చందా కొచ్చర్‌ దంపతులకు భారీ ఊరట! | Bombay High Court Confirms Interim Bail Granted To Chanda, Deepak Kochhar In Loan Fraud Case - Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కేసు : చందా కొచ్చర్‌ దంపతులకు భారీ ఊరట!

Published Tue, Feb 6 2024 8:03 PM | Last Updated on Tue, Feb 6 2024 9:41 PM

Bombay High Court Interim Bail Granted To Chanda, Deepak Kochhar - Sakshi

ఐసీఐసీఐ బ్యాంక్‌ - వీడియో కాన్‌ లోన్‌ కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందా కొచ్చర్‌ దంపతులకు భారీ ఊరట లభించింది. చందా కొచ్చర్‌ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ సబబేనని స్పష్టం చేసింది. 

రుణాల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తమని అక్రమంగా అరెస్ట్‌ చేసిందని, తమకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చార్‌లు కోర్టు మెట్లెక్కారు. విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర బెయిల్‌ను జారీ చేసింది.

 

తాజాగా, మధ్యంతర బెయిల్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తులు అనూజా ప్రభుదేశాయ్,ఎన్‌ఆర్ బోర్కర్‌లతో కూడిన ధర్మాసనం.. ‘చందా కొచ్చర్‌ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఆర్డర్‌ను ధృవీకరించాం’ అని తెలిపారు.

అంతేకాదు, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ అరెస్ట్‌ చేయడం అక్రమమని బాంబే హైకోర్టు పేర్కొంది. 2023 జనవరి 9న కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సబబేనని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్ సంస్థకు రుణాలు ఇచ్చారన్న కేసులో కొచ్చర్ దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

నేరం అంగీకరించకపోవడమంటే విచారణకు సహకరించడం లేదని అర్థం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.  

2022లో అరెస్ట్‌ 
వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంకు రుణం కేసుకు సంబంధించి చందా కొచ్చర్‌ దంపతులను 2022 డిసెంబర్ 23న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కొచ్చర్‌తో పాటు వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. 



చందా కొచ్చర్‌ దంపతులతో పాటు 
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీలను ఉల్లంఘించి ధూత్ ప్రమోట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల క్రెడిట్ మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది. నేరపూరిత కుట్రకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద 2019లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తోపాటు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఐసీఐసీ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆయన భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ నిందితులుగా చేర్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement