మూసీ బ్యూటిఫికేషన్‌ కాదు.. లూటిఫికేషన్‌! | KTR Fires On CM Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

మూసీ బ్యూటిఫికేషన్‌ కాదు.. లూటిఫికేషన్‌!

Published Sun, Oct 6 2024 6:19 AM | Last Updated on Sun, Oct 6 2024 6:19 AM

KTR Fires On CM Revanth Reddy: Telangana

కందుకూరు రైతు మహాధర్నాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌

ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.. ఉన్న ఇళ్లు కూలగొడుతున్నారని విమర్శ

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు రుణమాఫీ చేసేందుకు పైసల్లేవుగానీ.. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారా అని సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే కమీషన్లు రావని.. అదే మూసీ ప్రాజెక్టు అయితే రూ.30 వేల కోట్లు దోచుకోవచ్చని ప్లాన్‌ వేశారని ఆరోపించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్‌ కాదని, పెద్ద లూటిఫికేషన్‌ అని విమర్శించారు. పార్టీ పెద్దలకు కమీషన్లు పంపి కుర్చీని కాపాడుకోవటం కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ‘‘పైసలు కావాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చందాలు వేసుకుని ఇస్తాం. రాహుల్‌గాంధీకి పంపి కుర్చీని కాపాడుకో.. అంతేకానీ పేదల జోలికి రావొద్దు. నీ కళ్లు చల్లబడతాయంటే మా ఇళ్లు కూల్చు.

కానీ పేదల ఇళ్లను కూలగొట్టవద్దు. ముందు రెడ్డికుంటలోని మీ ఇంటిని, దుర్గంచెరువులోని మీ అన్న ఇంటిని కూల్చు’’ అని రేవంత్‌కు సవాల్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘సిగ్గు, శరం ఉన్నవాళ్లకు మనం మర్యాద ఇవ్వాలి. ఈ సీఎంకు అలాంటివి ఏమీ లేవు. కేసీఆర్‌ రుణమాఫీ చేసిన వాళ్లను కూడా మళ్లీ రుణం తెచ్చుకోండి మాఫీ చేస్తాం అని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి చెప్పారు. డిసెంబర్‌ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానన్నారు. పది నెలలైంది. ఇప్పటికీ పైసా రుణం మాఫీ కాలేదు. ఎన్నికల ముందు ఎక్కడ దేవుడు కనిపిస్తే.. ఆ దేవుళ్ల మీద ఒట్లు వేశారు. ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేశారు. చిట్టినాయుడు కట్టేటోడు కాదు.. కూలగొట్టేటోడు. రైతుబంధు లేదు, రైతు భరోసా లేదు. పెద్ద మనుషులు, మహిళలకు పింఛన్లు అన్నారు. లేవు. మహిళలకు బతుకమ్మ చీరలు వచ్చాయా? పండుగ పండుగలా ఉందా? ఇందిరమ్మ ఇళ్లు కడతా అంటే ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఇళ్లు కూలగొడుతున్నారు. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు.

బ్రదర్స్‌కు దోచిపెట్టేందుకే..
మేం ఏడేళ్లపాటు కష్టపడి ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి 14 వేల ఎకరాలు సేకరించాం. ఈ సర్కారు ఫోర్త్‌ సిటీ కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదు. ఫార్మా సిటీ భూములనే ఫోర్త్‌ సిటీ కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఫోర్త్‌ సిటీ కాదు. రేవంత్‌రెడ్డి ఫోర్‌ బ్రదర్స్‌ సిటీ. వాళ్లు రైతులను బెదిరించి అసైన్డ్‌ భూములను లాక్కుంటున్నారు. ఫార్మా సిటీ రద్దు కాలేదని కోర్టుకు చెప్తున్నారు. బయట మాత్రం ఫోర్త్‌ సిటీ అంటున్నారు. ఫోర్త్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దందాకు ప్రయత్నం చేస్తున్నారు. ఫోర్త్‌ సిటీ పేరుతో చేస్తున్న డ్రామాలపై రైతులు కోర్టుల్లో కేసులు వేయాలి. వారికి బీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ అండగా నిలుస్తుంది. రీజనల్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్‌ కట్టబెట్టేందుకే అలా వ్యవహరిస్తున్నారు. రేవంత్‌ ఓ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా పనిచేస్తున్నారే తప్ప.. సీఎంలా పనిచేయటం లేదు.

ఎవరినీ వదిలిపెట్టేది లేదు..
మూసీ గబ్బు అంతా సీఎం, మంత్రుల మెదళ్లలోనే ఉంది. వారి గబ్బు మాటలను ఇక వదిలేది లేదు. నాపై అడ్డగోలు గా మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టను. క్రిమినల్‌ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తా. గతంలో ప్రతి పక్షంలో ఉన్నారని ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోలే దు. ఇకపై వారిని వదిలేది లేదు. మోదీనే ఏం చేసుకుంటావో చేసుకో అన్నోళ్లం. ఈ చిట్టి నాయుడు ఎంత?’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

సీఎంకు బతుకమ్మ అంటే గిట్టదా?
‘‘ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి సీఎంకు మనసు రావడం లేదా? పండుగ పూట కూడా పల్లె లను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుకో వాలా? పల్లెల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ కొనడానికి, చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపు రించాయి. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం?బతుకమ్మ చీరలను రద్దు చేశారు. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’’ – ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ విమర్శలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement