కార్యాచరణపై బీఆర్‌ఎస్ కసరత్తు
ప్రభుత్వ వైఫల్యాలనుఎండగట్టడమే లక్ష్యంగా ముందుకు
దసరా తర్వాత ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి
హైడ్రా, మూసీ బాధితులు, రుణమాఫీపై ఇప్పటికే జనంలోకి..
నవంబర్ 10 తర్వాత బీసీ డిక్లరేషన్ అమలు కోసం ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని భారత్ రాష్ట్ర సమితి భావిస్తోంది. ప్రజా సమస్యలే ఎజెండాగా అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రైతులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాన్ని బలంగా ఎత్తిచూపుతున్న బీఆర్‌ఎస్.. ఇతర వైఫల్యాలపైనా ఫోకస్ పెంచాలనుకుంటోంది.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు తదితర అంశాలపై వివిధ రూపాల్లో నిరసన తెలిపిన పార్టీ.. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పేరిట నిర్వాసితులను బలవంతంగా తరలించడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయిన నేపథ్యంలో, ఆరు గ్యారంటీల అమలు కోసం ఒత్తిడి పెంచే యోచనలో బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఉన్నారు.
దసరా పండుగ తర్వాత ఆరు గ్యారంటీల అమలు కోసం పార్టీ పరంగా చేపట్టాల్సిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై కసరత్తు జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగం, ఆరు గ్యారంటీల లబ్ధిదారులను భాగస్వాములను వీటిల్లో భాగస్వాముల్ని చేయాలని భావిస్తున్నారు.
బీసీ డిక్లరేషన్ అమలు కోసం ..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీల కోసం కాంగ్రెస్ ప్రకటించిన ‘కామారెడ్డి డిక్లరేషన్’ అమలుకు నవంబర్ 10వ తేదీని గడువుగా బీఆర్‌ఎస్ విధించింది. ఆ లోపు కాంగ్రెస్ స్పందించని పక్షంలో బీసీ వర్గాలను కలుపుకొని ఉద్యమించాలని భావిస్తోంది. బీసీ సామాజికవర్గానికి 42 రిజర్వేషన్ల పెంపు, బీసీ కులగణన వంటి అంశాలపై ఇప్పటికే బీఆర్‌ఎస్ బీసీ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బీసీల రిజర్వేషన్లపై అధ్యయనం కోసం ఇటీవల తమిళనాడులో రెండురోజుల పర్యటనకు వెళ్లిన వచ్చిన బృందం త్వరలో కేసీఆర్‌కు నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను మరింత గట్టిగా విన్పించనుంది.
మరోవైపు కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన ఉద్యమ రూపాలపైనా బీసీ నేతల భేటీల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ‘జాట్‌లు’ తమ హక్కుల కోసం చేపట్టిన నిరసన రూపాలను అధ్యయనం చేస్తున్నారు. ఢిల్లీ శివార్లలో నెలల తరబడి రైతులు చేసిన ఉద్యమ తీరుతెన్నులు కూడా పరిశీలిస్తున్నారు.
స్థానిక సమస్యలపైనా..
స్థానిక సమస్యలపైనా ఆందోళనలు నిర్వ హించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఫల్యాలను ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తోంది. పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజ కవర్గ ఇన్‌చార్జిలు, ముఖ్య నేతలను భాగస్వాము లుగా చేస్తూ క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపయోగపడ తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణాలు, పంచాయతీలకు నిధుల కొరత, గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, పారిశుధ్య లోపం, ప్రజారోగ్యం, వైద్యం, అధికారుల పనితీరు, అధికార పార్టీ దాడులు, అక్రమ కేసులు వంటి అనేక అంశాలపై స్థానికంగా ఉద్యమించాలని నేతలకు పార్టీ సూచిస్తోంది.
జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్ అఫీసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ధర్నాలు తదితర రూపాల్లో నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు చెప్తోంది. స్థానికంగా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొనేలా చూడటం ద్వారా పార్టీ యంత్రాంగంలో ఉత్సాహం నింపాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment