chengal rayudu
-
చెంగల్రాయుడును అరెస్ట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, భీమవరం/ఉండి/నెల్లూరు(లీగల్): రాజ్యాంగబద్ధమైన పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను కించపరిచే విధంగా పరుష పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏపీ పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు సమక్షంలోనే చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను తిడుతూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని, అయినా ఆయన ఖండించకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలకు, పోలీసు, న్యాయ వ్యవస్థలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెంగల్రాయుడు లాంటి వ్యక్తులను చట్టసభలకు పంపిన చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు తమ రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం పోలీసు వ్యవస్థపై పరుష పదజాలంతో నిరాధారమైన, అవాస్తవమైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఒక సందర్భంలో పోలీసులను కట్టు బానిసలుగా అభివర్ణించారని, దానిని కూడా ఖండిస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి విధులు నిర్వహించడంలో మాత్రమే కట్టు బానిసలుగా ఉంటారని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థ మీద విమర్శలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ పోలీసు అధికారుల సంఘ ఉపాధ్యక్షుడు ఆర్.రఘురాం, సీఐడీ యూనిట్ అధ్యక్షుడు అక్కిరాజు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, సభ్యుడు సత్యారావు, విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.సోమయ్య పాల్గొన్నారు. చెంగల్రాయుడు, చంద్రబాబుపై విజయవాడలో సీపీకి న్యాయవాదుల ఫిర్యాదు న్యాయ, పోలీసు వ్యవస్థలను కించపరిచేలా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడకు చెందిన న్యాయవాదులు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణాకు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడును ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీకి ఫిర్యాదు చేసిన వారిలో న్యాయవాదులు జి.నాగిరెడ్డి, పి.నిర్మల్ రాజేష్, జె.జయలక్ష్మి, నరహరిశెట్టి శ్రీహరి, కె.వెంకటేష్‌శర్మ, గవాస్కర్, జి.కిరణ్, ఎస్.పరమేష్, బసవారెడ్డి, పి.రాంబాబు, కె.ప్రభాకర్, బి.రమణి, అల్లాభక్షు, ఎం.విఠల్‌రావు, ఎన్.కోటేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చెంగల్రాయుడు, చంద్రబాబుపై భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో, పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో, ఏలూరులో, నెల్లూరులోని చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో, తిరుపతిలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఆయనపై చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయ వ్యవస్థ, పోలీసులను కించపరిచేలా చెంగల్రాయుడు వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. -
కర్నూలు ప్రజలు ఒకే రాజధాని కావాలంటున్నారు
సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణ గురించి కర్నూలులో అడిగితే అక్కడి ప్రజలు ముక్తకంఠంతో ఒకే రాజధాని కావాలని నినదించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. కర్నూలును మెగా సిటీగా, విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పామన్నారు. జగన్ రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి అని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తన జీవితంలో పోలీసులు, ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని చూడలేదన్నారు. ఈ పోలీసులకు సిగ్గుందా అని ప్రశ్నించారు. నందిగామ, కర్నూలులో తన సభలకు జీవితంలో ఎప్పుడూ చూడనంత జనం వచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదని చంద్రబాబు చెప్పారు. మళ్లీ సీఎంగానే తాను అసెంబ్లీకి వెళ్తానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. పోలీసులు పెడుతున్న కేసులపై నేతలు తొడకొట్టి బదులివ్వాలని చెప్పారు. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా అడ్డులేకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. తన హయాంలో అమలుచేసిన పథకాలు నిలిపివేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ‘ఇదేం ఖర్మ’కు శ్రీకారం ఇక టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పాలని ఇందుకోసం ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అలాగే, 175 నియోజకవర్గాల్లో లీగల్ టీములు పనిచేస్తున్నాయని, పోలీసు కేసులు, ఇతర విషయాల్లో వారి సహకారం తీసుకోవాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో తనకిప్పుడు లాయర్లను వెతుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. పోలీసు నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డు చేయండి.. జడ్జిల ముందు అబద్ధాలు చెప్పండి ఈ సమావేశంలో చంద్రబాబు సమక్షంలో రైల్వేకోడూరుకు చెందిన టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు పోలీసులను దుర్భాషలాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. పోలీసు నా కొడుకులు ఫోన్‌చేస్తే రికార్డు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు వాయిస్ రికార్డు చేయాలని, పోలీసులను భయపెట్టేలా మాట్లాడాలని, బెదిరించాలని సలహా ఇచ్చారు. ‘పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే మేజిస్ట్రేట్ చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు అబద్ధాలు చెప్పండి. పోలీసులు ఎగిసెగిసి తన్నారని చెప్పాలి. చెప్పరాని చోటులో ఈ పోలీసులు ముగ్గురు ఎగిరి తన్నారు. చాలా నొప్పిగా ఉందని యాక్షన్ చేయాలి. అప్పుడు నా కొడుకులకు ఖాకీ గుడ్డలు ఊడిపోతాయి’ అంటూ కార్యకర్తలకు ఆయన సలహాలిచ్చారు. పోలీసులను ఎలా ఇబ్బంది పెట్టాలో, తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో ఆయన కార్యకర్తలకు శిక్షణ తరహాలో వివరించారు. -
కుల రాజకీయాలతో అమాయకుల బలి
సాక్షి, కడప(నందలూరు) : రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రాజంపేటలో కులరాజకీయాలు చేస్తూ అమాయకులను బలిచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ నేత పెనుబాల నాగసుబ్బయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బత్యాల గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి రాజంపేట నియోజకవర్గం ప్రశాంతత కోల్పోయిందన్నారు. ఈనెల 9న సోమవారం గువ్వల ఎల్లమ్మ పొలానికి సంబంధించి ప్రభుత్వం 1994లో 1158 సర్వేనెంబరులో 2.80 ఎకరాల సెంట్ల భూమికి సంబంధించి పాసుపుస్తుకాలు, వన్‌బీ ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఆమెకు ఆర్థికస్తొమత లేక రాజకీయ అండదండలు లేక ఆ భూమిని అభివృద్ధి చేసుకోలేకపోయారన్నారు. ఈ మధ్య కాలంలో ఎల్లమ్మ కుమారుడు ఓబులేసు అనే వ్యక్తి ఈ పొలంలో గది నిర్మించుకున్నాడన్నారు. 10వ తేదీన బత్యాల వర్గీయులు కొండా సురేష్, మరి కొంతమంది బుల్డోజర్ సాయంతో గదిని ధ్వంసం చేశారన్నారు. బాధితుడిపై మచ్చుకత్తితో దాడి చేశారన్నారు. తల్లీకొడుకును పొలంలో నుంచి బయటకి తరుముకుంటూ వచ్చారన్నారు. దీంతో బాధితుడు భయపడి తహసీల్దారు కార్యాలయం వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులకు మొరపెట్టుకున్నారన్నారు. తనతో పాటు మండెంనాగరాజు, ధనుంజనాయుడు , కాకిచంద్ర, భాస్కర్, నాని , మధు యాదవ్‌లు ఉన్నారన్నారు. టీడీపీకి చెందిన నాయకులు ఈ సంఘటనపై విచారణ చేయకుండా కేవలం ఒక సామాజికవర్గానికి కొమ్ముకాస్తూ కులాలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్నారు. మేడా కుటుంబీకులను విమర్శించే హక్కులేదు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తూ మేడా కుటుంబాన్ని విమర్శించే హక్కు బత్యాలకు లేదని నాగసుబ్బయ్య అన్నారు. మేడా కుటుంబం ఎంత అభివృద్ధి చేస్తుందో ప్రజలు చూస్తున్నారన్నారు. బత్యాల ఇప్పటికైనా ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు వేల్పుల శైలకుమార్, పణతల గంగయ్య, ధనుంజ నాయుడు, శివ, మధు, హిమగిరి, గుండు మల్లికారుజనరెడ్డి్డ, అరిగెల నాని, హిమగిరి, రాజశేఖర్‌రెడ్డి విజయుడు, కొరివి బలరాం, గుండు మల్లికార్జునరెడ్డి, మధు, మండెం నాగరాజు, «గుండు జనార్దన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. -
జూపూడి, చెంగల మధ్య ముగిసిన వివాదం
హైదరాబాద్ : ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, జూపూడి ప్రభాకరరావుల మధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన అంశంపై శాసనమండలిలో మాట్లాడుతున్న తనను చెంగల్రాయుడు దూషించి అవమానపరిచారంటూ శుక్రవారం ఉదయం జూపూడి ఛైర్మన్ పోడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. దాంతో తన వ్యాఖ్యలు జూపూడికి బాధకలిగించి ఉంటే ఉపసంహరించుకుంటున్నట్లు చెంగల్రాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చెంగల్రాయుడు వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లలేదన్నారు. మరోవైపు చెంగల్రాయుడిపై జూపూడి సభా హక్కుల నోటీసు ఇచ్చారు. -
మండలిలో 371 ‘ఢీ’
అది రాజ్యాంగ విరుద్ధమన్న చెంగ ల్రాయుడు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న షబ్బీర్ సాక్షి, హైదరాబాద్: విద్యా ఉపాధి అవకాశాలకు గండికొట్టే ఆర్టికల్ 371డీ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు చేసిన వ్యాఖ్యలు మండలిలో వాగ్వాదానికి తెరతీశారుు. అదే పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డిలు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 371డీ రాజ్యాంగ విరుద్ధం అనే హక్కు చెంగల్రాయుడికి లేదని, ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పొంగులేటి, యాదవరెడ్డిలు కూడా ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుపట్టారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ 371డీపై సభ్యులు అభిప్రాయాలు చెప్పవచ్చుగానీ, నిర్ణయాలు చెప్పే అధికారం వారికి లేదని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే విషయంలో పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తమ ఉద్యమమని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. టీడీపీ విభజనకు కట్టుబడి ఉందని, 2008లోనే చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఆ పార్టీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ తెలిపారు. లోపల అంతా విభజనకు ఒప్పుకుని బయట ఉల్టాగా మాట్లాడుతున్నారని, అందులో మా సీఎం కూడా ఒకరని షబ్బీర్ అలీ విమర్శించారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని తోసిరాజని విభజన జరిగితే అది అప్రజాస్వామ్యమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు విభజన ప్రక్రియ జరుగుతుండటాన్ని బట్టి.. ఇది రాజకీయ లబ్ధి కోసమేనని అర్థమవుతోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. కేవలం అభివృద్ధి కోసమే ప్రత్యేక తెలంగాణ అడగడం లేదని, ఇది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి చెప్పారు. రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు. {పాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బి.వెంకట్రావ్ కోరారు.