కొచర్‌ చుట్టూ ఉచ్చు! | Deepak Kochhar’s NuPower Renewables Gets Taxman’s Notice In Videocon Loan Case | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంక్‌ వీడియోకాన్‌ రుణ వివాదం.. కొచర్‌ చుట్టూ ఉచ్చు!

Published Wed, Apr 4 2018 12:08 AM | Last Updated on Wed, Apr 4 2018 8:23 AM

Deepak Kochhar’s NuPower Renewables Gets Taxman’s Notice In Videocon Loan Case - Sakshi

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చిన వివాదానికి సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్‌ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఈ లావాదేవీల్లో లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త దీపక్‌ కొచర్‌కు తాజాగా ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఐటీ చట్టం సెక్షన్‌ 131 కింద జారీ చేసిన నోటీసుల ప్రకారం ..

ఆయన వ్యక్తిగత ఆర్థిక వివరాలు, గడిచిన కొన్నేళ్ల ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రిటర్న్‌లతో (ఐటీఆర్‌) పాటు న్యూపవర్‌ రెన్యువబుల్స్‌ సంస్థతో వ్యాపార లావాదేవీల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. న్యూపవర్‌తో పాటు ఆ కంపెనీతో సంబంధమున్న వారి ఆర్థిక పరిస్థితులపై కూడా ఐటీ శాఖ దర్యాప్తు మొదలుపెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా కంపెనీతో సంబంధమున్న మరికొందరికి కూడా నోటీసులు పంపినట్లు, వారి దగ్గర్నుంచి వచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించాయి.

మరోవైపు, దీపక్‌ కొచర్‌ను త్వరలో ప్రశ్నించనున్నట్లు ఈ వివాదంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎంక్వైరీలో దీపక్‌ కొచర్, వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌లతో పాటు మరికొందరి పేర్లు కూడా ఉన్నట్లు వివరించాయి. వీడియోకాన్‌ గ్రూప్‌నకు 2012లో రూ. 3,250 కోట్ల మేర రుణాలు ఇచ్చిన విషయంలో చందా కొచర్‌ క్విడ్‌ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రుణం లభించినందుకు ప్రతిఫలంగా చందా కొచర్‌ భర్త దీపక్‌ సంస్థలో ధూత్‌ రూ. 64 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారని ఆరోపణలు ఉన్నాయి.  

వివాదంలోకి దీపక్‌ సోదరుడు రాజీవ్‌ సంస్థ కూడా..
రుణ వివాదంలోకి తాజాగా దీపక్‌ సోదరుడు, చందా కొచర్‌ మరిది.. రాజీవ్‌ కొచర్‌కి చెందిన అవిస్టా సంస్థ కూడా చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రుణాలు పొందిన పలు కంపెనీలకు అవిస్టా రుణ పునర్‌వ్యవస్థీకరణ సేవలు అందించినట్లు తెలుస్తోంది. అవిస్టా సేవలు పొందిన సంస్థల్లో జైప్రకాశ్‌ అసోసియేట్స్, జైప్రకాశ్‌ పవర్‌లతో పాటు వీడియోకాన్, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సుజ్లాన్‌ మొదలైనవి ఉన్నట్లుగా సమాచారం.

అయితే తమ బ్యాంక్‌ ఎన్నడూ కూడా అవిస్టా అడ్వైజరీ గ్రూప్‌ సర్వీసులు వినియోగించుకోలేదని, ఎలాంటి ఫీజు చెల్లించలేదని ఐసీఐసీఐ బ్యాంక్‌ స్పష్టం చేసింది. అటు జేపీ గ్రూప్‌ మాత్రం రుణ పునర్‌వ్యవస్థీకరణ కోసం అవిస్టాను నియమించుకోవడం వాస్తవమేనని, మార్కెట్‌ రేటును బట్టి ఫీజును చెల్లించామని ధ్రువీకరించింది.

