Chanda Kochhar: CBI Arrests Former CEO of ICICI - Get the Reasons- Sakshi
Sakshi News home page

Chanda Kochhar: పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్‌’

Published Sun, Dec 25 2022 5:18 PM | Last Updated on Mon, Dec 26 2022 12:48 PM

Cbi Arrests Former Icici Ceo Chanda Kochhar, Husband Deepak - Sakshi

వేగంగా డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ కథ అడ్డం తిరిగినప్పుడు కళ్లముందున్న డబ్బు కూడా చేతికొచ్చేలోగా ఆవిరైపోవచ్చు. అప్పుడు చేసిన పాపాలకు ముసుగేసే టైం దొరక్కపోవచ్చు. కష్టపడకుండా వచ్చిన సొమ్మును కాపాడుకోవడం కూడా కష్టమేనని నిరూపించిన సంఘటన చందాకొచ్చర్‌ స్కాం. కాస్త తెలివితేటలతో బ్యాంకింగ్‌ వ్యవస్థను అడ్డంగా వాడుకోవచ్చని బయటపెట్టిన ఈ కుంభకోణమే చందా కొచ్చర్‌ స్కాం. 

ఏదైనా సాధించడం ఎంత కష్టమో. దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. పవర్‌ఫుల్‌ బ్యాంకర్‌గా పేరు తెచ్చుకున్న చందా కొచ్చర్‌ పొజీషన్‌ కూడా అదే. లక్షల కోట్ల ఆస్తులు. వేల సంఖ్యలో ఉద్యోగులు. పురుషాధిక్య వ్యాపార రంగం. ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ. అయితేనేం అంకెలతో గారెడీ చేసే ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవోగా.. బ్యాంకర్లకు మెగస్టార్‌లా..తోటి ఉద్యోగులకు దేవుడిలా కనిపించారు. ఇండియన్‌ బ్యాంకింగ్‌ ట్రెండ్‌ను మార్చేసి.. ఆ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్లారు. కానీ కొంతమందిని కొంతకాలమే మోసం చేయొచ్చు. కానీ ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సీఈవోగా ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఏలిన కొచ్చర్‌ కూడా అలాగే దొరికి పోయారు. బ్యాంకింగ్‌ రంగంలో నడిచిన కరప్షన్‌ ఏపీసోడ్‌ మొత్తం బయటపడింది. చందా కొచ్చర్‌ అక్రమసామ్రాజ్యం పునాదులతో కదిలాయి. 

సీబీఐ అరెస్ట్‌


ఒకప్పుడు మ్యాగజైన్ కవర్‌ పేజీల మీద మెరిసిన స్టార్ చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. వేణుగోపాల్ ధూత్‌కి చెందిన వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రూ. 3,000 కోట్లకు పైగా రుణాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ముడుపుల వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎస్సార్‌ గ్రూప్‌, వీడియోకాన్‌ గ్రూప్‌లో లాంచాల భాగోతం ఎలా వెలుగులోకి వచ్చింది.   

ఇచ్చుకో.. పుచ్చుకో


2010లో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎస్సాఆర్‌ స్టీల్‌కి 530 మిలియన్‌ డాలర్లు అప్పిచ్చింది. ఎస్సార్‌ ఆయిల్‌కి 350 మిలియన్‌ డాలర్ల అప్పును పువ్వులో పెట్టి ఇచ్చింది. ఎస్సార్‌ గ్రూప్‌లోని రెండు కంపెనీలకు అప్పులిచ్చిన తర్వాత లంచాల భాగోతం మొదలైంది. అంటే 2010 నుంచి 2012 మధ్య కాలంలో చందా కొచ్చర్‌ భర్త దీపా కొచ్చర్‌ కంపెనీలో పెట్టుబడులను అంటే లంచాల ద్వారా పంపించారు. 

‘ఎంత పనిచేశావయ్యా అరవింద్‌’


రవి రూయా అల్లుడు నిషాంత్‌ కనోడియాకు చెందిన ఫస్ట్‌ హ్యాండ్‌ హోల్డింగ్స్‌ నాలుగు విడతులుగా న్యూ పవర్‌లో రూ.325 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. శశిరూయా అల్లుడు అనిరుధ్‌ భువాల్కాకు చెందిన ఏ1 మోటార్స్‌ అనే సంస్థ ఏంఎండబ్ల్యూ అనే మరో సంస్థతో న్యూపవర్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసిందని అరవింద్‌ గుప్తా అనే ఇన్వెస్టర్‌, సామాజిక కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విలువ ఎంతన్నది బయటకు రాలేదు. అంటే ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రెండు కంపెనీలకు అప్పులందాయి. అడిగినంత అప్పు ఇచ్చినందుకు ప్రతిఫలంగా న్యూపవర్‌కు వెళ్లింది. 

చదవండి👉ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్‌ స‍్కూటర్‌ వైరల్‌!

తీగలాగితే డొంక కదలింది
అప్పులిచ్చిన చందా కొచ్చర్‌, లంచం తీసుకున్న దీపా కొచ్చర్‌ భార్యభర్తలు. అప్పులు తీసుకున్న రుయా సోదరులకు పెట్టుబడులు పెట్టిన అనిరుధ్‌, నిషాంత్‌ అల్లుళ్లు. ఈ వ్యవహారమే క్విడ్‌ ప్రోకో అని రిజిష్టార్‌ ఆఫీస్‌ కంపెనీస్‌ నుంచి సేకరించిన సమాచారం తన దగ్గరుందని విజిల్‌ బ్లోయర్‌  అరవింద్‌ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు.

ఆ ఆరోపణలు కొనసాగుతుండగా చందా కొచ్చర్‌ వీడియోకాన్‌కు రూ.3 వేల కోట్లకు పైగా ఇచ్చిన రుణం ఇచ్చినందుకు గాను తీసుకున్న ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో చందా కొచ్చర్‌ చీకటి సామ్రాజ్యం ప్రపంచానికి తెలిసింది. తీగలాగితే డొంక కదిలిందిన్నట్లుగా వీడియో కాన్‌ గ్రూప్‌ల వద్ద నుంచి తీసుకున్న ముడుపులు దెబ్బకు గతంలో ఎస్సాఆర్‌ గ్రూప్‌ వ్యవహారం బయటకొచ్చింది.       

కొచ్చర్‌ భాగోతంపై ప్రధానికి లేఖ
వీడియోకాన్ గ్రూప్‌లో పెట్టుబడిదారు అరవింద్ గుప్తా. ఆ అరవింద్‌ గుప్తా 2016లో ఐసీఐసీఐ బ్యాంక్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ల మధ్య జరిగిన లావాదేవీలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కొచ్చర్‌ భాగోతాలపై అదే ఏడాది మార్చిలో ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖతో రంగంలో దిగిన ఆర్‌బీఐ దర్యాప్తు చేసింది. 

చందా కొచర్ - దీపక్ కొచ్చర్ అరెస్ట్‌:  

అక్టోబరు 2016: చందా కొచ్చర్‌పై ఆరోపణలు వెల్లు వెత్తిన తర్వాత  ఐసీఐసీఐ బ్యాంక్‌లో రుణ అక్రమాలు హైలెట్‌ అయ్యాయి. రంగంలోకి దిగిన ఆర్‌బీఐ దర్యాప్తు చేసింది కానీ.. కొచ్చర్‌ ముడుపుల వ్యవహారాన్ని ఎటూ తేల్చ లేకపోయింది.  

మార్చి 2018: 31లోన్ తీసుకున్న బ్యాంక్‌ అకౌంట్‌లలో  సమస్యలను గుర్తించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ బ్యాంక్,  ఆర్‌బీఐకు విజిల్‌ బ్లోయర్ అరవింద్‌ గుప్తా ఫిర్యాదు చేచేశారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత, సీబీఐ అంతర్గత విచారణను దాఖలు చేసి దీపక్ కొచ్చర్‌ను ప్రశ్నించడం ప్రారంభించింది.   

ఏప్రిల్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు చందా కొచ్చర్‌కు అండగా నిలిచింది. ఆమెపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. కొన్ని వారాల తర్వాత, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFO) ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు చేసిన వీడియోకాన్ రుణంపై దర్యాప్తు చేయడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిని కోరింది. 

మే - జూన్ 2018: చందా కొచ్చర్‌పై విజిల్‌బ్లోయర్ తాజా ఆరోపణలతో  ఐసీఐసీఐ బ్యాంక్ తప్పులు చేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ విచారణ ప్రారంభించడంతో మే నెలలో కొచ్చర్ సెలవుపై వెళ్లారు. 

జూలై 2018: షోకాజ్ నోటీసుకు తన ప్రత్యుత్తరాన్ని సమర్పించాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొచ్చర్‌ని కోరింది. 

అక్టోబర్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో బాధ్యతలకు చందా కొచ్చర్‌ రాజీనామా సమర్పించారు. 

జనవరి 2019: 2012లో వీడియోకాన్ గ్రూప్‌కు మంజూరైన రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దీపక్ కొచ్చర్, చందా కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ వెంటనే, చందా కొచ్చర్ బ్యాంక్ కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్ర దర్యాప్తులో తేలింది.

ఫిబ్రవరి 2019: చందా కొచ్చర్‌పై సీబీఐ లుక్‌అవుట్ నోటీసు జారీ చేసింది. 

జనవరి 2020: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చందా కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. వీటి విలువ రూ.78 కోట్ల పైమాటే. 

సెప్టెంబర్ 2020: మనీలాండరింగ్ కేసులో దీపక్ కొచ్చర్‌ను ఈడీ అరెస్టు చేసింది. 

నవంబర్ 2020: చందా కొచ్చర్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 

మార్చి 2021: దీపక్ కొచ్చర్ రూ. 3 లక్షల వ్యక్తిగత బాండ్‌పై విడుదలయ్యారు 

మే 2022: సీబీఐ  చందా కొచ్చర్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. 

డిసెంబర్ 23, 2022: చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సిబిఐ అరెస్టు చేసింది. డిసెంబరు 26, 2022 వరకు వారిని 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి తీసుకుంది. 

పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి
1984లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరిన చందా కొచ్చర్.. అతి తక్కువ సమయంలో దేశ బ్యాంకింగ్‌ రంగంలో స్టార్‌గా ఎదిగారు. అనతి కాలంలో ట్రైనీ నుంచి బ్యాంక్‌ సీఈవోగా ఆమె ఎదిగిన తీరు అమోఘం..అనర్వచనీయం. 2009 మేలో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓగా, ఎండీగా చందా కొచ్చర్‌ నియమితులయ్యారు.

ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఐసీఐసీఐ బ్యాంక్‌ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రభుత్వ బ్యాంకులకు గట్టి పోటీ ఇచ్చింది.  బ్యాంకింగ్‌ రంగంలో ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2011లో పద్మ భూషణ్ ప్రదానం చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు కూడా చోటు దక్కింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకుపైగా కాలంలో ఎన్నోసార్లు అత్యంత ప్రభావశీల మహిళగా చందా కొచ్చర్‌ గుర్తింపును పొందారు. కానీ, ఎంతో అద్భుతంగా సాగుతున్న తన బ్యాంకింగ్ కెరీర్ మెరుపుల నుంచి మరకల వరకు ఇలా కటకటాల వెనక్కి వెళ్తామని బహుశా ఆమె కూడా ఊహించి ఉండరు.

చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement