మొత్తానికి ‘సూపర్ సిక్స్ వేస్ట్’ అని గవర్నర్‌తో చెప్పించారే!
ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చే గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల అమలు, ప్రగతి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల ప్రణాళిక, హామీల ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) ముగించేసింది. ఏమిటి దీనర్థం? వాగ్ధానాలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Syed Abdul Nazeer) ప్రసంగం మొత్తాన్ని తరచి చూసినా సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించిన విషయం పెద్దగా కనపడదు. ఎన్నికల ప్రచారంలో ఈ ఆరు హామీలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రమంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ , లోకేష్‌లు ఈ హామీల ఎగవేతకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకు బదులు ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడంపైనే పాలకపక్షం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తల, నేతల ఆస్తుల విధ్వంసం, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రం ఇప్పటికే అరాచక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు!. జగన్ అధికారంలో ఉండగా ప్రశంసించిన మంత్రివర్గాన్నే ఇప్పుడు గవర్నర్ విమర్శించాల్సిన పరిస్థితి. ప్రసంగాన్ని గవర్నర్ స్వయంగా కాకుండా.. పాలకపక్షం తయారు చేసి ఆయన చేత చదివిస్తుంది మరి! భారత రాజ్యాంగంలోని ఒకానొక వైరుద్ధ్యమిది. 👉గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ టాప్ 25 హామీలు అంటూ ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నారు. సంతకమైతే పెట్టారు కానీ.. గడువులోగా అమలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంలో దీని గురించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. వృద్ధాప్య ఫించన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని చెప్పారు. కానీ, లక్షల సంఖ్యలో ఫించన్ల కోతకు కారణమేమిటో వివరించలేదు. అలాగే పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరికీ రూ.1500, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, వలంటీర్ల గౌరవ వేతనం రూ.పది వేలకు పెంపు, అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పూర్ టు రిచ్, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ వర్తింపు, పెళ్లికానుక కింద రూ.లక్ష, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిల్లో.. గ్యాస్ సిలిండర్లు పథకం అరకొరగా అమలు అవుతోంది. ఇసుక ఉచితం అనేది ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయింది. వీటితోపాటు మిగిలిన హామీల పురోగతి, అమలుకు ఉన్న అడ్డంకులను గవర్నర్‌తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ సూపర్ సిక్స్ హామీలను ఇవ్వనట్లు గవర్నర్ ప్రసంగం సాగిందనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏటా ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలును గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు నివేదించేది. టీడీపీ ప్రభుత్వం(TDP Government) మాత్రం అలవికాని హామీలను ఇవ్వడమే కాకుండా.. ఆచరణ ప్రశ్నార్థకంగా ఉన్న పలు అంశాలను చెప్పుకుని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందట. కుల వృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్ధిరత్వం వస్తుందట. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందని, విప్లవానికి నాయకత్వం వహిస్తోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా!. 👉యథా ప్రకారం స్వర్ణాంధ్ర -2047 సాధనకు పది సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏమిటంటే ఆ పది సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్నట్లుగా గవర్నర్‌తో చెప్పిస్తే ఏమి ప్రయోజనం?. అది నిజమో ,కాదో ప్రజలకు తెలియదా? తాము ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని అన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేసినట్లే రాశారు. వారికి కూడా తెలుగు అర్థం కాలేదా!. కేంద్ర పధకాలను పునరుద్దరించారట. తొమ్మిదివేల కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వ టైమ్ లోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు(Chandrababu)కు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. 👉ఇక రోడ్లు, ఇతర పనుల బిల్లులు రూ.పది వేల కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే. కాని దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని అనడమే ఒకింత ఆశ్చర్యం!!. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి ఆశించిన స్థాయిలో లేక, జీఎస్టీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మరోపక్క గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్, ,గ్రీన్ కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వీటిలో బీపీసీఎల్, గ్రీన్ కోలు జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్ కో కర్నూలు జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కూటమి సర్కార్ వీటిని తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వలంటీర్లు లక్షన్నర మందిని తొలగించారు. ఇతరత్రా కొన్నివేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు ఎక్కడ వచ్చాయో ప్రభుత్వం వివరంగా చెబితే బాగుండేది. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరిని స్కీమ్‌లు, డబ్బులతో ముంచి లేపుతానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పాత కొటేషన్ ను అందుకుంది. ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజే తీర్చగలదు. అదే కనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. అంటే అర్థమైంది కదా? సూపర్ సిక్స్, ఇతర హామీలు వేస్ట్ అని చెప్పడమే ఇది! ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు.. ప్రపంచ మార్కెట్లో అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు.. ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేయత్నం సాగించారు. రోడ్లను బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే రూ.15వేల కోట్ల మేర బాదిన ప్రభుత్వం ఇప్పుడు పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కాని ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. అన్నా క్యాంటిన్లు హామీ అమలు నిజమే కాని, దానితోనే పేదరికం పోయేటట్లయితే, పేదల ఆకలి తీరేటట్లయితే వాటినే రాష్ట్రం అంతటా వీధి, వీధిన పెడితే సరిపోతుంది కదా? మరి ఇది చేపల వల అవుతుందా? లేక చేపలు ఇచ్చినట్లు అవుతుందో వివరిస్తే బాగుంటుంది. మొత్తం మీద గవర్నర్ స్పీచ్‌లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ సిక్స్ హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవి అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.