అయితే, అవిస్టా సేవలు ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌ (ఎఫ్‌సీసీబీ) పునర్‌వ్యవస్థీకరణకు మాత్రమే పరిమితమని, దాని ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. జేపీ గ్రూప్‌లో ప్రధాన సంస్థ అయిన జైప్రకాశ్‌ అసోసియేట్స్‌.. దాదాపు 110 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎఫ్‌సీసీబీలను, మరో సంస్థ జైప్రకాశ్‌ పవర్‌ 225 మిలియన్‌ డాలర్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణకు అవిస్టా సర్వీసులు ఉపయోగించుకున్నాయి.  
 

న్యూపవర్‌ వెనుక ఉన్నదెవరో తెలియాలి: అరవింద్‌ గుప్తా
క్విడ్‌ ప్రో కో వివాదాన్ని బైటికి తెచ్చిన వేగు అరవింద్‌ గుప్తా న్యూపవర్‌పై ఆరోపణాస్త్రాలు కొనసాగిస్తున్నారు. కంపెనీలో మెజారిటీ షేర్‌హోల్డరుగా ఉన్న మారిషస్‌ సంస్థ డీహెచ్‌ రెన్యువబుల్స్‌ హోల్డింగ్‌ అసలు యజమాని వివరాలను బైటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

2008లో కంపెనీని ఏర్పాటు చేసినప్పుడు ఇందులో దీపక్‌ కొచర్‌కు, ధూత్‌ కుటుంబానికి చెరి యాభై శాతం వాటాలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత క్రమంగా దీపక్‌ ట్రస్టీగా ఉన్న పినాకిల్‌ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, డీహెచ్‌ రెన్యువబుల్స్‌ మొదలైనవి ఇందులో వాటాదారులుగా మారాయి. ‘న్యూపవర్‌ ఏర్పాటైనప్పుడు అది.. భారతీయ సంస్థ.

అయితే, క్రమంగా ఇందులో 54.99 శాతం వాటాలతో మారిషస్‌కి చెందిన డీహెచ్‌ రెన్యువబుల్స్‌ మెజారిటీ వాటాదారుగా ఆవిర్భవించింది. ఒకప్పుడు ధూత్‌ కుటుంబానికి చెందిన సుప్రీమ్‌ ఎనర్జీ సంస్థ.. ఇప్పుడు పినాకిల్‌ ఎనర్జీ, కొచర్‌ల చేతికి చేరింది. పినాకిల్, డీహెచ్‌ రెన్యువబుల్స్‌ సంస్థ అసలు యజమాని గురించి ఎవరికీ, ఎప్పటికీ అంతుపట్టని విధంగా అనేక లావాదేవీల ద్వారా ఇదంతా జరిగింది‘ అని గుప్తా వ్యాఖ్యానించారు.  


ఫిక్కీ సదస్సు నుంచి తప్పుకున్న చందా కొచర్‌
న్యూఢిల్లీ: ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో) ఈ నెల 5న నిర్వహిస్తున్న 34వ వార్షిక సదస్సు నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్‌ తప్పుకున్నారు. వీడియోకాన్‌ గ్రూప్‌నకు క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన రుణాలిచ్చారంటూ ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎఫ్‌ఎల్‌వో వార్షిక సదస్సులో ఆమె గౌరవ అతిథిగా పాల్గొనాల్సి ఉంది. అలాగే, రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా చందా కొచర్‌కు సన్మానం కూడా ఉంటుందని ఎఫ్‌ఎల్‌వో గతంలో పంపిన ఆహ్వాన పత్రికల్లో పేర్కొంది. అయితే, తాజాగా మంగళవారం పంపిన ఆహ్వానపత్రికల్లో చందా కొచర్‌ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.

ఈ కార్యక్రమం నుంచి చందా కొచర్‌ తప్పుకున్నారని, ఆమె హాజరయ్యే అవకాశం లేదని ఎఫ్‌ఎల్‌వో ఈడీ రష్మి సరిత తెలిపారు. కొచర్‌ తప్పుకోవడానికి కారణాలు తెలియరాలేదని  వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వీడియోకాన్‌ గ్రూప్‌ రూ. 3,250 కోట్ల మేర రుణాలు తీసుకున్న లావాదేవీల్లో.. కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌ లబ్ధి పొందినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. వీటిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement