ఐసీఐసీఐ బ్యాంకులో ఆ సంస్థ మాజీ సీఈవో చందాకొచ్చర్ ముడుపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనని ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో పదవి నుంచి అక్రమంగా తొలగించారంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండు వారాల తర్వాత ఆమె వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది.
లక్షల కోట్ల ఆస్తులు. వేల సంఖ్యలో ఉద్యోగులు. పురుషాధిక్య వ్యాపార రంగం. ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ. అయితేనేం అంకెలతో గారడీ చేసే ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా.. బ్యాంకర్లకు మెగస్టార్‌లా..తోటి ఉద్యోగులకు దేవుడిలా కనిపించిన చందాకొచ్చర్ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
2018లో
అప్పట్లో చందాకొచ్చర్ క్విడ్ ప్రోకో’ వ్యవహారం వెలుగులోకి రావడంతో అక్టోబర్ 4, 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ చందాకొచ్చర్‌తో స్వచ్ఛంద రాజీనామా చేయించింది. 4 నెలల తర్వాత బాంబే హైకోర్టు సైతం బ్యాంక్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైందేనని, చందా కొచ్చర్ సీఈవో పదవిలో కొనసాగేందుకు అనర్హులుగా తీర్పిచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చందా కొచ్చర్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
పలు నివేదికల ప్రకారం..
అదే సమయంలో, తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెన్ఫిట్స్, ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ (ఈఎస్‌ఓపీఎస్) అందిచాలని కోరింది. టెర్మినేషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, చందా కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్, అతని కంపెనీకి లాభం చేకూర్చిన వీడియోకాన్ గ్రూప్‌కు క్విడ్ ప్రోకో లోన్‌లు రూ. 3,250 కోట్లు ఇచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ డైరెక్టర్లు మాజీ సీఈవోకి ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ (ఈఎస్‌ఓపీఎస్) తోపాటు వేతనాన్ని నిలిపివేసింది. ఇప్పుడు అదే అంశాన్ని చందా కొచ్చర్ సుప్రీం కోర్టుకు చేసిన అప్పీల్‌లో వివరించారు.
ఐసీఐసీఐ బ్యాంక్ విఫలం
ఐసీఐసీఐ బ్యాంక్ తన పదవీ విరమణ తర్వాత సంస్థ అందించే ప్రయోజనాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని నిరోధించాలని సుప్రీంకు విన్నవించారు. తన వద్ద ఉన్న 6,90,000 షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లపై అనుమతించాలని అన్నారు. స్టాక్స్ డీల్ చేసే వీలు లేదని తెలిపేలా ఐసీఐసీఐ యాజమాన్యం వద్ద ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేవని హైకోర్టులో నిరూపించుకోవడంలో విఫలమైందని గుర్తు చేశారు.
వేధింపులకు గురవుతున్నారు
ఒకప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటును దక్కించుకున్నారని, అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును పొందిన తాను ఈ కేసుల కారణంగా 62 ఏళ్ల వయస్సులో తీవ్రమైన మనోవేదకు గురవుతున్నట్లు అప్పీల్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
అరెస్ట్.. బెయిల్‌పై విడుదల
చందా కొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3,200 కోట్లకుపైగా లోన్ తీసుకుంది. ఈ లోన్ మంజూరు సమయంలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీరిద్దరినీ ఈనెల 23న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్‌ఆర్‌ఎల్), సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు చందా కొచ్చర్‌లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొంది. దీపక్ కొచ్చర్ దంపతులతో పాటు వేణుగోపాల్ ధూత్‌లు డిసెంబర్ 2022లో అరెస్టయ్యారు, అయితే ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.
కాగా, ఇండియన్ బ్యాంకింగ్ ట్రెండ్‌ను మార్చేసి.. ఆ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్లారు. కానీ ఇప్పుడు కరువైన పలకరింపులు.. కోర్టులు,కేసులు, అరెస్ట్‌లతో ఆమె జీవితం భారం కావడంతో చందా కొచ్చర్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment