Videocon group
-
వీడియోకాన్ ఫౌండర్ అకౌంట్ల అటాచ్మెంట్.. సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: రూ. 5.16 లక్షల జరిమానా బకాయిలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌కు చెందిన బ్యాంక్, డీమాట్, మ్యుచువల్ ఫండ్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు (సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్), మ్యుచువల్ ఫండ్ సంస్థలకు సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతించవచ్చని పేర్కొంది. క్వాలిటీ టెక్నో అడ్వైజర్స్, క్రెడెన్షియల్ ఫైనాన్స్, సుప్రీం ఎనర్జీ వంటి సంస్థలతో తనకున్న పెట్టుబడులు, సంబంధం గురించి వెల్లడించకుండా, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ ఏడాది మార్చిలో ధూత్‌కు సెబీ రూ. 5 లక్షల జరిమానా విధించింది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఇదీ చదవండి ➤ ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్‌కు సీఈవోగా అంజలీ సూద్ దీంతో అసలుతో పాటు రూ. 15,000 వడ్డీ, రికవరీ వ్యయాల కింద మరో రూ. 1,000 కలిపి మొత్తం రూ. 5.16 లక్షలు బాకీ చెల్లించాలని అటాచ్మెంట్ నోటీసులో సెబీ ఆదేశించింది. వీడియోకాన్ గ్రూప్ సంస్థలకు రుణ సదుపాయాలు కల్పించినందుకు ప్రతిగా అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా పనిచేసిన చందా కొచర్, ఆమె భర్తకు ధూత్ ప్రయోజనం చేకూర్చారని (క్విడ్ ప్రో కో) ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. -
రూ.5.3 కోట్ల ఫ్లాట్ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం?
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ వీడియోకాన్ ముడుపుల వ్యవహారంలో బాంబే హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా చందా కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోర్ట్‌ను కోరింది. కొచ్చర్ రూ.64 కోట్ల బ్యాంక్ నిధుల్ని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారని కోర్ట్‌కు సీబీఐ తెలిపింది. చట్టవిరుద్ధంగా బ్యాంక్ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆధారాలున్నాయని పేర్కొంది. అంతేకాదు, తమ విచారణలో రూ.64 కోట్లను కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూ పవర్ రెన్యూవబుల్తో పాటు వీడియోకాన్ కంపెనీలోకి మళ్లించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ లిమోసిన్.. చందా కొచ్చర్ కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై రుణాలకు అనర్హమైన వీడియోకాన్ కంపెనీకి లోన్స్ ఇచ్చేలా తన పదవిని దుర్వినియోగం చేసినట్లు కోర్ట్ ఎదుట వాదించారు. దీంతో పాటు, 2016లో కొచ్చార్ ముంబైలోని చర్చ్‌గేట్ ప్రాంతంలో ఉన్న సీసీఐ చాంబర్స్‌లోని రూ.5.3 కోట్ల విలువైన ఫ్లాట్‌కు కేవలం రూ.11లక్షలే చెల్లించారని అన్నారు. 2021 నవంబర్ నెలలో అదే బిల్డింగ్‌లో ఓ ఫ్లోర్‌కు చందా కొచ్చర్ కుమారుడు అర్జున్ కొచ్చర్ రూ.19.11 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. 11,000 పేజీల ఛార్జ్ షీట్ ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్ గ్రూపు పొందిన తర్వాత.. అందులో కోట్లాది రూపాయలను దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్‌లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులుగా పెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. కేసులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ 11,000 చార్జిషీట్ దాఖలు చేసింది. జులై 3కి వాయిదా తాజాగా,ఆ చార్జిషీట్‌పై విచారణ జరిగింది. విచారణలో కొచ్చర్‌పై తాము దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్ట్‌ను కోరింది. ఇరువురి వాదనలు విన్న బాంబే హైకోర్ట్ కేసు తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ ఎదుట లిమోసిన్ తన వాదనలు కొనసాగించనున్నారు. 2017లోనే తెరపైకి క్విడ్ ప్రో కో వివాదం.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచ్చర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంక్ నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ.1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. చివరిగా :: సీబీఐ నివేదికల ప్రకారం..ఆగస్ట్ 6, 2009లో వీడియోకాన్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా ఉన్న చందా కొచ్చార్ లోన్లు ఇచ్చారని, అదే ఏడాది సెప్టెంబర్ 7 ఆ రుణాల్ని వీడియోకాన్‌కు చెల్లించినట్లు తేలింది. చదవండి👉 ‘అప్పుడు మెగాస్టార్.. ఇప్పుడు ఆర్థిక నేరాలతో అరెస్ట్’ -
కొడుకు పెళ్లికి ముందే.. కొచ్చర్ దంపతులకు భారీ ఊరట, జైలు నుంచి విడుదల
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త చందా కొచ్చర్ అరెస్ట్ అక్రమమంటూ బాంబే హైకోర్ట్ తీర్పు వెలువరించింది. దీంతో మంగళవారం చందా, దీపక్ కొచ్చర్లు జైలు నుంచి విడుదలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియో కాన్ గ్రూప్‌కు రూ.3వేల కోట్ల రుణం మంజూరు చేశారంటూ గతేడాది డిసెంబర్ 23న సీబీఐ అధికారులు కొచ్చర్ దంపతుల్ని అరెస్ట్ చేశారు. జనవరి 25న కొచ్చర్ల కుమారుడు వివాహం జరగాల్సి ఉండగా.... అంతకంటే ముందే వారిద్దరి అరెస్ట్ సరైంది కాదంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్లైంది. కోర్టు తీర్పులో ఏముందంటే? కేసు నమోదు చేసిన నాలుగేళ్ల తర్వాత ఆ జంటను అరెస్టు చేయడానికి గల కారణాన్ని అరెస్ట్ మెమోలలో పేర్కొనలేదని కోర్టు నిన్న తెలిపింది. "అరెస్ట్ మెమోలలో పేర్కొన్న పిటిషనర్లను అరెస్టు చేయడానికి కారణం తప్పనిసరి నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే" అని పేర్కొంది. నిందితులు చేసిన తప్పు ఒప్పుకోకపోతే.. వాళ్లు విచారణకు సహకరించలేమని చెప్పలేమని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం కింద తమ అరెస్టు చట్టవిరుద్ధమని, దర్యాప్తు ప్రారంభించేందుకు చట్టంలోని సెక్షన్ 17ఎ కింద అనుమతి తప్పనిసరి అని, ఈ దర్యాప్తును ప్రారంభించడానికి ఏజెన్సీకి అలాంటి అనుమతి లేదని కొచ్చర్ దంపతులు గతంలో కోర్టు ముందు వాదించారు. కాగా, ఇప్పటి ఐసీఐసీఐ రుణం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ -
3 రోజుల పాటు సీబీఐ కస్టడీలో చందా కొచర్, దీపక్ కొచర్
ఐసీఐసీఐ మాజీ సీఈవో, ఎండీ చందాకొచర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టు 3 రోజుల పాటు సీబీఐ కస్టడీని విధించింది. వీడియోకాన్ రుణాల అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరూ 26 తేదీ వరకూ సీబీఐ తన కస్టడీలో ఉంచుకోనుంది. ఈ కేసులో వీరివురిని స్వల్పకాలిక విచారణ తర్వాత శనివారం అరెస్టు చేశారు. విచారణలో వారిద్దరూ సహకరించలేదని, అందుకే అరెస్టు చేశామని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. కాగా 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచర్‌కి చెందిన కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. -
‘ఐసీఐసీఐ’ మాజీ సీఈవో చందా కొచర్ అరెస్ట్
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల్లో అవకతవకలు, మోసం ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి వారిని ముందుగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రశ్నించారు. అయితే, వారు విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. చందా కొచర్, దీపక్ కొచర్లను శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. తొలి చార్జి షీటును కూడా సీబీఐ సత్వరం దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచర్‌కి చెందిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
ఐసీఐసీఐ స్కాం : చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ
బాంబే హైకోర్టులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పదవీ విరమణ తర్వాత కొచ్చర్ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు 2018లో ఆమె సంపాదించిన 6.90 లక్షల షేర్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని జస్టిస్ ఆర్ఐ గహ్లా సింగిల్ బెంచ్ కొచ్చర్‌ను కోరినట్లు పీటీఐ నివేదించింది.దీంతో పాటు గతంలో ఆమె ఏదైనా షేర్లకు సంబంధించి ట్రాన్సాక్షన్, ఇతర వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఉంటే, ఆరు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని గహ్లా అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చాగ్లా మాట్లాడుతూ కొచ్చర్ రాజీనామా సమయంలో వెల్లడించని వాస్తవాలు ఇతర అంశాలపై పూర్తి అవగాహన బ్యాంకుకు లేదన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు విచారణ నివేదిక అందిన తర్వాత మాత్రమే వెల్లడయ్యాయని అన్నారు. కాగా, ఐసీఐసీఐ స్కాంలో చందా కొచర్ వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చందా కొచర్ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ .300 కోట్ల రుణ మొత్తంలో రూ .64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ నుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్ దంపతులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
దివాలా తీసిన వీడియోకాన్.. ఆపై మరిన్ని సమస్యలు
న్యూఢిల్లీ: వీడియోకాన్‌పై దివాలా కోడ్ కింద చర్యల పక్రియ మొత్తం ఈ చట్టంపై లొసుగులను, వాటిని సవరించాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటిస్తోంది. తాజా పరిణామాన్ని పరిశీలిస్తే.. వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్‌సహా ఆ గ్రూప్‌నకు సంబంధించి 13 కంపెనీలకు ‘ఏకీకృత’ పరిష్కార (రిజల్యూషన్) ప్రణాళికకు ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదముద్ర వేయడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) వ్యతిరేకించింది. ఎన్సీఎల్టీ రూలింగ్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో సవాలు చేసింది. పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్‌కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ. 2,962 కోట్ల టేకోవర్ బిడ్‌ను అనుమతిస్తూ ఈ ఏడాది జూన్ 9వ తేదీన ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని టెలికం శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను అభ్యర్థించింది. టెలికం శాఖ వాదనలు ఇవీ... తనకు వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ దాదాపు రూ.882 కోట్లు బకాయి పడినట్లు తెలిపింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణలో ఉండడం వల్ల తానకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడం సాధ్యంకాదని అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు విన్నవించింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్‌ని ప్రారంభించడం ద్వారా డిఫాల్ట్ టెలికం కంపెనీలు ‘తమకు సంబంధించి రుణ బాధ్యతల నుండి బయటపడలేవని’ తన వాదనల్లో పేర్కొంది. మోసపూరిత విధానాలు పాల్పడిన కంపెనీలు ఐబీసీ నిబంధనావళికింద తప్పించుకోలేవని, తద్వారా ప్రభుత్వానికి చెల్లింపులను ఎగ్గొట్టలేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఆపరేషనల్ క్రెడిటార్స్‌కు వచ్చేది అత్యంత తక్కువ మొత్తమని పేర్కొంది. తనవరకూ చూస్తే, తాను చేసే క్లెయిమ్‌లో లభించేది కేవలం 0.12 శాతమేనని వివరించింది. జనవరి 11కు విచారణ వాయిదా.. కాగా, ఇందుకు సంబంధించి ఎన్సీఎల్టీ ఉత్తర్యుపై జూలై 19వ తేదీన ఎన్సీఎల్ఏటీ స్టే ఇచ్చిన అంశాన్ని ముగ్గురు సభ్యుల బెంచ్ ప్రస్తావించింది. యథాతథ పరిస్థితిని కొనసాగిస్తూ దివాలా చట్ట నిబంధనలకు అనుగుణంగా వీడియోకాన్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలను నిర్వహించాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పేర్కొంటూ, ఈ నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి విచారణాంశాల్లోకి తక్షణం వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే రెండు వారాల్లో ‘రిప్లై అఫిడవిట్లు’ మరో వారంలో ఏదైనా అవసరమైతే ‘రీజాయిండర్’లు వేయాలని వీడియోకన్ ఇండస్ట్రీస్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్‌సహా మిగిలిన ప్రతివాదులను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. దివాలా కోడ్‌పై విమర్శల తీరిది... రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్) దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్‌కట్స్ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు నిజానికి ట్విన్ స్టార్ టెక్నాలజీస్ బిడ్‌కు తొలుత సరేనన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తరువాత యూ టర్న్ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్ గ్రూప్ కొనుగోలుకు తాజా బిడ్స్‌ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ ఇటీవలే దివాలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్‌కు వీలుగా క్రెడిటార్స్ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్ డ్యూరబుల్ సంస్థ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలుచేసిన రిజల్యూషన్ బిడ్ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే తాజా బిడ్స్ కోరడానికి కారణమని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. వీడియోకాన్ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్ అగర్వాల్‌కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్ చేసింది. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్‌కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ.2,962 కోట్ల బిడ్‌కు జూన్ 9న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్‌కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్ స్టార్ టెక్నాలజీస్ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రిజల్యూషన్ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐ లిమిటెడ్‌లు జూన్ 19న అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై ఇప్పటికే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయాలని కోరుతూ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్‌స్టార్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన రిజల్యూషన్ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వాదన. కాగా తమ గ్రూప్ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్, ఎండీ వేణగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ! -
మరోసారి బ్రేకులు, వీడియోకాన్ టేకోవర్‌పై స్టే
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద వేలానికి వచ్చిన వీడియోకాన్‌ను ట్విన్ స్టార్ టెక్నాలజీస్ టేకోవర్ చేసే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. దీనిపై జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్టే విధించింది. రుణ దాతల కమిటీ (సీవోసీ) నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐ దాఖలు చేసిన పిటీషన్లపై ఎన్సీఎల్ఏటీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై తమ సమాధానాలను రెండు వారాల్లోగా సమర్పించాలని సీవోసీ, పరిష్కార నిపుణుడు, ట్విన్ స్టార్‌కు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. బ్యాంకులకు సుమారు రూ. 64,838 కోట్లు బాకీపడి, వేలానికి వచ్చిన వీడియోకాన్‌ను దాదాపు రూ. 2,962 కోట్లకు కొనుగోలు చేసేందుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఉత్తర్వులు ఇచ్చింది. -
చందా కొచర్ ఖరీదైన ఫ్లాట్ గోవిందా!
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వీడియోకాన్ రుణాల జారీ విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్య తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) చందాకొచర్‌కు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఎటాచ్ చేసింది. ఇందులో ముంబైలోని ఖరీదైన ఆమె ఫ్లాట్‌తోపాటు, ఆమె భర్త దీపక్ కొచర్ కంపెనీకి సంబంధించిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఐసీఐసీఐ- వీడియోకాన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్ తనపదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. వీడియోకాన్ గ్రూపునకు సుమారు 3,250 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. అయితే తనను పదవినుంచి తొలగించడంపై చందా కొచర్ న్యాయ పోరాటం చేస్తున్నారు. -
చందా కొచర్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల రుణాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెంట్రల్ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జూన్ 10న ఉదయం 10.30 గం.లకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీలో చందా కొచ్చర్ కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే అయిదు సార్లు విచారణ చేసింది. 2009–2011 మధ్య కాలంలో వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో చందా కొచర్ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె చేసిన మేలుకు ప్రతిగా వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్.. చందా కొచర్ భర్తకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్లోకి కొంత పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత వీడియోకాన్ గ్రూప్ తీసుకున్న రుణాలు మొండిబాకీలుగా మారడం గమనార్హం. మొత్తం మీద ఇదంతా చందా కొచర్ కుటుంబం, ధూత్లకు లబ్ధి చేకూర్చేలా క్విడ్ ప్రో కో వ్యవహారంగా జరిగిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. -
చందాకొచర్ నుంచి రూ.9 కోట్లు వెనక్కి..!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ సుమారు రూ.9 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను కోల్పోనున్నారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాల జారీలో కొచర్ బ్యాంకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ట కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో, కొచర్‌ను తొలగించినట్టేనని, ఆమెకు గతంలో ఇచ్చిన బోనస్‌లు, పెండింగ్‌లో ఉన్నవి, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను సైతం రద్దు చేస్తామని బ్యాంకు బుధవారమే ప్రకటించింది. బోనస్‌లతోపాటు అన్‌ఎక్సర్‌సైజ్డ్ స్టాక్ ఆప్షన్లను కూడా వదులుకోవాల్సి ఉంటుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2009 మే నెలలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా నియమితులైన కొచర్, తనపై ఆరోపణల కారణంగా గతేడాది పదవికి రాజీనామా చేశారు. గత రెండేళ్లకు సంబంధించి కొచర్‌కు ఇవ్వదలిచిన పనితీరు ఆధారిత బోనస్‌లకు ఆర్బీఐ ఆమోదం తెలియజేయలేదని, దీంతో ఈ బోనస్‌లను కొచర్‌కు ఇచ్చినట్టు పరిగణించబోమని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, కొచర్‌కు ఇప్పటిదాకా బ్యాంకు 94 లక్షల షేర్లను(స్టాక్ ఆప్షన్స్) బ్యాంకు మంజూరు చేసింది. వీటిలో ఎన్ని ఆమె వినియోగించుకున్నారనే సమాచారం లేదు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చందాకొచర్‌కు ముట్టిన ఆర్థిక ప్రయోజనాలు రూ.340 కోట్ల మేర ఉంటాయని బ్యాంకు వర్గాల సమాచారం. -
ఐసీఐసీఐ-వీడియోకాన్ కేసు : సీబీఐ అధికారిపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ రుణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి బదిలీ అయ్యారు. ఈనెల 22న చందా కొచర్ బృందంపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా మరుసటి రోజే ఈ కేసును పర్యవేక్షిస్తున్న సీబీఐలో బ్యాంకింగ్, సెక్యూరిటీ ఫ్రాడ్ విభాగానికి చెందిన ఎస్పీ సుధాంశు ధర్ మిశ్రాను జార్ఖండ్‌కు చెందిన సీబీఐ ఆర్థిక నేరాల బ్రాంచ్‌కు బదిలీ చేయడం గమనార్హం. కాగా చందా కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్‌గా ఉన్న సమయంలో వీడియోకాన్ గ్రూపునకు రూ 1875 కోట్ల విలువైన ఆరు రుణాలను మంజూరు చేయడంలో అవినీతి, మోసం జరిగిందని కొచర్ దంపతులతో పాటు వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్‌పై గురువారం సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీడియాకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో కొచర్ దంపతులు క్విడ్‌ప్రోకోకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. వీడియోకాన్‌కు రుణాలు మంజూరైన తర్వాత ఇదే గ్రూప్ చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో పెట్టుబడులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని దర్యాప్తు సంస్ధ ఆరోపిస్తోంది. -
చందా కొచర్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాల వివాదంలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలతో చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కొచర్ తన పదవీకాలంలో వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణ ప్రతిపాదనలను క్లియర్ చేశారని ఎఫ్ఐఆర్లో అభియోగాలు ఉన్నాయి. ఈ లావాదేవీల కారణంగా బ్యాంక్‌కు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వీడియోకాన్ గ్రూప్, దాని అనుబంధ కంపెనీలకు ఇచ్చిన రూ. 1,875 కోట్ల విలువ చేసే ఆరు రుణాలను క్లియర్ చేసిన కమిటీలో సభ్యులైన ప్రస్తుత ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో సందీప్ బక్షితో పాటు ఇతర అధికారులు సంజయ్ చటర్జీ, జరీన్ దారువాలా, రాజీవ్ సబర్వాల్, కేవీ కామత్, హోమీ ఖుస్రోఖాన్ల పాత్రపై కూడా దృష్టి సారించనున్నట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్ఐఆర్ దరిమిలా గురువారం వీడియోకాన్ గ్రూప్, దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, ధూత్ ఒకప్పుడు ప్రమోట్ చేసిన సుప్రీమ్ ఎనర్జీ సంస్థ ముంబై, ఔరంగాబాద్ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. క్విడ్ ప్రో కో వివాదం.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంకు నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్ఐఆర్లో చందా, దీపక్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌పై అభియోగాలు ఉన్నాయి. షేర్లు 3 శాతం దాకా డౌన్.. కొచర్, ధూత్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకదశలో సుమారు మూడు శాతం దాకా పడ్డాయి. బీఎస్ఈలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేరు 2.73% క్షీణించి రూ.2.85 వద్ద, ఐసీఐసీఐ షేరు 0.72% పడి రూ.365 వద్ద క్లోజయ్యాయి. ఇంత జాప్యం ఎందుకు.. ఐసీఐసీఐ కేసులో రిజర్వ్ బ్యాంక్ వ్యవహరించిన తీరును ప్రభుత్వ రంగ(పీఎస్బీ) బ్యాంకర్లు ఆక్షేపించారు. చందా కొచర్‌పై చర్యలకు జాప్యం జరగడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల విషయంలో ఆర్బీఐ వేర్వేరుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ బ్యాంకులను నియంత్రించేందుకు తగినన్ని అధికారాల్లేవన్న ఆర్బీఐ.. మరి ప్రైవేట్ బ్యాంకులపై పూర్తి అధికారాలున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. విధానపరమైన చిన్న చిన్న లోపాలకు కూడా పీఎస్బీల్లో టాప్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ.. స్పష్టమైన ఆధారాలున్నా కొచర్ విషయంలో మాత్రం ఆ పని చేయలేదని బ్యాంకర్లు వ్యాఖ్యానించారు. ప్రక్రియాపరమైన వైఫల్యాల కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, ఇద్దరు ఈడీలపై సత్వరం వేటేసిన ఆర్బీఐ.. కొచర్ విషయంలో మీనమేషాలు లెక్కపెట్టుకుం టూ కూర్చుందని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ సమాఖ్య ఏఐబీవోసీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. విచారణ క్రమం ఇదీ.... ► ఈ వివాదంలో వేణుగోపాల్ ధూత్‌తో పాటు వీడియోకాన్ గ్రూప్ సంస్థలు, ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, ఆయనకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ కేంద్ర బిందువులు. ► మొత్తం రూ. 3,250 కోట్ల రుణాల వివాదంపై 2017 డిసెంబర్లో సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ (వీఐఎల్), వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌తో (వీఐఈఎల్) పాటు ఆ గ్రూప్‌లోని మరో నాలుగు కంపెనీలకు 2009 జూన్ – 2011 అక్టోబర్ మధ్యకాలంలో రూ. 1,875 కోట్ల మేర ఇచ్చిన ఆరు రుణాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని సీబీఐ తేల్చింది. ► వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కి 2009 ఆగస్టు 26న రూ. 300 కోట్ల రుణం, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు 2011 అక్టోబర్ 31న రూ. 750 కోట్లు మంజూరు చేసిన కమిటీలో చందా కొచర్ కూడా ఉన్నారని తేలినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ► 2009 ఆగస్టులో బ్యాంక్ కమిటీ ఆమోదం పొందిన రూ. 300 కోట్ల రుణం అదే ఏడాది సెప్టెంబర్ 7న వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కు మంజూరైంది. తన సొంత సంస్థ సుప్రీం ఎనర్జీ ద్వారా ధూత్ ఆ మర్నాడే .. న్యూపవర్ రెన్యూవబుల్స్కి దొడ్డిదారిన రూ. 64 కోట్లు బదలాయించారని అభియోగాలున్నాయి. ‘తొలి విద్యుత్ ప్లాంట్ కొనుగోలు కోసం దీపక్ కొచర్ సంస్థ న్యూపవర్‌కి లభించిన అత్యధిక మొత్తం పెట్టుబడి ఇది. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరు చేసిందుకు ఈ రూపంలో చందా కొచర్ లబ్ధి పొందినట్లయింది‘ అని సీబీఐ వర్గాలు తెలిపాయి. ► వీఐఎల్, వీఐఈఎల్తో పాటు మిలీనియం అప్లయెన్సెస్, స్కై అప్లయెన్సెస్, టెక్నో ఎలక్ట్రానిక్స్, అప్లికాంప్ ఇండియాకు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలిచ్చింది. వీఐఎల్ నుంచి పొందిన అన్సెక్యూర్డ్ లోన్లను తీర్చేసేందుకు ఈ నాలుగు సంస్థలు.. ఆ రుణాలను ఉపయోగించుకున్నాయని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు మొండిబాకీలుగా మారడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ నష్టం వాటిల్లగా రుణాలు పొందిన నిందితులు మాత్రం ప్రయోజనాలు పొందారని తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలు మంజూరు చేసిన కమిటీలోని సీనియర్ అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాల్సి ఉంటుందని సీబీఐ పేర్కొంది. -
ఐసీఐసీఐ- వీడియోకాన్ కేసులో ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ : వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల జారీలో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యులు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారనే అభియోగాలున్న కేసులో సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఐసీఐసీఐ బ్యాంక్- వీడియోకాన్ రుణం కేసులో రూ 3250 కోట్ల మేర అక్రమాలు సాగాయని ఆరోపణులున్నాయి. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్ గ్రూప్‌నకు రూ 3250 కోట్ల రుణం మంజూరైన కొద్దినెలలకే ఆ కంపెనీ అధినేత వేణుగోపాల్ ధూత్ చందాకొచర్ భర్తకు చెందిన న్యూపవర్ సంస్ధలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. గతంలో సెబీ చేపట్టిన ప్రాధమిక దర్యాప్తులో చందాకొచర్ భర్త దీపక్ కొచర్ వీడియోకాన్ గ్రూప్‌తో పలుమార్లు వ్యాపార సంప్రదింపులు జరిపినట్టు వెల్లడైంది. దీపక్, వీడియోకాన్ చీఫ్ వేణుగోపాల్ ధూత్ న్యూపవర్ సహవ్యవస్దాపకులు కావడం గమనార్హం. దర్యాప్తు వేగవంతం ఐసీఐసీఐ బ్యాంక్- వీడియోకాన్ రుణం కేసుకు సంబంధించి దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా ముంబైలో వీడియోకాన్ కార్యాలయాలు, ఔరంగాబాద్‌లోని న్యూపవర్, ముంబై నారిమన్ పాయింట్‌లోని సుప్రీం ఎనర్జీ కార్యాలయం సహా పలుచోట్ల సీబీఐ దాడులు చేసింది. ఈ కేసులో ఇరు పార్టీల మధ్య క్విడ్‌ప్రోకోకు సంబంధించిన కీలక ఆధారాలు రాబట్టేందుకు దర్యాప్తు ఏజెన్సీ సీబీఐ ప్రయత్నిస్తోంది. -
ఐసీఐసీఐకి కొచర్ రాజీనామా!!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. తాజా పరిణామాలతో కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సందీప్ బక్షి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 3 దాకా అయిదేళ్ల పాటు ఆయన ఈ హోదాల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చందా కొచర్‌పై బోర్డు మే నెలలో ఆదేశించిన విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, దర్యాప్తు ఫలితాలు బట్టి బ్యాంకు నుంచి ఆమెకు అందాల్సిన ప్రయోజనాలు అందటమనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రుణ వివాదంపై సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో బ్యాంకు బోర్డు విచారణ కమిటీ ఏర్పాటు చేసినప్పట్నుంచి చందా కొచర్ సెలవులో ఉన్నారు. మరోవైపు, స్వతంత్ర డైరెక్టర్ ఎండీ మాల్యా కూడా ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. గురువారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సుమారు 4 శాతం పెరిగి దాదాపు రూ. 316 వద్ద ముగిసింది రుణం తెచ్చిన తంటా.. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలివ్వడం వెనుక చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, ఈ డీల్‌కు ప్రతిఫలంగా వారు భారీ లంచం తీసుకున్నారనే (క్విడ్‌ప్రోకో) ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం పొందినందుకు ప్రతిగా.. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన అభియోగం. అంతే కాకుండా ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన మారిషస్ సంస్థ ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ నుంచీ న్యూపవర్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. సరిగ్గా 2010లో ఎస్సార్ స్టీల్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చిన నెలలోనే.. న్యూపవర్‌లోకి ఫస్ట్‌ల్యాండ్ నుంచి పెట్టుబడులు రావడం అనుమానాలకు తావిచ్చింది. ఈ రుణాన్ని బ్యాంకు ఆ తర్వాత మొండిబాకీగా వర్గీకరించింది. బక్షి.. మూడు దశాబ్దాల బ్యాంకింగ్ అనుభవం.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సీఈవోగా నియమితులైన సందీప్ బక్షి(58)కి బ్యాంకింగ్ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పైగా అనుభవం ఉంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. ఆరోపణలతో కొచర్ జూన్ నుంచి నిరవధిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో బ్యాంకు తొలుత ఆయన్ను అయిదేళ్ల పాటు హోల్‌టైమ్ డైరెక్టర్, సీవోవోగా నియమించింది. 1986 డిసెంబర్ 1న బక్షి ఐసీఐసీఐ గ్రూప్‌లోని ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ విభాగంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2002 ఏప్రిల్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. 2009 నుంచి 2010 దాకా ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యుటీ ఎండీగా కూడా వ్యవహరించారు. 2010 ఆగస్టు 1న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. పద్మభూషణ్ నుంచి పతనం దాకా... పురుషాధిపత్యం ఉండే ఆర్థిక రంగంలో శక్తిమంతమైన మహిళగా ఎదిగిన చందా కొచర్... అంతలోనే అవమానకర రీతిలో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ హోదా నుంచి నిష్క్ర మించాల్సి రావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న కొచర్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై విచారణలను ఎదుర్కొంటున్నారు. 1984లో ఐసీఐసీఐ లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరాక... చురుకైన పనితీరుతో గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ స్థాయి నుంచి 1990లలో ఐసీఐసీఐ కమర్షియల్ బ్యాంకుగా పరిణామం చెందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గ్రూప్ చైర్మన్ కేవీ కామత్ నిష్క్రమణ అనంతరం.. 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవిని దక్కించుకున్నారు. ఇది శిఖా శర్మ (యాక్సిస్ బ్యాంక్ చీఫ్) వంటి ఇతరత్రా సీనియర్ల నిష్క్రమణకు దారి తీసింది. చందా కొచర్ తన సారథ్యంలో బ్యాంక్‌ను పటిష్ట స్థానానికి చేర్చారు. ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్ పర్యాయపదాలుగా మారేంతగా ఆమె ప్రభావం చూపారు. వీడియోకాన్‌కు రుణాలపై ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో బ్యాంకు బోర్డు ఆమెకు పూర్తి మద్దతుగా నిల్చినా .. ఆ తర్వాత విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. పనితీరుపరంగా చూస్తే.. ఆమె సీఈవో పగ్గాలు చేపట్టినప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్.. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో రెండో స్థానంలోనూ, ప్రైవేట్ రంగంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ కొచర్ వైదొలిగే నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఐసీఐసీఐ మూడో స్థానానికి పడిపోయింది. -
చందా కొచర్‌కు షాక్.. ఐసీఐసీఐ ఖండన!
వీడియోకాన్ కుంభకోణంలో తమ సీఈవో చందాకొచర్‌కు షాక్ ఇచ్చినట్టు వచ్చిన కథనాలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. వీడియోకాన్ కుంభకోణంలో స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు చందా కొచర్‌ను సెలవు మీద వెళ్లాల్సిందిగా ఐసీఐసీఐ బోర్డు ఆదేశించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను తోసిపుచ్చిన ఐసీఐసీఐ.. చందా కొచర్ ప్రస్తుతం వార్షిక సెలవులో ఉన్నారని, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఆమె సెలవు తీసుకున్నారని వెల్లడించింది. వీడియోకాన్ సంస్థకు రుణాల విషయంలో చందా కొచర్‌పై క్విడ్ ప్రో కో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీడియోకాన్‌కు రుణాలు అందించినందుకు ప్రతిగా.. ఆమె భర్త సంస్థలోకి వీడియోకాన్ నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన కంపెనీలో వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్ ధూత్ 325 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు ఇటీవల వెలుగుచూసింది. అంతకుముందు ఆమె నేతృత్వంలోని ఐసీఐసీఐ కన్సార్షియం వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణం నిరర్థక ఆస్తి (ఎన్పీఏ)గా గుర్తించడంతో ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ స్కాం విషయంలో కొచర్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని గతంలో ఐసీఐసీఐ బాసటగా నిలిచింది. అయితే, ఈ నెల 29న జరిగిన ఐసీఐసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో కొచర్‌ను సెలవు మీద పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె స్థానంలో కొత్త సీఈవోను ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాలు అన్ని తప్పేనని, తాము అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు అధికార ప్రతినిధి వెల్లడించారు. -
దీపక్ కొచ్చర్‌కు రెండోసారి నోటీసులు
వీడియోకాన్ రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు మెడ చుట్టు ఉచ్చు బిగుస్తూనే ఉంది. రెండో సారి దీపక్ కొచ్చర్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 139(9) కింద వ్యక్తిగత ఆదాయంపై వివరణ ఇవ్వాలంటూ దీపక్ కొచ్చర్‌కు ఈ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా వీడియోకాన్ గ్రూప్ వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్ జాయింట్ వెంచర్ అయిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో మేజర్ షేర్‌హోల్డర్ డీహెచ్ రెన్యూవబుల్స్ హోల్డింగ్ లిమిటెడ్ ఓనర్షిప్ వివరాలు కూడా తెలుపాలంటూ మారిషస్ పన్ను అధికారులను ఐటీ డిపార్ట్మెంట్ కోరింది. 2012లో క్విడ్ ప్రొ కో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రూ.3250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందాకొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయముందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం ఈ రుణ వ్యవహారంలో చందా కొచ్చర్ లబ్ది పొందారని, ఆమె భర్త పరోక్ష లబ్దిదారుడని ఇండియన్ ఇన్వెస్టర్స్ కౌన్సిల్ ట్రస్టీ అరవింద్ గుప్తా సాక్ష్యాలతో సహా ఆరోపిస్తున్నారు. -
చిక్కుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ భవితవ్యం
-
కొచర్‌పై వేటు తప్పదా..?
ముంబై: వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రూ.3,250 కోట్లు రుణమిచ్చిన వ్యవహారం మరింత ముదురుతోంది. చివరికి కొచర్ పదవికి ఎసరు పెట్టే స్థాయికెళుతోంది. ఈ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచర్‌కు పరోక్ష లబ్ధి చేకూరిందంటూ ఆరోపణలు రాగా తొలుత ఆమెకు బ్యాంకు బాసటగా నిలిచింది. కొచర్ పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. బ్యాంక్ వెబ్సైట్ తెరిచిన ప్రతి ఒక్కరికీ... బోర్డు బాసటగా నిలుస్తోందన్న విషయం స్పష్టంగా కనిపించింది. అయితే, ఈ అంశంపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు చేస్తుండడం వంటి పరిణామాలతో కొచర్ విషయంలో బోర్డు రెండుగా చీలినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొచర్ తన పదవి నుంచి తక్షణం తçప్పుకుంటే బావుంటుందని కొందరు డైరెక్టర్లు కోరుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కొచర్ పదవిలో కొనసాగటాన్ని స్వతంత్ర డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తదుపరి కార్యాచరణ తేల్చేందుకు బోర్డు ఈ వారంలోనే సమావేశం కానుంది. వాస్తవానికి కొచర్ ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంది. అయితే, కొచర్‌ను పదవి నుంచి తప్పుకోవాలని కొందరు బోర్డు సభ్యులు కోరుతున్నట్టు వచ్చిన వార్తలు అసత్యమని బ్యాంకు అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో 12 మంది సభ్యులున్నారు. వీరిలో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు. ఇందులో బ్యాంకు చైర్మన్ ఎంకే శర్మ, ఎల్ఐసీ హెడ్ కూడా ఉన్నారు. ఒకరు ప్రభుత్వ నామినీ కాగా, ఐదుగురు బ్యాంకు తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు. కొచర్‌పై ఆర్బీఐ తేలుస్తుంది: ఆర్థిక శాఖ ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచర్‌పై వచ్చిన ఆరోపణలను ఆర్బీఐ పరిశీలిస్తోందని, ఇందులో తమ పాత్ర ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కొచర్ ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా కొనసాగాలా, లేదా అన్నది ఆర్బీఐ తేలుస్తుందని పేర్కొంది. ఆర్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంకు బోర్డుకు దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉందని వివరించింది. 3 కోట్ల ఐసీఐసీఐ షేర్లను కొన్న మెరిల్ లించ్ డీల్ విలువ రూ.823 కోట్లు న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్‌పై ప్రతికూల వార్తలు హల్చల్ చేస్తున్నప్పటికీ, ఈ షేర్లను విదేశీ సంస్థలు జోరుగా కొనుగోలు చేస్తున్నాయి. మెరిల్ లించ్ మార్కెట్స్ సింగపూర్ పీటీఈ సంస్థ సోమవారం 2.94 కోట్ల ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు విలువ రూ.823.40 కోట్లుగా ఉంటుందని అంచనా. ఒక్కో షేర్ సగటు కొనుగోలు ధర రూ.280. బెయిల్లీ గిఫోర్డ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్ ఈ షేర్లను విక్రయించింది. సోమవారం ఐసీఐసీఐ షేర్ బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ.280.45 వద్ద ముగిసింది. -
చందా కొచర్ రాజీనామా? రెండుగా చీలిన బోర్డు
న్యూఢిల్లీ : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందా కొచర్ భవితవ్యంపై ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు రెండుగా చీలింది. వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రుణ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేయడంతో, చందా కొచర్‌కు పదవి గండం తెచ్చిపెట్టింది. చందా కొచర్ రాజీనామా చేయాల్సిందిగా కొంతమంది బోర్డు సభ్యులు కోరుతున్నారు. మరికొంత మంది సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. చందా కొచర్‌కు అండంగా నిలుస్తున్నారు. ఇలా బ్యాంకు బోర్డు సభ్యులు రెండుగా చీలినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కొంతమంది వెలుపల ఉన్న డైరెక్టర్లు చందా కొచర్ ఐసీఐసీఐ సీఈఓగా కొనసాగడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై ఐసీఐసీఐ బోర్డు సభ్యులు ఈ వారంలోనే సమావేశం కాబోతున్నట్టు కూడా పేర్కొన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా కొచర్ పదవి కాలం 2019 మార్చి 31 వరకు ఉంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బోర్డులో మొత్తం 12 మంది సభ్యులున్నారు. చైర్మన్ ఎంకే శర్మ ఆధ్వర్యంలో ఈ బోర్డు నడుస్తోంది. 12 మంది సభ్యులో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు, ఒకరు ప్రభుత్వ నామినీ, ఐదుగురు ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లున్నారు. క్విడ్ ప్రో కో ప్రతిపాదికన వీడియోకాన్ గ్రూప్‌కు చందా కొచర్ రుణం మంజూరు చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంపై బోర్డు సమాధానం కూడా ఇచ్చింది. రుణాల జారీలో ఎలాంటి క్విడ్ ప్రో కో లేదని, సీఈఓ కొచర్‌పై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని బోర్డు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఆమెపై ఆ విశ్వాసం సన్నగిల్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చందా కొచ్చర్ కుటుంబీకులు ఉన్నట్లు ఆధారాలు వెలుగుచూడటంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. దీంతో సీఈవోగా చందా కొచర్ కొనసాగడంపై బోర్డు సభ్యులు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే కొచర్ భర్త దీపక్ కొచర్‌పై, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌పై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా ప్రారంభించింది. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ ఐసీఐసీఐ అధికార ప్రతినిధి ఖండించారు. కొచర్ రాజీనామా చేయాలని బోర్డు సభ్యులు కోరుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా అధికార ప్రతినిధి ఈ మేరకు స్పందించారు. కొచర్ రాజీనామా వార్తలతో, ఈ బ్యాంకు షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఒకవేళ సీఈవోగా చందా కొచర్ రాజీనామా చేస్తే, షేర్లు మరింత కిందకి దిగజారనున్నాయని విశ్లేషకులు చెప్పారు. -
కొచర్‌కి షాకిచ్చిన ఇమ్మిగ్రేషన్
ముంబై : వీడియోకాన్ రుణాల కుంభకోణ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌కు ఇమ్మిగ్రేషన్ అథారిటీలు షాకిచ్చారు. దేశం విడిచి వెళ్లకుండా... ట్రావెల్ బ్యాన్ విధించారు. కొచర్‌తో పాటు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌పై కూడా ఈ ట్రావెల్ బ్యాన్ విధించినట్టు ఇమ్మిగ్రేషన్ అథారిటీలు పేర్కొన్నారు. వీరిద్దరిపై లుకౌట్ సర్క్యూలర్ జారీచేసినట్టు చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకు జారీచేసిన రూ.3250 కోట్ల రుణ వ్యవహారంలో వీరిద్దరిపై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ(పీఈ) చేపట్టిన సంగతి తెలిసిందే. సీబీఐ అభ్యర్థన మేరకు ధూత్, దీపక్ కొచర్లకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసు జారీచేశామని సంబంధిత ప్రభుత్వ అధికారులు చెప్పారు. అదేవిధంగా చందాకొచర్ ఒకవేళ భారత్ విడిచి ట్రావెల్ చేయాలనుకుంటే, తమకు సమాచారం అందించాలని ఇమ్మిగ్రేషన్ అథారిటీలను సీబీఐ ఆదేశించినట్టు తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించడానికి సీబీఐ అధికార ప్రతినిధి నిరాకరించారు. ‘నాపై వస్తున్న ఈ వార్తలన్నీ ఊహాగానాలే. నాకు వ్యతిరేకంగా ఎలాంటి లుక్అవుట్ నోటీసు జారీ కాలేదు. ఇవన్నీ రూమర్లే. నా పాస్‌పోర్టుకు రెండు నెలల క్రితమే గడువు తీరిపోయింది. గత ఐదేళ్లుగా నేను దేశం విడిచి ఎక్కడికీ వెళ్లలేదు. దేవుడు అంతా చూస్తాడు. నాపై రూమర్లు క్రియేట్ చేసే వారిని దేవుడు శిక్షిస్తాడు’ అని ధూత్ అన్నారు. కాగ, దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్ దేశం విడిచి వెళ్లే సమయంలో ముంబైలో ఆయన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డగించిన సంగతి తెలిసిందే. రాజీవ్ కొచర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పీఈ కానీ, లుకౌట్ నోటీసు కానీ సీబీఐ జారీచేయలేదు. -
రాజీవ్ కొచర్‌ను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూపునకు 2012లో ఐసీఐసీఐ బ్యాంకు జారీ చేసిన రూ.3,250 కోట్ల రుణానికి సంబంధించిన కేసులో బ్యాంకు సీఈవో చందా కొచర్ భర్త సోదరుడు రాజీవ్ కొచర్‌ను సీబీఐ శుక్రవారం విచారించింది. వీడియోకాన్ గ్రూపునకు రుణ పునరుద్ధరణకు సంబంధించి రాజీవ్ కొచర్‌ను సీబీఐ అధికారులు తొమ్మిది గంటల పాటు పలు కోణాల్లో ప్రశ్నించారు. రాజీవ్ కొచర్‌కు చెందిన అవిస్టా అడ్వైజరీ సర్వీసెస్ పేరుతో వీడియోకాన్ గ్రూపునకు అందించిన రుణ సలహా సేవలపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విదేశానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్న రాజీవ్ కొచర్‌ను సీబీఐ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను అధికారులు విచారించారు. ఈ విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. వీడియోకాన్‌కు రుణం మంజూరు చేయడం ద్వారా బ్యాంకు సీఈవో చందాకొచర్‌కు పరోక్షంగా రూ.60 కోట్లకు పైగా లబ్ధి కలిగిందన్న ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. ఈ ఆరోపణల్లో నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. విచారణలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని తేలితే అప్పుడు నిందితులపై కేసులు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతుంది. రుణం మంజూరు తర్వాత వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూత్, చందాకొచర్ భర్త దీపక్ కొచర్ ఏర్పాటు చేసిన న్యూపవర్ రెన్యువబుల్స్‌కు నిధులు అందించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, చందాకొచర్‌పై వచ్చిన ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంకు యాజమాన్యం ఇప్పటికే ఖండించిన విషయం విదితమే. చందాకొచర్, ఆమె భర్త,ధూత్‌లపై లుకవుట్ నోటీసులు? వీడియోకాన్–ఐసీఐసీఐ బ్యాంకు కేసు కొత్త మలుపు తీసుకుంది. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీ వెనుక అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ, బ్యాంకు సీఈవో చందాకొచర్, ఆమె భర్త దీపక్‌కొచర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లపై లుకవుట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దేశం విడిచి వెళ్లిపోకుండా వారిని నిరోధించేందుకు గాను దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. దీనిపై సీబీఐ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. -
ఐసీఐసీఐ: తొలిసారి స్పందించిన సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ - వీడియోకాన్ రుణ వివాదం విషయంలో ప్రభుత్వం తొలిసారి స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదని కార్పొరేట్ వ్యవహరాల శాఖ (ఎంసీఏ) సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రిజర్వ్‌బ్యాంక్ ఈ కేసును పరిశీలిస్తోందని తెలిపారు. మరోవైపు సీఈవో చందా కొచర్‌కు ఇప్పటికే పూర్తి మద్దతును ఐసీఐసీఐ బోర్డు ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా ఆమెపై స్వతంత్ర దర్యాప్తునకు ఐసీఐసీఐ అంగీకరించలేదు. దాదాపు 3250 కోట్ల రూపాయల వీడియోకాన్-ఐసీఐసీఐ రుణ వ్యవహారాన్నివెలుగులో తెచ్చిన అరవింద్ గుప్తా ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్ చేసిన నేపథ్యంలో బాహ్య ఏజెన్సీలతో స్వతంత్ర దర్యాప్తును బ్యాంకు వ్యతిరేకించింది. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌తో బిజినెస్ వ్యవహారాల్లో భాగంగానే వీడియోకాన్‌కు గ్రూపునకు రుణాలిచ్చారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కాగా ఈ వ్యవహారంలో సీబీఐ ఇప్పటికే దర్యాప్తును మొదలుపెట్టింది. ముఖ్యంగా వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్, దీపక్‌కొచర్ పై ప్రాథమిక దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ మేరకు కొన్ని కీలక పత్రాలను సీబీఐ అధికారుల పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యువబుల్స్ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. -
స్వతంత్ర దర్యాప్తునకు ఐసీఐసీఐ బ్యాంక్ విముఖత
సాక్షి, న్యూఢిల్లీ : వీడియోకాన్ గ్రూప్‌తో కుమ్మక్కై భారీ మొత్తంలో రుణాలు జారీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఈ కుంభకోణంపై స్వతంత్ర సంస్థచే విచారణ చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి బ్యాంకు అన్నివిధాలా సహకరిస్తుందని, దర్యాప్తు సంస్థ కోరిన లోన్ డాక్యుమెంట్లను అందచేసిందని ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఐసీఐసీఐ బ్యాంకుతో కూడిన 20 బ్యాంకుల కన్సార్షియం వీడియోకాన్ గ్రూప్‌నకు రూ 40,000 కోట్ల రుణాలు మంజూరు చేసింది. వీటిలో చాలావరకూ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయి. వీడియోకాన్‌కు భారీగా రుణాలు ఇవ్వడంలో ఎలాంటి ప్రలోభాలు జరిగాయనే కోణంలో సీబీఐ విచారణ సాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ల ప్రమేయంపై సీబీఐ ఆరా తీస్తోంది. ప్రాధమిక విచారణలో చందా కొచ్చర్ పేరు లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. -
కొచర్ చుట్టూ ఉచ్చు!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చిన వివాదానికి సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఈ లావాదేవీల్లో లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త దీపక్ కొచర్‌కు తాజాగా ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఐటీ చట్టం సెక్షన్ 131 కింద జారీ చేసిన నోటీసుల ప్రకారం .. ఆయన వ్యక్తిగత ఆర్థిక వివరాలు, గడిచిన కొన్నేళ్ల ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్‌లతో (ఐటీఆర్) పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ సంస్థతో వ్యాపార లావాదేవీల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. న్యూపవర్‌తో పాటు ఆ కంపెనీతో సంబంధమున్న వారి ఆర్థిక పరిస్థితులపై కూడా ఐటీ శాఖ దర్యాప్తు మొదలుపెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా కంపెనీతో సంబంధమున్న మరికొందరికి కూడా నోటీసులు పంపినట్లు, వారి దగ్గర్నుంచి వచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించాయి. మరోవైపు, దీపక్ కొచర్‌ను త్వరలో ప్రశ్నించనున్నట్లు ఈ వివాదంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎంక్వైరీలో దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లతో పాటు మరికొందరి పేర్లు కూడా ఉన్నట్లు వివరించాయి. వీడియోకాన్ గ్రూప్‌నకు 2012లో రూ. 3,250 కోట్ల మేర రుణాలు ఇచ్చిన విషయంలో చందా కొచర్ క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం లభించినందుకు ప్రతిఫలంగా చందా కొచర్ భర్త దీపక్ సంస్థలో ధూత్ రూ. 64 కోట్లు ఇన్వెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. వివాదంలోకి దీపక్ సోదరుడు రాజీవ్ సంస్థ కూడా.. రుణ వివాదంలోకి తాజాగా దీపక్ సోదరుడు, చందా కొచర్ మరిది.. రాజీవ్ కొచర్‌కి చెందిన అవిస్టా సంస్థ కూడా చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన పలు కంపెనీలకు అవిస్టా రుణ పునర్వ్యవస్థీకరణ సేవలు అందించినట్లు తెలుస్తోంది. అవిస్టా సేవలు పొందిన సంస్థల్లో జైప్రకాశ్ అసోసియేట్స్, జైప్రకాశ్ పవర్లతో పాటు వీడియోకాన్, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుజ్లాన్ మొదలైనవి ఉన్నట్లుగా సమాచారం. అయితే తమ బ్యాంక్ ఎన్నడూ కూడా అవిస్టా అడ్వైజరీ గ్రూప్ సర్వీసులు వినియోగించుకోలేదని, ఎలాంటి ఫీజు చెల్లించలేదని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది. అటు జేపీ గ్రూప్ మాత్రం రుణ పునర్వ్యవస్థీకరణ కోసం అవిస్టాను నియమించుకోవడం వాస్తవమేనని, మార్కెట్ రేటును బట్టి ఫీజును చెల్లించామని ధ్రువీకరించింది. అయితే, అవిస్టా సేవలు ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ (ఎఫ్‌సీసీబీ) పునర్వ్యవస్థీకరణకు మాత్రమే పరిమితమని, దాని ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. జేపీ గ్రూప్‌లో ప్రధాన సంస్థ అయిన జైప్రకాశ్ అసోసియేట్స్.. దాదాపు 110 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎఫ్సీసీబీలను, మరో సంస్థ జైప్రకాశ్ పవర్ 225 మిలియన్ డాలర్ల రుణాల పునర్వ్యవస్థీకరణకు అవిస్టా సర్వీసులు ఉపయోగించుకున్నాయి. న్యూపవర్ వెనుక ఉన్నదెవరో తెలియాలి: అరవింద్ గుప్తా క్విడ్ ప్రో కో వివాదాన్ని బైటికి తెచ్చిన వేగు అరవింద్ గుప్తా న్యూపవర్పై ఆరోపణాస్త్రాలు కొనసాగిస్తున్నారు. కంపెనీలో మెజారిటీ షేర్‌హోల్డరుగా ఉన్న మారిషస్ సంస్థ డీహెచ్ రెన్యువబుల్స్ హోల్డింగ్ అసలు యజమాని వివరాలను బైటపెట్టాలని డిమాండ్ చేశారు. 2008లో కంపెనీని ఏర్పాటు చేసినప్పుడు ఇందులో దీపక్ కొచర్‌కు, ధూత్ కుటుంబానికి చెరి యాభై శాతం వాటాలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత క్రమంగా దీపక్ ట్రస్టీగా ఉన్న పినాకిల్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, డీహెచ్ రెన్యువబుల్స్ మొదలైనవి ఇందులో వాటాదారులుగా మారాయి. ‘న్యూపవర్ ఏర్పాటైనప్పుడు అది.. భారతీయ సంస్థ. అయితే, క్రమంగా ఇందులో 54.99 శాతం వాటాలతో మారిషస్‌కి చెందిన డీహెచ్ రెన్యువబుల్స్ మెజారిటీ వాటాదారుగా ఆవిర్భవించింది. ఒకప్పుడు ధూత్ కుటుంబానికి చెందిన సుప్రీమ్ ఎనర్జీ సంస్థ.. ఇప్పుడు పినాకిల్ ఎనర్జీ, కొచర్ల చేతికి చేరింది. పినాకిల్, డీహెచ్ రెన్యువబుల్స్ సంస్థ అసలు యజమాని గురించి ఎవరికీ, ఎప్పటికీ అంతుపట్టని విధంగా అనేక లావాదేవీల ద్వారా ఇదంతా జరిగింది‘ అని గుప్తా వ్యాఖ్యానించారు. ఫిక్కీ సదస్సు నుంచి తప్పుకున్న చందా కొచర్ న్యూఢిల్లీ: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఈ నెల 5న నిర్వహిస్తున్న 34వ వార్షిక సదస్సు నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ తప్పుకున్నారు. వీడియోకాన్ గ్రూప్‌నకు క్విడ్ ప్రో కో ప్రాతిపదికన రుణాలిచ్చారంటూ ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఎఫ్ఎల్వో వార్షిక సదస్సులో ఆమె గౌరవ అతిథిగా పాల్గొనాల్సి ఉంది. అలాగే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా చందా కొచర్‌కు సన్మానం కూడా ఉంటుందని ఎఫ్ఎల్వో గతంలో పంపిన ఆహ్వాన పత్రికల్లో పేర్కొంది. అయితే, తాజాగా మంగళవారం పంపిన ఆహ్వానపత్రికల్లో చందా కొచర్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం నుంచి చందా కొచర్ తప్పుకున్నారని, ఆమె హాజరయ్యే అవకాశం లేదని ఎఫ్ఎల్వో ఈడీ రష్మి సరిత తెలిపారు. కొచర్ తప్పుకోవడానికి కారణాలు తెలియరాలేదని వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్ గ్రూప్ రూ. 3,250 కోట్ల మేర రుణాలు తీసుకున్న లావాదేవీల్లో.. కొచర్ భర్త దీపక్ కొచర్ లబ్ధి పొందినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. వీటిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.