సాక్షి, న్యూఢిల్లీ : వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ రుణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి బదిలీ అయ్యారు. ఈనెల 22న చందా కొచర్ బృందంపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా మరుసటి రోజే ఈ కేసును పర్యవేక్షిస్తున్న సీబీఐలో బ్యాంకింగ్, సెక్యూరిటీ ఫ్రాడ్ విభాగానికి చెందిన ఎస్పీ సుధాంశు ధర్ మిశ్రాను జార్ఖండ్‌కు చెందిన సీబీఐ ఆర్థిక నేరాల బ్రాంచ్‌కు బదిలీ చేయడం గమనార్హం.
కాగా చందా కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్‌గా ఉన్న సమయంలో వీడియోకాన్ గ్రూపునకు రూ 1875 కోట్ల విలువైన ఆరు రుణాలను మంజూరు చేయడంలో అవినీతి, మోసం జరిగిందని కొచర్ దంపతులతో పాటు వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్‌పై గురువారం సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీడియాకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో కొచర్ దంపతులు క్విడ్‌ప్రోకోకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. వీడియోకాన్‌కు రుణాలు మంజూరైన తర్వాత ఇదే గ్రూప్ చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో పెట్టుబడులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని దర్యాప్తు సంస్ధ ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment