TG: ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్ | Telangana Assembly Budget Sessions 2024 Day 1 Live Updates And Top News Headlines | Sakshi
Sakshi News home page

TG: ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్

Jul 23 2024 8:12 AM | Updated on Jul 23 2024 1:38 PM

Telangana Assembly Budget Sessions Day 1 Updates

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించింది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. లాస్య నందిత మరణం పట్ల రెండు నిమిషాలు సభ మౌనం పాటించింది. అనంతరం సభ రేపటి వాయిదా పడింది. అనంతరం స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం నిర్వహించారు.

ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు
బీఏసీ  సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి హరీష్‌రావు, సీపీఐ నుంచి కునంనేని హాజరయ్యారు. ఈ నెల 31వ తేది వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మధ్యలో ఆదివారం 28వ తేదీన సెలవు ప్రకటించింది. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 31వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. బీఏసీ సమావేశానికి ప్రోటోకాల్ పాటించకపోవడంపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలలో కూడా ఊహించలేదు: కేటీఆర్‌
లాస్య నందితకు సంతాపం తెలిపే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ భావోద్వేగానికి గురైయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న నిబద్ధతతో కలిసి పనిచేశారు. సాయన్న కోరినట్టు కవాడిగూడ నుంచి లాస్యను గెలిపించుకున్నము. సాయన్న మరణం నుంచి అప్పడప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబం మరోసారి విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. సాయన్న కుమార్తె  లాస్య నందిత కూడా యాక్సిండెంట్‌కు గురై మృతిచెందడం అత్యంత ఆవేదన కలిగించిన అంశ. ఏడాదిలోపే తండ్రి, కూతురు మరణించటమంటే ఆ వార్త వినటానికే ఎంతో ఆవేదనగా ఉంటుంది. అలాంటిది ఆ కుటుంబం. పరిస్థితిని ఎలా ఎదుర్కొందో తలచుకుంటేనే బాధగా ఉంది’’ అని కేటీఆర్‌ చెప్పారు.

‘‘సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ ఇదే శాసనసభలో హామీ ఇచ్చారు. లాస్య నందిత చాలా చురుకైన అమ్మాయి సాయన్న సేవలు పార్టీ అండతో లాస్య గెలిచి అసెంబ్లీలోకి వచ్చింది. సాయన్న మాదిరిగానే ప్రజా సేవ చేయాలనుకున్న లాస్య నందితకు మంచి అవకాశం వచ్చింది. లాస్య కారు ప్రమాదానికి వారం ముందు కూడా నల్గొండ బహిరంగ సభలోనూ యాక్సిడెంట్ జరిగింది. తండ్రి మరణం, ఆ తర్వాత నల్గొండ సభలో జరిగిన యాక్సిడెంట్ ఇలా విధి పగబట్టింది. కానీ తన సంతాపం తెలిపే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా నిలవాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ మళ్లీ ఆ కుటుంబంలోనే సాయన్న మరో కూతురు నివేదితకు పార్టీ సీటును కేటాయించింది. అయితే దురదృష్టవశాత్తు తన ఓడిపోవటం జరిగింది. తండ్రి, కూతురును కోల్పోయిన ఆ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

లాస్య మరణించడం బాధాకరం: సీఎం రేవంత్‌
లాస్య మృతి బాధాకరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారు. సాయన్న వారసురాలిగా కుమారి లాస్య నందితను ప్రజలు  కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరం. సాయన్న మృదుస్వభావి.. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారు.

‘‘కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలన్న సాయన్న కోరిక. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరు లాస్య బతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండేవారు. కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరం. వారు మన మధ్య లేకపోయినా  ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి ఆశయాలను, వారు చేయాలనుకున్న పనులను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా’’ అని రేవంత్‌ చెప్పారు.


 

 

కేసీఆర్‌కు కేటాయించిన ఛాంబర్‌పై కేటీఆర్‌ అసంతృప్తి
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు కేటాయించిన ఛాంబర్‌పై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రూమ్‌లు కలిపి ఒకే రూమ్‌గా అసెంబ్లీ సిబ్బంది మార్పు చేశారు. రూం మధ్యలో వాష్ రూం పెట్టీ వాడుకోవడానికి అనుకూలంగా లేకుండా చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ అంశాన్ని బీఏసీలో లేవనెత్తాలని హరీష్‌రావుకు కేటీఆర్‌ సూచించారు.

 

తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత 
తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది.

గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాళులు
గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, సునితా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, కాలేరు వెంకటేష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి,పాడి కౌశిక్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

అందుకే కేంద్రం  నిధులు ఆపింది: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
 గన్‌ పార్క్‌ వద్ద ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు 800 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో ఉపాధి హామీలో పని చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్రం నిధులు ఆపిందని సునీత లక్ష్మారెడ్డి అన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ 
సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినా వారికి బిల్లులు రాలేదు. మన ఊరు మన బడి ద్వారా చేసిన పనులకు బిల్లులు ఆపారు. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement