అనకాపల్లి జిల్లా నాతవరం వద్ద భారీ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రజలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతున్నారు. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాల సమగ్రా భివృద్ధి సత్వర రీతిలో సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారు. గతంలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల ఏ రీతిన నష్టపోయామో కళ్లారా చూశామని, ఇకపై అలాంటి తప్పిదం చోటుచేసుకోకుండా ఇప్పుడే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తామని ఊరూ వాడా ఎలుగెత్తి చాటుతున్నారు.
కేవలం 29 గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తూ పాదయాత్ర పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న టీడీపీ తీరును ఎండగడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీలు.. దీక్షలు.. పూజలు.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ప్రజలు తమ వాణి వినిపిస్తున్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి ముందుకు కదలండని వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారు.
నాతవరం/అనకాపల్లి రూరల్/తణుకు అర్బన్/ ఇరగవరం/ అత్తిలి/ప్రొద్దుటూరు: రాష్ట్రాన్ని విడదీసేందుకు చంద్రబాబు కుట్రలో భాగంగా సాగుతున్న అమరావతి పాదయాత్రను ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం ఆయన వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పి.జగ్గంపేట నుంచి 1500 బైక్‌లతో గన్నవరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చేపట్టిన ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది.
అడుగడుగునా మహిళలు హారతులిచ్చి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర వచ్చే సమయానికి నర్సీపట్నం ప్రాంతంలో రౌడీలతో అల్లర్లు సృష్టించేందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుట్ర పన్నారని, దానిని అందరూ కలిసి తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గణేష్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడిలో మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.
గిరిజనులు, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, విద్యార్థులు, యువతీ యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కాగా, పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమనేది తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. శుక్రవారం జరిగిన అనకాపల్లి మండల పరిషత్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, జెడ్పీటీసీ వరలక్ష్మి హాజరయ్యారు.
తణుకులో కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న గుబ్బల తమ్మయ్య, పార్టీ శ్రేణులు
వికేంద్రీకరణతోనే అభివృద్ధి
వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.
తణుకులో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, తణుకు మండల అధ్యక్షుడు పోలేపల్లి వెంకట ప్రసాద్, ఇరగవరంలో పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, అత్తిలిలో ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి భరణీ ప్రసాద్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
దేవుడా.. బాబుకు మంచి బుద్ధి ప్రసాదించు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పెన్నానది ఒడ్డునున్న అమృతేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment