
గుడివాడ టౌన్: ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోనూ రాజధాని నిర్మించిన చరిత్ర లేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. రాజధాని నిర్మాణం అనే కాన్సెప్ట్ తెచ్చింది చంద్రబాబే అని అన్నారు. ఆయన సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో విలేకరులతో మాట్లాడారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో రాజధాని నిర్మించారో తెలుగుదేశం చవటలు చెప్పాలన్నారు.
అన్ని సౌకర్యాలు, వెసులుబాటు ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడ నుంచి పాలన కొనసాగిస్తే అదే రాజధాని అవుతుంది తప్ప రాజధాని నిర్మించి పాలనచేసిన చరిత్ర లేదని చెప్పారు. దానికి కొన్ని నిధులు వెచ్చించి ఇంకా అభివృద్ధి చేస్తే అది పెద్ద నగరంగా మారి అనంతరం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యూనిట్లు ఏర్పడి మహానగరాలుగా మారతాయని పేర్కొన్నారు. విశాఖపట్నం ఎప్పుడో నిర్మాణమైన మహానగరమన్నారు.
అక్కడ 25 లక్షల జనాభా, సహజసిద్ధమైన ఓడరేవు, లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ప్లాంట్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఆరురోడ్ల జాతీయ రహదారి వంటివి గతంలోనే ఉన్నాయి కనుక అక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందని, ఆ ప్రాంతంలో ప్రజలు బాగుపడతారని చెప్పారు. అదేవిధంగా కర్నూలు గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉందని గుర్తుచేశారు. అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయపరమైన అన్ని శాఖలు నెలకొల్పితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం సంకల్పం
ఈ విధంగా రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని చెప్పారు. దీన్ని ఓర్వలేక 420 చంద్రబాబు అమరావతి రైతులకు అన్యాయం అంటూ ఆయన సామాజికవర్గానికి చెందిన కొన్ని కుటుంబాల అభివృద్ధిని కాంక్షిస్తూ దొంగయాత్రలు చేపట్టారని విమర్శించారు.
చంద్రబాబు మాటల భ్రమలోపడి ఆయన సామాజికవర్గానికి చెందిన కొందరు పిచ్చిపిచ్చి యాత్రలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని నిరసన దీక్షలు చేసేవారు... ముందుగా ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన్ను అధికారంలో నుంచి దించేసిన దుర్మార్గుడు చంద్రబాబును బయటకు పంపేందుకు దీక్షలు చేయాలని సూచించారు.
ఎన్టీఆర్‌ను మానసికంగా వేధించి మరణానికి కారకులైన వారిని, ఆయనకు ‘భారతరత్న’ వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోని వెధవల్ని పార్టీ నుంచి బయటకు సాగనంపేలా దీక్షలు చేయాలని కోరారు. ఎన్టీఆర్ పేరున ఒక జిల్లా ఏర్పాటు చేసి ఆయనకు గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని నిందించడం సరికాదని కొడాలి నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment