దివాలా తీసిన వీడియోకాన్‌.. ఆపై మరిన్ని సమస్యలు | DoT moves NCLAT against resolution plan of Videocon Insolvency Issue | Sakshi
Sakshi News home page

దివాలా తీసిన వీడియోకాన్‌.. ఆపై మరిన్ని సమస్యలు

Published Sat, Dec 11 2021 4:51 PM | Last Updated on Sat, Dec 11 2021 5:09 PM

DoT moves NCLAT against resolution plan of Videocon Insolvency Issue - Sakshi

న్యూఢిల్లీ: వీడియోకాన్‌పై దివాలా కోడ్‌ కింద చర్యల పక్రియ మొత్తం ఈ చట్టంపై లొసుగులను, వాటిని సవరించాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటిస్తోంది. తాజా పరిణామాన్ని పరిశీలిస్తే..  వీడియోకాన్‌ టెలికమ్యూనికేషన్స్‌సహా ఆ గ్రూప్‌నకు సంబంధించి 13 కంపెనీలకు ‘ఏకీకృత’ పరిష్కార (రిజల్యూషన్‌) ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) ఆమోదముద్ర వేయడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) వ్యతిరేకించింది. ఎన్‌సీఎల్‌టీ రూలింగ్‌ని అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో సవాలు చేసింది. పారిశ్రామికవేత్త అనిల్‌ అగర్వాల్‌కు చెందిన ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ రూ. 2,962 కోట్ల టేకోవర్‌ బిడ్‌ను అనుమతిస్తూ ఈ ఏడాది జూన్‌ 9వ తేదీన ఎన్‌సీఎల్‌టీ, ముంబై బెంచ్‌ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని టెలికం శాఖ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ను అభ్యర్థించింది.  
టెలికం శాఖ వాదనలు ఇవీ... 
తనకు వీడియోకాన్‌ టెలికమ్యూనికేషన్స్‌ దాదాపు రూ.882 కోట్లు బకాయి పడినట్లు తెలిపింది. ఎన్‌సీఎల్‌టీలో కేసు విచారణలో ఉండడం వల్ల తానకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడం సాధ్యంకాదని అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌కు విన్నవించింది.  కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ని ప్రారంభించడం ద్వారా డిఫాల్ట్‌ టెలికం కంపెనీలు ‘తమకు సంబంధించి రుణ బాధ్యతల నుండి బయటపడలేవని’ తన వాదనల్లో పేర్కొంది. మోసపూరిత విధానాలు పాల్పడిన కంపెనీలు ఐబీసీ నిబంధనావళికింద తప్పించుకోలేవని, తద్వారా ప్రభుత్వానికి చెల్లింపులను ఎగ్గొట్టలేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమోదించిన రిజల్యూషన్‌ ప్లాన్‌ కింద కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ ద్వారా ఆపరేషనల్‌ క్రెడిటార్స్‌కు వచ్చేది అత్యంత తక్కువ మొత్తమని పేర్కొంది. తనవరకూ చూస్తే, తాను చేసే క్లెయిమ్‌లో లభించేది కేవలం 0.12 శాతమేనని వివరించింది.   
జనవరి 11కు విచారణ వాయిదా.. 
కాగా, ఇందుకు సంబంధించి ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్యుపై జూలై 19వ తేదీన ఎన్‌సీఎల్‌ఏటీ స్టే ఇచ్చిన అంశాన్ని ముగ్గురు సభ్యుల బెంచ్‌ ప్రస్తావించింది.  యథాతథ పరిస్థితిని కొనసాగిస్తూ దివాలా చట్ట నిబంధనలకు అనుగుణంగా వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ కార్యకలాపాలను నిర్వహించాలని రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌కు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పేర్కొంటూ, ఈ నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి విచారణాంశాల్లోకి తక్షణం వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే రెండు వారాల్లో ‘రిప్లై అఫిడవిట్లు’ మరో వారంలో ఏదైనా అవసరమైతే ‘రీజాయిండర్‌’లు వేయాలని వీడియోకన్‌ ఇండస్ట్రీస్, వీడియోకాన్‌ టెలికమ్యూనికేషన్స్‌సహా మిగిలిన ప్రతివాదులను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది.  
దివాలా కోడ్‌పై విమర్శల తీరిది... 
రిజల్యూషన్‌ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్‌ ప్రక్రియలో క్రెడిటార్స్‌ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్‌) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్‌ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌)  దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో  ఆర్థికశాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్లతో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి రాజేష్‌ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్‌కట్స్‌ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.  
ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు
నిజానికి ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ బిడ్‌కు తొలుత సరేనన్న క్రెడిటార్స్‌ కమిటీ (సీఓసీ) తరువాత యూ టర్న్‌ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్‌ గ్రూప్‌ కొనుగోలుకు తాజా బిడ్స్‌ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్‌ కమిటీ ఇటీవలే దివాలా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్‌కు వీలుగా  క్రెడిటార్స్‌ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్‌ డ్యూరబుల్‌ సంస్థ వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలుకు ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ దాఖలుచేసిన రిజల్యూషన్‌ బిడ్‌ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే  తాజా బిడ్స్‌ కోరడానికి కారణమని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు తెలిపింది. వీడియోకాన్‌ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్‌ అగర్వాల్‌కు చెందిన ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్‌ చేసింది. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చిన ఎస్‌బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్‌కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్‌బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌  రూ.2,962 కోట్ల బిడ్‌కు జూన్‌ 9న ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్‌ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్‌కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.  ఈ రిజల్యూషన్‌ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఐఎఫ్‌సీఐ లిమిటెడ్‌లు  జూన్‌ 19న అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనితో ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వుపై ఇప్పటికే అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే  అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ స్టే ఎత్తివేయాలని కోరుతూ  ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్‌స్టార్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.  తన రిజల్యూషన్‌ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్‌ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్‌స్టార్‌ టెక్నాలజీస్‌ వాదన. కాగా   తమ గ్రూప్‌ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్‌ గ్రూప్‌ చైర్మన్, ఎండీ వేణగోపాల్‌ ధూత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ విచారణకు స్వీకరించింది. 

చదవండి: రిలయన్స్‌ క్యాపిటల్‌ దివాలా ప్రొసీడింగ్స్‌ షురూ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement