మాట్లాడుతున్న చెంగల్రాయుడు
సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణ గురించి కర్నూలులో అడిగితే అక్కడి ప్రజలు ముక్తకంఠంతో ఒకే రాజధాని కావాలని నినదించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. కర్నూలును మెగా సిటీగా, విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పామన్నారు. జగన్ రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి అని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తన జీవితంలో పోలీసులు, ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని చూడలేదన్నారు.
ఈ పోలీసులకు సిగ్గుందా అని ప్రశ్నించారు. నందిగామ, కర్నూలులో తన సభలకు జీవితంలో ఎప్పుడూ చూడనంత జనం వచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదని చంద్రబాబు చెప్పారు. మళ్లీ సీఎంగానే తాను అసెంబ్లీకి వెళ్తానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. పోలీసులు పెడుతున్న కేసులపై నేతలు తొడకొట్టి బదులివ్వాలని చెప్పారు. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా అడ్డులేకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. తన హయాంలో అమలుచేసిన పథకాలు నిలిపివేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు.
‘ఇదేం ఖర్మ’కు శ్రీకారం
ఇక టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పాలని ఇందుకోసం ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అలాగే, 175 నియోజకవర్గాల్లో లీగల్ టీములు పనిచేస్తున్నాయని, పోలీసు కేసులు, ఇతర విషయాల్లో వారి సహకారం తీసుకోవాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో తనకిప్పుడు లాయర్లను వెతుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
పోలీసు నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డు చేయండి.. జడ్జిల ముందు అబద్ధాలు చెప్పండి
ఈ సమావేశంలో చంద్రబాబు సమక్షంలో రైల్వేకోడూరుకు చెందిన టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు పోలీసులను దుర్భాషలాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. పోలీసు నా కొడుకులు ఫోన్‌చేస్తే రికార్డు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు వాయిస్ రికార్డు చేయాలని, పోలీసులను భయపెట్టేలా మాట్లాడాలని, బెదిరించాలని సలహా ఇచ్చారు.
‘పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే మేజిస్ట్రేట్ చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు అబద్ధాలు చెప్పండి. పోలీసులు ఎగిసెగిసి తన్నారని చెప్పాలి. చెప్పరాని చోటులో ఈ పోలీసులు ముగ్గురు ఎగిరి తన్నారు. చాలా నొప్పిగా ఉందని యాక్షన్ చేయాలి. అప్పుడు నా కొడుకులకు ఖాకీ గుడ్డలు ఊడిపోతాయి’ అంటూ కార్యకర్తలకు ఆయన సలహాలిచ్చారు. పోలీసులను ఎలా ఇబ్బంది పెట్టాలో, తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో ఆయన కార్యకర్తలకు శిక్షణ తరహాలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment