ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ వీడియోకాన్ ముడుపుల వ్యవహారంలో బాంబే హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా చందా కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోర్ట్‌ను కోరింది.
కొచ్చర్ రూ.64 కోట్ల బ్యాంక్ నిధుల్ని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారని కోర్ట్‌కు సీబీఐ తెలిపింది. చట్టవిరుద్ధంగా బ్యాంక్ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆధారాలున్నాయని పేర్కొంది. అంతేకాదు, తమ విచారణలో రూ.64 కోట్లను కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూ పవర్ రెన్యూవబుల్‌తో పాటు వీడియోకాన్ కంపెనీలోకి మళ్లించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది.
ఈ సందర్భంగా సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ లిమోసిన్.. చందా కొచ్చర్ కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై రుణాలకు అనర్హమైన వీడియోకాన్ కంపెనీకి లోన్స్ ఇచ్చేలా తన పదవిని దుర్వినియోగం చేసినట్లు కోర్ట్ ఎదుట వాదించారు.
దీంతో పాటు, 2016లో కొచ్చార్ ముంబైలోని చర్చ్‌గేట్ ప్రాంతంలో ఉన్న సీసీఐ చాంబర్స్‌లోని రూ.5.3 కోట్ల విలువైన ఫ్లాట్‌కు కేవలం రూ.11లక్షలే చెల్లించారని అన్నారు. 2021 నవంబర్ నెలలో అదే బిల్డింగ్‌లో ఓ ఫ్లోర్‌కు చందా కొచ్చర్ కుమారుడు అర్జున్ కొచ్చర్ రూ.19.11 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది.
11,000 పేజీల ఛార్జ్ షీట్
ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్ గ్రూపు పొందిన తర్వాత.. అందులో కోట్లాది రూపాయలను దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్‌లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులుగా పెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. కేసులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ 11,000 చార్జిషీట్ దాఖలు చేసింది.
జులై 3కి వాయిదా
తాజాగా,ఆ చార్జిషీట్‌పై విచారణ జరిగింది. విచారణలో కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్ట్‌ను కోరింది. ఇరువురి వాదనలు విన్న బాంబే హైకోర్ట్ కేసు తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ ఎదుట లిమోసిన్ తన వాదనలు కొనసాగించనున్నారు.
2017లోనే తెరపైకి క్విడ్ ప్రో కో వివాదం..
వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచ్చర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్‌లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంక్ నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్‌లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ.1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి.
చివరిగా :: సీబీఐ నివేదికల ప్రకారం..ఆగస్ట్ 6, 2009లో వీడియోకాన్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా ఉన్న చందా కొచ్చార్ లోన‍్లు ఇచ్చారని, అదే ఏడాది సెప్టెంబర్ 7 ఆ రుణాల్ని వీడియోకాన్‌కు చెల్లించినట్లు తేలింది.
చదవండి👉 ‘అప్పుడు మెగాస్టార్.. ఇప్పుడు ఆర్థిక నేరాలతో అరెస్ట్’
Comments
Please login to add a commentAdd a comment