కోల్‌కతా ప్లాంటులో వీడియోకాన్ హ్యాండ్‌సెట్స్ ఉత్పత్తి
కోల్‌కతా : వీడియోకాన్ గ్రూప్ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్లాంటులో మొబైల్ హ్యాండ్‌సెట్స్ ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించనుంది. ‘సాల్ట్ లేక్ ప్లాంటులో వీడి యోకాన్ బ్రాండ్ హ్యాండ్‌సెట్స్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ప్లాంటులో దుర్గా పూజ పండుగ అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తాం’ అని వీడియోకాన్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ అనిరుధ్ దూత్ తెలిపారు.
ప్రస్తుతం తాము మొబైల్ మార్కెట్‌పై దృష్టికేంద్రీకరించామని, అందులో భాగంగానే ఈ ప్లాంటులో తొలిగా ఫీచర్, స్మార్ట్‌ఫోన్ విభాగాల్లో 30 లక్షల మొబైళ్లను తయారు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. కోల్‌కతాను వీడియోకాన్ హ్యాండ్‌సెట్స్ తయారీ హబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి మమతా బెన ర్జీ చెప్పినట్లు పేర్కొన్నారు. మరొక ప్లాంటును గుర్గావ్‌లో ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీడియోకాన్ హ్యాండ్‌సెట్స్ ఔరంగాబాద్‌లోని ప్లాంటులో తయారు అవుతున్నాయి.