అసెంబ్లీలో చర్చించాకే రైతుభరోసా
ఖర్చు పెట్టినా ఫలితమివ్వని మిషన్ భగీరథ
కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రైతు రుణమాఫీని ఆగస్టు కంటే ముందే అందిస్తే ఏమైనా ఇబ్బందా’అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అని ప్రశ్నించారు. కొత్తగూడెంలో వివిధ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు.
రైతుభరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎలా పంపిణీ చేయాలి అనే అంశాలపై ప్రజాభిప్రాయం సేకరిస్తామని, విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాతే అందిస్తామని ప్రకటించారు. అంతే కానీ నలుగురం కూర్చుని మాదేం పోయింది..ప్రజల డబ్బే కదా అన్నట్టుగా భావించి గుట్టలు ఉన్న చోట, పంటలు వేయని భూములకు రైతుభరోసా అందించే ఉద్దేశం లేదని చెప్పారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9వేల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా నీరందించలేకపోయారని విమర్శించారు. రూ.42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ పేరుతో ఖర్చు చేసినా, ఇప్పటివరకూ ఇంటింటికీ తాగునీరు రాని గ్రామాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయన్నారు.
పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బులను ఎవరికి పడితే వారికి పంచి, రూ.7లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని చెప్పారు. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి సహకారంతో ఐటీ హబ్, పాల్వంచలో కొత్త «థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
12 ఆర్వోబీలకు ప్రతిపాదనలు
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కనెక్టివిటీ పెంచేందుకు 12 ఆర్వోబీలకు సేతుబంధన్ కింద నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అందులో రూ.148 కోట్లతో నిర్మించే కొత్తగూడెం ఆర్వోబీ కూడా ఉందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచి్చన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదు అమలు చేశామని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.35 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ట్రయల్‌రన్ ద్వారా బీజీ కొత్తూరు పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు అంకురార్పణ జరిగిందనిచ, మిగిలిన పనులను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్‌నాయక్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పీచైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు
యాక్షన్ ప్లాన్
గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ప్రజలకు సేవలు అందించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గోదావరి వరదల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment