
సొంత పథకాల్లో పెట్టుబడుల పరిమితి తగ్గింపు
నిబంధనల వెసులుబాటు కల్పించిన సెబీ
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) పనిచేసే ఉద్యోగులకు సెబీ నిబంధనల పరంగా ఊరట కల్పించింది. మఖ్య నిర్వహణ అధికారి (సీఈవో), ముఖ్య పెట్టుబడుల అధికారి (సీఐవో), ఫండ్ మేనేజర్లు తదితర ఎంపిక చేసిన కీలక ఉద్యోగులు తమ వార్షిక వేతనంలో 20 శాతం మేర తమ సంస్థ నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అంతేకాదు ఇలా చేసిన పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. దీన్నే ‘స్కిన్ ఇన్ ద గేమ్’గా చెబుతారు.
ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులో కొంత ఉపశమనాన్ని సెబీ కల్పించింది. స్థూల వార్షిక పారితోషికం ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ఉద్యోగులు సొంత నిర్వహణ పథకాల్లో చేయాల్సిన పెట్టుబడుల శాతంలో మార్పులు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ ఉద్యోగుల నైతిక నడవడిక, సొంత పథకాల నిర్వహణలో బాధ్యతను పెంచడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ ఇందులోని ఉద్దేశ్యాలుగా ఉన్నాయి.
కొత్త నిబంధనలు..
- కొత్త నిబంధనల కింద రూ.25 లక్షలకు మించని వేతనం ఉన్న వారు సొంత మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
- రూ.25 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారు 10 శాతం ఇన్వెస్ట్ చేయాలి. ఇసాప్‌లు/ఉద్యోగ స్టాక్ ఆప్షన్లు కూడా కలుపుకుంటే 12.5% పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
- రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య వేతనం ఉన్న వారు కనీసం 14 శాతం మేర (ఒకవేళ స్టాక్ ఆప్షన్లు కూడా ఉంటే 17.5 శాతం) పెట్టుబడులు పెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment