సాక్షి, హైదరాబాద్: క్విడ్ ప్రోకో (నాకిది, నీకది)లో భాగంగానే సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణాన్ని ప్రైవేటు భూముల్లో తలపెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముకాస్తున్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్(ప్రభుత్వ నిర్ణయాలను ముందే తెలుసుకుని, వాటి ద్వారా బహిరంగ మార్కెట్‌లో లబ్ధి పొందడం)కు పాల్పడుతూ మోసం చేస్తున్నారు.
సూర్యాపేటలో కలెక్టరేట్ నిర్మాణానికి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 55.38 ఎకరాలు ఆమోదయోగ్యమని తేల్చినా కోట్లు ఖర్చు చేసి ప్రైవేటు భూముల్లో నిర్మించ తలపెట్టారు. కుడకుడ గ్రామంలో 17 మంది రైతుల నుంచి 2016లో జగదీశ్‌రెడ్డి 34 ఎకరాలు రూ.1.2 కోట్లకు కొనుగోలు చేశారు. అక్కడే శ్రీ సాయి డెవలపర్స్ 41.28 ఎకరాలు కొన్నది. ఈ భూముల్లో రియల్టీ వ్యాపారం కోసమే కలెక్టరేట్/ఎస్పీ కార్యాలయాల సముదాయాన్ని సూర్యాపేటకు దూరంగా ఉన్న బీబీగూడెం, కుడకుడ గ్రామాల మధ్య నిర్మిస్తున్నారు.
శ్రీ సాయి డెవలపర్స్‌లో 4వ భాగస్వామి అయిన జి.ప్రకాశ్ సూర్యాపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ భర్త’’ అని ఆరోపించారు. ఈ వివరాలన్నింటినీ కోర్టు దృష్టికి తెచ్చేందుకే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. బీబీగూడెం, కుడకుడల్లో కలెక్టరేట్ నిర్మాణాలు చేపట్టడానికి కారణాల్ని వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై చకిలం రాజేశ్వర్‌రావు వేసిన పిల్‌ను ధర్మాసనం మంగళవారం మళ్లీ విచారించింది. గత ఆదేశాల మేరకు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు జీవోల నోట్ ఫైల్‌ను ధర్మాసనానికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment