స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం | Telangana Assembly Budget Session 2025 March 13th Live Updates, Top News Headlines And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Telangana Assembly 2025 Updates: స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

Published Thu, Mar 13 2025 10:13 AM | Last Updated on Thu, Mar 13 2025 1:14 PM

Telangana Assembly Budget Session 2025: March 13th Assembly News Updates

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఉద్దేశించి మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో అలజడి రేపాయి. ప్రతిపక్షంగా తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీఆర్‌ఎస్‌ స్పీకర్‌పై ఆరోపణలకు దిగగా.. బీఆర్‌ఎస్‌ సభ్యులు దళిత స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఆందోళనలతో గందరగోళం నెలకొనగా సభ కాసేపు వాయిదా పడింది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్‌ మంత్రులుగా వ్యవహారం నడిచింది. 

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి గవర్నర్‌ ప్రసంగంపై సెటైర్లు వేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిెడ్డి వెంకట్ రెడ్డి అడ్డు పడి వాస్తవాలు మాట్లాడాలని జగదీష్‌రెడ్డికి సూచించారు. ఆ వెంటనే తలసాని జోక్యం చేసుకుని కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. సభలో సభ్యులందరికీ సమాన నిబంధనలు ఉంటాయని అన్నారు.  ఈలోపు.. మంత్రి శ్రీధర్ బాబు - బీఆర్ఎస్ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ బాబు ప్రసంగానికి బీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు వ్యంగంగా నవ్వారు కాబట్టే అధికారం కోల్పోయారని శ్రీధర్‌ బాబు సెటైర్లు వేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. 

ఒకానొక తరుణంలో పరిస్థితి చేజారిపోతుండడంతో స్పీకర్‌ ప్రసాద్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌ సభ్యులు సభను అవమానం ఇచ్చే విధంగా బీఆర్‌ఎస్‌ ప్రవర్తించవద్దు. స్పీకర్ తీరును సభ్యులు ప్రశ్నించొద్దు’’ అని స్పీకర్‌ ప్రసాద్‌ అనడంతో జగదీశ్‌ రెడ్డి లేచారు. స్పీకర్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యాఖ్యలను ఖండించిన జగదీశ్ రెడ్డి.. ‘‘మీరు ఈ సభకు పెద్ద మనిషి మాత్రమేనని, ఈ సభ అందరిదని, మీ ఒక్కరికే సొంతం కాదు’’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు.

జగదీష్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. పోటీగా బీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పొడియం దగ్గరగా వెళ్లారు. సభను ఆర్డర్‌లో పెట్టాలని, ప్రతిపక్ష పార్టీకి కనీస గౌరవం ఇవ్వరా? అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో.. దళిత స్పీకర్‌ను అవమానించిన జగదీష్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌కు దిగింది. ఈ ఆందోళనలతో సభ వేడెక్కగా.. కాసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement