Quid Proko
-
సావర్కర్ కాదు భగత్ సింగ్ వారసులం.. అరెస్టులకు భయపడం: కేజ్రీవాల్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము బ్రిటిషర్లకు భయపడకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్ వారసులమని, బ్రిటిషర్లకు క్షమాణలు చెప్పిన సావర్కర్ వారసులం కాదని వ్యాఖ్యానించారు. జైలు అంటే ఆప్ నేతలకు భయం లేదని, బీజేపీనే భయపడుతుందని ధ్వజమెత్తారు. 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. అయితే దీనిలో నిబంధనలు అతిక్రమించారని, దీని వల్ల లిక్కర్ మాఫియాకు రూ.144 కోట్ల ప్రయోజనం చేకూరిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆ కాసేపటికే కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఫైనాన్షియల్ క్విడ్ ప్రోకో జరిగిందని, ఎక్సైజ్ శాఖ ఇంఛార్జ్‌గా ఉన్న సిసోడియానే దీన్ని అమలు చేశారని చీఫ్ సెక్రెటరీ నివేదిక తెలిపింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా పంపారు. అయితే ఇదంతా ఫేక్ అని కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్ అంటున్నారు. 'ఈరోజుల్లో కొత్త రూల్ వచ్చింది. ఎవర్ని జైలుకు పంపాలో ముందు కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత వారిపై కేసు నమోదవుతుంది. సిసోడియాపై చేస్తున్న ఆరోపణలను పరిశీలించాను. అందులో ఒక్కటి కూడా నిజం లేదు. అది ఫేక్ కేసు' అని మీడియా సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా తనకు 22 ఏళ్లుగా తెలుసునని, ఆయన ఎంతో నిజాయితీ పరుడని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వేవ్‌ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని బీజేపీ కుట్ర చేస్తోందని, కానీ అది వాళ్లకు సాధ్యం కాదన్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో సిసోడియా సమూల మార్పులు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. చదవండి: 94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం -
చందా కొచర్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాల వివాదంలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలతో చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కొచర్ తన పదవీకాలంలో వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణ ప్రతిపాదనలను క్లియర్ చేశారని ఎఫ్ఐఆర్లో అభియోగాలు ఉన్నాయి. ఈ లావాదేవీల కారణంగా బ్యాంక్‌కు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వీడియోకాన్ గ్రూప్, దాని అనుబంధ కంపెనీలకు ఇచ్చిన రూ. 1,875 కోట్ల విలువ చేసే ఆరు రుణాలను క్లియర్ చేసిన కమిటీలో సభ్యులైన ప్రస్తుత ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో సందీప్ బక్షితో పాటు ఇతర అధికారులు సంజయ్ చటర్జీ, జరీన్ దారువాలా, రాజీవ్ సబర్వాల్, కేవీ కామత్, హోమీ ఖుస్రోఖాన్ల పాత్రపై కూడా దృష్టి సారించనున్నట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్ఐఆర్ దరిమిలా గురువారం వీడియోకాన్ గ్రూప్, దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, ధూత్ ఒకప్పుడు ప్రమోట్ చేసిన సుప్రీమ్ ఎనర్జీ సంస్థ ముంబై, ఔరంగాబాద్ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. క్విడ్ ప్రో కో వివాదం.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంకు నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్ఐఆర్లో చందా, దీపక్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌పై అభియోగాలు ఉన్నాయి. షేర్లు 3 శాతం దాకా డౌన్.. కొచర్, ధూత్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకదశలో సుమారు మూడు శాతం దాకా పడ్డాయి. బీఎస్ఈలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేరు 2.73% క్షీణించి రూ.2.85 వద్ద, ఐసీఐసీఐ షేరు 0.72% పడి రూ.365 వద్ద క్లోజయ్యాయి. ఇంత జాప్యం ఎందుకు.. ఐసీఐసీఐ కేసులో రిజర్వ్ బ్యాంక్ వ్యవహరించిన తీరును ప్రభుత్వ రంగ(పీఎస్బీ) బ్యాంకర్లు ఆక్షేపించారు. చందా కొచర్‌పై చర్యలకు జాప్యం జరగడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల విషయంలో ఆర్బీఐ వేర్వేరుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ బ్యాంకులను నియంత్రించేందుకు తగినన్ని అధికారాల్లేవన్న ఆర్బీఐ.. మరి ప్రైవేట్ బ్యాంకులపై పూర్తి అధికారాలున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. విధానపరమైన చిన్న చిన్న లోపాలకు కూడా పీఎస్బీల్లో టాప్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ.. స్పష్టమైన ఆధారాలున్నా కొచర్ విషయంలో మాత్రం ఆ పని చేయలేదని బ్యాంకర్లు వ్యాఖ్యానించారు. ప్రక్రియాపరమైన వైఫల్యాల కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, ఇద్దరు ఈడీలపై సత్వరం వేటేసిన ఆర్బీఐ.. కొచర్ విషయంలో మీనమేషాలు లెక్కపెట్టుకుం టూ కూర్చుందని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ సమాఖ్య ఏఐబీవోసీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. విచారణ క్రమం ఇదీ.... ► ఈ వివాదంలో వేణుగోపాల్ ధూత్‌తో పాటు వీడియోకాన్ గ్రూప్ సంస్థలు, ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, ఆయనకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ కేంద్ర బిందువులు. ► మొత్తం రూ. 3,250 కోట్ల రుణాల వివాదంపై 2017 డిసెంబర్లో సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ (వీఐఎల్), వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌తో (వీఐఈఎల్) పాటు ఆ గ్రూప్‌లోని మరో నాలుగు కంపెనీలకు 2009 జూన్ – 2011 అక్టోబర్ మధ్యకాలంలో రూ. 1,875 కోట్ల మేర ఇచ్చిన ఆరు రుణాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని సీబీఐ తేల్చింది. ► వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కి 2009 ఆగస్టు 26న రూ. 300 కోట్ల రుణం, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు 2011 అక్టోబర్ 31న రూ. 750 కోట్లు మంజూరు చేసిన కమిటీలో చందా కొచర్ కూడా ఉన్నారని తేలినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ► 2009 ఆగస్టులో బ్యాంక్ కమిటీ ఆమోదం పొందిన రూ. 300 కోట్ల రుణం అదే ఏడాది సెప్టెంబర్ 7న వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కు మంజూరైంది. తన సొంత సంస్థ సుప్రీం ఎనర్జీ ద్వారా ధూత్ ఆ మర్నాడే .. న్యూపవర్ రెన్యూవబుల్స్కి దొడ్డిదారిన రూ. 64 కోట్లు బదలాయించారని అభియోగాలున్నాయి. ‘తొలి విద్యుత్ ప్లాంట్ కొనుగోలు కోసం దీపక్ కొచర్ సంస్థ న్యూపవర్‌కి లభించిన అత్యధిక మొత్తం పెట్టుబడి ఇది. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరు చేసిందుకు ఈ రూపంలో చందా కొచర్ లబ్ధి పొందినట్లయింది‘ అని సీబీఐ వర్గాలు తెలిపాయి. ► వీఐఎల్, వీఐఈఎల్తో పాటు మిలీనియం అప్లయెన్సెస్, స్కై అప్లయెన్సెస్, టెక్నో ఎలక్ట్రానిక్స్, అప్లికాంప్ ఇండియాకు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలిచ్చింది. వీఐఎల్ నుంచి పొందిన అన్సెక్యూర్డ్ లోన్లను తీర్చేసేందుకు ఈ నాలుగు సంస్థలు.. ఆ రుణాలను ఉపయోగించుకున్నాయని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు మొండిబాకీలుగా మారడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ నష్టం వాటిల్లగా రుణాలు పొందిన నిందితులు మాత్రం ప్రయోజనాలు పొందారని తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలు మంజూరు చేసిన కమిటీలోని సీనియర్ అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాల్సి ఉంటుందని సీబీఐ పేర్కొంది. -
‘క్విడ్ ప్రోకో’లో భాగమే
సాక్షి, హైదరాబాద్: క్విడ్ ప్రోకో (నాకిది, నీకది)లో భాగంగానే సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణాన్ని ప్రైవేటు భూముల్లో తలపెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముకాస్తున్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్(ప్రభుత్వ నిర్ణయాలను ముందే తెలుసుకుని, వాటి ద్వారా బహిరంగ మార్కెట్లో లబ్ధి పొందడం)కు పాల్పడుతూ మోసం చేస్తున్నారు. సూర్యాపేటలో కలెక్టరేట్ నిర్మాణానికి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 55.38 ఎకరాలు ఆమోదయోగ్యమని తేల్చినా కోట్లు ఖర్చు చేసి ప్రైవేటు భూముల్లో నిర్మించ తలపెట్టారు. కుడకుడ గ్రామంలో 17 మంది రైతుల నుంచి 2016లో జగదీశ్‌రెడ్డి 34 ఎకరాలు రూ.1.2 కోట్లకు కొనుగోలు చేశారు. అక్కడే శ్రీ సాయి డెవలపర్స్ 41.28 ఎకరాలు కొన్నది. ఈ భూముల్లో రియల్టీ వ్యాపారం కోసమే కలెక్టరేట్/ఎస్పీ కార్యాలయాల సముదాయాన్ని సూర్యాపేటకు దూరంగా ఉన్న బీబీగూడెం, కుడకుడ గ్రామాల మధ్య నిర్మిస్తున్నారు. శ్రీ సాయి డెవలపర్స్‌లో 4వ భాగస్వామి అయిన జి.ప్రకాశ్ సూర్యాపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ భర్త’’ అని ఆరోపించారు. ఈ వివరాలన్నింటినీ కోర్టు దృష్టికి తెచ్చేందుకే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. బీబీగూడెం, కుడకుడల్లో కలెక్టరేట్ నిర్మాణాలు చేపట్టడానికి కారణాల్ని వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై చకిలం రాజేశ్వర్‌రావు వేసిన పిల్‌ను ధర్మాసనం మంగళవారం మళ్లీ విచారించింది. గత ఆదేశాల మేరకు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు జీవోల నోట్ ఫైల్‌ను ధర్మాసనానికి అందజేశారు. -
అంత భూమి ఎవరికోసం బాబూ?
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు నిలదీత * కొత్త రాజధానికి 1,561 ఎకరాలు చాలు * మిగతాది క్విడ్ ప్రోకో కోసమా? సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమి అవసరం లేదని, కేవలం 1,561 ఎకరాలు సరిపోతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం చెబుతున్నారని, ఆ లెక్కన 1,561 ఎకరాలు చాలన్నారు. సింగపూర్, జపాన్ దేశాలకు వత్తాసు పలుకుతూ అక్కడి పారిశ్రామికవేత్తల చంకల్లో ఉన్న ఇక్కడి పెద్దమనుషులకు ఉపయోగపడేలా చంద్రబాబు భూమిని సేకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్న సీపీఎం కేంద్రకమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా రాఘవులు బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజధానికి సరిపోగా మిగతా భూమిని క్విడ్ ప్రోకో(బదులుకు బదులుగా) కింద రియల్టర్లకు కట్టబెట్టేందుకే అంత భూమి సేకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. భూ సమీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని, భూ సేకరణ చట్టం ప్రకారమే సేకరించాలని స్పష్టం చేశారు. నిరంకుశ పద్ధతిలో సారవంతమైన భూముల్ని లాగేసుకుంటామంటే సహించబోమని హెచ్చరించారు. పిల్లల్ని కనాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాఘవులు ఎద్దేవా చేశారు. ‘‘తన హయాంలో జనాభాను 1.3 శాతం మేరకు తగ్గించగలిగానని మీసాలు మెలేసుకుని చెప్పుకున్న బాబుకు ముందు చూపు పోయి వెనకచూపు వచ్చినట్టుంది. సంతానాన్ని తగ్గించినందుకు తనను ప్రపంచ బ్యాంకు ప్రశంసించిందని ఘనంగా చెప్పుకున్న పెద్దమనిషి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారో మరి! పిల్లల్ని కనాలా వద్దా అనేది వ్యక్తులకు,భార్యాభర్తలకు వదలండి.. అందు లో సీఎం జోక్యం అక్కర్లేదు’’ అని రాఘవులు అన్నారు. ‘‘జార్జ్ బుష్(అమెరికా మాజీ అధ్యక్షుడు)ను, ఉల్ఫెన్సన్(ప్రపంచ బ్యాంకు మాజీ అధ్యక్షుడు)ను రప్పించి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళతామన్నారు? వాళ్లు వచ్చినప్పుడు వార్లు పోసి కాళ్లకు మొక్కి భజన్లు చేశారు.. చివరకు ఏమైంది? వచ్చినవాళ్లు దోచుకుపోయారు. ఇప్పుడు ఒబామా వస్తున్నదీ అందుకే..’’ అని ఆయన అన్నారు. ఉద్యమాల ప్రాతిపదికనే ఫ్రంట్లు.. విశాఖలో జరిగే పార్టీ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టే రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని కేంద్ర కమిటీ ఆమోదించినట్టు రాఘవులు తెలిపారు. గతంలో తాము పెట్టిన ఫ్రంట్లు ఎన్నికలకే పరిమితమయ్యేవని, ఇకపై పోరాటాలు, ఉద్యమాల ప్రాతిపదికన ఫ్రంట్లుంటాయని స్పష్టం చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతోపాటు మతతత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాల్లో తమతో కలిసి వచ్చేవారితోనే జట్టు కడతామని, ఎన్నికల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తామని తెలిపారు. ‘‘బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొచ్చింది. హిందూమతోన్మాదులతో ఏకీభవించని వారిని అణచివేసే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వీటిపై పోరాడాల్సి ఉంది. అందుకోసం సీపీఎంగా మేము బలపడాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు.