సాక్షి, న్యూఢిల్లీ : వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల జారీలో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యులు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారనే అభియోగాలున్న కేసులో సీబీఐ గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.ఐసీఐసీఐ బ్యాంక్- వీడియోకాన్ రుణం కేసులో రూ 3250 కోట్ల మేర అక్రమాలు సాగాయని ఆరోపణులున్నాయి.
2012లో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్ గ్రూప్‌నకు రూ 3250 కోట్ల రుణం మంజూరైన కొద్దినెలలకే ఆ కంపెనీ అధినేత వేణుగోపాల్ ధూత్ చందాకొచర్ భర్తకు చెందిన న్యూపవర్ సంస్ధలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. గతంలో సెబీ చేపట్టిన ప్రాధమిక దర్యాప్తులో చందాకొచర్ భర్త దీపక్ కొచర్ వీడియోకాన్ గ్రూప్‌తో పలుమార్లు వ్యాపార సంప్రదింపులు జరిపినట్టు వెల్లడైంది. దీపక్, వీడియోకాన్ చీఫ్ వేణుగోపాల్ ధూత్ న్యూపవర్ సహవ్యవస్దాపకులు కావడం గమనార్హం.
దర్యాప్తు వేగవంతం
ఐసీఐసీఐ బ్యాంక్- వీడియోకాన్ రుణం కేసుకు సంబంధించి దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా ముంబైలో వీడియోకాన్ కార్యాలయాలు, ఔరంగాబాద్‌లోని న్యూపవర్, ముంబై నారిమన్ పాయింట్‌లోని సుప్రీం ఎనర్జీ కార్యాలయం సహా పలుచోట్ల సీబీఐ దాడులు చేసింది. ఈ కేసులో ఇరు పార్టీల మధ్య క్విడ్‌ప్రోకోకు సంబంధించిన కీలక ఆధారాలు రాబట్టేందుకు దర్యాప్తు ఏజెన్సీ సీబీఐ ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment