న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాల వివాదంలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలతో చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కొచర్ తన పదవీకాలంలో వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణ ప్రతిపాదనలను క్లియర్ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు ఉన్నాయి.
ఈ లావాదేవీల కారణంగా బ్యాంక్‌కు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వీడియోకాన్ గ్రూప్, దాని అనుబంధ కంపెనీలకు ఇచ్చిన రూ. 1,875 కోట్ల విలువ చేసే ఆరు రుణాలను క్లియర్ చేసిన కమిటీలో సభ్యులైన ప్రస్తుత ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో సందీప్ బక్షితో పాటు ఇతర అధికారులు సంజయ్ చటర్జీ, జరీన్ దారువాలా, రాజీవ్ సబర్వాల్, కేవీ కామత్, హోమీ ఖుస్రోఖాన్‌ల పాత్రపై కూడా దృష్టి సారించనున్నట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్‌ఐఆర్ దరిమిలా గురువారం వీడియోకాన్ గ్రూప్, దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, ధూత్ ఒకప్పుడు ప్రమోట్ చేసిన సుప్రీమ్ ఎనర్జీ సంస్థ ముంబై, ఔరంగాబాద్ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
క్విడ్ ప్రో కో వివాదం..
వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్‌లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంకు నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్‌లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్‌ఐఆర్‌లో చందా, దీపక్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌పై అభియోగాలు ఉన్నాయి.
షేర్లు 3 శాతం దాకా డౌన్..
కొచర్, ధూత్‌లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకదశలో సుమారు మూడు శాతం దాకా పడ్డాయి. బీఎస్‌ఈలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేరు 2.73% క్షీణించి రూ.2.85 వద్ద, ఐసీఐసీఐ షేరు 0.72% పడి రూ.365 వద్ద క్లోజయ్యాయి.
ఇంత జాప్యం ఎందుకు..
ఐసీఐసీఐ కేసులో రిజర్వ్ బ్యాంక్ వ్యవహరించిన తీరును ప్రభుత్వ రంగ(పీఎస్‌బీ) బ్యాంకర్లు ఆక్షేపించారు. చందా కొచర్‌పై చర్యలకు జాప్యం జరగడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల విషయంలో ఆర్‌బీఐ వేర్వేరుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ బ్యాంకులను నియంత్రించేందుకు తగినన్ని అధికారాల్లేవన్న ఆర్‌బీఐ.. మరి ప్రైవేట్ బ్యాంకులపై పూర్తి అధికారాలున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. విధానపరమైన చిన్న చిన్న లోపాలకు కూడా పీఎస్‌బీల్లో టాప్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకుంటున్న ఆర్‌బీఐ.. స్పష్టమైన ఆధారాలున్నా కొచర్ విషయంలో మాత్రం ఆ పని చేయలేదని బ్యాంకర్లు వ్యాఖ్యానించారు. ప్రక్రియాపరమైన వైఫల్యాల కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, ఇద్దరు ఈడీలపై సత్వరం వేటేసిన ఆర్‌బీఐ.. కొచర్ విషయంలో మీనమేషాలు లెక్కపెట్టుకుం టూ కూర్చుందని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ సమాఖ్య ఏఐబీవోసీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
విచారణ క్రమం ఇదీ....
► ఈ వివాదంలో వేణుగోపాల్ ధూత్‌తో పాటు వీడియోకాన్ గ్రూప్ సంస్థలు, ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, ఆయనకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ కేంద్ర బిందువులు.
► మొత్తం రూ. 3,250 కోట్ల రుణాల వివాదంపై 2017 డిసెంబర్‌లో సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ (వీఐఎల్), వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌తో (వీఐఈఎల్) పాటు ఆ గ్రూప్‌లోని మరో నాలుగు కంపెనీలకు 2009 జూన్ – 2011 అక్టోబర్ మధ్యకాలంలో రూ. 1,875 కోట్ల మేర ఇచ్చిన ఆరు రుణాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని సీబీఐ తేల్చింది.
► వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కి 2009 ఆగస్టు 26న రూ. 300 కోట్ల రుణం, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు 2011 అక్టోబర్ 31న రూ. 750 కోట్లు మంజూరు చేసిన కమిటీలో చందా కొచర్ కూడా ఉన్నారని తేలినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
► 2009 ఆగస్టులో బ్యాంక్ కమిటీ ఆమోదం పొందిన రూ. 300 కోట్ల రుణం అదే ఏడాది సెప్టెంబర్ 7న వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కు మంజూరైంది. తన సొంత సంస్థ సుప్రీం ఎనర్జీ ద్వారా ధూత్ ఆ మర్నాడే .. న్యూపవర్ రెన్యూవబుల్స్‌కి దొడ్డిదారిన రూ. 64 కోట్లు బదలాయించారని అభియోగాలున్నాయి. ‘తొలి విద్యుత్ ప్లాంట్ కొనుగోలు కోసం దీపక్ కొచర్ సంస్థ న్యూపవర్‌కి లభించిన అత్యధిక మొత్తం పెట్టుబడి ఇది. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరు చేసిందుకు ఈ రూపంలో చందా కొచర్ లబ్ధి పొందినట్లయింది‘ అని సీబీఐ వర్గాలు తెలిపాయి.
► వీఐఎల్, వీఐఈఎల్‌తో పాటు మిలీనియం అప్లయెన్సెస్, స్కై అప్లయెన్సెస్, టెక్నో ఎలక్ట్రానిక్స్, అప్లికాంప్ ఇండియాకు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలిచ్చింది. వీఐఎల్ నుంచి పొందిన అన్‌సెక్యూర్డ్ లోన్‌లను తీర్చేసేందుకు ఈ నాలుగు సంస్థలు.. ఆ రుణాలను ఉపయోగించుకున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు మొండిబాకీలుగా మారడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ నష్టం వాటిల్లగా రుణాలు పొందిన నిందితులు మాత్రం ప్రయోజనాలు పొందారని తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలు మంజూరు చేసిన కమిటీలోని సీనియర్ అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాల్సి ఉంటుందని సీబీఐ పేర్కొంది.
చందా కొచర్‌పై సీబీఐ కేసు
Published Fri, Jan 25 2019 5:09 AM | Last Updated on Fri, Jan 25 2019 11:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment