అంత భూమి ఎవరికోసం బాబూ?
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు నిలదీత
* కొత్త రాజధానికి 1,561 ఎకరాలు చాలు
* మిగతాది క్విడ్ ప్రోకో కోసమా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమి అవసరం లేదని, కేవలం 1,561 ఎకరాలు సరిపోతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం చెబుతున్నారని, ఆ లెక్కన 1,561 ఎకరాలు చాలన్నారు. సింగపూర్, జపాన్ దేశాలకు వత్తాసు పలుకుతూ అక్కడి పారిశ్రామికవేత్తల చంకల్లో ఉన్న ఇక్కడి పెద్దమనుషులకు ఉపయోగపడేలా చంద్రబాబు భూమిని సేకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్న సీపీఎం కేంద్రకమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా రాఘవులు బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజధానికి సరిపోగా మిగతా భూమిని క్విడ్ ప్రోకో(బదులుకు బదులుగా) కింద రియల్టర్లకు కట్టబెట్టేందుకే అంత భూమి సేకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. భూ సమీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని, భూ సేకరణ చట్టం ప్రకారమే సేకరించాలని స్పష్టం చేశారు.
నిరంకుశ పద్ధతిలో సారవంతమైన భూముల్ని లాగేసుకుంటామంటే సహించబోమని హెచ్చరించారు. పిల్లల్ని కనాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాఘవులు ఎద్దేవా చేశారు. ‘‘తన హయాంలో జనాభాను 1.3 శాతం మేరకు తగ్గించగలిగానని మీసాలు మెలేసుకుని చెప్పుకున్న బాబుకు ముందు చూపు పోయి వెనకచూపు వచ్చినట్టుంది.
సంతానాన్ని తగ్గించినందుకు తనను ప్రపంచ బ్యాంకు ప్రశంసించిందని ఘనంగా చెప్పుకున్న పెద్దమనిషి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారో మరి! పిల్లల్ని కనాలా వద్దా అనేది వ్యక్తులకు,భార్యాభర్తలకు వదలండి.. అందు లో సీఎం జోక్యం అక్కర్లేదు’’ అని రాఘవులు అన్నారు. ‘‘జార్జ్ బుష్(అమెరికా మాజీ అధ్యక్షుడు)ను, ఉల్ఫెన్‌సన్(ప్రపంచ బ్యాంకు మాజీ అధ్యక్షుడు)ను రప్పించి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళతామన్నారు? వాళ్లు వచ్చినప్పుడు వార్లు పోసి కాళ్లకు మొక్కి భజన్లు చేశారు.. చివరకు ఏమైంది? వచ్చినవాళ్లు దోచుకుపోయారు. ఇప్పుడు ఒబామా వస్తున్నదీ అందుకే..’’ అని ఆయన అన్నారు.
ఉద్యమాల ప్రాతిపదికనే ఫ్రంట్‌లు..
విశాఖలో జరిగే పార్టీ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టే రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని కేంద్ర కమిటీ ఆమోదించినట్టు రాఘవులు తెలిపారు. గతంలో తాము పెట్టిన ఫ్రంట్‌లు ఎన్నికలకే పరిమితమయ్యేవని, ఇకపై పోరాటాలు, ఉద్యమాల ప్రాతిపదికన ఫ్రంట్‌లుంటాయని స్పష్టం చేశారు.
సరళీకృత ఆర్థిక విధానాలతోపాటు మతతత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాల్లో తమతో కలిసి వచ్చేవారితోనే జట్టు కడతామని, ఎన్నికల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తామని తెలిపారు. ‘‘బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొచ్చింది. హిందూమతోన్మాదులతో ఏకీభవించని వారిని అణచివేసే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వీటిపై పోరాడాల్సి ఉంది. అందుకోసం సీపీఎంగా మేము బలపడాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు.