్‌లపై లుకవుట్ నోటీసులు? వీడియోకాన్–ఐసీఐసీఐ బ్యాంకు కేసు కొత్త మలుపు తీసుకుంది. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీ వెనుక అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ, బ్యాంకు సీఈవో చందాకొచర్, ఆమె భర్త దీపక్‌కొచర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లపై లుకవుట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దేశం విడిచి వెళ్లిపోకుండా వారిని నిరోధించేందుకు గాను దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. దీనిపై సీబీఐ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. -
చందా కొచర్, శిఖా శర్మలకు ఆర్బీఐ షాక్
ముంబై : దేశీయ టాప్ ప్రైవేట్ బ్యాంకు అధినేతలకు బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆర్బీఐ షాకిచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్‌కు, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీఈవో ఆదిత్య పురిలకు ఏడాది చివరన ఇచ్చే బోనస్‌లను ఆలస్యం చేస్తోంది. బ్యాంకుల్లో చోటు చేసుకుంటున్న కుంభకోణాల నేపథ్యంలో బోనస్‌లపై ఆర్బీఐ వేటు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బ్యాంకుల సీఈవోలు 2017 మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా బోనస్‌లను అందుకోలేదు. ఈ బోనస్‌లు 2018 మార్చి 31 కంటే ముందే అందుకోవాల్సి ఉంది. కానీ ప్రతిపాదిత చెల్లింపులపై ఆర్బీఐ ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. బోనస్‌లు ఇవ్వకుండా ఆర్బీఐ ఎందుకు ఆలస్యం చేస్తుందనే విషయంపై స్పందించడానికి సంబంధిత వర్గాలు నిరాకరించాయి. చందాకొచర్‌కు రూ.2.2 కోట్ల బోనస్ ఇవ్వాలని ఐసీఐసీఐ బోర్డు ఆమోదించింది. శిఖా శర్మ రూ.1.35 కోట్ల బోనస్ అందుకోవాల్సి ఉంది. ఆదిత్య పురి కూడా రూ.2.9 కోట్ల బోనస్‌ను పొందాల్సి ఉందని ఎక్స్చేంజ్ ఫైలింగ్స్‌లో తెలిసింది. అయితే ఈ విషయంపై స్పందించడానికి యాక్సిస్ బ్యాంకు నిరాకరించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల అధికార ప్రతినిధులు కూడా ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్‌పై స్పందించలేదు. ఆర్బీఐ సైతం బోనస్‌లపై స్పందించడం లేదు. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల విషయంలో చందాకొచర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్‌కు రూ.3250 కోట్ల రుణాలు జారీచేశారని, చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌తో బిజినెస్ వ్యవహారాల్లో భాగంగానే వీడియోకాన్ గ్రూప్‌కు రుణాలిచ్చారనే ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. కాగ, ఈ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. మరోవైపు తొలి నుంచి శిఖాశర్మపై మొండిబాకీల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇటీవలే ఆమె పదవీ కాలం పొడిగింపుపై ఆర్బీఐ విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాజాగా ఏడాది చివర బోనస్‌లను కూడా ఆలస్యం చేస్తోంది. గత కొన్నేళ్లుగా దేశీయ ప్రైవేట్ బ్యాంకులు కఠినతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మొండిబకాయిలు పెరగడం, కార్పొరేట్ గవర్నెన్స్ లోపించడం బ్యాంకులను బాధిస్తోంది. ముందు నుంచి చూసుకుంటే 2018 మార్చి 31 కంటే ముందే ఈ బోనస్‌లను ఆర్బీఐ ఆమోదించాల్సి ఉందని ముంబైకి చెందిన బ్యాంకింగ్ విశ్లేషకుడు అసుతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఈ ఆలస్యాన్ని తాము ఎన్నడూ చూడలేదన్నారు. -
చందా కొచర్‌కు మరో షాక్
-
చందా కొచర్‌కు మరో షాక్
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంలో సీబీఐ చురుకుగా కదులుతోంది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందాకొచర్ భర్త, దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నారు. ముంబై విమానాశ్రయంనుంచి సింగపూర్ వెళుతుండగా అతనిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ కేసులో చందాకొచర్ కుటుంబానికి చెందిన సన్నిహితుడిని సీబీఐ ప్రశ్నించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో మరింత విచారణ చేపట్టే క్రమంలో రాజీవ్‌ను అదుపులోకి తీసుకుంది. అతణ్నించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో చందాకొచర్ భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ధూత్పై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ,అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఇంతవరకూ దీపక్‌ను ప్రశ్నించలేదు. కానీ, దీపక్ కొచర్కుచెందిన న్యూపవర్రెన్యువబుల్స్ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. కాగా 2012లో వీడియోకాన్ గ్రూపునకు రూ.3,250 కోట్ల విలువైన రుణాల మంజూరు సందర్భంగా బ్యాంకు సీఈవో చందా కొచర్‌పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తును వ్యతిరేకించింది. కాగా ఈ రుణ వివాదంలోకి తాజాగా దీపక్ సోదరుడు, చందా కొచర్ మరిది.. రాజీవ్ కొచర్‌కి చెందిన అవిస్టా సంస్థ కూడా చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన పలు కంపెనీలకు అవిస్టా రుణ పునర్వ్యవస్థీకరణ సేవలు అందించిందనీ, అవిస్టా సేవలు పొందిన వాటిల్లో జైప్రకాశ్ అసోసియేట్స్, జైప్రకాశ్ పవర్లతో పాటు వీడియోకాన్, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుజ్లాన్ తదితర కంపెనీలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని రాజీవ్ కొచర్ ఖండించిన సంగతి తెలిసిందే. భారతీయ బ్యాంకులతో ఎలాంటి సిండికేషన్ ఉండకూడదనే ఒక నియమాన్ని తాము పెట్టుకున్నామన్నారు. ఈక్రమంలో చందా కొచర్ సీఈవోగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఇండోనేషియా, దుబాయ్‌లోని కార్యాలయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదేదో కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా రాజీవ్ కొచర్ కొట్టిపారేశారు. -
సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తాం: ఐసిఐసిఐ
-
కొచర్ చుట్టూ ఉచ్చు!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చిన వివాదానికి సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఈ లావాదేవీల్లో లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త దీపక్ కొచర్‌కు తాజాగా ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఐటీ చట్టం సెక్షన్ 131 కింద జారీ చేసిన నోటీసుల ప్రకారం .. ఆయన వ్యక్తిగత ఆర్థిక వివరాలు, గడిచిన కొన్నేళ్ల ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్‌లతో (ఐటీఆర్) పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ సంస్థతో వ్యాపార లావాదేవీల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. న్యూపవర్‌తో పాటు ఆ కంపెనీతో సంబంధమున్న వారి ఆర్థిక పరిస్థితులపై కూడా ఐటీ శాఖ దర్యాప్తు మొదలుపెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా కంపెనీతో సంబంధమున్న మరికొందరికి కూడా నోటీసులు పంపినట్లు, వారి దగ్గర్నుంచి వచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించాయి. మరోవైపు, దీపక్ కొచర్‌ను త్వరలో ప్రశ్నించనున్నట్లు ఈ వివాదంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎంక్వైరీలో దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లతో పాటు మరికొందరి పేర్లు కూడా ఉన్నట్లు వివరించాయి. వీడియోకాన్ గ్రూప్‌నకు 2012లో రూ. 3,250 కోట్ల మేర రుణాలు ఇచ్చిన విషయంలో చందా కొచర్ క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం లభించినందుకు ప్రతిఫలంగా చందా కొచర్ భర్త దీపక్ సంస్థలో ధూత్ రూ. 64 కోట్లు ఇన్వెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. వివాదంలోకి దీపక్ సోదరుడు రాజీవ్ సంస్థ కూడా.. రుణ వివాదంలోకి తాజాగా దీపక్ సోదరుడు, చందా కొచర్ మరిది.. రాజీవ్ కొచర్‌కి చెందిన అవిస్టా సంస్థ కూడా చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన పలు కంపెనీలకు అవిస్టా రుణ పునర్వ్యవస్థీకరణ సేవలు అందించినట్లు తెలుస్తోంది. అవిస్టా సేవలు పొందిన సంస్థల్లో జైప్రకాశ్ అసోసియేట్స్, జైప్రకాశ్ పవర్లతో పాటు వీడియోకాన్, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుజ్లాన్ మొదలైనవి ఉన్నట్లుగా సమాచారం. అయితే తమ బ్యాంక్ ఎన్నడూ కూడా అవిస్టా అడ్వైజరీ గ్రూప్ సర్వీసులు వినియోగించుకోలేదని, ఎలాంటి ఫీజు చెల్లించలేదని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది. అటు జేపీ గ్రూప్ మాత్రం రుణ పునర్వ్యవస్థీకరణ కోసం అవిస్టాను నియమించుకోవడం వాస్తవమేనని, మార్కెట్ రేటును బట్టి ఫీజును చెల్లించామని ధ్రువీకరించింది. అయితే, అవిస్టా సేవలు ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ (ఎఫ్‌సీసీబీ) పునర్వ్యవస్థీకరణకు మాత్రమే పరిమితమని, దాని ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. జేపీ గ్రూప్‌లో ప్రధాన సంస్థ అయిన జైప్రకాశ్ అసోసియేట్స్.. దాదాపు 110 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎఫ్సీసీబీలను, మరో సంస్థ జైప్రకాశ్ పవర్ 225 మిలియన్ డాలర్ల రుణాల పునర్వ్యవస్థీకరణకు అవిస్టా సర్వీసులు ఉపయోగించుకున్నాయి. న్యూపవర్ వెనుక ఉన్నదెవరో తెలియాలి: అరవింద్ గుప్తా క్విడ్ ప్రో కో వివాదాన్ని బైటికి తెచ్చిన వేగు అరవింద్ గుప్తా న్యూపవర్పై ఆరోపణాస్త్రాలు కొనసాగిస్తున్నారు. కంపెనీలో మెజారిటీ షేర్‌హోల్డరుగా ఉన్న మారిషస్ సంస్థ డీహెచ్ రెన్యువబుల్స్ హోల్డింగ్ అసలు యజమాని వివరాలను బైటపెట్టాలని డిమాండ్ చేశారు. 2008లో కంపెనీని ఏర్పాటు చేసినప్పుడు ఇందులో దీపక్ కొచర్‌కు, ధూత్ కుటుంబానికి చెరి యాభై శాతం వాటాలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత క్రమంగా దీపక్ ట్రస్టీగా ఉన్న పినాకిల్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, డీహెచ్ రెన్యువబుల్స్ మొదలైనవి ఇందులో వాటాదారులుగా మారాయి. ‘న్యూపవర్ ఏర్పాటైనప్పుడు అది.. భారతీయ సంస్థ. అయితే, క్రమంగా ఇందులో 54.99 శాతం వాటాలతో మారిషస్‌కి చెందిన డీహెచ్ రెన్యువబుల్స్ మెజారిటీ వాటాదారుగా ఆవిర్భవించింది. ఒకప్పుడు ధూత్ కుటుంబానికి చెందిన సుప్రీమ్ ఎనర్జీ సంస్థ.. ఇప్పుడు పినాకిల్ ఎనర్జీ, కొచర్ల చేతికి చేరింది. పినాకిల్, డీహెచ్ రెన్యువబుల్స్ సంస్థ అసలు యజమాని గురించి ఎవరికీ, ఎప్పటికీ అంతుపట్టని విధంగా అనేక లావాదేవీల ద్వారా ఇదంతా జరిగింది‘ అని గుప్తా వ్యాఖ్యానించారు. ఫిక్కీ సదస్సు నుంచి తప్పుకున్న చందా కొచర్ న్యూఢిల్లీ: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఈ నెల 5న నిర్వహిస్తున్న 34వ వార్షిక సదస్సు నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ తప్పుకున్నారు. వీడియోకాన్ గ్రూప్‌నకు క్విడ్ ప్రో కో ప్రాతిపదికన రుణాలిచ్చారంటూ ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఎఫ్ఎల్వో వార్షిక సదస్సులో ఆమె గౌరవ అతిథిగా పాల్గొనాల్సి ఉంది. అలాగే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా చందా కొచర్‌కు సన్మానం కూడా ఉంటుందని ఎఫ్ఎల్వో గతంలో పంపిన ఆహ్వాన పత్రికల్లో పేర్కొంది. అయితే, తాజాగా మంగళవారం పంపిన ఆహ్వానపత్రికల్లో చందా కొచర్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం నుంచి చందా కొచర్ తప్పుకున్నారని, ఆమె హాజరయ్యే అవకాశం లేదని ఎఫ్ఎల్వో ఈడీ రష్మి సరిత తెలిపారు. కొచర్ తప్పుకోవడానికి కారణాలు తెలియరాలేదని వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్ గ్రూప్ రూ. 3,250 కోట్ల మేర రుణాలు తీసుకున్న లావాదేవీల్లో.. కొచర్ భర్త దీపక్ కొచర్ లబ్ధి పొందినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. వీటిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. -
ఆ ఈవెంట్ నుంచి చందా కొచర్ ఔట్
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 3: వీడియోకాన్ గ్రూప్ రుణవివాదంలో ఇరుక్కున్న, ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ చందా కొచర్‌కు మరో పరాభవం ఎదురైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) లేడీస్ ఆర్గనైజేషన్ వార్షిక ఉత్సవాలనుంచి ఆమెను తొలగించారు. ఈవారంలో నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్ చేతులు మీదుగా చందా కొచర్ సన్మానాన్ని అందుకోవాల్సి ఉంది. అయితే గత నెలలో ఆమె పేరును ప్రముఖంగా ప్రస్తావించిన నిర్వాహకులు తాజా జాబితాలో చందా కొచర్ పేరును తొలగించడం గమనార్హం. నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 5వ తేదీన జరిగే ఈవెంట్‌కు చందా కొచర్ గౌరవ అతిధిగా హాజరుకావాల్సి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అందించిన సేవలకుగాను చందాకొచ్చర్‌ను ఎఫ్ఎల్వో ఐకాన్ ఆవార్డుతో సత్కరించాలని భావించింది. కానీ ఈ కార్యక్రమంనుంచి ఆమెను తప్పించామని ఎఫ్ఎల్వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రష్మి సతిటా తెలిపారు. అయితే ఎందుకు తొలగించిందీ కచ్చితంగా చెప్పలేదు. 2018 ఏప్రిల్ 5న ఎఫ్ఎల్వో 34వ వార్షిక సమావేశంలో అధ్యక్షుడు కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమంలో చందాకొచర్ గౌరవ అతిథిగా ఉంటారనీ మార్చి 31న జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 10మంది భారతీయ మహిళా ప్రముఖులను ఎఫ్ఎల్వో ఐకాన్ అవార్డులతో సత్కరించనున్నామని చెప్పింది. ఆరోగ్యం, సంక్షేమం రంగంలో ఎయిమ్స్ చీఫ్, ఆర్గాన్ రిట్రీవల్ అండ్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ కు చెందిన ఆరతి విజ్, వినోద రంగంలో నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా, మీడియా ఎంట్రప్రెన్యూర్షిప్లో బాలాజీ టెలీఫిలింస్ క్రియేటివ్ డైరక్టర్ ఎక్తాకపూర్, డిజిటల్ వ్యాపారంలో నైకా ఫౌండర్ ఫల్గుణి నాయక్, సాహిత్యంలో నమితా గోఖలే తదితరుల పేర్లను ఈ జాబితాలో పేర్కొంది. -
చిక్కుల్లో చందాకొచ్చర్..!
-
ఐసీఐసీఐలో ‘కొచర్’ దుమారం
-
ఐసీఐసీఐలో ‘కొచర్’ దుమారం
ముంబై, న్యూఢిల్లీ : కార్పొరేట్లు, బ్యాంకర్లు కుమ్మక్కై బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపణలకు బలమిస్తూ.. మరో కుంభకోణం!! ఈ సారి బయటపడింది ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐలో. దేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్.. క్విడ్ ప్రో కో విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు కొచర్ కుటుంబం లబ్ధి పొందిందనే ఆరోపణల వెనకున్న ఆధారాలు చూస్తుంటే... ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కార్పొరేట్ గవర్నెన్స్ సందేహాస్పదమయిందని అనిపించకమానదు. ఒక పరిశోధనాత్మక కథనం ప్రకారం డిసెంబర్ 2008లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌తో పాటు ఆమె మరో ఇద్దరు బంధువులతో కలసి వీడియోకాన్ గ్రూప్ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ నుంచి ఈ కొత్త సంస్థకు రూ.64 కోట్ల రుణమిచ్చిన ధూత్... ఆపై కేవలం రూ.9 లక్షలకు న్యూపవర్‌లోని తన వాటాలు, యాజమాన్య అధికారాలన్నీ దీపక్ కొచర్‌కి బదలాయించేశారు. అయితే, వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల మేర రుణం మంజూరైన ఆరు నెలల్లోనే ‘న్యూపవర్’ కంపెనీ చేతులు మారటం చర్చనీయమైంది. ఇందులో లబ్ధిదారు చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఇతర కుటుంబీకులు కావడంతో ఆమె పాత్రపై సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు, వీడియోకాన్ తీసుకున్న రుణ మొత్తంలో ఇప్పటికీ 86 శాతం భాగం (సుమారు రూ.2,810 కోట్లు) కట్టనే లేదు. 2017లో వీడియోకాన్ ఖాతాను మొండిపద్దుగా వర్గీకరించారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు ఏజెన్సీలు కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. న్యూపవర్ ఆర్థిక పరిస్థితి ఇదీ.. 2008 డిసెంబర్లో ఏర్పాటైన న్యూపవర్.. గత ఆరు ఆర్థిక సంవత్సరాలుగా నష్టాలు ప్రకటిస్తూనే ఉంది. 2012–17 మధ్య కంపెనీ నష్టాలు రూ.78 కోట్ల మేర పేరుకుపోయాయి. 2017లో రూ.14.3 కోట్ల నష్టం ప్రకటించింది. 2016 మార్చి 31 నాటి దాకా సుప్రీమ్ ఎనర్జీ, పినాకిల్ ఎనర్జీలతో పాటు కొచర్‌కి న్యూపవర్‌లో 96.23 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, 2017 మార్చి నాటికి సుప్రీమ్, పినాకిల్‌తో కలిపి ప్రత్యక్షంగా, పరోక్షంగా దీపక్ కొచర్ వాటాలు 43.4 శాతంగా ఉన్నాయి. మిగతా వాటాలు మారిషస్‌కి చెందిన డీహెచ్ రెన్యూవబుల్స్ చేతిలో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఏమంటుందంటే.. తాజా వ్యవహారంపై ఐసీఐసీఐ స్పందిస్తూ... ‘‘2012లో ఎస్బీఐ సారథ్యంలో 20 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి చమురు, గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాల కోసం వీడియోకాన్‌కు సుమారు రూ.40,000 కోట్లు రుణాలిచ్చాయి. ఇందులో మా వాటా కేవలం రూ.3,250 కోట్లే. మిగిలిన బకాయి రూ.2,810 కోట్లు.. వడ్డీతో కలసి వీడియోకాన్ చెల్లించాల్సింది రూ.2,849 కోట్లు. 2017లో గ్రూప్ ఖాతాను మొండి పద్దుగా వర్గీకరించాం’’ అని వివరణిచ్చింది. దీనిపై ఐసీఐసీఐ చైర్మన్ ఎం.కె. శర్మ మాట్లాడుతూ... కన్సార్షియంలో ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంకులు రుణాలు మంజూరు చేశాకే 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కమిటీ తన వంతు రుణం మంజూరు చేసిందని చెప్పారు. సదరు కమిటీకి అప్పట్లో చందా కొచర్ చైర్‌పర్సన్‌గా లేరని స్పష్టం చేశారు. బ్యాంకులో ఏ స్థాయి ఉద్యోగైనా సరే రుణ నిర్ణయాలను ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు. 2009లోనే వదిలేశా: ధూత్ ‘‘నేను 2009లోనే న్యూపవర్ రెన్యువబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ సంస్థల నుంచి వైదొలిగాను. న్యూపవర్‌లో 24,996 షేర్లను, సుప్రీమ్ ఎనర్జీలో 9,990 షేర్లను అమ్మేసి పూర్తి హక్కులను వదులుకున్నాను. చమురు, టెలికం వ్యాపారాలతో బిజీ అయిపోవడంతో.. ఆ రోజు నుంచి రెండు కంపెనీలతో సంబంధాలు వదులుకున్నాను’’ అని ధూత్ వివరించారు. కానీ ఆర్‌ఓసీలో దాఖలు చేసిన ఫైలింగ్స్ ప్రకారం చూస్తే 2010 అక్టోబర్ దాకా సుప్రీం ఎనర్జీకి ఆయన యజమానిగా కొనసాగినట్లు, 2010 నవంబర్‌లో మాత్రమే తన షేర్లను అనుచరుడు పుంగ్లియాకు బదలాయించినట్లుగా తెలుస్తోంది. న్యూపవర్ వివరణ ఇదీ.. ఈ లావాదేవీల్లో పరస్పరం ప్రయోజనాలు పొందారనడానికేమీ లేదని న్యూపవర్ వివరణనిచ్చింది. అసలు పినాకిల్ ఎనర్జీ ట్రస్టుకు గానీ, సుప్రీమ్ ఎనర్జీకి గానీ ఐసీఐసీఐ బ్యాంకుతో ఎలాంటి వ్యాపార సంబంధాలూ లేవని స్పష్టం చేసింది. లావాదేవీలు జరిగాయిలా.. ♦ 2008 డిసెంబర్లో దీపక్ కొచర్, వేణుగోపాల్ ధూత్‌లు కలసి న్యూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్ఆర్పీఎల్) ఏర్పాటు చేశారు. ఇందులో ధూత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సంబంధీకులకు 50 శాతం వాటాలుండేవి. అలాగే దీపక్ కొచర్‌కి, ఆయన తండ్రికి చెందిన పసిఫిక్ క్యాపిటల్ సంస్థకు, చందా కొచర్ సోదరుడి భార్యకు మిగతా 50 శాతం వాటాలుండేవి. ♦ 2009 జనవరిలో న్యూపవర్ డైరెక్టర్ పదవికి ధూత్ రాజీనామా చేశారు. రూ. 2.5 లక్షల మొత్తానికి కంపెనీలో తనకున్న 24,999 షేర్లను దీపక్ కొచర్‌కి బదలాయించారు. ♦ 2010 మార్చిలో సుప్రీమ్ ఎనర్జీ అనే సంస్థ నుంచి న్యూపవర్‌కి రూ.64 కోట్ల రుణం (ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ రూపంలో) లభించింది. ఈ సుప్రీమ్ ఎనర్జీలో ధూత్‌కి 99.9 శాతం వాటాలు ఉన్నాయి. ♦ ధూత్ నుంచి కొచర్‌కి.. ఆ తర్వాత కొచర్ కుటుంబీకులకు చెందిన పసిఫిక్ క్యాపిటల్ నుంచి షేర్లు సుప్రీమ్ ఎనర్జీకి ఒక ఒక పద్ధతి ప్రకారం న్యూపవర్ షేర్ల బదలాయింపు జరిగింది. ఫలితంగా 2010 మార్చి ఆఖరుకు న్యూపవర్‌లో సుప్రీమ్ ఎనర్జీ 94.99 శాతం వాటాదారుగా అవతరించింది. మిగతా వాటాలు కొచర్ పేరిటే ఉండిపోయాయి. ♦ 2010 నవంబర్‌లో ధూత్ సుప్రీమ్ ఎనర్జీలో తనకున్న మొత్తం వాటాలను.. తన అనుచరుడు మహేష్ చంద్ర పుంగ్లియాకు బదలాయించారు. ♦ ఈ పుంగ్లియా.. 2012 సెప్టెంబర్ 29 నుంచి 2013 ఏప్రిల్ 29 మధ్య తన వాటాలను పినాకిల్ ఎనర్జీ అనే ట్రస్టుకు బదలాయించారు. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా దీపక్ కొచర్ ఉన్నారు. ఈ షేర్ల విలువ రూ.9 లక్షలుగా చూపించారు. అంటే న్యూపవర్‌కి రూ. 64 కోట్ల రుణాలిచ్చిన ధూత్ సంస్థ సుప్రీమ్ ఎనర్జీ .. మూడేళ్ల వ్యవధిలో దీపక్ కొచర్‌కి చెందిన పినాకిల్ ఎనర్జీ అనే కంపెనీలో కలిసిపోయింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.59 కోట్ల జరిమానా బాండ్ల విక్రయ నిబంధనలు ఉల్లంఘించినందుకే... ముంబై: ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకుపై ఆర్బీఐ రూ.58.9 కోట్ల జరిమానా విధించింది. హెచ్టీఎం (హెల్డ్ టు మెచ్యూరిటీ) సెక్యూరిటీలను నేరుగా విక్రయించే విషయంలో మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు ఉల్లంఘించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఆర్బీఐ మార్గదర్శకాలు ఎప్పటి నుంచి అమలయ్యేవనే విషయాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఉల్లంఘన చోటు చేసుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు వివరణ ఇచ్చింది. నియంత్రణపరమైన మార్గదర్శకాలను పాటించేందుకు ఎంతో ప్రాధాన్యమిస్తామని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949 ప్రకారం తనకు లభించిన అధికారాల మేరకు, తాను జారీ చేసిన మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు పాటించకపోవడంతో జరిమానా విధించినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పెట్టుబడులను హెల్డ్ ఫర్ ట్రేడింగ్ (హెచ్ఎఫ్టీ), అవైలబుల్ ఫర్ సేల్ (ఏఎఫ్ఎస్), హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ (హెచ్టీఎం) అని మూడు వర్గీకరణలు చేయాల్సి ఉంటుంది. హెచ్టీఎం కేటగిరీలో సెక్యూరిటీలు కాల వ్యవధి తీరే వరకు వాటికి కొనసాగించాలి. ఒకవేళ ఈ విభాగం నుంచి సెక్యూరిటీలను విక్రయించినట్టయితే, అది ఈ విభాగంలో అవసరమైన పెట్టుబడుల్లో 5 శాతానికి మించితే ఆర్బీఐకి తెలియజేయాలి. కానీ, ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేయలేదు. -
వెలుగులోకి ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణం
-
మరో భారీ కుంభకోణం : చిక్కుల్లో కొచ్చర్
న్యూఢిల్లీ : పీఎన్బీ కుంభకోణం అనంతరం బ్యాంకింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణం బయటపడింది. వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం దక్కేలా ఈ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్ సాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2012లో ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్‌కు ఈ రుణం ఇచ్చినట్టు తెలిసింది. వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్లో పాటు చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, చందాకొచ్చర్‌కు చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులు 2008లో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. అయితే ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ గ్రూప్‌కు రూ.3250 కోట్ల రుణం అందిన వెంటనే ఆ కంపెనీలో ఉన్న వేణుగోపాల్ తన వాటాను దీపక్ కొచ్చర్‌కు ట్రాన్సఫర్ చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు జారీచేసిన ఆ రుణంలో దాదాపు 86 శాతం అంటే రూ.2810 కోట్లు ఈ గ్రూప్ చెల్లించలేకపోయింది. దీంతో 2017లో ఆ రుణమంతటిన్నీ స్థూల నిరర్థక ఆస్తిగా ప్రకటించారు. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు మాత్రమే కాక, మొత్తం బ్యాంకులన్నీ కలిపి వీడియోకాన్ సంస్థకు మొత్తం రూ.36వేల కోట్ల రుణమిచ్చినట్టు తెలిసింది. నిబంధనలు పాటించకుండా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌కు కొచ్చర్ రుణమిచ్చారని, దీంతో ఆమె కుటుంబీకులు లబ్ది పొందారని ప్రస్తుతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు వివరణ ఇచ్చింది. 2012 ఏప్రిల్‌లో వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చిన కన్సార్షియంలో తమది లీడ్ బ్యాంక్ కూడా కాదని పేర్కొంది. కన్సార్షియంలో భాగంగానే సుమారు రూ.3,250 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇది కన్సార్షియం ఇచ్చిన మొత్తం రుణంలో 10 శాతం కన్నా తక్కువేనని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. రుణ నిబంధనలను చందాకొచ్చర్ ఉల్లంఘించలేదని పేర్కొంది. వీడియోకాన్‌కు రుణమివ్వాలనే నిర్ణయం చందాకొచ్చర్ ఒక్కరిదే కాదని, బ్యాంకు క్రెడిట్ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఆమె కమిటీ చైర్పర్సన్ కూడా కాదని ప్రకటించింది. ఆరోపణల్లో పేర్కొంటున్నట్లుగా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు చందా కొచ్చర్ ఎటువంటి లబ్ధి పొందలేదని.. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో గానీ ఆశ్రిత పక్షపాతం గానీ స్వార్ధ ప్రయోజనాలు గానీ లేవని స్పష్టం చేసింది. -
చందాకొచర్‌కు ఐసీఐసీఐ బోర్డు బాసట
న్యూఢిల్లీ: రుణాల మంజూరు విషయంలో వీడియోకాన్ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్‌కు బ్యాంకు బోర్డు బాసటగా నిల్చింది. ఇవన్నీ దురుద్దేశపూర్వకమైన, నిరాధారమైన వదంతులేనని స్పష్టం చేసింది. కొచర్‌పై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని పేర్కొంది. రుణాలను ఆమోదించే విషయంలో తమ బ్యాంకు అంతర్గత వ్యవస్థ పటిష్టంగా ఉందని బోర్డు పేర్కొంది. క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలివ్వడం ద్వారా కొచర్, ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారంటూ ఒక వెబ్సైట్లో వార్తలొచ్చిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఈ మేరకు వివరణనిచ్చింది. ఆరోపణల్లో పేర్కొంటున్నట్లుగా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు చందా కొచర్ ఎటువంటి లబ్ధి పొందలేదని.. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో కో గానీ ఆశ్రిత పక్షపాతం గానీ స్వార్థ ప్రయోజనాలు గానీ లేవని స్పష్టం చేసింది. బ్యాంకు, టాప్ మేనేజ్మెంటును అప్రతిష్ట పాలు చేసేందుకే కొన్ని స్వార్థ శక్తులు వదంతులను వ్యాపింపచేస్తున్నాయని బోర్డు తెలిపింది. 2012 ఏప్రిల్‌లో వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చిన కన్సార్షియంలో తమది లీడ్ బ్యాంక్ కూడా కాదని పేర్కొంది. కన్సార్షియంలో భాగంగానే సుమారు రూ.3,250 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇది కన్సార్షియం ఇచ్చిన మొత్తం రుణంలో 10 శాతం కన్నా తక్కువేనని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
పీఎన్బీ స్కాంలో సరికొత్త మలుపు
-
ఆర్థిక రంగం ఆణిముత్యాలు
‘‘సుదీర్ఘ కాలంగా ఆర్థికరంగం అంటే కేవలం పురుషులకే పరిమితమైన రంగంగా ఉంటూ వచ్చింది. అది బ్యాంకింగ్ రంగమైనా, బీమా, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు ఇలా ఏ రంగమైనా అది మహిళలకు సంబంధించింది కాదనే భావన. దాదాపు మహిళలందరూ ఈ భావనతోనే ఈ రంగాలవైపు (ఆసక్తి వున్నా) వెనకడుగు వేస్తూ వచ్చారు. కానీ ఆ తరువాత ఈ పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. వివిధ రంగాలతోపాటు ఆర్థిక రంగంలో కూడా మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం మొదలు పెట్టారు. ‘‘విత్తం అంటే కేవలం పురుషుల సొత్తే’’ కాదంటూ తమ సత్తా చాటడం మొదలు పెట్టారు. వారిలో ప్రముఖమైన మహిళల్ని ఇపుడు చూద్దాం’’. చందా కొచ్చర్ జోధ్ పూర్లో జన్మించిన చందా కొచ్చర్ భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈవోగా తన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 1984 లో ట్రైనీగా ప్రారంభమైన ఆమె ప్రయాణం బ్యాంకు అత్యున్నత అధికారిగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయబావుటా ఎగరేస్తూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యంతో దెబ్బతిన్న సమయంలో ఆమె బ్యాంకును విజయపథంలో నడిపించారు. ఆమె నాయకత్వంలోనే ఐసీఐసీఐ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకులలో ఒకటిగా నిలవడం గమనించాల్సిన విషయం. దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె నిలవడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు. ఆర్థిక రంగంలో ఆమె చేసిన విశేష సేవలకు గాను 2010లో ఆమెకు పద్మభూషణ్ దక్కంది. అలా మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి ఎండీదాకా సాగిన చందా కొచ్చర్ ప్రస్థానం బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించాలనుకునే అనేకమంది యువతులకు ప్రేరణ. ఉషా అనంతసుబ్రమణియన్ 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉషా అనంత సుబ్రమణియన్ సొంతం. స్టాటస్టిక్స్ లో దిట్ట. ప్రస్తుతం, అలహాబాద్ బ్యాంక్ సీఎండీగా ఉన్న ఉషా బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, భారతీయ మహిళా బ్యాంక్ లాంటి బ్యాంకులకు సారధ్యం వహించారు.అనంత సుబ్రమణియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ)తో యాక్ట్యుయేరియల్ డిపార్ట్మెంట్లో స్పెషలిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించారు. స్టాటస్టిక్స్‌లో ఆమెకున్న పట్టుతో తన సామర్ధ్యాలకు మరింత పదును పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్తులు క్షీణిస్తూ....దయనీయ పరిస్థితుల్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) పరిశీలనలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారధ్య బాధ్యతలు ఆమెకు అప్పగించారు. తన అనుభవం, ప్రతిభతో బ్యాంకును కష్టాలనుంచి గట్టెక్కిండచడంతోపాటు.. లాభాల బాట పట్టించిన ఘనతను సాధించారామె. ముఖ్యంగా మొట్టమొదటి భారతీయ మహిళా బ్యాంకు స్థాపనలో ఆమె కృషి ప్రధానంగా చెప్పుకోదగ్గది. (భారతీయ మహిళా బ్యాంకు ఇపుడు ఎస్బీఐలో విలీనమైంది). శిఖా శర్మ భారతదేశంలో మూడవ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ. 1980 లో ఐసిఐసిఐ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ రిటైల్ ఫైనాన్స్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. ఆర్ధిక రంగంలో మూడు దశాబ్దాల విశేష అనుభవంతో యాక్సిస్ బ్యాంకు సారధ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ విభాగంలో తనదైన ముద్రతో యాక్సిస్ బ్యాంకును అగ్రభాగంలో నిలిపే లక్ష్యంతో సాగుతున్నారు. అరుంధతి భట్టాచార్య దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగబ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 208 సంవత్సరాల ఎస్బీఐచరిత్రలో, ఈ ఘనతను సాధించిన మొదటి మహిళగా భట్టాచార్య గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ 'మోస్ట్ పవర్ఫుల్ వుమెన్’ 2016 లో 25వ స్థానంలో నిలిచారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు రెండేళ్ల సెబాటికల్ లీవ్ విధానాన్ని ఆమె పరిచయం చేశారు. దీన్నిమహిళలు ప్రసూతి సెలవు లేదా పెద్దల సంరక్షణల బాధ్యతల సందర్భంగా వినియోగించుకోవచ్చు.అలాగే సర్వైకల్ క్యాన్సర్ టీకాను మహిళా ఉద్యోగులందరు ఉచితంగా పొందే సౌకర్యాన్ని కల్పించారు. చిత్ర రామకృష్ణ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారిలో చిత్రా రామకృష్ణ ప్రముఖులు. అంతేకాదు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) కు బలమైన పోటీదారుగా ఎన్ఎస్ఈని నిలపడంలో ఆమె కృషి చాలా ఉంది. మార్కేట్ రెగ్యులేటరీ సెబీకి కూడా ఆమె తన సేవలనందించారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా కెరియర్ ను ప్రారంభించిన చిత్ర ఐడీబీఐ బ్యాంకులో ప్రాజెక్ట్ ఫైనాన్స్ విభాగంలో పనిచేశారు. 1992లో ఎన్ఎస్ఈ ఏర్పడినప్పటినుంచి వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె 2013లో (20 ఏళ్ల తరువాత) సీఈవో, ఎండీగా నియమితులయ్యారు. అదే సంవత్సరం ఫోర్బ్స్ ఇండియన్ విమెన్ లీడర్ పురస్కారం గెలుచుకున్నారు. డిసెంబరు 2, 2016 న ఆమె పదవికి రాజీనామా చేశారు. ఉషా సంగ్వాన్ దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కి మొట్టమొదటి మహిళా ఎండీ ఉషా సంగ్వాన్. సాధారణంగా ఎల్ఐసీకి టెక్నికల్‌గా నలుగురు ఎండీలు సారధ్యం వహిస్తారు. అయితే నలుగురు ఎండీలు కంపెనీని వీడిన అనంతరం ఎండీ పదవిన చేపట్టిన ఉషా సంస్థను ఆరునెలలపాటు ఒంటి చేత్తో నడిపించడం విశేషం. ఈ కాలంలో ఎల్ఐసి మార్కెట్ వాటా 70 శాతంనుంచి 71శాతానికి పెరిగింది. క్లెయియ్ పరిష్కార నిష్పత్తి 99.6 శాతం వద్ద ఉంది. వాణి కోలా బెంగళూరు ఆధారిత కోలారి క్యాపిటల్ వ్యవస్థాపకురాలు, ఎండీ వాణి కోలా. కోలారి క్యాపిటల్‌ను నెలకొల్పినప్పటినుంచీ విజయపథంలో నడిపించారు. తద్వారా దేశంలో వెంచర్ పెట్టుబడి సంస్థలలో ఒకటిగా నిలిపారు. 22 ఏళ్లపాటు సిలికాన్ వ్యాలీలో, 10సంవత్సరాలు వెంచర్ క్యాపిటలిస్టుగా సేవలనందించారు. సిలికాన్ వ్యాలీలో సర్టస్ సంస్థకు వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా ఉన్నారు. అంతకుముందు ఇ- ప్రొక్యూర్ మెంట్ కంపెనీ రైట్ వర్క్స్‌కు సీఈవోగా పనిచేశారు.2005 లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆరు నెలలకాలంలోనే 210 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సహా దాదాపు 60 స్టార్టప్ కంపెనీల్లో 650 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను సాధించిన ఘనత ఆమె సొంతం. 1964లో హైదరాబాద్‌లో జన్మించిన వాణి కోలా ఉస్మానియా యూనివర్శిటీలో, అరిజోనా యూనివర్శిటీలో విద్యనభ్యసించారు. ఇంద్రనూయి 1955లో తమిళనాడులోని మద్రాసులో జన్మించిన ఇంద్రనూయి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆహార, పానీయాల కంపెనీ పెప్సీకోకు సీయీవోగా ఎదిగారు. ఫోర్బ్స్ వారు ప్రకటించిన ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో 13వ స్థానంలో నిలిచారు. 2001లో ఆమె పెప్సీకో కంపెనీలో చేరినప్పుడు సంస్థ నికర లాభం 2.7బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం అది 6.5బిలియన్ డాలర్లకు చేరుకోవడంలో ఆమె చేసిన కృషి అమోఘం. ఆమె కృషికి తగ్గ ఫలితంగా ఆమె ప్రస్తుతం సంవత్సరానికి 18.6మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకుంటున్నారు. కావేరి కళానిధి మారన్ సన్ టీవీ మానేజింగ్ డైరెక్టర్‌గా సంవత్సరానికి 18మిలియన్ డాలర్ల వేతనాన్ని పొందుతున్నారు. ఇన్ఫోసిస్ సీయీవో వేతనం కంటే కూడా ఇది అధికం. 2010 నుంచి 2015 వరకూ స్పైస్‌జెట్ చైర్మన్‌గా పనిచేశారు. కిరణ్ మజుందార్ షా బెంగెళూరులో బయోకాన్ బయోటెక్నాలజీ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం సంస్థ మానేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సంవత్సరానికి రూ.16కోట్ల వేతనం పొందుతూ దేశంలో అత్యంత ధనవంతురాలుగా గుర్తింపు పొందుతున్న మహిళ. భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రాలలో ఆమె చేసిన రచనలకు గాను 2014లో ఒత్మేర్ గోల్డమెడల్ పొందారు. ఐఐఎమ్ బెంగుళూరుకు చైరపర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉర్వి పిరమాల్ సంవత్సరానికి రూ.10కోట్ల వేతనం పొందుతూ నాల్గో స్థానంలో నిలిచారు ఉర్వి పిరమాల్, అశోక్ పిరమాల్ సంస్థ అధినేత్రి. తన 32వ ఏట భర్తను కోల్పొయారు. తదనంతరం కుటుంబ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. కుటుంబ వ్యాపారం విడిపోయిన తర్వాత ఉర్వి పిరమాల్‌కు తన వాటాగా ఒక టెక్సటైల్ మిల్, రెండు ఇంజనీరింగ్ సంస్థలు లభించాయి. పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను ఆమె తిరిగి లాభాల బాట పట్టించారు. ప్రస్తుతం ఈ సంస్థల సంవత్సర ఆదాయం రూ.1600కోట్లు. ఆర్తీ సుబ్రమణియన్ ‘‘ఉత్తమమైనది తప్ప మరేమి వద్దు’’ ఇదే ఆర్తీ సుబ్రమణియన్ పాటించే సూత్రం. అదే ఆమెను టీసీఎస్ లాంటి టాప్ కంపెనీకి ఎక్సిక్యూటీవ్ డైరెక్టరుగా ఎదిగేలా చేసింది. ఆమె ఈడీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సాధించిన అతి గొప్ప విజయం పాస్‌పోర్టు సేవా ప్రాజెక్టు. పాస్‌పోర్టు జారీ ప్రక్రియను పూర్తిగా మార్చి డిజిటైజేషన్ చేశారు. టీసీఎస్ చరిత్రలోనే బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలైన తొలి మహిళ. ఆమె తోటి ఉద్యోగులు ఆమెను ప్రేమగా ‘మిస్.ఫిక్సిట్’ అని పిలుచుకుంటారు. వనిత నారయానణ్ టెక్ దిగ్గజం ఐబీఎమ్ గురించి మనలో చాలా మందికి తెలుసు. బీటెక్ చదివిన ప్రతి విద్యార్ధి ఐబీఎమ్‌లో ఉద్యోగం గురించి కలలు కంటుంటారు. వనితా నారయానణ్ కూడా అలానే అనుకుంది, అనుకోవడమే కాకుండా అందులో ఉద్యోగం కూడా సంపాదించారు. 1985లో ఐబీఎమ్‌లో సాధరణ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 2013లో ఐబీఎమ్ ఇండియాకు మానేజింగ్ డైరెక్టర్‌గా, ఇండియా/సౌత్ ఆసియాకు రిజనల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 25 సంవత్సరాల నుంచి వివిధ దేశాల్లో పర్యటిస్తూ, వేర్వేరు రకాల వ్యక్తులతో పనిచేస్తున్నారు. 2013-14లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో సభ్యురాలిగా పనిచేశారు. నీలమ్ ధావన్ హెచ్‌పీ కంప్యూటర్లు, ప్రింటర్లకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అంత గొప్ప పేరు ఉన్న కంపెనీకి ఇండియాలో మానేజింగ్ డైరెక్టరుగా నియమితులయ్యారు నీలం ధావన్. కేవలం కంప్యూటర్లు, ప్రిటింగ్ పరికరాలకే పరిమితమైన కంపేని సేవలను బీపీవో, సాఫ్ట్వేర్, పరిశోధన - సేవలకు కూడా విస్తరించి ప్రస్తుతం హెచ్‌పీ కంపెనీని దేశంలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీగా నిలబెట్టారు. హెచ్‌పీలో చేరడానికంటే ముంది నీలం 2005నుంచి 2008వరకూ మైక్రోసాఫ్ట్ ఇండియాకు మానేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. హెచ్‌సీఎల్, ఐబీఎమ్ కంపెనీల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అరుణ జయంతి 2011 సెప్టెంబరులో కాప్జెమిని సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన అరుణ జయంతిది ఈ రంగలో రెండు దశాబ్దల అనుభవం. సీయీవోగా చేయడానికి కంటే ముంది అరుణ కాప్ జెమినిలో ఔవుట్ సోర్సింగ్ విభాగానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆమె ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఔవుట్సోర్సింగ్ సేవల విలువలను గణనీయంగా పెంచారు. సీయీవోగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే భారతీయ వ్యాపార రంగంలో తన ఉనికిని చాటుకున్నారు. 2013లో ఇండియా టుడే వారు ప్రకటించిన ఇండియన్ వుమేన్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. క్రితిగా రెడ్డి సామాజిక మాధ్యమం ఫేస్బుక్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా తన శాఖలను విస్తరించింది ఈ కంపెనీ. ఇంతపెద్ద కంపెనీలో భారతదేశం నుంచి ఉద్యోగంలో చేరిన తొలి మహిళ క్రితిగా రెడ్డి. 2010లో ఉద్యోగంలో చేరిన క్రితిగా రెడ్డి ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో తన సేవలను విస్తరించేందుకుగాను హైదరాబాదులో ప్రారంభించిన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫార్చున్ పత్రిక ప్రకటించే టాప్ 50 మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ ఇన్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. పిల్లలు, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు. కుముద్ శ్రీనివాసన్ 1987లో ఇంటెల్ కంపెనీలో చేరిన కుముద్ శ్రీనివాసన్ బిజినేస్, ఇనఫర్మేషన్ సిస్టమ్స్‌లో వేర్వేరు బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం భారత్‌లో ఇంటెల్‌కు జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరులోని ఐఐఐటీ గవర్నింగ్ బాడీలో సభ్యురాలిగా పనిచేశారు. తన్యా దుబాష్ గోద్రెజ్ ఉత్పత్తులకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో తెలిసిన విషయమే. సబ్బుల దగ్గర నుంచి లాకర్ల వరకూ ఎనో ఉత్పత్తులను తయారుచేస్తుంది ఈ కంపెనీ. కానీ ఒకానొక సందర్భంలో కంపెనీలో మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని ముందు గుర్తించి నష్టం వాటిల్లకుండా చూసి కంపెనీని తిరిగి పుంజుకునేలా చేసిన ఘనత తన్యా దుబాష్ది. తన్యా దుబాష్, ఆది గోద్రెజ్ పెద్ద కుమార్తే. తన్యా దుబాష్ భారతీయ మహిళ బ్యాంకు బోర్డు మెంబరు. సునితా రెడ్డి వైద్యరంగంలో అపోలో ఆసుపత్రులది విశిష్ట స్థానం. 2014లో సునితా రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆరోగ్యసేవలను విస్తరస్తూ పోతు ఉన్నారు. ప్రస్తుతం అపోలో ఆరోగ్య సేవలను గ్రామాలకూ కూడా విస్తరించారు. ఆమె హర్వర్డ్ బిజినేస్ స్కూల్ ఇండియా అడ్వైసరీ బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు. శాంతి ఏకాంబరం ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో ఎంతటి పోటి ఉందో అందరికి తెలిసిన విషయమే. ఇంత తీవ్ర పోటిని తట్టుకుని నిలబడాలంటే ఎంతో ముందు చూపు ఉన్న నాయకత్వం అవసరం. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తే శాంతి ఏకాంబరం, ప్రముఖ కోటాక్ మహింద్ర బ్యాంక్ ప్రెసిడెంట్. 2014లో ఆమె బాధ్యతలు తీసుకున్న వెంటనే డిజిటల్ ఉత్పత్తుల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగానే వేర్వేరు భాషల్లో బ్యాంక్ సర్వీసులను అందిచడం, అల్ఫా సేవింగ్స్ అకౌంట్స్, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా డబ్బులను పంపిచడం వంటి నూతన విధానాలను ప్రవేశపెట్టారు. ఆమె చేసిన మార్పుల వల్ల 2015లో రూ.21,113గా ఉన్న ఖాతాదారుల ద్రవ్య నిల్వలు 2016 మార్చి నాటికి రూ.32,987 కోట్లకు చేరుకున్నాయి. చౌహన్ సాలుజా పార్లే-జీ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది బిస్కెట్లు. అంతా ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ ఒకానొక సమయంలో అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల కంపెనీల నుంచి తీవ్ర పోటిని ఎదుర్కొవాల్సి వచ్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీ పగ్గాలు చేపట్టింది చౌహాన్ సాలుజా, కంపెనీ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సాలుజా పెద్ద కుమార్తే. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధించిన అతిపెద్ద విజయం కంపెనీ తయారి సంస్థను ఉత్తారాఖండ్‌లో నెలకొల్పడం. రోశిని నాడార్ హెచ్‌సీఎల్ అంటే ఐటీ సేవలు అందించే సంస్థగానే గుర్తింపు ఉంది. కానీ రోశిని నాడార్ కంపెనీ సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 2014లో రోశిని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐటీ సేవలకే పరిమతమయిన కంపెనీ ఆరోగ్యరంగంలో అడుగు పెట్టింది, నైపుణ్య శిక్షణ కోసం హెచ్‌సీఎల్ టాలెంట్ కేర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇవి విజయవంతంగా పనిచేస్తున్నాయి. రేఖ మీనన్ అక్సెంచర్ కంపెనీకి 2000 సంవత్సరంలో భారతదేశంలో కేవలం 300మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మరి ప్రస్తుతం...? 1,40,000మంది అవును అక్షరాల లక్షానలబై వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ సాధించిన ఈ అభివృద్ధి వెనక రేఖా మీనన్ క్రమశిక్షణ, కృషి, అంకితభావం ఉన్నాయి. ప్రియా నాయర్ 1995లో హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీలో మానేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం కంపెనీలో ముఖ్య విభాగమైన హోమ్ కేర్ డివిజన్‌కు ఎగ్సిక్యూటీవ్ డైరెక్టరుగా ఎదిగారు. మార్కెట్లో వస్తున్న పోటి కంపెనీ ఉత్పత్తులకు ధీటుగా ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడ్తూ కంపెనీని విస్తరిస్తూ పోతు ఉన్నారు. ఏక్తా కపూర్ సగటు భారతీయ ప్రేక్షకులను ముఖ్యంగా ఆడవారిని టీవీల ముందు కట్టిపడేసి, ధారవాహికలకు భారీ హంగులు అద్దిన బుల్లితెర రాణి ఏక్తా కపూర్. బాలాజీ టెలిఫిల్మ్ అనే సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన ధారవాహికలను నిర్మిస్తూన్నారు ఏక్తా కపూర్. అంతేకాదు సిని నిర్మాణ రంగంలోనూ ప్రవేశించి తన ప్రతిభను చాటుకుంటున్నారు. నీతా అంబాని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అంబానీల ఇంట అడుగుపెట్టారు నీతా అంబాని. రిలయన్స్ సంస్థల అభివృద్ధిలో ఆమె పాత్రను మరవలేము.ఇంత పేరుప్రఖ్యాతులు వచ్చినా ఆమె తన మూలాలను మరిచిపోలేదు. అందుకే కంపెనీ లాభాల్లోంచి కొంత వాటాను తిరిగి సమాజాభివృద్ధికే కేటాయించే ఉద్ధేశంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే సవాళ్లను ముందే గుర్తించడం, అందుకు తగ్గ పరిష్కారాలను కనుక్కొవడం ఆమె ప్రత్యేకత. వీరు తమ అసమాన ప్రతిభా పాటవాలతో అటు తాము నేతృత్వం వహిస్తున్న కంపెనీలను విజయపథం వైపు నడిపించడం మాత్రమే కాదు ఫైనాన్షియల్ సెక్టార్లో గణనీయమైన కృషి చేశారు. కొన్ని పనులను, బాధ్యతలను మహిళలు నిర్వహించలేరు అనేది కేవలం అపోహ మాత్రమేనని నిరూపించారు. అవకాశాలు కల్పిస్తే..బాధ్యతలు అప్పగిస్తే ఏ రంగమైనా రాణించి తీరతామని చాటి పెట్టారు. తద్వారా యావత్ మహిళాలోకానికి ప్రేరణగా నిలిచారు. ధరణి సూర్యకుమారి -
మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు
-
పురుషులు ఈ విషయాన్ని గుర్తించాలి: ఇవాంక
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ ప్లీనరీలో ఇవాంక మాట్లాడుతూ.. మహిళలు విభిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ.. కుటుంబసభ్యులకు ఆర్థికంగా అండగా ఉంటున్నారని గుర్తుచేశారు. సాంకేతిక రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కొత్త ఆవిష్కరణలన్నీ ప్రైవేటు రంగంలోనే వస్తున్నాయని, ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ లభిస్తుందని అన్నారు. వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని గుర్తుచేశారు. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నారు. అమెరికన్ వర్సిటీల్లో మహిళలకు సాంకేతిక విద్యను అందించడంపై ఎక్కువ శ్రద్ధా పెట్టామని తెలిపారు. మహిళలకు ప్రధానంగా నమ్మకం, సామర్థ్యం, మూలధనం ఉండాలని చెప్పారు. మహిళలు తమతో ఏ విషయంలో తీసిపోరని పురుషులు గుర్తించాలన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిస్కో, మైక్రోసాఫ్ట్‌తో కలిసి మహిళాభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు. భారత దేశంలో మహిళల భాగస్వామ్యం చాలా పెరిగిందని చందా కొచ్చర్ అన్నారు. భారతదేశం నుంచి మంచి క్రీడాకారిణులు అన్ని విభాగాల్లో ఉన్నారని తెలిపారు. నేడు భారత దేశ రక్షణమంత్రిగా మహిళ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని బ్యాకింగ్ రంగంలో 40శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. ఆత్మస్థైర్యం నింపినప్పుడే మహిళలు రాణించగలరని చెప్పారు. తన పిల్లలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. మహిళల సాధికారిత కోసం తమ ఫౌండేషన్ ప్రధానంగా కృషి చేస్తున్నదని చెర్రీ బ్లెయిర్ తెలిపారు. -
చెర్రీ బ్లెయిర్.. చందా కొచ్చర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)లో జరిగే వివిధ చర్చల్లో ప్రసంగించనున్న 57 మంది పారిశ్రామికవేత్తల పేర్లు ఖరారయ్యాయి. వీరికి సంబంధించిన వివరాలను సదస్సు నిర్వాహకులు విడుదల చేశారు. సదస్సులో మొత్తం 53 చర్చాగోష్ఠులు జరగనున్నాయి. అయితే అందులో మాట్లాడే వారి తుది జాబితాలు ఇంకా ఖరారు కాలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఖరారైన పేర్లలో 57 మందికి సంబంధించిన నేపథ్యాలను నిర్వాహకులు వెల్లడించారు. వీరిలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, చైర్మన్ చందా కొచ్చర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెర్రీ బ్లెయిర్‌తోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు. అందులో కొందరి గురించి.. చెర్రీ బ్లెయిర్ – బ్రిటన్ మాజీ ప్రధాని సతీమణి ఈమె ప్రముఖ న్యాయవాది కూడా. పరిశ్రమలను నెలకొల్పడంలో మహిళలకు సహాయం చేసేందుకు 2008లో చెర్రీ బ్లెయిర్ ఫౌండేషన్‌ను స్థాపించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజంలో తమ గొంతను వినిపించగలుగుతారన్న ఆశయంతో ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు, బాలలు, మానవ హక్కుల కోసం కృషి చేస్తున్నారు. చందా కొచ్చర్ – ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐకు ఈమె 2009 నుంచి సీఎండీగా పని చేస్తున్నారు. 1984లో ఐసీఐసీఐలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె... 2001లో బ్యాంక్ పాలక మండలిలో స్థానం సంపాదించారు. 2011లో పద్మభూషన్ పురస్కారాన్ని అందుకున్నారు. 153 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తులున్న ఐసీఐసీఐ బ్యాంకుకు లాభాల బాట పట్టిస్తూ ఖ్యాతి గడించారు. అను ఆచార్య – సీఈవో, మ్యాప్ మై జీనోమ్ ఇండియా లిమిటెడ్ జన్యు చికిత్స ద్వారా వైద్య సేవలందించేందుకు అను ఆచార్య 2013లో ‘మ్యాప్ మై జీనోమ్’సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎన్నో పురస్కారాలను గెలుచుకుంది. రెడ్ హెర్రింగ్ టాప్ 100 ఏసియా అండ్ గ్లోబల్ 2016, ఈఎన్–ఏబుల్ ఇండియా స్టార్టప్ అవార్డ్–2016, వాల్ స్ట్రీట్ జర్నల్ స్టార్టప్ షోకేస్–2016 ఫైనలిస్ట్ పురస్కారాలను సొంతం చేసుకుంది. భావిష్ అగర్వాల్ – ఓలా, సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఐఐటీ ముంబైలో చదివిన భావిష్ సహ విద్యార్థి అంకిత్ భాటీతో కలిసి ఓలా క్యాబ్స్ కంపెనీని 2013 డిసెంబర్లో నెలకొల్పారు. అంతకు ముందు రెండేళ్ల పాటు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లో పనిచేశారు. ఓలా షేర్, ఓలా షటిల్ సేవలతో రవాణా రంగంలోకి దూసుకువచ్చారు. ఎకనామిక్స్ టైమ్స్ నుంచి ఎంటర్‌ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్–2017 పురస్కారం అందుకున్నారు. సంజీవ్ భిక్చందాని – ‘నౌకరీ’ వ్యవస్థాపకుడు ఐఐఎం అహ్మదాబాద్ నుంచి 1989లో ఎంబీఏ పూర్తి చేసిన సంజీవ్ భిక్చందాని ఎన్నో రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేసిన తర్వాత 2003లో ‘నౌకరి డాట్ కాం’వెబ్‌సైట్‌ను స్థాపించారు. ఇది ఉద్యోగ సమాచారం అందించే ప్రధాన వెబ్‌సైట్‌గా పేరుగాంచింది. స్టాక్ ఎక్సే్ఛంజీలో రిజిస్టరైన ఈ కంపెనీకి మార్కెట్లో 2 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులున్నాయి. దీప్ కాల్ర – ‘మేక్ మై ట్రిప్’ వ్యవస్థాపకుడు ఈయన ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ‘మేక్ మై ట్రిప్ డాట్ కాం’ను 2000లో స్థాపించి కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేశారు. అంతకు ముందు పలు కంపెనీల్లో పనిచేశారు. ఐఏఎంఏఐ, ఇంటర్నెట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (2010), కేపీఎంజీ నుంచి డిజిటల్ ఇన్‌ఫ్లూయన్సర్ ఇన్ ఇండియా((2012)తో సహా పలు పురస్కారాలను అందుకున్నారు. సచిన్ భన్సల్ – ఫ్లిప్‌కార్ట్, సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దేశ ఈ–కామర్స్ రంగంలో 60 శాతం వాటా కలిగిన ఫ్లిప్‌కార్ట్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. కంపెనీని స్థాపించిన 2007 నుంచి 2015 వరకు సీఈవోగా, 2016 నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2016లో ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. -
చందా కొచర్ వేతనం @ రూ. 7.85 కోట్లు
-
చందా కొచర్ వేతనం @ రూ. 7.85 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం చందా కొచర్ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 7.85 కోట్ల వేతనం అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 64 శాతం అధి కం. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. ఆమె బేసిక్ శాలరీ 15 శాతం పెరిగి రూ. 2.67 కోట్లకు చేరింది. అంటే రోజువారీగా చూస్తే కొచర్ రోజుకు.. రూ. 2.18 లక్షల వేతనం అందుకున్నట్లవుతుంది. 2016–17లో ఆమె రూ. 2.2 కోట్ల బోనస్ అందుకున్నారు. వసతి, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, నీరు, గ్రూప్ ఇన్సూరెన్స్, క్లబ్ ఫీజు, నివాసం వద్ద వినియోగించేందుకు ఫోన్, కారు, రీయింబర్స్మెంట్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీఏ), ప్రావిడెంట్ ఫండ్ మొదలైన వాటితో పాటు రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ కలిపి రెమ్యూనరేషన్లో లెక్కేస్తారు. నెలవారీ కొచ్చర్ బేసిక్ శాలరీ రూ. 13,50,000– రూ. 26,00,000 శ్రేణిలో ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక నివేదిక పేర్కొం ది. ప్రధాన సవాళ్లెదుర్కొంటూ.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడమే ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధాన లక్ష్యమని నివేదికలో కొచర్ తెలిపారు. బ్యాంకు పరిమాణం, భారీ స్థాయిలో నిధులు, వివిధ ఆర్థిక సేవలు అందిస్తుండటం తదితర అంశాలు ఇందుకు తోడ్పడగలవని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
ప్రైవేట్ దిగ్గజానికి భారీ డిపాజిట్లు
ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుగా పేరున్న ఐసీఐసీఐ బ్యాంకు, పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా డిపాజిట్లను ఆర్జించినట్టు ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచ్చర్ తెలిపారు. శుక్రవారం వరకు రూ.32వేల కోట్ల డిపాజిట్లు బ్యాంకులో నమోదయ్యాయని ఆమె వెల్లడించారు. నోట్ల మార్పిడికి బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న భారీ రద్దీ, క్యూలైన్లపై స్పందించిన కొచ్చర్, ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చాలా కోపంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. కొత్త రూ.500 నోట్లను ఏటీఎంల ద్వారా ఎక్కువగా అందుబాటులోకి తీసుకొస్తే, కస్టమర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించుకుని, పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని కొచ్చర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చెల్లింపులన్నీ డిజిటల్ మార్గంలోకి పయనిస్తున్నాయని తెలిపారు. వర్తకుల నుంచి తమకు చాలా రిక్వెస్ట్‌లు వస్తున్నాయని, సేల్ టెర్నినల్స్ను ఏర్పాటుచేయాలని వారు అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా వాడకుండా మూలన పడిఉన్న ఏటీఎం కార్డుల వాడకం కూడా పెరిగిందని చెప్పారు. బ్లాక్‌మనీపై ఉక్కుపాదం మోపుతూ, అవినీతిని నిర్మూలించడానికి నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు బ్యాంకులకు రూ.5 ట్రిలియన్ వరకు డిపాజిట్లు నమోదయ్యాయి. బ్యాంకింగ్ డిపాజిట్ల వెల్లువ అటు ఉంచితే, ఎక్కువగా నగదు లావాదేవీలపైనే ఆధారపడిన మన దేశంలో పెద్ద నోట్ల రద్దుతో, బ్యాంకు నోట్లు ఎక్స్చేంజ్కు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
డిపాజిట్ల పెరుగుదలకు దోహదం
పెద్ద నోట్ల నిషేధంపై ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ముంబై: నల్లధనం నిరోధానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు బ్యాంకుల్లో డిపాజిట్ వృద్ధిరేటు పెరుగుదలకు దోహద పడుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచర్ గురువారం పేర్కొన్నారు. ఆమె ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో కస్టమర్లు ఎటువంటి ఇబ్బందులూ ఎదుర్కొనకుండా చూడ్డంపై అధికంగా దృష్టి సారిస్తున్నట్లు ఆమె తెలిపారు. తగిన రీతిలో రూ. 100 నోట్లను బ్రాంచీలకు భారీగా తరలించినట్లు వెల్లడించారు. క్యాష్ అరుుపోవడం అనేది తమ బ్యాంకు బ్రాంచీల్లో ఎక్కడా చోటుచేసుకోలేదని వివరించారు. గురువారం సాయంత్రమే తమ బ్యాంక్ ఏటీఎంలు కస్టమర్లకు సేవలు అందించడం ప్రారంభించాయనీ వివరించారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో డిపాజిట్ల వృద్ధిని గమనిస్తున్నట్లు తెలిపారు. ‘అరుుతే డిపాజిట్లు ఏ స్థారుులో వచ్చాయన్నది చెప్పడం సరికాదుకానీ, పలు బ్రాంచీల్లో 70 శాతం అధికంగా డిపాజిట్లు వచ్చాయన్నది సమాచారం. సాధారణ పరిస్థితులతో పోల్చితే ఇది రెట్టింపు’ అని వివరించారు. నల్లధనం నిరోధంలో ప్రధాని మోదీ తగిన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. -
ఐసీఐసీఐలో ఇక రోబోటిక్స్!
ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ • బ్యాంకింగ్‌కు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ • మార్చి నాటికి 20 శాతం లావాదేవీలు లక్ష్యం సాక్షి, బిజినెస్ బ్యూరో : ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ ఆటోమేషన్ విప్లవానికి నాంది పలికింది. 2017 మార్చి నాటికి బ్యాంకింగ్ లావాదేవీల్లో 20 శాతం ఆటోమేషన్ ద్వారా జరగాలన్నది బ్యాంక్ లక్ష్యం. ఇందులో భాగంగానే ‘సాఫ్ట్వేర్ రోబోటిక్స్’ లేదా ‘రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్’ను గురువారం ముంబైలో బ్యాంకు ఎండీ, సీఈఓ చందా కొచర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలను ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధితో ప్రత్యేకంగా పంచుకున్నారు. అవి... • ఈ సాఫ్ట్వేర్ రోబోటిక్స్ ఎలా పనిచేస్తుంది? ఒక ఉద్యోగి చేసే పనిని ఒక సాఫ్ట్వేర్ చేస్తుంది. విభిన్న పనులు చేయగల సత్తా వీటికుంది. ఫ్యాక్టరీల్లోనైతే రోబోటిక్స్‌తో వస్తువును ఒకచోటి నుంచి మరొకచోటకు తీసుకెళ్లొచ్చు. సాఫ్ట్వేర్ రోబోట్స్ అలాకాదు. కంప్యూటర్లో నిక్షిప్తమై ఏకకాలంలో అనేక అప్లికేషన్స్‌ను నడిపిస్తాయి. మనుషులకన్నా 10 రెట్లు వేగంగా ప్రాసెస్ చేస్తాయి. ఈ సాఫ్ట్వేర్ రోబోటిక్స్‌ను బ్యాంకింగ్ లావాదేవీలకు వాడుతున్న తొలి దేశీ బ్యాంకు మాదే. అంతర్జాతీయంగా కొన్ని బ్యాంకులు వాడుతున్నాయి. • ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు లక్ష్యమేంటి? చాలా ఉన్నాయి. ఒకటి కస్టమర్లకు వీటితో వేగంగా సేవలు అందుతాయి. రెండవది.. దీనివల్ల మా ఉద్యోగులు విలువ ఆధారిత సేవలను అందించగలుగుతారు. పని ఒత్తిడి తగ్గుతుంది. బ్యాంక్ పరంగా చూస్తే... ఏటా మా రిటైల్ బ్యాంకింగ్ వృద్ధి రేటు 25 శాతంగా ఉంది. ఇది పెరుగుతుంది. • రిటైల్ బ్యాంకింగ్ ఆటోమేషన్ వల్ల 2015-2025 మధ్య 30 శాతం బ్యాంక్ ఉద్యోగాలు పోతాయంటున్నారు. నిజమేనా? గడచిన పదేళ్లుగా బ్యాంకింగ్‌లో ఐటీ వినియోగం పెరుగుతూనే వచ్చింది. అయినా 6-7 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. ఎన్బీఎఫ్సీలను కూడా లెక్కిస్తే ఈ సంఖ్య 30 లక్షల వరకూ ఉంటుంది. అంటే టెక్నాలజీతో పాటు ఉపాధి కూడా పెరిగింది. ఇక బ్యాంకింగ్ అనుబంధ పరిశ్రమల వల్ల కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయి. అంటే... టెక్నాలజీతో పాటు ఉపాధీ పెరుగుతుంది. కాకపోతే కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలి. • ఆటోమేషన్తో ఏ లావాదేవీలు జరుగుతాయి? రిటైల్ బ్యాంకింగ్, అగ్రి బిజినెస్, ట్రేడ్ అండ్ ఫారెక్స్, ట్రెజరీ, హ్యూమన్ రిసోర్సెర్స్ విభాగాల్లో తొలుత ఈ సేవలకు ప్రారంభించాం. 2017 మార్చి నాటికి బ్యాంకింగ్ లావాదేవీల్లో 20 శాతం ఆటోమేషన్ ద్వారా జరగాలన్నది లక్ష్యం. • సేవింగ్స్ ఖాతా, రుణాలు, కార్డ్ వినియోగదారులకూ దీంతో లాభం ఉంటుందా? పలు విభాగాల్లో సేవల ప్రాసెసింగ్ సమయం గణనీయంగా 60 శాతం మేర తగ్గిపోతుంది. ఏటీఎం, 15జీ/హెచ్ ఫామ్‌ల ప్రాసెసింగ్‌లకు వీటిని వినియోగిస్తున్నాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలర్ట్స్‌కు మొబైల్ నంబర్ అప్డేషన్, రుణ రీపేమెంట్లకు ఈసీఎస్ ప్రెజెంటేషన్, ఆధార్ వివరాలు, దిగుమతి-ఎగుమతిదారు కోడ్ ధ్రువీకరణ ప్రక్రియ, డెబిట్ కార్డ్ పునఃజారీ వంటి కార్యకలాపాలకు తాజా టెక్నాలజీని వినియోగిస్తున్నాం. -
ఆ పవర్ ఫుల్ మహిళల్లో నలుగురు మనోళ్లే
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో మనవాళ్లు నలుగురు నిలిచారు. ప్రపంచంలో 100మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2016 ఎడిషన్ ను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య(25వ ర్యాంకు), ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్(40వ ర్యాంకు), బయోకాన్ చైర్మన్, ఎండీ కిరణ్ మజుందర్ షా(77వ ర్యాంకు), హెచ్ టీ మీడియా లిమిటెడ్ ఎడిటోరియల్ డైరెక్టర్, చైర్ పర్సన్ శోభనా భారతీయ(93వ ర్యాంకు)లు చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో జర్మన్ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. వరుసగా ఆరోసారి ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మెర్కెల్ తర్వాత స్థానం అమెరికా అధ్యక్ష అభ్యర్థురాలు హిల్లరీ క్లింటన్ ను వరించింది. అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్ జానెట్ ఎల్లెన్ ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచారు. బిలీనియర్లు, బిజినెస్, ఫైనాన్స్, మీడియా, పాలిటిక్స్, ఫిలాంథ్రఫిక్ట్స్, ఎన్ జీవోస్, టెక్నాలజీ వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారినుంచి ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తివంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ కేటగిరీల్లో సంపద, మీడియా ఉనికి, ప్రతిభపాటవాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. -
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
ముంబయి: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకు మహిళల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకనుంచి ఇంటి దగ్గర ఉండి పనిచేసేందుకు వీలుగా అవకాశం తెచ్చిపెట్టింది. 'ఐ వర్క్@హోమ్' పేరిట ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చి తమ సంస్థకు చెందిన ఉద్యోగినులు ల్యాప్ టాప్ ద్వారా బ్యాంకు లావాదేవీలు చూసేందుకు వీలు కల్పించింది. ఈ విధానం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే మహిళలకు అమితంగా ఉపయోగపడనుంది. తమ బ్యాంకులో పనిచేసే మహిళలకు పెద్దగా ఇబ్బందులు కలగకూడదని ఐసీఐసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్ మాట్లాడుతూ తాము నిర్వహించిన సర్వేలో మహిళలు మెటర్నటీ కారణంగా విధులకు దూరం కావాల్సి వస్తుందని, ఇంకొందరైతే రాజీనామాలు చేస్తున్నారని గుర్తించామని చెప్పారు. 'ఇకపై మహిళలు ఇబ్బందుల కారణంగా విధులకు దూరం అయ్యే సమస్య లేకుండా ఓ బలమైన వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయించాం. వర్క్ ఎట్ హోమ్ విధానం తెచ్చాం. ఇప్పటికే 50 మంది మహిళలు ఇలా పనిచేస్తున్నారు. మరో 125 మంది ఇలా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఇంటి దగ్గర ఉండి పనిచేసే వారి సంఖ్య త్వరలోనే 500కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాజీనామాలు చేసినవారు కూడా.. ఈ కొత్త విధానం చూసి వాటిని ఉపసంహరించుకునేందుకు ఆలోచిస్తారు' అని ఆమె చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకులో 30 శాతం మంది అంటే 73 వేల మంది మహిళలు పని చేస్తున్నారు.