SEBI Orders Attachment Of Bank Demat MF Account Of Videocon Dhoot - Sakshi
Sakshi News home page

వీడియోకాన్‌ ఫౌండర్‌ అకౌంట్ల అటాచ్‌మెంట్‌.. సెబీ ఆదేశాలు

Published Wed, Jul 19 2023 2:09 PM

Sebi orders attachment of bank demat MF accounts of Videocon Dhoot - Sakshi

న్యూఢిల్లీ: రూ. 5.16 లక్షల జరిమానా బకాయిలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌కు చెందిన బ్యాంక్, డీమాట్, మ్యుచువల్‌ ఫండ్‌ ఖాతాలు, లాకర్లను అటాచ్‌ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల నుంచి డెబిట్‌ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు (సీడీఎస్‌ఎల్, ఎన్‌ఎస్‌డీఎల్‌), మ్యుచువల్‌ ఫండ్‌ సంస్థలకు సూచించింది. 

అయితే, క్రెడిట్‌ లావాదేవీలకు అనుమతించవచ్చని పేర్కొంది. క్వాలిటీ టెక్నో అడ్వైజర్స్, క్రెడెన్షియల్‌ ఫైనాన్స్, సుప్రీం ఎనర్జీ వంటి సంస్థలతో తనకున్న పెట్టుబడులు, సంబంధం గురించి వెల్లడించకుండా, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ ఏడాది మార్చిలో ధూత్‌కు సెబీ రూ. 5 లక్షల జరిమానా విధించింది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. 

ఇదీ చదవండి ➤ ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్‌కు సీఈవోగా అంజలీ సూద్

దీంతో అసలుతో పాటు రూ. 15,000 వడ్డీ, రికవరీ వ్యయాల కింద మరో రూ. 1,000 కలిపి మొత్తం రూ. 5.16 లక్షలు బాకీ చెల్లించాలని అటాచ్‌మెంట్‌ నోటీసులో సెబీ ఆదేశించింది. వీడియోకాన్‌ గ్రూప్‌ సంస్థలకు రుణ సదుపాయాలు కల్పించినందుకు ప్రతిగా అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవోగా పనిచేసిన చందా కొచర్, ఆమె భర్తకు ధూత్‌ ప్రయోజనం చేకూర్చారని (క్విడ్‌ ప్రో కో) ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

 
Advertisement
 
Advertisement