న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు రుణాల వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ తాజాగా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోకుండా చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిపై కేసు నమోదైన వారం వ్యవధిలోనే నోటీసులపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. చందా కొచర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి ఇప్పటిదాకా ఆమెకు సమన్లేమీ జారీ చేయలేదని అధికారవర్గాలు తెలిపాయి. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు పారిపోకుండా నిలువరించేందుకు సీబీఐ లుక్ అవుట్ నోటీసును ఇమిగ్రేషన్ అధికారులకు పంపుతుంది. ఒకవేళ నిందితులు అటువంటి ప్రయత్నమేదైనా చేసిన పక్షంలో ఇమిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, విచారణ సంస్థలకు అప్పజెప్పాల్సి ఉంటుంది.
వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్.. చందా భర్త దీపక్ కొచర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. తొలుత చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు వెనకేసుకొచ్చినప్పటికీ, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. అంతకు ముందే చందా కొచర్ రాజీనామా చేసినప్పటికీ కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించడంతో పాటు అప్పటిదాకా ఇచ్చిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు మొదలైనవన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు, చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లపై సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల్లో చాలా భాగం మొండిబాకీలుగా మారగా, ఐసీఐసీఐకి రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పట్లో రుణాలు మంజూరు చేసిన కమిటీలో సభ్యులైన పలువురు బ్యాంకింగ్ దిగ్గజాల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ ప్రస్తావించింది.
చందా కొచర్‌పై లుక్ అవుట్ నోటీసు
Published Sat, Feb 23 2019 1:03 AM | Last Updated on Sat, Feb 23 2019 1:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment