సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితిపై అసెంబ్లీ శ్వేతపత్రం విడుదల, నీటిపారుదల రంగంపై ప్రజెంటేషన్ శనివారానికి వాయిదా పడ్డాయి. వీటిపై శాసనసభలో శుక్రవారమే చర్చ జరగాల్సి ఉన్నా ఇతర అంశాలపై చర్చతో జాప్యమవడం, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్ సభ్యు ల నిరసనతో చాలా సేపు గందరగోళం నెలకొంది. నీటిపారుదల అంశం చాలా కీలకం కావడంతో.. ఎక్కువ మంది సభ్యులు చర్చలో పాల్గొనేందుకు వీ లుగా వాయిదా వేయాలని అధికార పక్షం కోరడం.. దీనికి ఎంఐఎం, సీపీఐ మద్దతివ్వడంతో స్పీకర్ శ నివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కి..
శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో శాసనసభలో కులగణనపై తీర్మానం ఆమోదం పొందాక స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తేనీటి విరామం ప్రకటించారు. తిరిగి సభ సాయంత్రం 6 గంటలకు సమావేశమైంది. తొలుత ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య లేచి.. శ్వేతపత్రంపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సభను శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు.
దీనితో వాయిదా వద్దని, వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్ సభ్యులు లేచి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడటానికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండకు హెలికాప్టర్‌లో వెళతారు. ఐదు నిమిషాల్లో రాగల సభకు రాకపోవడం ఏమిటంటూ ఘాటు విమర్శలు చేశారు. దీనితో బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు.
వాయిదాపై చర్చ తర్వాత
బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శ్వేతపత్రంపై చర్చించడానికి గంటల తరబడి వేచి ఉన్నాం. రాత్రి 11 గంటల వరకు కూర్చోవడానికి సిద్ధం. శనివారం పార్టీ సమావేశాలకు వెళ్లాల్సి ఉంది. మీరు ఎజెండాలో పెట్టి ఎందుకు చర్చ చేపట్టడం లేదు. వెంటనే చర్చ మొదలుపెట్టండి..’’ అని కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకుంటూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు.
సభ వాయిదాకు అభ్యంతరం లేదని ఎంఐఎం, సీపీఐ సభ్యులు తెలిపారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టులపై స్పల్పకాలిక చర్చ శుక్రవారం ఉంటుందని, సమావేశాలు అదేరోజు ముగుస్తాయని బీఏసీలో నిర్ణయించారు. మధ్యాహ్నం కలసినప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు కూడా స్పల్పకాలిక చర్చ ఉంటుందన్నారు. కానీ ఇలా సభా సంప్రదాయాలకు విరుద్ధంగా చర్చ లేకుండా వాయిదా వేస్తామనడం సరికాదు. ఎంతరాత్రయినా చర్చకు మేం సిద్ధం. ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేస్తాం. ఇష్టానుసారం నిర్వహిస్తామనడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.
దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. బీఏసీలో నిర్ణయించని ఇతర అంశాలను స్పీకర్ అనుమతితో చర్చిద్దామనుకున్నామని చెప్పారు. ఇది ముఖ్యమైన అంశమని, అన్ని పారీ్టల ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనేందుకు వీలుగా శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు నిర్వహిద్దామని, ప్రతిపక్షం సహకరించాలని కోరారు. కాగా.. కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. సభను శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
మీరంటే.. మీరు.. క్షమాపణల కోసం డిమాండ్
సభలో గందరగోళం నెలకొన్న తరుణంలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుని.. శ్వేతపత్రంపై స్పల్పకాలిక చర్చకు సంబంధించి అన్నిపక్షాల సలహాలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ తొలుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు అవకాశం ఇచ్చారు. ‘‘ప్రతిపక్ష నేత గురించి మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదా స్పీకర్ రికార్డుల నుంచి తొలగించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘నల్లగొండ సభలో ప్రతిపక్ష నేత సీఎంను, నన్ను దున్నపోతులంటూ వ్యాఖ్యానించారు. ఆయన సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు ప్రతిస్పందిస్తూ.. ‘‘గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నాటి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కాల్చేయాలి, ఉరితీయాలి అని మాట్లాడలేదా? బాధ్యతయుత పదవిలో ఉన్నందున సభలో అలా మాట్లాడవద్దు’’ అని కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment